గెలుపు - అచ్చంగా తెలుగు
(జ)వరాలి కధలు - 17 
గెలుపు
గొర్తి వేంకట సోమనాధశాస్త్రి(సోమసుధ)
పెళ్ళి చేసుకొనే ముందు ఆడవాళ్ళయినా, మగవాళ్ళయినా తమ వైవాహిక జీవితంపై ఎన్నో ఊహించుకొంటారు. వచ్చిన వ్యక్తి తన ఆలోచనలను ఊహలను అర్ధం చేసుకొని,తన మాటకు విలువనిస్తూ, ఒకరకంగా తన చెప్పుచేతలలో ఉండాలని కోరుకొంటారు. కానీ బరిలోకి దిగాక గాని తెలీదు - ఏం జరుగుతుందో?
"వరాలూ!" వీధిలోంచి వస్తూ హుషారుగా పిలిచాను.
" ఏమిటండీ?" చీరకొంగుతో చేయి తుడుచుకొంటూ వంటింట్లోంచి వచ్చింది వరాలు.
"నీ కోసమేం తెచ్చానో చెప్పుకో" చేతిలోని పాకెట్టును వెనకాల దాస్తూ సినిమాఫక్కీలో అడిగాను.
" ఏముంటాయి? సన్నజాజులో, సంపెంగలో తెచ్చి ఉంటారు" చాలా నిర్లిప్తంగా బదులిచ్చింది.
"అదేంటోయి? అంతకన్న మీరేం తెస్తారులెండి అన్నట్లు తేల్చేశావ్?"
"రామ రామ! నేను అనకుండానే మీరలా ఊహించుకొంటే ఏం చేయగలను చెప్పండి?"
" లేకపోతే? ప్రతీ ఏటా నీవు అడక్కుండానే తెస్తున్న చీరలన్నీ వాడుకొంటూ, యిలా మాట్లాడటం ఏం బాగోలేదు"
" చూశారా? మీరు తెచ్చిందేమిటో మీకు తెలీకుండా మీచేతే చెప్పించాను"
నా తొందరపాటుకి నాలిక్కరుచుకొని చేతిలోని పాకెట్టు ఆమె చేతికి యిచ్చాను. ఆత్రుతగా పాకెట్టులోంచి చీర బయటకు తీసింది.
నా యింటికొచ్చాక వరాలికి ఒక్క నగన్నా చేయించలేదు గాని, ప్రతీ ఏడూ పండగ పదిరోజులు ఉందనగా ఒక చీర తెచ్చేసి, ప్రేమగా నాలుగు కధలు వినిపించేస్తాను. ఆమె మురిసిపోయి మూడువందలరవై నాలుగు రోజులూ గడిపేస్తుంది. మరు సంవత్సరం మరో చీర. అది కూడా ఎందుకంటారా? కనీసం చీరయినా తేకపోతే మనని చెరుకుముక్కను చీరేసినట్లు చీరేసి, ఉగాది పచ్చట్లో వేసెయ్యగలరు. అలాగని వారు అడిగినవన్నీ కొన్నారనుకోండి. బజారంతా మీ యింట్లో ఉంటుంది, మీరు బజార్లో ఉంటారు. అందువల్ల ఆడవారి కోరికలకు పగ్గమేస్తూ, కపట ప్రేమతో పబ్బం గడుపుకోవాలని నా మిత్రుడొకడు సలహా యిచ్చాడు. అఫ్ కోర్స్! వాడికింకా పెళ్ళి కాలేదు లెండి! అందుకే వాడి సలహా పాటిస్తూ ఏడాదికి ఓ చీర తెచ్చిపడేస్తూంటాను. 
"నల్లపూల గళ్ళచీర! నాకు చాలా యిష్టం" అంటూ మడత విప్పి, చీరను భుజంపై అటూ యిటూ వేసుకు చూసింది.
" నాకూ యిష్టమే! మన పెళ్ళిచూపుల్లో యిలాంటి చీర కట్టుకొనే కదా నన్ను పడేశావ్!" అన్నాను.
