మాయాబజార్ - అచ్చంగా తెలుగు
మాయాబజార్
మా బాపట్ల కధలు - 15 
భావరాజు పద్మిని

టీవిలో ఆ రోజు “ మాయాబజార్ “ సినిమా. మంగమ్మ గారికి ఆ సినిమా అంటే పంచప్రాణాలు. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. బాపట్ల ఆడపడుచు ఆవిడ, పెళ్లయ్యాకా బెజవాడలో అడుగుపెట్టింది. ఆ సంగతి తెలిసిన రామనాధం గారు...
“ఏవమ్మోయ్ మాయాబజార్ మంగమ్మా ! ఇవాళ టీవిలో మీ సినిమానే. అన్నెం పున్నెం ఎరుగని వయసులో నన్ను మాయ చేసి, నీకిచ్చి కట్టబెట్టినప్పుడు తెలీలేదు, ఇదేదో మాయాజాలమని ! తీరా వయసయిపోయాకా ఏం లాభం ! నాకు తెలీకడుగుతా మీ వీధి వీధంతా మాయా మశ్చీంద్రలేనా ?” ఆవిడను ఉడికిస్తూ అన్నారు ఆయన. వీళ్ళ సంభాషణ అంతా వినోదంగా చూడసాగాడు మనవడు సమీర్. అతని తల్లిదండ్రులు నాసిక్ లో ఉంటారు. సమీర్ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతూ, నాయనమ్మ వద్దే ఉంటున్నాడు.
“ ఎన్ని సార్లు చెప్పాలి మీకు, మా కాలనీ పేరు మాయాబజార్ కాదు, ‘విజయలక్ష్మీపురం’ అని ! ప్రకాశం వారధికి వరదలొచ్చినప్పుడు ఎగరేసే ఒకటో నంబరు, రెండో నంబరు ప్రమాద సూచికల్లా... మీ ఊళ్లోనూ ఉన్నాయిగా వన్ టౌన్, టు టౌన్ అని వీధులు. ఊరికే మా ఊరిని, ఊరి వీధుల్ని ఆడిపోసుకుంటారే !” ఎదురు తగువుకి దిగింది మంగమ్మ గారు.
“మాది రాజుల వంశం, రారాజుల ఊరే ! మీ ఊళ్ళో ఏముంది, గంట స్థంభం, నాలుగు మేడలు, తిప్పి తిప్పి కొడితే ఓ ఐదారు వీధులు... అంతేగా ! మొత్తం ఊరు కలిపి చూసినా, మా వన్ టౌన్ అంతయినా ఉంటుందా?”
“ఓయబ్బో, రాచ వంశమట రాచ వంశం ! పెళ్లై పదేళ్ళయినా పిల్లలు లేరు మొర్రో అని, మా మాయాబజార్లో సత్యనారాయణ స్వామి గుళ్ళో మొరపెట్టుకు మొక్కుకున్నాకే కదూ, ఇంతోటి వంశానికి ఓ వంశాంకురం జన్మించింది. వీడి నాన్నకూ సంతానం లేకపోతే, ఆ సత్యనారాయణ స్వామి గుళ్ళోనే పిల్లల కోసం సుబ్రహ్మణ్యుడి చుట్టూ    బుర్ఖా వేసుకున్న బూబెమ్మలతో పాటు ప్రదక్షిణాలు చేస్తే కదూ, వాడి నుంచి వీడూ పుట్టిందీ. ఈ వంశం నిలబెట్టడానికి కారణమైన ఆ వీధినే, ఇప్పుడు వెటకారం చేస్తున్నారు, చూడరా ఈయన దాష్టీకం !” సమీర్ కు షికాయతు చేసింది మంగమ్మ గారు.
“ఆగాగు బామ్మా ! నాకంతా అయోమయంగా ఉంది. విన్నకొద్దీ సందేహాలు పెరుగుతున్నాయి. అసలు మీ వీధిని ‘మాయాబజార్’ అని ఎందుకు పిలుస్తారో తెలీక చస్తుంటే, మధ్యన గుళ్ళో బూబెమ్మలతో మా నాన్న ప్రదక్షిణాలు చేస్తే నేను పుట్టాను అంటావేంటి? ముస్లిం స్త్రీలు ఎక్కడైనా గుడికి వస్తారా? మాయాబజార్ సినిమా ఏమో కాని, ఇవాళ నాకీ సంగతి తెలియాల్సిందే ! మా మంచి బామ్మవు కదూ, చెప్పవా !” ఆవిడ గడ్డం పట్టుకు బ్రతిమాలసాగాడు సమీర్.
