ఉన్మత్త సంధ్యారాగం - అచ్చంగా తెలుగు

ఉన్మత్త సంధ్యారాగం

Share This
//ఉన్మత్త సంధ్యరాగం//
శతపత్ర !!  

మనసు కాగితం పైన
ఙ్ఞాపకాల అక్షరాలను కుప్పగా పోస్తూ
నొప్పికి కేంద్రస్థానంలో కూర్చోని
నొప్పెంత నొప్పించగలదో చూసే వేళ
ఎక్కడినుండో ఓ కరుణరస గీతాలాపనా
బాధను మార్ఫిన్ల కన్నా మత్తుగా
గుండెల్లోకి దింపగల తియ్యనైన గానకేళి
"...పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
      అల్లన మ్రోవిని తాకితే గేయాలు"
ఎదను తడితే రోదనలు
పెదవి దాటని మౌనవీచికలు...

బాధ ఎప్పటికీ ఎదురుపడని
కలల ప్రేమికుడేమో...
ఊరించి,ఊగించి,ఉన్మత్త ఊహాతీరంలో జోగించి...
ఉసురుమనిపించే నిషా చేతన జలతారు
బాధనెంత తీవ్రంగా వర్ణించగలుగుతున్నామో
అంతకన్నా వందరెట్లు దాన్నుండి ఫ్లెజర్ని పొందుతున్నామని...
"...పొందిన పెయిన్ని గానీ,ఫ్లెజర్ని గానీ
     రీ వాల్యూట్ చేసే ఓపిక నాకు లేదు" యారా!
గాయం నుండి తేరుకోకముందే
గాయం మీద గాయం తగిలాకా
గాయానైనా అనుభవించే తీరికెక్కడిది
ఇప్పుడు తీరిగ్గా నొప్పిని వివరించడానికి...

కాకపోతే...
ఎప్పటికీ తీరదని తెలిసినా...
ఉండచుట్టుకుపోయిన కాలనంతా
ఓమారు ఏ ముడికాముడి విప్పేసి
మళ్ళీ సరికొత్తగా మొదలుపెట్టాలనుంది
ఏ చిక్కులు పడకుండా...
ముక్కలు ముక్కలుగా తెగకుండా...

***

No comments:

Post a Comment

Pages