వారములు – పేర్లు - అచ్చంగా తెలుగు
బాల గేయాలు
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
వారములు – పేర్లు

చిన్నతనంలో అంటే ఇంకా బడికి పంపని చిన్నపిల్లలకు బామ్మలు, నాన్నమ్మలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వారాలపేర్లు, నెలలపేర్లు, తిధులపేర్లు, ఎక్కాలు రోజూ బట్టీయం వేయించే వారు. ఇంకా వారికి గుర్తుండడానికి రకరకాల పాటలతో పద్యాలతో కలిపి ఇవన్నీ చెప్పేవారు. అవన్నీ మరచిపోతున్నాం. సాంకేతిక పరిజ్ఞానం ముందు ఇవన్నీ ఎందుకూ కొరగాకుండా పోతున్నై.
మళ్ళీ ఆరోజులు రావు. అందుకే ఎన్నో కధలూ, బాలగేయాలు కేవలం గ్రంధాలయాలకే పరిమితం అవుతున్నై. ఈ వారం వారాల పేర్లతో తమాషాగా చిన్నప్పుడు నేర్చుకున్న ఒక గేయం.

ఆదివారమునాడు అరటి మొలచినది
సోమవారమునాడు చిగురు తొడిగినది
మంగళవారమునాడు మారాకు వేసినది
బుధవారమునాడు పొట్టిగెల వేసినది
గురువారమునాడు గుబురుగా పెరిగినది
శుక్రవారమునాడు చూడగా పండినది
శనివారమునాడు అత్తములు కోసితిమి
అందరకు పంచితిమి అరటి అత్తములు
అబ్బాయి అమ్మాయి అరటిపండ్లివిగో

సంస్కృతంలో వారముల పేర్లు:

భానువారము
ఇందువారము
భౌమవారము లేక కుజ వారము
సౌమ్యవారము
గురువారము లేక బృహస్పతివారము
భృగువారము లేక భార్గవ వారము
మందవారము లేక స్థిరవారము
ప్రతి దినమునకు ఒక పేరు ఉంది. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఏదో ఒక పేరు వుండాలి గనుక పెట్టిన పేర్లు గావు. ఆపేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు హవర్ అనే మాట . ఒక రోజుకు 24 హోరాలుంటాయి. ఆ హోరా లకు (గంట) ఏడింటికి ఏడు పేర్లున్నాయి. శని,గురువు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి. ఆది వారము రవి హోరాతో ప్రారంభమయితే మూడు ఆవర్తనాలు పూర్తికాగా అనగా 21 హోరాలు పూర్తి కాగ 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుద హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది. ఆతర్వాత హోరా 25వ హోరా అనగా మరుదినము మొదటి హోరా దానిపేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది. చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిదిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన ఏర్పడతాయి. ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది.
-0o0-

No comments:

Post a Comment

Pages