ఆశపడ్డ సూర్యుడు - అచ్చంగా తెలుగు
ఆశపడ్డ సూర్యుడు
పి.యస్.యమ్. లక్ష్మి

సూర్యారావు మండిపడిపోతున్నాడు.  ఆయన మంటల వేడిమి ఆయనే తట్టుకోలేక పోతున్నాడు.  ఏమి చెయ్యాలో తోచటంలేదు.  సలహా  అడుగుదామన్నా ఎవరూ కనబడటం లేదు.  సపర్యలు చేసే పరిచారకులు ఎక్కడా కనబడకుండా దాక్కుంటున్నారు.  హహహ .. పాపం .. తన వేడిమి తనే తట్టుకోలేక పోతున్నాడు.  ఇంక అర్భకులు .. వాళ్ళెంత.  తన ప్రతాపానికి గర్వంగా మీసం దువ్వుకోబోయి  ఆగాడు.  అన్నట్లు ఈ మంటలని ప్రతాపం అనుకోవాలా, అసహనం అనుకోవాలా ఏమనుకోవాలి.  తనే తట్టుకోలేని ఈ భగ భగలను అర్భకురాలగు ప్రకృతి, అంతకన్నా అర్భకులయిన దానిలో నివసించే జీవజాలం ఎలా తట్టుకుంటారు అనే అనుమానం నిలదియ్యటంతో.
అయినా బ్రహ్మ దేవుడు సృష్టించిన ఈ జీవజాలం ఆయన తలకాయలన్నింటిలో వున్న తెలివితేటలను మించి పోయిన తెలివి తేటలను పెంచుకున్నారు.  ఇవ్వన్నీ బ్రహ్మ దేవుడు ఇచ్చినవయితే కావు.  ఇన్ని యుగాలనుంచీ చూస్తున్నాడు ఆయనని.  మిమ్మల్ని సృష్టించాను, మీకు తెలివి తేటలు ఇచ్చాను, ఆలోచించే బుధ్ధి ఇచ్చాను మీదోవ మీరు చూసుకోండి అన్నాడే గానీ,  ఇదిగో ఈ సమస్య వస్తే ఇదీ పరిష్కారం అని చెప్పాడా.  ఆయన ఇచ్చిన తెలివి తేటలే అయితే సమస్యలు, పరిష్కారాలు అన్నీ ఒకే విధంగా వుండేవి.  ఏదో మనుష్యులకి ఆలోచనా శక్తి ఇచ్చాడుగనుక ఇన్ని తెలివితేటలని చూడగలుగుతున్నాడు.
సూర్యారావుకి తన శరీర ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు చిందరవందరగా అధికమయిపోతున్నాయి.  వాటిని నియంత్రించటానికి ఆయన మస్తిష్కం విపరీతమైన ఉష్ణోగ్రతతో వుండటంవల్ల సహకరించటంలేదు.  ఏదో చెయ్యాలి.  ఈ వేడి తగ్గాలి.  ఏం చెయ్యాలో తెలియటంలేదు.  ఇద్దరు భార్యలున్నారు.  సమయానికి సలహా ఇవ్వకుండా తన వేడికి భయపడి దూరంగా వుంటున్నారు.  అదే మనుషుల భార్యలయితే ఇలాగే చేస్తున్నారా.  అమాయక మొగుడయితే కొంగున ముడేసుకుని ఆడిస్తున్నారు.  దుర్మార్గులయితే దుమ్ము దులిపి చెవి మెలేస్తున్నారు.  అంతదాకా ఎందుకు .. ప్రదర్శనశాలలో ప్రదర్శించే చిత్రములలో, ఇంటింటా దూర దర్శన్ లో చూపించే ధారావాహికలలో ఆడవారు ఎంతసేపూ కత్తులు, పిస్తోళ్ళు పట్టుకుని ఎవరిని ఎలా చంపాలా అని పని లేనట్లు రోడ్లమీద తిరుగుతూ వుంటారు కార్లేసుకుని.  అసలు వాళ్ళకి తెలిసినంతమంది రౌడీలు ఈ ప్రపంచంలో వున్నారా, లేకపోతే గొప్పలకి అంతమంది తెలుసు అని చెప్పుకుంటున్నారా?  రోజూ  ప్రపంచం అంతా తిరుగుతాడు కదా తను ..  కత్తులు, పిస్తోళ్ళు ఊపుకుంటూ తిరిగే ఆడవాళ్ళని కానీ, మగవాళ్ళని కానీ తనింతమటుకూ చూడలేదు..  సరే ఇప్పుడు వాళ్ళ గోల నాకెందుకుగానీ ఈ ఉష్ణోగ్రత తగ్గే మార్గమే తెలియటంలేదేమి?   అదే భూలోకంలో అయితే చక్కగా మానవులు మానవ మహానుభావులు కనుగొన్న ఫేనూ, కూలరూ, ఎసీలలో సేద తీరుతున్నారు హాయిగా ఎండవేడి తెలియకుండా.  తాహతు లేని మనిషి చెట్టు నీడన సేద తీరుతూ అదే సుఖమనుకుంటున్నాడు.  అయినా వీళ్ళవి ఎంత గొప్ప తెలివితేటలయినా తాత్కాలికమేగా.  చెట్ల నీడన సేద తీరుతున్నారుగానీ, చెట్లని పెంచటంలేదు.  కూలరూ, ఏసీ వుందికదా అనుకుంటున్నారుగానీ అవి పని చెయ్యటానికి విద్యుత్ కావాలనీ, తను పెంచే కాంక్రీటు అరణ్యాలతో విద్యుత్ ఉత్పత్తి కాదనీ తెలిసినా తమ సౌకర్యం తాము చూసుకుంటున్నారుగానీ, తమ పిల్లల గురించి వారుకూడా సుఖంగా వుండాలంటే తాము నెరవేర్చాల్సిన బాధ్యతల గురించిగానీ ఆలోచించటంలేదు.  
