కాలి పోవని చేతులు... - అచ్చంగా తెలుగు

కాలి పోవని చేతులు...

Share This
కాలి పోవని చేతులు...
- పి.వి.ఆర్. గోపీనాథ్

“క్యాన్లు తెచ్చావా?” లోగొంతుతో గుసగుసగా అడిగారు రామంగారు.
“భలేవారే. బహువచనం కూడానా. ఒక్కటి దొరికే సరికే గగనమైపోయె. పైగా శవానికి స్నానం అంటే అసలివ్వడం లేదెవరూ. పైగా ఆ ఒక్కటీ కూడా ఐదు వందలకు తగ్గలేదు ! ”వాపోయేడు చిన్నయ్య
“అలా అంటే ఎలా? అప్పుడే పెద్దాయన పోయి ఒకటిన్నర  రోజైపోయె. ఈ సాయంత్రానికైనా స్నానం కానిచ్చి తీయకపోతే ఎట్లా కుదురుతుందీ.?”
పోయినాయన పేరు రంగనాథం గారు. వయసు 80 దాటింది. చిన్నయ్య ఆయన మనుమడు కాగా,  రామంగారు అతనికి వరసకు మామ అవుతారు. రంగనాథంగారి కుమారులిద్దరూ తండ్రి దేహం దగ్గరే ఉండిపోయారు. భార్య అంతకు ముందే కాలం చేసింది. కుమార్తె అక్కడే ఉన్నా మన లోకంలో లేనట్లే. దిగులుతో బాహ్య స్మృతి ఉండీ లేనట్లుగా ఉందామె స్థితి. చిన్నయ్య పెద్దవాడి కొడుకు. రెండోవాడి పిల్లలు విదేశాల్లో ఉండటం వల్ల వీలుకుదరడం లేదన్నారు..
అంతటా ఉన్నట్లే అక్కడా నీటి ఎద్దడి. తాగడానికే చాలవు. మామూలు స్నానాలకైతే మరింత కటకట. చివరకు ఎలాగో కిందా మీదా పడి వారినీ, వీరినీ బ్రతిమాలి మరిన్ని నీళ్ళు తెప్పించి పని అయిందనిపించారు.
***
   "మామయ్యా అసలు ఈ నీటి కరవు ఇంతలా ఎందుకుందీ. చిన్నప్పుడు అందరం చక్కగా చెరువుల్లో స్నానాలు చేసేవారంగా...?" చిన్నయ్య తమ్ముడు రంగయ్య అమాయకంగా వేసిన ఆ ప్రశ్నే రామంగారిని కొన్ని దశాబ్దాలు వెనక్కు నడిపింది.
 ***
ధన్ డబ్ ధన్ డబ్... “ఏ వూరు మీది కాసిలో రంగయా, ఎన్నాళు ఉంటావు కాసిలో రంగయా...”
కాల్వ గట్టున రజక సోదరీ, సోదరుల  రాగాలాపన. కాశిలో రంగడుంటాడా శివుడా అనేది మనకే కాదు, ఎవరికీ తెలియదు. కేవలం శ్రమ మరిచిపోవడానికి వారు తీసే రాగాలవి. బట్టల ఉతుకుడు చప్పుళ్ళతో ఈ రాగాలు కలగలసి ఊరి వారికి విందు చేసేవంటే అబద్ధం కాదు. ఆ తర్వాత వాటిని మడతలు పెట్టేటప్పుడు లో గొంతుతో (పెద్దింటారు వింటారనే జంకు తో) వేసుకునే జోకులు పిల్లలు విని తమ పెద్దల వద్ద ప్రశ్నించడమూ సన్నగా చివాట్లు తినడమూ కూడా రివాజే.
కానీ, కాలం మారిపోయింది. చాలా వేగంగా. కాల్వల గట్లు కబ్జాలకు గురి కాగా ఉతుకుడు యంత్రాలొచ్చి ఈ జనాల పొట్టలు గొట్టాయి. మరోవైపు, కాల్వ గట్ల వెంట భారీ భవనాలు. నీళ్ళందక ఎండిన పొలాలను అదే సాకుతో లే ఔట్లుగా మార్చుకున్న  మోతుబరులు, రాజకీయ నేతలు.
