పుష్యమిత్ర – 13 - అచ్చంగా తెలుగు

పుష్యమిత్ర – 13

- టేకుమళ్ళ వెంకటప్పయ్య



జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ " అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు బృహద్ధ్రదుని వద్దకు సైన్యాధికారి పదవి కోసం వెళ్ళిన సమయంలో సింహకేతనునితో తలపడి అతన్ని ఓడించగా,  సింహకేతనుడు నగరం వదలివెళ్తాడు. కోటలో జరిగిన సంఘటనలు పుష్యమిత్రుని దిగ్భ్రాంతికి గురి చేస్తాయిరాజ్యం నుండి వెళ్ళిపోయిన సింహకేతనుడు జీలం నది వద్ద నివాతకవచులతో కలిసి కనిపించాడని భయపడ్డ బృహద్ధ్రధునికి తన యుద్ధ తంత్రాలు చెప్పి ఊరడిస్తాడు  పుష్యమిత్రుడు. బృహద్ధ్రధుని అనుజ్ఞమేరకు ఆంధ్ర దేశానికి స్వయంవరానికి వెళ్ళిన పుష్యమిత్రుడు వసంతసేన  ను ఆలయంలో చూసి ప్రేమలో పడతాడు. అనుకోకుండా వారిద్దరికీ వివాహం అవుతుంది. వసంతసేన ను తీసుకుని కళింగరాజ్యం పొలిమేరలు దాటుతూ ఉండగా ఏవరో ముసుగు దొంగలు వెంటాడతారు.   ( ఇక చదవండి).
పుష్యమిత్రుడు రధంపై వసంతసేనను తీసుకుని కళింగ రాజ్యంలో ప్రవేశిస్తుండగా దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు గుర్రపు సకిలింపులూ వినిపిస్తాయి. పక్కన వున్న ఆంధ్ర సైనికులు "మహారాజా బందిపోటు దొంగలు. మనం యుద్ధానికి సిద్ధంగా ఉండాలి". పుష్యమిత్రుడు రధాన్ని ఓ ప్రక్కగా ఆపి, వసంతసేన వైపు చూసి చిరునవ్వుతో "నా శక్తి సామర్ధ్యాలు కధలు కధలుగా వినడమే గానీ ప్రత్యక్షంగా చూడలేదు అన్నావు కదా!  ఇప్పుడు చూడు" అంటూ పది మంది సైనికులను రధం చుట్టూ కాపు ఉంచి తన గుర్రాన్ని అదిరోహించి ఎనిమిది అడుగుల బల్లెం ధరించి కొంచెం ముందుకు వచ్చి నిలబడి సిద్ధం అయ్యాడు. ఓ పదిమంది ముఖాలకు గుర్తు తెలియకుండా కవచాలు ధరించి చుట్టుముట్టారు. పుష్యమిత్రుడు వారిని బల్లెంతో వేసిన దెబ్బలకు నలుగురు అక్కడికక్కడే మరణించారు.  గుర్రాల కాళ్ళపై బల్లెం దెబ్బలు తగలగానే నలుగురు ధభీ మని క్రింద పడగానే వారి గుండెలు చీల్చుకుని భూమిలో దిగబడేట్టుగా బల్లెం తో గుచ్చాడు. మరో ఇద్దర్ని బల్లెం గుండ్రంగా తిప్పుతూ గుర్రంపై నిలబడి బల్లెం పిడిని తగిలించగానే ఎగిరి ఏభై గజాల దూరం వెళ్ళిపడ్డారు. ఇంతలో ఒక ముసుగు దొంగ వెనకగా రధం వైపు వెళ్ళి పుష్యమిత్రుని సైనికులను పక్కకు పడదోసి వసంతసేనను రధంపై నుండి పడతోయడానికి ప్రయత్నిస్తుండగా వసంతసేన చేసిన ఆర్తనాదం విన్న పుష్యమిత్రుడు  “హా”  అని పెద్ద కేక పెట్టి, తృటిలో అక్కడ వాలి ఒర లోని ఖడ్గం తీసి అతని తలపై ఒక్కదెబ్బ విసురుగా వేయగానే ఆ మనిషి ఆసాంతం భీమసేనుడు జరాసంధుని రెండు భాగాలుగా చీల్చిన రీతిగా రెండు భాగాలుగా చీలిపోయాడు గుర్రంతో సహా. భయంకరంగా అతను అలా నేలకూలగానే మిగిలిన వారు జడుసుకుని పిక్కబలం చూపారు.  