" అంటే మీకు నచ్చింది నేను కాదా? ఆ మాట ముందే చెప్పి ఉంటే, నాకు బదులుగా ఆ చీరనే యిచ్చేవారుగా మావారు" 
"అలా అపార్ధం చేసుకొంటే నేనేం చెప్పేది? ఆ చీరలో ఉన్న నువ్వు నచ్చావ్! ఇంకా చెప్పాలంటే అసలు నీ వల్లనే ఆ చీరకు ఆ అందం వచ్చింది" 
నా పొగడ్తకు పొంగిపోతూనే " చాల్లే ఊరుకోండి " అంది.
"అంతా బాగానే ఉంది గానీ, యిప్పుడీ చీరెందుకండీ?" వరాలు ప్రశ్నకు నా గుండె వేగంగా కొట్టుకోసాగింది.
"ఎందుకేమిటోయి? కట్టుకొందుకి" ధైర్యం కూడగట్టుకొంటూ అన్నాను.
"కట్టుకొన్న మీరున్నారుగా" వరాలు కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూంటే నా శరీరం గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది. ఆమె నా భుజం పట్టి గుంజటంతో తిరిగి భూమ్మీద పడ్డాను.
"అదికాదండీ! ఈ మధ్యనే మీ యింటి వద్ద అనుకోని ఖర్చులొచ్చి అప్పు చేయటమైందా? ఆ అప్పు తీరాలంటే అయిదారు నెలలైనా పడుతుంది కదా! ఇలాంటి సమయాల్లో చీరలు, సింగారాలు లేకపోతేనేం?" 
వరాలికి నా మీద ఎంత అభిమానం? ఇతర ఆడవాళ్ళలా అప్పుచేసి పప్పుకూడు పెట్టమనకుండా పరిస్థితులకు సర్దుకుపోయేదాన్లా మాట్లాడుతోంది.
"ఆనవాయితీగా వస్తున్న పని కదాని. . . ." నసిగాను.
"ఈ ఏడాది మానేస్తారు. వచ్చే ఏడాది యీ రెండేళ్ళ చీరలకి బదులుగా ఏ నెక్లెస్సో కొంటారు. అలా చేస్తే నేనేం కాదంటానా?" అని మరో సమ్మోహనాస్త్రాన్ని విసిరింది. ఈసారి ఆ అస్త్రానికి నేను పడలేదు.
అమ్మ వరాలూ! అప్పుల్లో ఉన్నప్పుడు చీరెందుకు తెచ్చారంటే గొప్ప త్యాగశీలివి అనుకొన్నాను. చీరకి బదులు నెక్లెస్సుకి గాలం వేస్తున్నావా? చీరైతే ఖర్చు వందల్లోనే! నెక్లెస్సయితే వేలల్లో పెట్టాలి. . . కషాయం తాగుతున్నట్లు కళ్ళు చిట్లించాను. నా మనోభావాల్ని యిట్టే పసిగట్టినట్టుందామె.
"ఖర్మరా బాబూ! నెక్లెస్ కొంటారని మాటవరసకి అన్నానే తప్ప దరఖాస్తు పెట్టలేదు. ఆ ముఖ కవళికలు మార్చండి ముందు" వరాలి భరోసా తరువాత కొద్దిగా తేరుకొన్నాను.
" అసలు భార్య అంటే ఏమనుకొన్నారు? మా సరదాలు తీర్చుకోవటానికి మిమ్మల్ని పావులా వాడుకొంటామనుకొన్నారా? ఈ దేశంలో నూటికి ఎనభై శాతం ఆడవాళ్ళు సాధ్యమైనంతవరకూ భర్తని యిబ్బంది పెట్టకూడదని, అవసరమైతే తమ సరదాలు చంపుకొని మీ యిష్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని అనుకొంటారండీ! విదేశీ ఆడవాళ్ళలా విలాసవంతమైన జీవనాన్ని కాకుండా, జీవితాంతం భర్త తనను ఆప్యాయంగా చూస్తే చాలని కోరుకొంటారు" 
" సరె! ఇప్పుడు నేనేమనలేదు కదా!" అంటూ మెల్లిగా అక్కడనుంచి ప్రక్క గదిలోనికి తప్పుకొన్నాను.