“నా బంగారు మనవడు అడిగితే చెప్పనా? దారా మనవడా, ఈ రాలుగాయి రామనాధం గారి నుంచి దూరంగా వెళ్లి, ఎంచక్కా, పెరట్లో ఆ రావిచెట్టు కింద కూర్చుని చెప్పుకుందాం, పద” అని మనవడి చెయ్యి పట్టుకు లాక్కుపోయింది ఆవిడ.
హాయిగా రావిచెట్టు నీడలో బామ్మ ఒళ్లో తలపెట్టుకు పడుకున్నాడు సమీర్. అతని తల ప్రేమగా నిమురుతూ, ఇలా చెప్పసాగారు మంగమ్మ గారు.
“సమీర్ కన్నా, మా మాయాబజార్ కధ చెప్పాలంటే ముందుగా సత్యనారాయణ స్వామి గుడి కధను చెప్పాలి. వింటావా?” అని అడిగారు ఆవిడ.
“వింటాను బామ్మా,” బామ్మ రెండో చేతిని లాక్కుని, చెంపకింద పెట్టుకుంటూ అన్నాడు సమీర్. ఎంత ఎదిగినా బామ్మకు మనవడు పసి పిల్లాడేగా. మనవడిని చూసుకు మురిసిపోతూ ఇలా చెప్పసాగారు ఆవిడ.
***
పొన్నూరులో భాగవతుల అన్నపూర్ణయ్య సిద్ధాంతి గారు ఉండేవారు. ఆయన ఎదురుగుండా వినయంగా నమస్కరించి కూర్చున్నారు బాపట్లకు చెందిన దేశిరాజు సార్వభౌమారావు గారు. ఆయనకు అన్నపూర్ణయ్య గారే గురువు, ఆయన  మాటే వేదం.
“ఏవిటీ వచ్చిన పని?” సూటిగా అడిగారు ఆయన.
“గురువుగారు, ఆంజనేయస్వామి గుడి బాపట్ల ఊరి చివరన ఉందని మీకు తెలుసు. కాని, ఊరి బయట 1916 లో అక్కడ కోర్టు ఏర్పాటు చేసారు. ఆ కోర్ట్ ఎదురుగుండా పెద్ద అడవిలా ఉన్న భూమిని, మా ప్లీడర్లు అందరం కలిసి, చెక్కల మాష్టారు పేరుతో కొన్నాము.”
“ఏవిటీ, చెక్కల మాష్టారా? ఇదేం పేరు” ఒక్కసారి పెద్దగా నవ్వుతూ అడిగారు ఆయన.
సార్వభౌమరావు గారు కూడా ఆయన నవ్వుతో శృతి కలిపి,  “అంటే గురువుగారూ ...మా ఊర్లో ఉప్పారపు చంద్రశేఖర రావు గారిని చెక్కల మాష్టారని అనేవారు.ఆయన మున్సిపల్ హై స్కూల్ లో క్రాఫ్ట్ టీచర్ , ఆయన పిల్లలకు చెక్క ముక్కలతో కళారూపాలు తయారు చెయ్యడం నేర్పుతారని, ‘క్రాఫ్ట్ ‘ అనడానికి నోరు తిరగని ఊరి జనమంతా ఆయన్ని చెక్కల మాష్టారని అనడం మొదలుపెట్టారు. మా ప్లీడర్లందరూ ఆయనపేరుతో స్థలం కొని, ప్లాట్స్ చేసుకుని, ఎవరికి వాళ్ళు ఇళ్ళు కట్టుకోవాలని అనుకుంటున్నాం.”
“ఇంకేం బ్రహ్మాండంగా కట్టుకోండి. మరి ఏవిటి వచ్చిన ఇబ్బంది?” భ్రుకుటి ముడి పడుతూ ఉండగా అడిగారాయన.