అది చూసి వసంతసేన ఆశ్చర్య పోయింది పుష్యమిత్రుని భుజబలానికి. వాడు అలా కింద పడగానే కవచం వూడి రెండుభాగాలైన మొహం కనిపించింది. ఆశ్చర్యం వాడు ఎవరో కాదు శ్వేతాశ్వుడు. "హు...శ్వేతాశ్వా... చివరికి నీ కధ ఇలా అంతమయిందా!" అనగానే వసంతసేన ఎవరని ప్రశ్నించగా అతని వివరాలు చెప్పి మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు.
బృహద్ధ్రధుని రాజధాని చేరేసరికి సాయంకాలం అవుతున్నది. ఆంధ్ర సైనికులకు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి రధాన్ని తన భవనానికి తీసుకు వెళ్ళి అక్కడ ఆపాడు. రధం నుండి దిగుతున్న వసంతసేనను చూసిన జనం ఆశ్చర్యపోయారు ఎవరీ  అతిలోక సౌదర్యవతి యని. వసంతసేనను ఒక రహస్యమందిరం లో ఉంచి సకలసదుపాయాలు అమర్చి "నా అనుమతి లేకుండా ఎవరు ద్వారాలు తీయాలని సంకల్పించినా ఉపేక్షించకండి. నిర్దాక్షిణ్యంగా వారిని సంహరించండి" అని ఆంధ్ర సైనికులకు ఆదేశించి రాజాంత:పురానికి గుర్రం పై సాగి పోయాడు.
*  *  *
"పుష్యమిత్రా! ఘనస్వాగతం. నీవు వసంతసేనను తీసుకొని నగరు చేరిన విషయం ఇప్పుడే విన్నాను. ఒక్కడివే వచ్చావు. వసంతసేన ఎక్కడ? అని ప్రశ్నించాడు బృహద్ధ్రధుడు. "మహారాజా! అక్కడ జ్యోతిషవేత్తలు మనకు గొప్ప చిక్కును తెచ్చిపెట్టారు. నరేంద్రవర్మ స్వయంవరంలో కూడా ఈవిషయమే పలుమార్లు హెచ్చరించాడు. అందువల్ల ఆమెను వివాహమాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు." "ఏమిటా విషయం?" గంభీరంగా అడిగాడు మహారాజు. "ఆమెను సంవత్సరం వరకూ ఎవరూ చేపట్టినా మరణం తధ్యం. ఒక సంవత్సరం పాటు ఆమె చేసే మంగళగౌరీ వ్రతానికి ప్రతి మంగళవారం వేద మంత్రాలతో పూజ జరిపించాలి. అది భర్తఉన్న ప్రదేశంలో జరుగకూడదు. వేదాంగవేత్త అయిన బ్రాహ్మణుని సన్నిధిలో జరగాలి.  అందువల్ల ఆమెను నా భవంతిలో ప్రత్యేకమైన పూజా గదిలో ఉంచాను." "హతవిధీ అంతటి సౌదర్యవతి అయినా ఆమెకు ఎలాంటి దురవస్థ!" అని వాపోయాడు మహారాజు. "ఆమెను నేను చూడవచ్చా?" అనగానే "మహారాజా! మీ మేలుగోరేవాడిని కనుక చెప్తున్నాను. ఎప్పుడూ మనం దైవంతో ఆటలాడరాదు" అనగానే మౌనంగా తలవూచాడు మహారాజు.