మరునాడు శుభ్రంగా స్నానం చేసి, కొత్తచీర ఒకసారి కట్టుకొని, నా సెలక్షను బాగుందని నన్ను ఆకాశానికి ఎత్తేస్తుందని ఆశపడ్డాను. కానీ. . .అబ్బే. . .ఆ జాడలేం కనబడలేదు. రెండు రోజులు నా ఆశల్ని ఉగ్గబట్టి, యిక ఉండబట్టలేక అడిగేశాను.
"ప్రతీ ఏడు చీర తెచ్చిన వెంటనే ఒకసారి కట్టుకొని నా సర్టిఫికెట్టు తీసుకొనేదానివి కదా! మరిప్పుడేమైంది? ఏం? చీర నచ్చలేదా?" 
"నాకిష్టమైన చీరనే తెచ్చారన్నానుగా!" 
" మరి కట్టుకోలేదేం?" 
" పండక్కింకా వారం ఉంది కదాని...ఒక్కసారి కట్టుకు విప్పినదాన్ని పండక్కి కట్టుకొంటే బాగుండదుగా. . .మీరు అప్పటికి మరో చీర కొంటానంటే చెప్పండి. ఈ చీరను యిప్పుడే కట్టేసుకొంటాను" వరాలు వాగ్బాణానికి ఎదురు నిలవలేక అక్కడినుంచి తప్పుకొన్నాను.
వరాలు యీ మధ్య బాగానే గడుసుదనం నేర్చుకొంది. నా మంచిదనానికి రాటుదేలిందా? లేక నా ఆర్ధిక యిబ్బందులను దృష్టిలో ఉంచుకొని అలా మాట్లాడిందా? నగరం నీళ్ళు యీ పల్లెటూరిపిల్లకు ఒంటబట్టలేదుకదా! ఏమైతేనేం? నల్లపూల గళ్ళచీరలో తనను చూడాలనుకొన్న కోరికను మనసులోనే అణిచేసుకొని, నా కోరిక తీర్చే పండగ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను.
పండగ రెండురోజులు ఉందనగా నా ఆఖరి చెల్లెలు ఢిల్లీనుంచి వచ్చింది. చాలాకాలానికి ఆమెను చూశానన్న ఆనందం ఆ రాత్రే మటుమాయమైంది.
"రేపు మీ చెల్లికి, బావగారికి కొత్త బట్టలు తెండి" వక్కపొడి పాకెట్టు తెమ్మన్నంత తేలిగ్గా వరాలు చెప్పింది.
"దేనికోయి?" అన్నాను త్రుళ్ళిపడుతూ.
" మీ చెల్లెలు ఢిల్లీలో అమ్ముకొందుకి. లేకపోతే ఏమిటి? అచ్చటాముచ్చటా చూడాల్సిన అన్నగారాయె! ఆ మాత్రం తెలీదా?" 
"దాన్ని అత్తవారింటికి పంపినప్పుడు భారీగానే యిచ్చాంగా! అయినా బావగారికి యిటువైపు పనుంది కదాని వచ్చారు గానీ నేను పండక్కి పిలిస్తే రాలేదుగా!"