“ఇబ్బందని కాదండి, ఈ స్థలమంతా 1938 లే అవుట్. అడ్వకేట్ లు అందరూ కలిసి, అందరికీ జయం చేకూరేలా “విజయలక్ష్మి పురం” అన్న పేరుతో ఒక కాలనీ కట్టుకోడానికి ఒక ప్లాట్ తీసుకుంటే, అందులో ఒక ప్లాట్ ‘గుడికి’ కేటాయించారు. దానికి మోదడుగు సుబ్బమ్మ గారిచ్చిన ప్లాట్, మరొకరి ప్లాట్ కలిపి, మొత్తం 50 సెంట్ల స్థలంలో గుడి నిర్మించాలని సంకల్పించాము. మరి ఏ దేవుడి గుడి కట్టాలా అని సందేహం. మీరు ఆజ్ఞాపిస్తే, మీ ఆజ్ఞ ప్రకారం మా దేశిరాజు వంశస్తులైన ఐదుగురు అన్నదమ్ములం, ఇతర కుటుంబ సభ్యులం కలిసి ఆలయం నిర్మిస్తాము. మీ ఆజ్ఞ జవదాటము, ఇదిగో లే అవుట్ తాలూకు చిత్ర పటం. దయుంచి ఈ విషయంలో తగిన సలహా ఇవ్వండి.” అభ్యర్ధనగా అడిగి, ఆయన మాటలు వినేందుకు మౌనం దాల్చారు.
చాలాసేపు ఆ ప్లాన్ ను, గుడికి కేటాయించిన స్థలానికి వాస్తురీత్యా ఉన్న ఎల్లలను పరిశీలించిన అన్నపూర్ణయ్య సిద్ధాంతి గారు నెమ్మదిగా మౌనం వీడి ఇలా అన్నారు. “అందరికీ శుభప్రదంగా ఉండాలని, ఈ కాలనీకి పెట్టిన పేరు బాగుంది. ఈ విజయలక్ష్మిపురంలో సత్యనారాయణ స్వామిని విష్ణు పంచాయతన పద్ధతిలో ప్రతిష్ఠిస్తే అందరికీ శుభాదాయకంగా ఉంటుంది. శివకేశవులు ఒకే పీఠం మీద పూజలు అందుకోవడం స్మార్త ఆగమం. దీని ప్రకారం మధ్యలో సత్యనారాయణ స్వామి, స్వామివారి చుట్టూ నాలుగు ప్రక్కలా, శివుడు, అమ్మవారి స్వరూపమైన చండి, సూర్యుడు, వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ట చేస్తే, మీ కాలనీకి, మీ ఊరికీ కూడా సుఖసంతోషాలు కలుగుతాయి. ఇదీ నా సూచన, ఆజ్ఞ.” అన్నారాయన.
“అయితే గురువుగారు, నాదొక మనవి. మీరు చెప్పిన విధంగా, ఆలయానికి ఒక నమూనా చిత్రాన్ని వేసిస్తే, మేము ఆలయ నిర్మాణ పనులు చేపడతాము. ప్రతిష్టా కార్యక్రమం అంతా మీరే దగ్గరుండి స్వయంగా జరిపించాలి. మీకు, మీతో వచ్చే ఋత్విక్కులకు తగిన భోజన, వసతి సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాము.” అని అభ్యర్ధించారు సార్వభౌమరావుగారు.
“తప్పకుండా నాయనా, శుభం భూయాత్” అని దీవించి ఆయన్ను పంపేసారు అన్నపూర్ణయ్య గారు.
అన్నపూర్ణయ్య గారి దిశా నిర్దేశంలో నిర్మాణ పనులు మొదలై, 1955 లో నిర్మాణం పూర్తయ్యి, ప్రతిష్ట జరిగింది. మాట ఇచ్చినట్లుగా ఈ ప్రతిష్ట అంతా అన్నపూర్ణయ్య గారే చేయించారు.