అటు నీరు లేదు, ఇటు పంటల్లేవు, కుల వృత్తులకు గండి. ఇంతలో వచ్చి పడ్డాయి ఎన్నికలు. ఎవరికి వారు తాము అధికారంలోకి వస్తే పేదలకు ఇల్ళు కట్టిస్తామని హామీలు గుప్పించేశారు. అవి ఎక్కడ కడుతున్నారో ఎవరూ ఎవరికీ చెప్పలేదు. ఊళ్ళో  జనావాసాల మధ్య పదుగురికీ అందుబాటులో ఉండే వృత్తి దారులను ఊరి చివరకు తోలేసేరు. ఆ ఇళ్ల సొబగులు ఎలా ఉన్నా తగినన్ని నీరు లేక వారు పక్కనే పారే నదులకూ, కాల్వలకూ గండ్లు కొట్టేశారు.
దాంతో నాలుగు చుక్కలు ఎక్కువ పడగానే నదులు పొంగేవి. కాల్వల గట్లు తెగేవి. ఊరూ వాడా ఏకం. దాంతో విధి లేనట్లు  ఆ నీళ్ళన్నిటినీ సముద్రంలోకి తోసేసి సమస్య పరిష్కరించేశాం అనుకునేవారు.
కానీ, ఏటా వేసవి వచ్చే సరికి తీవ్ర నీటి ఎద్దడి. మున్సిపల్ టాంకర్ల హడావుడీ, కాంట్రాక్టర్ల రాజకీయం. ఎడాపెడా బోర్ల తవ్వకాలు. చెట్లను అంతకు ముందే ఇళ్ళకోసమో, మరొకందుకో నరికేయడంతో  గాలి రాదు, వానలూ రావు. అది తెలిసిన నాయకులు లేరు,  వారికి తెలిసేట్లు చెప్పగల పెద్దలూ లేరు. ఈ నేపథ్యంలోనే ఓ సంవత్సరం ప్రకృతి కన్నెర్ర మరీ పెద్దది కావడంతో సమస్య పల్లెలూ, బస్తీలూ దాటి రాజధానీ నగరం వరకూ పోయింది.
బస్తీల్లో ట్యాంకర్ల హడావుడి. జనాలకు నీరు మాటేమో గానీ, అదికార్లకు, కాంట్రాక్టర్లకు,  బడా నాయకులకు కూడా ఖజానాలు నిండ సాగాయి. దాంతో అక్కడెవరూ పట్టించుకోలేదు. మరోవైపు,  పల్లెల్లో టాంకర్ల హడావుడి లేకపోయినాఎడా పెడా బావులు తవ్వేవారు. బోర్లు వేసేవారు. వీటి వలన కూడా సామాన్యులకు తప్ప ఇతర వర్గాలకు బాగానే ముట్టసాగడంతో ఇక్కడా బడుగు జనులు బావురు మనక తప్పడం లేదు.
దీనికి తోడు ఆ బావుల లేదా బోర్ల లోతూ, వాటికి అమర్చే మోటార్లూ ఇతరులకు కొంత ఇబ్బంది కరంగా మారేవి కూడా. అవీ అడపా దడపా గొడవలకు దారి తీసేవి. అవీ కొన్ని వర్గాలకు కాసుల వర్షాలే కురిపంచాయి మరి.ఏతావాతా ఎక్కడా సామాన్యుల గోడు ఎవరికీ పట్టేది కాదు.
****
రోజులు మారాయి. సర్కారూ మారింది. మరోవైపు వానలు లేక చేలు బావురుమంటున్నాయి. సామెత చెప్పినట్లు సర్కారు దృష్టి సాంకేతికపై పడింది. దాంతో  హైటెక్ , సైబర్ సడేమియాలు  పెరిగి ఇతర ప్రాంతాలలోని సేద్యంపై విపరీతమైన ప్రభావం చూపసాగాయి. అదెలాగంటే,  యువత మోజు ఇంజనీరింగ్ వైపు మళ్లింది. వారి వలసలతో పల్లెల్లో రైతులకు చేయూత కరవయింది. పిల్లలను చూసుకునే నెపంతో వారూ నగరాల బాట పట్టారు. దాంతో పొలాలలోనూ లే అవుట్ల హవా మొదలయింది. ఫలితం....
****
“దీం తుంప తెగా 15 అడుగులు తవ్వినా నేల తగల్దేంటిరా... అవుతల ఆగరుగాళ్ళు గోలెడతన్నారూ...”
“ఇందేంటహె. వందడుగులు తవ్వినా జల పడదూ.. ఇట్టయితే కట్టుబడి ఎట్టా...”