"పొద్దున్న అన్నం తిన్నాం కదాని రాత్రికి మానేస్తున్నామా? ఇదీ అంతే! మీరు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, వాళ్ళు మీ అమ్మగారింటికి వెళ్ళేవారు గనుక ఆ సాంప్రదాయాలన్నీ ఆవిడ చూసుకొనేది. అందుకే యీ ఊళ్ళో ఉన్న మీకు తెలిసేది కాదు. కానీ యిప్పుడు మీరు గృహస్తు హోదాలో ఉన్నారు. ఇకపై  వాళ్ళు  మీ యింటికి వస్తూంటారు, పోతూంటారు. ఇంటికి వచ్చిన ఆడపిల్లను ఉత్తచేతులతో పంపటం మన సంప్రదాయం కాదు. వాళ్ళు వచ్చినప్పుడల్లా చీరో, రవికలగుడ్డో పెట్టి పంపటం మన సంప్రదాయం. వాళ్ళు పండగపూటా వచ్చారు గనుక, అతనికీ బట్టలు తెమ్మని అంటున్నాను. మీరు నాకోసం చీర తెచ్చారా? వాళ్ళకేం పెట్టకుండా పండగపూటా నేను కొత్తచీర కట్టుకొంటే బాగుంటుందా? చెప్పండి" 
"మరేం ఫరవాలేదు. మనం ఖర్చుల్లో ఉన్నామనుకొంటారులే! కావాలంటే దాని భర్తే దానికి చీర తెస్తాడు" అతితెలివి ప్రదర్శించబోయాను.
"ఆహా! ఆమెకే కాదు. . .పాపం తన చెల్లెలు కూడా కట్టుకొంటుందని నాకూ తెస్తాడో చీర. . .మన యింటికొచ్చిన వారికి మనం బట్టలు పెట్టాలి గానీ మనమే అతని దగ్గర తీసుకోవటం బాగుంటుందా? చెప్పండి" వరాలి మాటలకు ఉల్లిపాయ తరుగుతున్నవాళ్ళా కళ్ళు చిట్లించాను.
ఒరిస్సాలో "సావిత్రి" అని ఒక పండగ చేస్తారు. వారు యముడి వెంటపడి భర్తని బ్రతికించుకొన్న సావిత్రిని తమ ప్రాంతానికి చెందిన ఆడపడుచుగా భావిస్తారు. ఆ పండుగ ప్రతీ ఏడూ జూను నెలలో వచ్చే  సంక్రాంతి రోజున జరుపుకొంటారు. ఆ రోజునే యముడి వెంటపడి సావిత్రి తన భర్త సత్యవంతుణ్ణి బ్రతికించుకొన్నదని వారి విశ్వాసం. ఆ రోజున అన్నదమ్ములంతా తమ ఆక్కచెల్లెళ్ళకి, తమ శక్తికొలదీ బంగారం, వివిధరకాల పళ్ళు కొని కానుకలుగా చదివిస్తారు. ఇక్కడ వారి వారి ఆర్ధికస్థోమతులతో పనిలేదు. సంప్రదాయం సంప్రదాయమే! ఏమి యిచ్చారన్నది ముఖ్యం కాదు. ఇవ్వాలి అంటే యివ్వాల్సిందే! మన సాధారణాచారాలన్నీ మనని కొంత కష్టానికి గురి చేసేవే కావచ్చు. కానీ ఆ కష్టమేదో మనమే భరించి ఎదుటివాళ్ళను మెప్పించటమే మన ధర్మం. అలాగని ఆడపడుచులు అల్లరి పెట్టే రకాలు కాకపోవచ్చు. కానీ సంఘంలో చుట్టూ జరిగే ముచ్చట్లు తమకు జరక్కపోతే ఆడపిల్లలు లోలోపల బాధపడటం సహజమే! అందుకని కొన్ని ఆచారాలకు మనం తలవంచక తప్పదు. 
 వరాలి తలంటుతో, మరునాడే మారు మాట్లాడకుండా షావుకార్ని బ్రతిమాలి అరువుపెట్టి చెల్లెలికి, బావగారికి  బట్టలు తెచ్చాను.
పండగరోజు నల్లపూల గళ్ళచీరలో వరాల్ని కన్నులపండుగగా చూద్దామనుకొన్నాను. ఒకవైపు ఆమె నా ఆశ తీరుస్తుందని ఎదురుచూస్తూనే, హడావిడిగా కాలకృత్యాలు ముగించుకొన్నాను. బాత్రూంనుంచి బయటకొచ్చిన నేను, నల్లపూలగళ్ళచీరలో ఆమెను వెనకనుంచి చూసి మెల్లిగా సకిలించాను. ఆమె అటువైపునుంచి నావైపు తిరిగింది. వెంటనే నాకు కళ్ళు తిరిగినట్లయింది. 