*  *  *
బృహద్ధ్రధుని అరాచకాలకు ప్రజల్లో అసంతృప్తి పెచ్చుపెరిగిపోయింది. ఆశ్వీయజ మాసంలో దశరా ఉత్సవాలు వచ్చాయి. ఆయుధ పూజ కోసమై ఆ సమయం లో అష్టసేనానులతో పాటూ అందరు ముఖ్య సైనికాధికారులతో పుష్యమిత్రుని భవంతిలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దాదాపు అందరూ మహారాజు పట్ల అసంతృప్తిని వెళ్ళగ్రక్కారు. పుష్యమిత్రుడు వారిని శాంతపరచి త్వరలో పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చాడు. ఇంతలో వసంతసేన ఆ సమావేశ మందిరంలోకి ప్రవేశించి "ఒక్కసారి భవంతి తలుపులు మూసి రండి" అని సైనికులకు ఆదేశించింది." అందరూ ఆమె ఏమి చెప్పబోతుందో అర్ధంకాక అలా చేష్టలుడిగి చూస్తున్నారు. "మహాసేనాని పుష్యమిత్రుని అనుమతితో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను" అనగానే పుష్యమిత్రుడు చెప్పమని సైగ చేసాడు. అందరూ చెవులు రిక్కించి వింటున్నారు. "బృహద్ధ్రధుని పాలనలో ఉండాలనుకునే వారు చేతులెత్తండి" అంది. ఎవ్వరూ చేతులెత్తలేదు సరికదా మాట్లాడనూ లేదు. సరే నేను చేసే ప్రతిపాదన వినండి. "పుష్యమిత్రుడు రాజైతే సమర్ధించేవారు ఎంత మంది?" అనగానే అందరూ మహోత్సాహంతో నిలబడి చప్పట్లు చరిచారు. ఇంకా ఇలాంటి బ్రతుకులు గడుపుతారో, దేశ సేవ చేసి ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునే పుష్యమిత్ర మహారాజు క్రింద పనిచేస్తారో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమయినది" అంటూ తన గదిలోకి నిష్క్రమించింది. ఒక ఉరుము వురిమి వెళ్ళినట్ట్లుగా వసంతసేన వెళ్ళగానే పుష్యమిత్రుడు నిర్ఘాంత పోయాడు. అందర్నీ ఈ విషయం ఇంతటితో మర్చిపొమ్మని,  ఎవరూ ఈ విషయం ఇంక ప్రస్తావించవద్దనీ ఆదేశించి దశరా సందర్భంగా జరగాల్సిన ఆయుధ పూజాకార్యక్రమాన్ని అందరికీ వివరించి సమావేశం ముగించాడు పుష్యమిత్రుడు.
*  *  *
"మహారాజా! మన దేశంలోనే కాక చుట్టుప్రక్కల సామంతదేశాలలో కూడా సైనిక శిక్షణ గత ఆరునెలలుగా సాగుతోంది. యువకులు ఉత్సాహవంతంగా కత్తిసాము మొదలైనవి నేర్చుకుంటున్నారు. వాటిని తమ ముందు ప్రదర్శించాలని వువ్విళ్ళూరుతున్నారు" అన్న పుష్యమిత్రుని మాటలకు బృహద్ధ్రధుడు "ప్రతి సంవత్సరం  కార్తీక పౌర్ణమి రోజున సర్వ సైనిక కవాతు ఉంటుంది. దానిలో పాల్గొనాల్సిందిగా అందరికీ కబురు చేయి." అన్నాడు. "చిత్తం మహారాజా!" అని సెలవు పుచ్చుకున్నాడు పుష్యమిత్రుడు.