అసలు ఈ మానవుల స్వార్ధపూరితమైన ఆలోచనలవల్లకదా తనూ ఇంత ఇబ్బంది పడుతున్నది.  ఏదో పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తున్నారనీ, ఆదిత్య హృదయాలు చదువుతున్నారనీ, అందరూ తన భక్తులనుకుని వారి కోర్కెలు తీర్చబోయికదా తనీ విపరీత పరిణామం తెచ్చుకున్నది.  ఇదివరకు రోజుల్లో ఇలా వుండేవా   మనుషులందరూ సకాలంలో వర్షాలు కురవాలనీ, ఋతువులన్నీ సక్రమంగా వుండాలనీ, సకాలంలో వర్షాలు కురవాలనీ, పంటలు సమృధ్ధిగా పండాలనీ కోరుకునేవారు.  వారి కోరికలను మన్నించి దేవతలందరూ దీవించేవారు.  సకాలంలో ఎండలు, వానలు అన్నీ జరిగేవి.  
ఇప్పుడో  ఆ తాయారమ్మ నేను నా కూతురుకి ఫారెన్ పంపించాలని గుమ్మడికాయ వడియాలు పెట్టాను..అవి చక్కగా ఎండే దాకా ఎండలు బాగా రావాలని కోరుకుంది.  ఆవిడ రోజూ ఆదిత్య హృదయం చదువుతుందయ్యే.. మరి ఆవిడ కోరిక తీర్చకపోతే నాకూ, నా హృదయానికీ విలువ వుండద్దూ.  ఆ ఇంద్రప్రస్ధ కాలనీవాళ్ళు సర్కారు కాంట్రాక్టరు తమ రోడ్లు సరిగ్గా వెయ్యక పోవటంవల్ల రోడ్లమీద ఎక్కడపడితే అక్కడ గుంటలు, ఆ గుంటలలో చేరే డైనేజ్ నీళ్ళు,  పంపులలోని నీళ్ళతో ఇబ్బంది పడుతున్నాము, అనీ, భాగ్యనగరం వాళ్ళు చినుకు పడితే రోడ్లమీద మోకాలు లోతు నీళ్ళు వస్తాయిగనుక వానలు వద్దనీ ప్రార్ధిస్తుంటే ఏదో పాపమని వాళ్ళ కష్టాలు తీరుద్దామని తన ప్రతాపం చూపిస్తున్నాడు, 
దీనితో తనకీ చాలా గందరగోళంగా వున్నది.  కొందరికి ఎండగా వుండాలి, కొందరికి ఎండ వుండకూడదు, చాలామందికి సరైన ఎండ వుండాలి .. ఇంతమంది మనుష్యుల రకరకాల కోర్కెలు తీర్చటం ఎన్ని కిరణాలు వుంటే మాత్రం తనవల్ల అవుతుందా.  అవును బ్రహ్మ నాకూ ఆలోచనా శక్తి ఇచ్చాడుకదా.  దానిని విస్మరించి మనుష్యులలాగా నేనూ ఎందుకు మనుష్యుల వెనకాల పడుతున్నాను.  వాళ్ళ కోర్కెలన్నీ తీరుస్తున్నాను.  అందులోనూ అవి మంచివి అవునా కాదా అనే విచక్షణ లేకుండా, బ్రహ్మ సృష్టికి ఎంత మటుకు ఉపయోగపడుతున్నాయి అనే ఆలోచన లేకుండా.
తన పధ్ధతి మార్చుకోవాలి.  తన శక్తినంతా మానవ శ్రేయస్సుకి ఉపయోగించాలిగానీ, కొందరు మానవుల స్వార్ధానికి ఉపయోగించకూడదు.  అయితే వాళ్ళు కోరినా కోరక పోయినా వారికి మంచే చేస్తుంటే వాళ్ళకి జీవితం విలువ తెలియదు.  తమ సృష్టికి పరమార్ధం తెలియదు.  వాళ్ళకి వాళ్ళు ఈ జగత్తు విలువ, ఈ ప్రకృతి విలువ, అందులో తమ మానవ జన్మ విలువ తెలుసుకోవాలి .. భగవంతుడు ప్రసాదించిన ప్రకృతిని కాపాడుకోవటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చెయ్యాలి.  భగవంతుడున్నాడు కదా వాడాడించినట్లు ఆడుతున్నాము అని నిర్లక్ష్యంగా బతికెయ్యకుండా, భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేద్దామని, తనకోసం, భావి తరాలకోసంకూడా ఆలోచించాలి.  అప్పుడే ఋతువులన్నీ సక్రమంగా వుంటాయి.  పూర్వం అలాంటి వారుండటంవల్లనేనేమో కాలచక్రం సరిగ్గా తిరిగింది.
ఆలోచన బాగానే వుందిగానీ, వాళ్ళ సంగతేమోగానీ తనకే ఈ వేడి భరించటం కష్టంగా వుంది.  ఈ మానవులు తొందరగా మారితే బాగుండుని అని ఆశగా చూస్తున్నాడు సూర్యుడు.
***

2 comments:

  1. అందర్నీ ఆలోచింపచేసే కథ.. చాలాబాగుంది లక్ష్మిగారూ...

    ReplyDelete
  2. మాలతిగారీకి, లలితగారికి, సీతాలక్ష్మి గారికి ధన్యవాదాలు. కధ నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete

Pages