ఇదేమీ పట్టించుకోని ఆమె, నా చేతిలో అక్షింతలు పెట్టి కాళ్ళకు మొక్కింది. అప్రయత్నంగానే నా చేతిలోని అక్షింతలు ఆమె శిరసుపై చల్లాను. ఆమె సంతోషంగా లోనికెళ్ళబోతుంటే వెనక్కి పిలిచాను.
"ఇందూ! ఈ చీర. . . ."
"వదిన యిచ్చిందన్నయ్యా! చాలా బాగుంది కదూ!" అని మురిసిపోతూ లోనికెళ్ళిపోయింది. 
నా మనసు, దెబ్బ తిన్న పిట్టలా గిలగిలలాడుతూంటే, మౌనంగా నా గదిలోకి వెళ్ళిపోయాను.
వరాలు ఎంత దెబ్బ తీసింది? చీర నచ్చకపోతే ఆ రోజే తనకు చీర నచ్చలేదని చెప్పాలి. ఆ రోజు అడిగితే పండగనాడు కట్టుకొంటానని మురిపించటమెందుకు? పండగనాడు ఆ చీరను యిందిరకిచ్చి నా ముచ్చట మీద దెబ్బకొట్టడమెందుకు? నా మనసు కిరసనాయిలు పోయకుండానే అవమానంతో భగ్గున మండిపోతోంది. 
" ఇక్కడ ఉన్నారా? త్వరగా తెమలండి. అన్నయ్య ఆలయంలో అర్చన చేయిస్తాడుట. రమ్మంటున్నాడు" వరాలు హడావిడిగా చెప్పి బయటకు వెళ్ళిపోయింది. నేను మౌనంగానే బట్టలు వేసుకొని తనకు చెప్పకుండా, బావతో బయట పనుందని చెప్పి బయటపడ్డాను. 
ఆ తరువాత వాళ్ళున్న రెండు రోజులు వరాలిముందు ముభావంగానే గడిపాను.
ఆ రోజు ఇందిర దంపతులను ఢిల్లీ రైలు ఎక్కించి, అటునుంచి అటే ఆఫీసుకి పోయాను. మధ్యాహ్నం ఆఫీసు దగ్గర హోటల్లో భోంచేసి, రాత్రి తొమ్మిదిన్నరకి మెల్లిగా యిల్లు చేరాను. 
"అయ్యగారికీరోజు ఆఫీసులో పని అంత ఎక్కువగా ఉందా? మీ చెల్లెలిని రైలెక్కించి అటునుంచి అటే వెళ్ళిపోయారు" అడుగుతున్న వరాలికి బదులీయకుండానే బాత్రూంలోకి వెళ్ళిపోయాను. బాత్రూంలో ముఖం, కాళ్ళు కడుక్కొంటూంటే వరాలు తువ్వాలు బాత్రూం తలుపుపై వేసి వెళ్ళింది. ఆ తువ్వాలుతో కాళ్ళు, మొహం తుడుచుకొని నా గదిలో తలుపుపై తువ్వాలు పడేశాను. 
వరాలొచ్చి ఆ తువ్వాలు తీసుకొని " భోజనానికి రండి" అని పిలిచి, హాలులో తాడుపై తువ్వాలు ఆరవేసి వంటింట్లోకెళ్ళింది. ఇన్నాళ్ళూ ఇందిర ఉంది గనుక నేనేం చేసినా, తను మాట్లాడలేదు. ఇప్పుడు జరగబోయే దృశ్యమెలా ఉంటుందో? ఎలా ఉన్నా ఎదుర్కోక తప్పదుగా! దుస్తులు మార్చుకొని మౌనంగా వెళ్ళి డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చున్నాను.
వరాలు మౌనంగా నాముందు కంచం పెట్టి వడ్డించి, తను నా ప్రక్క కుర్చీలో కూర్చుంది. నేను మౌనంగా అన్నం కలిపి తినబోయాను.