*  *  *
అష్టసేనానులతో ఆంతరంగిక సమావేశం జరుగుతోంది. బృహద్ధ్రధ మహారాజు పాలన పై రోజురోజుకీ వారికి అసహనం పెరిగిపోతోంది. వారు అష్ట దిక్కులనుండీ కనీసం వారం రోజులకు ఒకరు చొప్పున మంచి అందగత్తెలను తెచ్చి మహారాజుకు బహుమతిగా ఇవ్వాలి.  "మేం సేనానులమా లేక అమ్మాయిల తార్పుడు గాళ్ళమా అర్ధం కావడం లేదు మహాసేనానీ! మేం ఇక భరించలేని స్థితికి వచ్చేసాం.  ఇక ఏదో ఒకటి తేలిపోవాలి అనగానే "అర్ధం కాలేదు" అన్నాడు పుష్యమిత్రుడు. బృహద్ధ్రధునికి వారసులు లేరు. ఉన్న సింహకేతనుడు అలా రాజ్యం విడిచి వెళ్లగా ఈ మధ్య శ్వేతాస్వుడూ కనిపించడంలేదు. అనగానే పుష్యమిత్రుడు అతని మరణం గురించి చెప్పాడు. “పుష్యమిత్రా మేమందరం చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చాం. అన్నిటికీ ఒకటే పరిష్కారం. వసంతసేన రాజకుమార్తె. మీతో వివాహం అయింది.  మహారాణిగా ఉండవలసిన అర్హతలన్నీ ఆమెకు ఉన్నాయి. మీరు కాబోయే భావి భారత చక్రవర్తిగా వూహించుకుంటున్నా”  అని పూర్తిగా అనకముందే  "ఆపండి"  అన్నాడు పుష్యమిత్రుడు. “మరి దేశంలో శాంతిభద్రతలు అఖ్ఖరలేదంటారా?” అని అనగానే "అలా అని నేను అనడం లేదు చూస్తూ చూస్తూ ఒక బ్రాహ్మణునిగా రాజద్రోహం చెయ్యడం ఎలా?"   " పుష్యమిత్రా! ఇక దాచడం అనవసరం మేమే యెల్లుండి రాబోయే కార్తీక పౌర్ణమి రోజున బృహద్ధ్రధుని వధించడానికి పధకం వేసాము. మీకు వివరంగా అన్నీ ఆరోజు చెప్తాము" అని వెళ్ళిపోయారు. ఇంతలో ఒక సైనికుడు వచ్చి పుష్యమిత్రా మీరు ఆంధ్ర దేశంలో వదలి వచ్చిన సైనికులలో ఇద్దరు తిరిగి వచ్చి  మహారాజు అంత:పురంలో ఉన్నారు" అని చెప్పాడు. పుష్యమిత్రునికి ఏదో కీడు శంకించినట్లైంది. వెంటనే వసంతసేనకు భద్రత మరింత కట్టుదిట్టం చేసాడు.
*  *  *
సైనిక కవాతుకు అందరు సైనికులూ నగరం చేరుకుని ఒకసారి రేపు జరగబోయే దానికి ముందుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పుష్యమిత్రుడు దగ్గరఉండి అన్నీ పర్యవేక్షిస్తున్నాడు. అన్ని దళాలకు ముందుగా అష్ట సేనానులు ఉండే విధంగా ఏర్పాటు చేసాడు. వెనుకు కాల్బలం, ఆ వెనుక అశ్వికులు, ఆ వెనుక గజబలం.. ఇలా అన్నీ పద్ధతి ప్రకారం ఏర్పాటు చేస్తూ ఉండగా వాటిని పరిశీలించడానికి బృహద్ధ్రధుడు రధం పై వచ్చాడు. వెంట తను ఆంధ్రదేశం లో వదలి వచ్చిన సైనికులు ఇద్దరు ఉన్నారు. "జయము జయము బృహద్ధ్రధ మహారాజులకు.. విచ్చేయండి.. చివరిగా ఇలా అంటూ తన ఏర్పాట్లను చెప్తూ ఉంటే అన్నీ తలవూపి వింటూ మౌనంగా  ఏమీ మాట్లాడకుండా, సలహాలను ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. పుష్యమిత్రుడు విషయం ఏమిటో తెలీక ఆలోచనలో పడ్డాడు.
