సేవ - అచ్చంగా తెలుగు

సేవ 

 వై.ఎస్.ఆర్.లక్ష్మి
         "సుబ్బారావు రాలేదా?అని అడిగాడు శ్రీనివాసరావు తనతోపాటు పార్కులో కూర్చున్న మిగిలిన స్నేహితులను.
           "లేదు.ఎక్కడ ఊరేగుతున్నాడో?"అన్నాడు మురళి ఎగతాళిగా.
          "ఎక్కడకెళ్ళి ఉంటాడంటావు?"తెలుసుకోవాలన్న కుతూహలం కంటే వెటకారం ఎక్కువ ధ్వనించింది నరేంద్ర గొంతులో.
          "ఏముంది రాఘవయ్య బిల్లులు కట్టాలనో,జానకమ్మ బ్యాంక్ పనుల కోసమో వెళ్ళుంటాడు.మామూలేగా!"మరల మురళి అన్నాడు.
       "ఎందుకొచ్చిన పన్లంటావు?అందరి పనులూ భుజాన వేసుకొని తిరుగుతుంటాడు.క్షణం తీరికుండదు,దమ్మిడీ ఆదాయం ఉండదు."అన్నీ రూపాయలతో కొలిచి ఎవరికీ వీసమెత్తు సహాయపడని రమణ.
     "పోనిద్దూ!ఎవరి పిచ్చి వారికి ఆనందం.మనకు ఎందుకు ?చీకటి పడింది ఇంక వెళదామా?"అంటూ లేచాడు కృష్ణారావు.
                          వారంతా విజయ్ నగర్ కాలనీలో నివాసముంటున్నారు.అందరూ ఉద్యోగాలు చేసో,చిన్నచిన్న వ్యాపారాలు చేసో  ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నవారే.రోజూ సాయంకాలం పార్కుకు వచ్చి రెండు,మూడు గంటలు కాలక్షేపం చేసి వెళుతుంటారు.వాళ్ళ సంభాషణల్లోకి రాని విషయమంటూ లేదు.కుటుంబ విషయాల దగ్గర్నుంచి రాజకీయాల వరకు,మోడీ నోట్ల రద్దు దగ్గర నుంచి ట్రంప్ హెచ్1 వీసాల ఆంక్షల వరకు ప్రతిదీ చర్చనీయాంశమే!కృష్ణమూర్తి ఈ మధ్యనే అక్కడకు వస్తున్నాడు.సుబ్బారావు తో ఎక్కువ పరిచయం లేదు.
                              వాళ్ళందరికీ హాట్ టాపిక్ గా మారిrన సుబ్బారావు కూడా అదే కాలనీలో ఉంటాడు.ఆయనా రిటైర్ ఉద్యోగే!భార్య రమ మాత్రం ఉద్యోగం చేస్తోంది.ఇద్దరు మగపిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు.రెండుమూడేళ్ళకు ఒకసారి వచ్చి పోతుంటారు.రమ ఆఫీసుకు వెళ్ళడం ఆలస్యం సుబ్బారావు బయటకు వెళ్ళి  ఆమె వచ్చే సమయానికి వస్తాడు.ఎవరికి ఏ సహాయం అవసరమున్నా చేస్తాడు.రమ కూడా అభ్యంతర పెట్టదు.దాంతో అతని వ్యాపకాలు నిర్విఘ్నంగా జరిగిపోతున్నాయి.హాయిగా తమలాగా కాలుమీద కాలు వేసుకొని కులాసాగా గడపక లేని పనులు భుజాన వేసుకొని తిరుగుతుంటాడని సుబ్బారావు గురుంచి మిత్రబృందం హేళన గా మాట్లాడుతుంటారు.అతనికి చూచాయగా తెలిసినా పట్టించుకోడు.ఎప్పుడన్నా బాగా తీరిక దొరికినప్పుడు పార్కుకు వచ్చి వెళతాడు.
                         కృష్ణమూర్తికి యాక్సిడెంట్ అయ్యి హాస్పటల్ లో ఉన్న విషయం మర్నాటికి గాని తెలియలేదు సుబ్బారావు కి.తెలిసిన వెంటనే హాస్పటల్ కి వెళ్ళాడు. పరామర్సించి వెళ్ళాడు.మర్నాడు మరల వెళ్ళేటప్పటికి కృష్ణమూర్తి ఒక్కడే బెడ్ మీద ఉన్నాడు.మంచి నీళ్ళు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.సుబ్బారావు గభాల్న దగ్గరకు వెళ్ళి గ్లాసు లో నీళ్ళు పోసి తాగించాడు.ఈ లోపు అతని భార్య జయ వచ్చి "ఇప్పుడే మందులు తెద్దామని వెళ్ళాను.అక్కడ క్యూ ఉండటంతో ఆలస్యం అయ్యింది.   మీకు ఇబ్బంది కలిగించాము "అంది నొచుకుంటూ.