" ప్రొద్దున్న టిఫిను కూడా తినలేదు. వాళ్ళతో వెళ్తున్నప్పుడు తినమంటే ఏమీ మాట్లాడలేదు. వచ్చాక తింటారనుకొన్నాను. చివరికి ఆ టిఫిను మీద మీ పేరు వ్రాసిలేనట్లుంది. పనిపిల్లకి యిచ్చేశాను" నా నుంచి జవాబు కోసం కొద్దిసేపు ఆగింది.
" వాళ్ళని రైలెక్కించి అటే ఆఫీసుకెడతానంటే, బాక్సులో టిఫిను సర్ది యిచ్చేదాన్నిగా" ఆమె మాటలకు జవాబివ్వలేదని ఉక్రోషం తన్నుకొచ్చినట్లుంది.
"అడిగేది మిమ్మల్నే! వంటగిన్నెల్ని కాదు " వరాలి కంఠం ఖంగున మ్రోగింది.
"ఏమిటడిగేది? కడుపు మండిపోతోంది. భోజనం తిననీ!" నాలో అంత కోపం ఉందని నాకే తెలీదు. 
"ఉదయం నుంచి ఏమీ తినలేదుగా! మీకింత ఆకలిగా ఉందని నాకు తెలియదు. క్షమించండి" 
ఆమె మాటలకు బదులీయక మౌనంగానే భోజనాన్ని ముగించాను. 
నా ప్రవర్తనకు దెబ్బ తిన్న ఆమెలోని కోపమంతా, వంటగిన్నెలశబ్దంలో ప్రతిధ్వనిస్తోంది. గిన్నెలు పోతే కొత్తవైనా కొనొచ్చు గానీ ఆమెతో మాత్రం ఆరోజు మాట్లాడకూడదనుకొన్నాను. సాధ్యమైనంతవరకూ మొహాన్ని చిట్లిస్తూ వసారాలో పచార్లు చేస్తున్నాను. 
"సత్రానికొచ్చి భోజనం చేసినట్లు చేశారు. అక్కడన్నా నయమే! అది కావాలి, యిది కావాలి అని అడిగి మరీ వేయించుకొంటారు. కట్టుకొన్నది ఆ పనివాళ్ళ కన్నా కనికిష్టమైపోయింది. నా కన్న ప్రక్కింటి పంకజమ్మే నయం. మొగుడి చేత్తో గోరుముద్దలు తింటుంది. నాకు ఆ యోగం అక్కరలేదు. నేను వండిన నాలుగు మెతుకులు నవ్వుతూ తింటే చాలనుకొంటాను. కనీసం అది కూడా నా నొసటను వ్రాయలేదా మాయదారి దేవుడు" వరాలు నిప్పుల్లో పడ్డ ఉప్పులా చిటపటలాడుతోంది. ఆమె చివాట్లను గమనిస్తూ ఆరోజు వార్తాపత్రికలో తలదూర్చి కూర్చున్నాను. అయిదు నిమిషాలు అంట్లమ్యూజిక్ వినిపించి, చేయి తుడుచుకొంటూ నా దగ్గరకొచ్చింది. 
నిద్ర వస్తున్నవాళ్ళా ఆవులిస్తూ చేతిలోని పత్రికను బల్లపై పడేసి, నా గదిలో మంచంపై వాలిపోయాను. నా ప్రవర్తనకు ఆమె గాయపడినట్లుంది. 
బల్లపై పత్రికను తీసి దగ్గరున్న గూట్లోకి  విసిరికొట్టి  మంచం దగ్గరకొచ్చింది. 
" ఇన్నాళ్ళుగా లేనిది యీరోజు అంత వెగటైపోయానా? సరెలెండి! ఈరోజు మనం కలిసి భోజనం చేయలేదు" ఆమె గొంతులో జీర పారాడింది. నేను మౌనంగా గోడవైపు తిరిగి పడుకొన్నాను.