ఇదే సందర్భంలో గుడి మాన్యానికి మూడెకరాల పొలం సమకూరింది. ఆంజనేయస్వామి గుడి పక్కన రంగారావు మాష్టారు అని ఉండేవారు. ఆయన నాన్నగారు దేశిరాజు బాపారావు గారు ఒక ఎకరం ఇచ్చారు. దేశిరాజు అప్పారావు గారు  ఒక ఎకరం ఇచ్చారు. గుంటూరులో ఉండే పార్ధసారధి గారు ఒక ఎకరం ఇచ్చారు. దీనితో నిత్య ధూప దీప నైవేద్యాలకి ఏర్పాటు చేసాము. ప్రతిష్టకి, నిర్మాణానికి  జరిగిన ఖర్చులన్నీ ఆ దేశిరాజు సోదరులు ఐదుగురు చేసారు. ఈ ఆలయానికి రావూరి వంశం వారు అర్చకత్వ బాధ్యతలను స్వీకరించారు. రావూరి సాంబయ్య గారి తండ్రి గారు మొదట అర్చకత్వం వహించగా, ప్రస్తుతం వారి కుమారులైన రావూరి సాయి అర్చకులుగా ఉన్నారు.
మా విజయలక్ష్మీ పురం వైభవానికి ఆ సత్యనారాయణుడి దీవెనలే కారణం. ఒకసారి అనుకోకుండా 76 లో ఆలయ ధ్వజస్తంభం పడిపోయింది. దానితో ఈ ప్రాంతమంతా 96 వరకు వెలితిగా ఉండేది. మాయాబజార్ కళ కోల్పోయింది. 96లో ధ్వజస్తంభం పునః ప్రతిష్ట చేసాకా తిరిగి వైభవాన్ని సంతరించుకుంది.”
“అది సరే బామ్మా... మీ విజయలక్ష్మిపురాన్ని అంతా మాయాబజార్ అని ఎందుకు అంటారు?”ఇక ఆత్రం ఆపుకోలేని సమీర్ అడిగాడు.
మనవడి తొందరకు నవ్వి, “ ఉన్నట్టుండి ప్లీడర్లు అందరూ కలిసి, స్థలం తీసుకుని, ఒక్కసారిగా ఇళ్ళు కట్టేసరికి ‘ఇదేదో సినిమా సెట్టింగ్ లాగా, రాత్రికి రాత్రే ఇంత వేగంగా ఒక కొత్త కాలనీ ఏర్పడడంతో జనాలు ఆశ్చర్యపోయారు. మాయాబజార్ సినిమా వచ్చిన కొత్తల్లో కావడంతో, ఈ బజారును కూడా మాయాబజారు అన్నారు. “
“భలే పేరు పెట్టేసారు గమ్మత్తుగా. మరి బుర్ఖాలు వేసుకున్న స్త్రీలు, సుబ్రహ్మణ్యుడి చుట్టూ తిరగడం ఏమిటి? అసలు ఈ గుళ్ళో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట ఎప్పుడు చేసారు?” ఇక సస్పెన్స్ తట్టుకోలేనట్టు బామ్మ ఒళ్లోనుంచి లేచి అడిగాడు సమీర్.
56 మే 2 న గుడి ప్రతిష్టా ఇతర కార్యక్రమాలు పూర్తయ్యాయి, నవగ్రహాల ప్రతిష్ట, వాయులింగ శివ ప్రతిష్ట విడిగా జరిగింది. పదేళ్ళ తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య ప్రతిష్ట జరిగింది. దీనికీ ఓ కధుంది. శ్రీనివాసరావు గారని అప్పట్లో ఎ.జి కాలేజిలో లెక్చరర్ ఒకాయన ఉండేవారు, ఆయన పిల్లలు లేకపోతే నాగప్రతిష్ట చేస్తానని మొక్కుకున్నారు. ఈ గుళ్ళో రావి చెట్టు, వేప చెట్టు కింద నాగ ప్రతిష్ట చేసి, ఆయన గుడి కట్టారు. ఆ ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా వేరొకరు ప్రతిష్టించారు. ఆ తర్వాత ఆయనకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు కలిగారు. ఆ తర్వాత పిల్లలు లేనివారు ఎవరు మొక్కుకున్నా వారికి పిల్లలు కలుగుతూ ఉండడంతో, సుబ్రహ్మణ్య స్వామికి పిల్లల కోసం కళ్యాణాలు చేసేవారు, ప్రదక్షిణాలు చేసేవారు ఎక్కువయ్యారు. ఇదే క్రమంలో పిల్లలు లేని ముస్లిం స్త్రీలు, పిల్లలు ఆపదల్లో ఉన్న ముస్లిం స్త్రీలు ఈ గుడికి వచ్చి, ప్రదక్షిణాలు చేసి, మొక్కుకోవడం ఇప్పటికీ కొనసాగుతోంది.