భవనాలకు పునాదులు తవ్వాలంటే ఒక సమస్య. ఆ నిర్మాణాలకోసం సుదూరాన నీటి కోసం జరిపే అన్వేషణలో మరో సమస్య. ఎవరి సమస్య వారిది అనిపించినా రెండిటికీ మూలం ఒకటే. అదే విచక్షణా రహితంగా చెట్ల కొట్టివేత. ఎడాపెడా భవంతుల నిర్మాణం.
ఊరంతా రోగాలే. వరిని కదిలించినా ఏదో ఒక రుగ్మత. మొదట్లో అంతు బట్టని రోగాలనుకున్నా తర్వాత్తర్వాత తెలిసింది ఇదంతా గాలీ, నీటి కాలుష్యాల పుణ్యమేనని.
అలా అన్న వారితో కొందరు అభ్యుదయ వాదులం అనుకునేవారు వాదులాటకు దిగారు.
“అంతస్తులు లేపకపోతే ఇంత మందికి చోటేదీ?భూసారం తగ్గిపోతున్నప్పుడు పరిశ్రమలు పెట్టకపోతే యువతకు ఉపాధి ఎట్లా??”
“కానీ, కొంతైనా సంయమనం పాటించాలర్రా.  ఒకరిని చూసి ఒకరు కులవృత్తులను, సేద్యాన్ని పూర్తిగా మానేసి బస్తీల వెంట పరుగులు తీస్తున్నారు. లేదా  పెద్దలు వద్దనుకుంటూ వేరు కాపురాల మోజు పెంచుకుంటూ పోతూంటే అంతస్తులు అవసరమే ... కానీ, దాని వలన కిందా, పైనా కూడా కాంక్రీటు పేరుకు పోతుంటే గాలీ,  నీరూ కలుషితం కావా?”
“చూడూ... ఓ సారి వీటిని పరికించు. నా మాటలలో అబద్ధముంటే చెప్పు మరి...”
“ఆ.వె.చెట్లతోడ మనకు చెలిమి లాభించునూ
గాలి నడ్డి యవియె గాలి నిచ్చు
మదియె పులకరించ మరి యెన్ని శుభములో
పంక్తి వరుని రాత ప్రగతి గీత !!
ఆ.వె.. అంబరమున మిద్దె సంబరమే గాని
నీరు పోవ కింద దారి లేదె?
దారి చేసుకున్న తగులదా ధూళియే
వ్యాధులకును మూల వ్యసనమిదియె !!“
అప్పటికి ఆలోచించినట్లు కనిపించినా, ఆ తర్వాత తిరిగి అంతా మామూలే...
***
సంవత్సరాలు గడిచే కొద్దీ సమస్య మరింత తీవ్రమయింది. దాంతో సర్కారు కొత్త ఆలోచనకు తెర తీసింది. ఊరూరా ఇంకుడు గుంతలు తవ్వి వాన నీరు, వాడకం నీరు కూడా పట్టాలన్నది. ఆ మేరకు ఆదేశాలూ జారీ చేసింది. కానీ ఇక్కడే తప్పటడుగు వేసిందనాలి. ఇంకుడు గుంతలనేవి ప్రాంగణాలకే పరిమితం. మరి బయటి వారి సంగతేమిటి. పైగా భూగర్భాలలో నీరు నిల్వ చేసినా వాటి చుట్టూ చేరే కాంక్రీటు బెడదను వదిలించడం ఎట్లాగన్నది ఎవరూ ఆలోచించ లేదు.
పైగా సమస్య సమస్యగానే మిగిలిపోయింది. కారణం ..  నీటి ఆవశ్యకతను గుర్తించిన సర్కారు మొక్కలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. రోడ్ల విస్తరణలో భాగంగానూ,ఇతర కారణాల వల్లనా చెట్లను ఎడా పెడా నరకడమే గానీ, తిరిగి మొక్కలు నాటాలనీ, సాకాలని గట్టిగా సంకల్పించ లేదు. దాంతో పల్లెలూ, నగరాలూ కూడా వేడెక్కిపోతున్నాయి.
చివరకు జల కాలుష్యం అటుంచి  నేల అడుగున నీరే మాయమైపోయింది. పల్లెల్లో కూడా క్యాన్ల హడావుడి చోటుచేసుకుంది. కానీ, దొరికేది మాత్రం స్వల్పమే. అందుకే...
***
ఊరూరా, వాడలా వ్యాపార ప్రకటలను మించిపోయి హెచ్చరిక బోర్డులు వెలిశాయి.