"ఓహో! పౌరుషం మీ సొత్తే అనుకొన్నారేమో! ఆమాత్రం పంతం నాకూ ఉంది. జరగండి" అని నన్ను కొద్దిగా తోసి, తను నా ప్రక్కన సర్దుకొంది. కొద్ది క్షణాల తరువాత కోపాన్ని నిగ్రహించుకొంటూ " నేనేం తప్పు చేశానో చెబితే సర్దుకొంటాను. అంతేగానీ యిలా మౌనంతో హింసించకండి" అని నా వైపు తిరిగి భుజం పట్టి లాగింది. మెల్లిగా నా భుజంపై ఆమె చేతిని తప్పించగానే విసురుగా అటు తిరిగి పడుకొంది. మరుక్షణమే ఉక్రోషంతో లేచి ఊగిపోయింది.
" నేనేం తప్పు చేశానని నామీద అలిగారు. మీరు నా కోసం కొన్న చీరని మీ చెల్లెలికి యిచ్చాను. అదేనా నేరం? వెధవది. . .తమ సొత్తు కన్న పరాయివాళ్ళ సొత్తే మెరుగనుకోవటం ఆడదాని బలహీనత. ఆ బలహీనతతోనే నా ఆడపడుచుకి నా కోసం మీరు కొన్న చీరే బాగుందనిపించింది. ఆ చిన్నపిల్లని చిన్నబుచ్చడమెందుకని ఆ చీరే ఆమెకిచ్చి, తనకోసం మీరు కొన్నచీరను నేను కట్టుకొన్నాను. ఈ విషయం మీతో చెప్పకపోవటం నా పొరపాటే! అదేదో మీరు అర్ధం చేసుకొంటారనుకొన్నానే తప్ప యిలా బాధపడతారనుకోలేదు. నాకు కావలసినది మీ చిరునవ్వే తప్ప యీ చీనీచీనాంబరాలు కాదు" దుఃఖంతో ఆమె కంఠం రుద్ధమైంది. నా నుంచి స్పందన లేకపోయేసరికి మోకాళ్ళలో తల దాచి భోరుమంది. ఆమె కన్నీటి వెల్లువలో నా పంతం కొట్టుకొనిపోయింది. 
"వరాలూ! ఏమిటిది? ఊరుకో!" భుజం పట్టి కుదిపేసరికి పసిపిల్లలా నా గుండెలో తల దాచేసింది. అప్రయత్నంగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. అయిదు నిమిషాలు నా గుండెల్లో తలదాచుకొన్న ఆమె, కళ్ళు తుడుచుకొంటూ లేచి "రండి" అంది.
"ఎక్కడికి?" 
"ప్రొద్దుటినుంచి ఏమీ తినలేదండీ! ఆకలిగా ఉంది" 
వరాలి మాటలకు త్రుళ్ళిపడ్డాను.
"అదేమిటోయి? ప్రొద్దున టిఫిను తయారుచేశానన్నావుగా" 
"మీరు తినలేదని పనిపిల్లకి యిచ్చేశానన్నానుగా" 
" నా కోటా యిచ్చేశావు. నీది?"
"మీరు తినకుండా నేనెప్పుడైనా తిన్నానా?" 
"చూడు. నాకేదో ఆఫీసు పని తగిలినప్పుడు యింట్లో తినకుండా వెళ్ళిపోవచ్చు. అలాగని నువ్వు కడుపు మాడ్చుకొంటే ఎలా?" 
"అలా మీరు చెప్పి వెడితేగా? నేను నగరం అమ్మాయిని కాదు. చేదస్తం మూర్తీభవించిన పల్లెటూరి పిల్లను. అలాగే ఉంటాను" 
ఈ సమయంలో మధ్యాహ్నం నేను హోటల్లో లాగించానని చెబితే ప్రళయమే! అయినా అలా చేసినందుకు సిగ్గుపడ్డాను.
"వడ్డించమంటావా?" డైనింగ్ టేబిల్ పై కంచం పెట్టుకొన్న ఆమె ముందు అతివినయం నటించాను. 