*  *  *
కార్తీక పౌర్ణమి రోజున మూడో ఝామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సంధ్యాదులు ముగించి ఉపాహారం సేవించి ఐదు గంటలకు వసంతసేన వద్దకు వెళ్ళి  అన్ని జాగ్రత్తలు చెప్పి నమ్మకస్తులైన సైనికులను కాపలా ఉంచి కవాతు జరిగే ప్రదేశం చేరుకున్నాడు. ఆ సైనిక బృందాలకు సలహాలు ఇస్తూ ఉండిపోయాడు. ఉదయం ఎనిమిది గంటలకల్లా అందరూ హాజరయ్యారు. కవాతు ప్రారంభమయింది. పుష్యమిత్రుడు దగ్గర ఉండి మహారాజుకు అన్నీ చూపిస్తున్నాడు."మహారాజా నలభై వేల మంది ఉన్న మన కాల్బలం నేడు ఎనభై వేలకు పెరిగింది. అలాగే అశ్వికులు గజ బలం కూడా గణనీయంగా పెరిగింది" అన్నాడు. మహారాజు అదోరకంగా విషపు నవ్వు నవ్వి  "సైనికులారా!  ఆ చెట్టు క్రింద దూరంగా పంజరం లో వున్న వసంతసేనను రధంలో ఉంచి తీసుకురండి" అనగానే వారు కవాతుకు కొద్ది దూరంలో చేతులు వెనక్కు విరిచి కట్టివేయబడి పంజరంలో ఉన్న వసంతసేన రధాన్ని పుష్యమిత్రుని ముందు నిలబెట్టారు. "నమ్మకద్రోహం!  పుష్యమిత్రా! నాకు కానుకగా తెమ్మన్న వసంతసేనను నీవు వివాహం చేసుకున్నావు" అనగానే "మీరు పొరబడుతున్నారు. ఆమె స్వయంవర పుష్పమాల నా మెడలో వేయడం నా తప్పిదం కాదు తను నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే హక్కు తనకు ఉంది. దయచేసి ఆమెను విడిపించండి. నేను ఆమె సౌరాష్ట్రకు వెళ్ళి జీవితం గడుపుతాము" అనగానే " ఇంత రాజద్రోహం చేసిన నిన్ను వదలడమా!" అని   "అష్ట సేనానులారా! పుష్యమిత్రుడిని బంధించి వధించండి! చక్రవర్తిగా ఇది నా ఆజ్ఞ" అనగానే అష్టసేనానులు ఏమీ మాట్లాడకుండా నిలుచున్నారు.  వసంతసేన రధం తోలుకుని వచ్చిన వ్యక్తి ముఖం లోహపు కప్పుతో కప్పబడి ఉంది. ఆ వ్యక్తి రధం దిగి ఓ పెద్ద బల్లెంతో పుష్యమిత్రుని ముందు నిలబడి "ఆనతియ్యండి మహారాజా పుష్యమిత్రుడిని ఖండ ఖండాలుగా నరికేస్తాను" అని ముఖం పై ఉన్న లోహపు కవచాన్ని తొలగించి పెద్దగా నవ్వాడు. ఆశ్చర్యం  అతడు "సింహకేతనుడు.   మహారాజు పెద్దగా నవ్వుతూ... "శబాష్ సింహకేతనా!   నీవు చెప్పినట్లే పుష్యమిత్రుడు రాజద్రోహిగా మనముందు నిలబడ్డాడు. నీవు వూహించినది అక్షరాలా నిజం."  అన్నాడు. (సశేషం)
*  *  *

No comments:

Post a Comment

Pages