“మరైతే బామ్మా... వైశాఖ మాసంలో భావన్నారాయణ స్వామి తిరునాళ్ళు చూసాము కదా. అలా ఈ గుళ్ళో కూడా కళ్యాణాలు, ఉత్సవాలు జరుగుతాయా ? మళ్ళీ దీనికీ ఓ కధుంది అంటావా ఏంటి?”
“అవున్రా. బాపట్లలో బయ్యా సుబ్బారావు గారని ఒక వ్యాపారి ఉండేవారు, శిఖరం వారి ఇంటికి టెలిఫోన్ ఎక్స్చేంజి కి మధ్యలో  వీరి ఇల్లు. అతనికి మూడో అబ్బాయికి ఏదో బాణాలాట ఆడుతుంటే కంట్లో గుచ్చుకుని, కన్ను పోయే పరిస్థితి వచ్చిందట.  ‘మావాడి కన్ను నయమైతే కల్యాణం చేయిస్తానని’ ఆయన మొక్కుకున్నారు. ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల వాళ్ళబ్బాయి కన్ను మళ్ళీ బాగుపడింది. అప్పటినుంచి స్వామికి వాళ్ళు కల్యాణం చేసేవారు.
సత్యనారాయణ స్వామి కళ్యాణం మాఘ పౌర్ణమికి జరుగుతుంది. మొదట్లో తొమ్మిది రోజులు, తొమ్మిది వాహనాలతో చేసేవాళ్ళం. తిరుపాక వాళ్ళది, మోదడుగు వాళ్ళది, బయ్యా వాళ్ళది ఇలా తొమ్మిది వాహనాలు తొమ్మిది కుటుంబాలకీ ఉండేవి. పొన్నమాను, కీలు గుఱ్ఱము, పెద్దపులి, రెక్కల గుఱ్ఱం, గరుడ వాహనం, శేష వాహనం, ఇలా అన్ని వాహనాలు స్వామికి ఉండేవి. వాటిలో ప్రస్తుతం ఐదే మిగిలాయి. ఇప్పుడు మూడు రోజులు మూడు వాహనాలతో ఉత్సవాలు చేస్తున్నారు.  మార్గశిర షష్టి కి సుబ్రహ్మణ్య కల్యాణం చేస్తాం. హనుమజ్జయంతి నాడు హనుమంతుడి ఉత్సవాలు జరుగుతాయి. ఇదిరా మనవడా మా మాయాబజార్ కధ.”
“బామ్మా, ఈసారి మనిద్దరం టాక్సీ చేసుకుని, ఆ గుడికి వెళ్లి, స్వామి దీవెనలు అందుకుని వద్దామా?” అని సమీర్ అడుగుతుండగా, “ఏవిటీ మాయాబజారు వారు ఏదో మంత్రాంగం నడుపుతున్నట్టు ఉన్నారు....ఇంకేంతసేపో రహస్య మంతనాలు ...” అనుకుంటూ అక్కడికి వచ్చారు రామనాధం గారు.
ఆయన వంక గుర్రుగా చూసి, “వెళ్దాం రా మనవడా ! ఈ రాలుగాయి రామబ్రహ్మాన్ని వదిలేసి, ఎంచక్కా మనిద్దరమే వెళ్లి, అన్ని గుళ్ళూ తిరిగి, సెంటర్లో బాదంపాలు తాగి, అలా బీచ్ కు వెళ్లి, హాయిగా తిరిగొద్దాం. “అందావిడ ఆయన్ని తిరిగి ఉడికిస్తూ.
వారిద్దరి గిల్లికజ్జాలను చూసి నవ్వుకుంటూ, త్వరలోనే మాయాబజార్ వెళ్లి, సత్యనారాయణ స్వామిని చూడాలని సంకల్పించుకుని, మనసులోనే ఆ నమస్కరించుకున్నాడు సమీర్.
*** 
(ఈ కధ రాసేందుకు తగిన సమాచారాన్ని అందించిన దేశిరాజు చందు గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు)No comments:

Post a Comment

Pages