" వద్దులెండి. మీరు ప్రక్కనుండి నవ్వుతూ మాట్లాడండి చాలు. అన్నం గిన్నెను ఊడ్చేస్తాను" అంది నవ్వుతూ. ఆ సమయంలో వరాలి కళ్ళలో, ఆనాడు భారతదేశాన్ని జయించిన అలెగ్జాండరు కళ్ళలో తొణికిసలాడిన వెలుగు కనిపించింది. 
"నా మీద అలిగితే లొంగదీసుకోలేననుకొన్నారా? పంతం పట్టిన మగాణ్ణి కన్నీళ్ళు పెట్టయినా కాళ్ళబేరానికి తెచ్చే సామర్ధ్యం ఆడవాళ్ళకి ఉంది. తెలుసా?" విజయగర్వంతో ఉన్న ఆ కళ్ళలో సందేశాన్ని చదివిన నేను ఊహల్లోకి వెళ్ళిపోయాను. 
ఈ సృష్టిలో చిత్రమైనది భార్యాభర్తలబంధం. ఇద్దరిలోను భిన్నాభిప్రాయాలు, అహాలు ఉండవచ్చు. కానీ కొన్ని సమయాల్లో ఒకరిమీద ఒకరు గెలుపు సాధించాలనుకొంటూనే, ఒకరిచేతిలో ఒకరు ఓడిపోతుంటారు. అలాగని గెలిచినవారికి ఓడినవారు బానిసలా కనిపించరు. ఆత్మబంధువులా అనిపిస్తారు. అదే భారతీయ కుటుంబవ్యవస్థలో ఉన్న గొప్పదనం. మరొక విషయం. పెళ్ళిపీటలమీద మగవాడు తలెత్తి ధీమాగా కూర్చుంటాడు. ఆడది నమ్రతగా తల వంచి కూర్చుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ, మగవాడు తల వాలిపోతూ ఉంటుంది. ఆడది క్రమంగా సంతానసౌభాగ్యాలు పొంది, సంఘంలో గర్వంగా తలెత్తి తిరుగుతుంది. అలాగని ఎవరికి ఎవరూ లొంగిపోయినట్లు గాదు. అసలక్కడ గెలుపు స్త్రీ పురుషులది కాదు, ఆలుమగల మధ్య వెల్లివిరిసే అనురాగానిది.
"ఏంటలా చూస్తారు?" వరాలి ప్రశ్నతో ఊహల్లోంచి బయటపడ్డాను. 
"మరదలుపిల్లా! మిడిసిపడకు. . .నీ గెలుపే నా గెలుపు కాదా?" గాలి మోసుకొస్తున్న ఘంటసాల గొంతు విని నవ్వుకొన్నాను.
"నవ్వుతారెందుకు?"
"పాట విను"
"చాల్లెండి" ముసిముసిగా నవ్వుకొంటూ చేయి కడుక్కొని లేచింది వరాలు.
" రేపు మరొక నల్లపూల గళ్ళచీర కొనుక్కొని రండి" వరాలి మాటలకు త్రుళ్ళిపడ్డాను.
" ఎందుకు?" అప్రయత్నంగా అడిగాను.
" కట్టుకొందుకి " 
అమ్మో! ఈ ఏడాది కోటా అయిపోయినా మరో చీరకి టెండరా? ఆలోచిస్తున్న నాకు ఆమె గతంలో అన్న మాటలు గుర్తుకొచ్చాయి.
" కట్టుకొన్న నేనున్నానుగా! మళ్ళీ చీరెందుకు?" చిలిపిగా అన్నాను.
"మిమ్మల్ని . . ." అంటూ నన్ను కొట్టడానికి మీదకొచ్చింది.
తనకు అందకుండా పరిగెత్తే నా వెనకే గదిలోకి తరుముకొచ్చింది. 
ఆ తరువాత. . . . 
దంపతుల్లో తలలెత్తే అహంకారాలపై గెలుపు సాధించిన మమకారాల విజయభేరీ. . .గమనించిన చంద్రుడు తన ఆశీస్సులందిస్తూ మబ్బుల్లోకి తప్పుకొన్నాడు.
@ @ @

No comments:

Post a Comment

Pages