“నీరు తక్కువగా దొరుకుతున్నందున వృధా చేయరాదు. ఎక్కడైనా ఒక్క చుక్కనీరు వృధా చేసినట్లు తెలిస్తే జిరిమానా తప్పదు.... శుభ్రతకు వీలైనందత వరకూ కాగితాలతోనే వాడండి...!” ఇదీ ఆ బోర్డుల సారాంశం !!
ఇళ్లల్లో మినహా బయట ఎక్కడా నీరు ఉచితంగా ఇవ్వడమే మానేశారు. గ్లాసు నీటి కంటే కృత్రిమంగా తయారయ్యే  కూల్ డ్రింకులే చవకైపోయాయి.
స్నానాలు రోజు విడిచి రోజు చేయాల్సిందే. అదీ కుటుంబ సభ్యులందరికీ ఒకేసారి వీలు పడదు. ఆంక్షలు లేవుగానీ నీరే లేదు. కాకపోతే ప్రత్యామ్నాయంగా అత్తరులు చల్లుకోవచ్చు. మృత దేహాలకైతే అసలు నీరే లభించదు. అలాగని చెపితే అసలు విక్రయించడానికే వీలులేని పరిస్థితి.  కేవలం ఓ వస్త్రంతో శుభ్రంగా తుడిచి కరెంటు ఆదారంగా దహనం చేయాల్సిందే. ఆ తర్వాత మాత్రం ఏదో నామకః ఇన్ని నీళ్ళు నెత్తిన చల్లుకోవచ్చు.
***
“ఎంత దారుణం. మరి దీనికి పరిష్కారమే లేదా మామయ్యా ... ఎన్నేళ్ళు ఇలా?”
రంగయ్య ప్రశ్నలతో ఆలోచనలు వీడి లోకంలోకి వచ్చారు. రామంగారు.
“లేకేంరా. మనం సవ్యంగా ఆలోచించాలేగానీ ప్రతి సమస్యకూ తగిన పరిష్కారం ఉంటుంది. ముందుగా ... పెరిగి పోతున్న కట్టడాల ధోరణికి పగ్గం వేయాలి. కట్టదలచినవాటినైనా అన్నీ ఒక్కచోట కాకుండా అక్కడొకటీ ఇక్కడొకటీగా కొట్టుకోవాలి. అసాదారణ అత్యాధునిక సమాచార వ్యవస్థ అందుబాలులో ఉంచుకునీ ఇంకా అన్నీ ఒక్క చోటే కట్టాలనుకోవడం, అందుకోసం పొలాలను పాడుపట్టడం మానుకోవాలి. పొలాల వల్ల మనకు తిండి మాత్రమే కాదురా,  వాటికి అందించే నీరు కూడా వాటికి పోగా కొంత మిగిలే అవకాశమూ, భూగర్భ జలాల మట్టం పెంచే అవసకాశమూ ఉంటుందని గ్రహించాలి.
అంతేకాదు. ఇదే సమయంలో నదీ తీరాల వెంట వాన నీటిని పట్టేందుకు తగిన జలాశయాలు నిర్మించుకోవాలి. సముద్రం వెంట ఉప్పు నీటినుంచి మంచి నీటిని వేరుచేసే కర్మాగాలు నిర్మించుకోవాలి. వీటి వలన యువతకు ఉపాధి కూడా కదా. కార్ఖానాలలో రసాయనాలతో  కృత్రిమంగా తయారయ్యే ఉప్పు కన్నా ఇది చాలా మంచిది కదా...”
“అవునా. మరి ఇదంతా ఆలోచించే దెవరూ, మన పాలకులకు ఇవేవీ తెలియవంటావా, అయినా దీనికంతటికీ డబ్బులెక్కడివీ?” లాంటి ప్రశ్నలేవీ వేయలేదతను. అలా అడిగితే ఎదురయ్యే ప్రశ్నలు అతనికీ తెలుసు మరి.
***
“ఒరె ఒరే. మీ అభిమానం చల్లగుండా. నానమ్మమీద ఎంత ప్రేమైతే మాత్రం శవం స్నానానిక్కూడా అన్ని బిందెలేమిట్రా,  ఇలాగ చేసే మా పెద్దలు మా చిన్నప్పుడు క్యాన్ల లెక్కన కొనుక్కోవలసి వచ్చింది. ఆ తర్వాత అసలు అమ్మకానికీ దొరకలేదు తెలుసా?”
మెత్తగా హెచ్చరిస్తున్న రంగయ్య గారిని చూసి దూరాన పడక్కుర్చీలో కూర్చున్న రామంగారు గుంభనంగా నవ్వుకోసాగారు.
***

No comments:

Post a Comment

Pages