   "అదేమీ లేదు.మీ వాళ్ళెవరూ లేరా?"అని అడిగాడు.
  "దగ్గర్లో ఎవరూ లేరు.అమ్మానాన్న ఉన్నా పెద్దవారు.మాకు సహాయం చేసే స్థితిలో లేరు.మా అమ్మాయి  వచ్చి ఉండలేదు.     దాని ఉద్యోగం ,పిల్లల చదువులు.ఏదో ఒకటి నేనే తిప్పలు పడాలి."అంది జయ.
       అది మొదలు సుబ్బారావు రోజూ హాస్పటల్ కి వెళ్ళి ఏమి కావాలో కనుక్కుని ఇచ్చి వస్తూ ఉండెవాడు.ఇంటికి వచ్చి కృష్ణమూర్తి కి కట్టు విప్పే వరకు రేపుమాపు వెళ్ళి వాళ్ళ అవసరాలు కనుక్కునే వాడు.పూర్తి కులాసా చిక్కింది అతని కి.ఆ రోజు సాయంకాలం సుబ్బారావు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి దంపతులిద్దరూ హాలు లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు.   అతన్ని చూడగానే జయ లేచి "రండి అన్నయ్యగారూ! మీ గురించే చెప్పుకుంటున్నాము."అంది చనువుగా.ఈ రెండు నెలల లో అతడు వారికి బాగా దగ్గర అయ్యాడు.
    "రండి!కూర్చోండి.ఈ రెండు నెలల నుంచి మీరు చేసిన సహాయం మరువలేనిది.అదే అంటోంది మీ చెల్లాయి ఇప్పుడు నాతో."
 "దానిదేముంది.ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు."
   "అలా అనకండి.ఇంతమంది స్నేహితులున్నారు.ఒక్కరైనా వచ్చారా?ఒకసారి వచ్చి ముఖం చూపించి వెళ్ళారు.ఒక్కరన్నా ఏమన్నా అవసరమా?తెచ్చిపెట్టాలా ?అని అడిగినవాళ్ళు లేరు.తియ్యగా కబుర్లు చెప్పి వెళ్ళారు.మీ చెల్లాయి సంగతి వాళ్ళ కు తెలుసు.అయినా మిన్నకుండి పోయారు.ఎక్కువ పరిచయం లేకపోయినా మీరు ఆపద్భాంధవుడిలా ఆదుకున్నారు."
   "నిఝం అన్నయ్యగారూ!మీ మేలు జన్మలో మరచిపోలేము.ఎదుటి వారి అవసరాన్ని గ్రహించి సహాయపడే వారు అరుదుగా ఉంటారు.జీవితాంతం మీకు ఋణపడి ఉంటాము."అంది అప్పుడే కాఫీ తీసుకొని వచ్చి అక్కడ కూర్చొంటూ జయ.
     "మీ వారితో పాటు నువ్వు కూడా ఏమిటి చెల్లెమ్మా?నేను చేయగలిగింది చేసా!ఇక అది వదిలేయండి"అన్నాడు ఇబ్బందిపడుతూ.
    "మీ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడతారు........."నసుగుతూ అన్నాడు కృష్ణమూర్తి.
   "ఏమున్నది?తాము చేయలేని పనిని ఎదుటివారు చేస్తున్నారన్న అక్కసు కావచ్చు,అసూయ కావచ్చు.ఏదైనా వారి మనస్సుల్లోని అభిప్రాయాన్ని మనం మార్చలేము కదా!"
   "నిజమే!పగలు మీరు ఏమి చేస్తారు?"
   సుబ్బారావు సన్నగా నవ్వి,"మీ సందేహం అర్ధం అయ్యింది.నాకు కొంతమంది పెద్దవారితో పరిచయం ఉన్నది.పెద్దవారంటే సంపదలో కదున.వయసులో.వాళ్ళు బయటకు వెళ్ళి పనులు చేసుకోలేరు.అలాంటి వారి కి సహాయం చేస్తాను."
    "ఎలాంటి సహాయం."
     "రాఘవయ్య గారు పెద్దవారు బయటకు వెళ్ళి బిల్లులు కట్టలేరు.పిల్లలు ఎక్కడో దూరాన ఉంటారు.జానకమ్మ ఉన్న ఒక్క కొడుకూ అమెరికాలో ఉంటాడు.ఆమెకు బ్యాంకు పనులుంటాయి.అలాగే శంకరం గారు,వెంకట్రావు గారు,అంజయ్య గారు.వీరంతా వృధ్ధ దంపతులు.ఎవరికి ఏమి అవసరమో ఆ పనులు చేసిపెడతాను. వారి కి ప్రత్యేకంగా ఏమీ చేయక్కరలేదు.ఉదాహరణకి ఫోను,కరెంటు బిల్లులు కట్టాలనుకోండి.నా వాటితో పాటే వారివీ కడతాను.అలాగే బ్యాంకు పనులైనా!"
      "మరి సాయంకాలం కూడా వెళుతుంటారు"
   "అదా!నా గురుంచి బాగానే వాకబు చేస్తున్నారనుకుంటా!రమ,నేను ఇద్దరం కాసేపు వాళ్ళలో ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పి వస్తాము.పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాల లో ఉంటే ఇక్కడ తల్లిదండ్రులు ఒంటరితనం  అనుభవిస్తున్న వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు.వారికి కాస్త ఊరడింపునీ,ఉత్సాహాన్ని కలిగించడానికి ఇద్దరమూ ప్రయత్నిస్తాము.వాళ్ళలో  ఎవరికి బాగోకపోయినా అవసరాన్ని బట్టి కూర వండో,వంట చేసో ఇస్తాము."
    "ఇలా హెల్ప్ చేయవచ్చనే ఆలోచన మీకెలా వచ్చింది?"
  "గీతలో...'దాతవ్యమితి యద్దానం దీయతే నుపకారిణే|
               దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతం||'
                   - అంటే తగిన ప్రదేశములందు ,దుర్భిక్షాదికాలముల యందు, ఆకలిదప్పులతో బాధపడువారు,అంగవైకల్యముగల. వారు,రోగులు మొదలగు వారికి, బ్రాహ్మణులు ,పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు వారికి ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్ధ భావముతో చేయుదానము సాత్త్విక దానము.' అని చెప్పబడింది. ఇక్కడ దానమంటే సేవ అనే.నేను వీరిలో వానప్రస్థుల్ని ఎంచుకున్నాను. మిగతా వారి కి వ్యక్తులో,సమస్థలో సహాయ పడుతుంటాయి.వృధ్ధుల్ని పిల్లలే పట్టించుకోని పరిస్థితి.సమాజ నిరాదరణకూ గురౌతున్నారు.ఆలోచించి నా చాతనైన విధంగా నా పరిధిలో వారి కి  ప్రశాంత జీవనం అందించడానికి ప్రయత్నిస్తున్నాను."అన్నాడు సుబ్బారావు.
            "నిజమే సుబ్బారావు గారూ!ఎవరికి అక్కరలేని,అవసరం లేని జీవితాలు మనవి.మీరు ధన్యులు.ఇంతటి మహా కార్యాన్ని చేస్తున్న మిమ్మల్ని హేళనగా మాట్లాడుతున్న వారి కుసంస్కారానికి నేను సిగ్గుపడుతున్నాను."
           "నన్ను మరీ ములగ చెట్టు ఎక్కించ కండి.ఇందులో  నా స్వార్ధం కూడా లేక పోలేదు.మేమూ ఒంటరి జంటమే కదా!వారితో పాటు మేమూ ఆనందం పంచుకోవడమే కాక ఒక సత్ కాలక్షేపాన్ని పొందుతున్నాము."అన్నాడు నవ్వుతూ  సుబ్బారావు.
             నవ్వుతున్న ఆయన ముఖం లోని నిర్మలత్వాన్ని చూసి మనసులోనే నమస్కరించారు కృష్ణమూర్తి దంపతులు.
****

No comments:

Post a Comment

Pages