తులసి తీర్థం - అచ్చంగా తెలుగు

తులసి తీర్థం

 పి.వి.ఆర్. గోపీనాథ్

“కం. రక్షించు వృక్ష జాతిని
రక్షణ యదె నీకు, నాకు,రక్షణ భువికిన్
భక్షణయే మాననిచో
శిక్షించును జగతి నెపుడు చింతింప శివా ! “
పక్క గదిలో ఉన్న తాతయ్య కూడా వినాలన్నట్లు గొంతు పెంచి మరీ చదువుతున్నాడు హితిన్. తల్లిదండ్రులు ఆధునికం అనుకుంటూ అదోరకం పేరు పెట్టినా తను మాత్రం తాత మాట వింటూ సంప్రదాయబద్ధంగానే మసలుకుంటున్నాడు. వాడి తల్లి దండ్రులు కూడా పేరు ఏం పెట్టినా పెద్దాయన మాట కాదనలేక తెలుగు బడిలోనే వేసేరు కూడా. దాని ప్రభావమే ఈ శతక పఠనం.
బాబిగాడు  (ముద్దుపేరు ... పెద్దాయన తండ్రిపేరు బాబూరావుగారు మరి) అనుకున్నట్లు రామయ్యగారు విననే విన్నారు. చదువుతున్న భాగవత పురాణాన్ని పక్కన పెట్టి  హాల్లోకి వచ్చారు.
ఏదిరా మళ్ళీ చదువు ... అన్నారు. ఆ గొంతులో సంభ్రమం కన్నా విచారమే కాస్త ఎక్కువగా ధ్వనించిందేమో.
 మా తెలుగు వాచకంలో ఉంది తాతయ్యా. ఇలాంటివే ఇంకో నాలుగున్నాయి. చదవమంటావా... ఆత్రంగా అడిగాడు. వాడు. చదువు చదువు అన్నారు. ఈసారి ఉద్వేగం కూడా తొంగి చూసిందా కంఠంలో. పూర్తి కాగానేవీటి అర్థం తెలుసునురా. అడిగాడాయన ... తెలుసు తాతయ్యా. చెట్ల పెంపకం వల్ల చాలా లాభాలున్నాయిట కదా.
అవునురా. అవునూ, అవి రాసిందెవరో....
ఏమో తెలియదు తాతయ్యా. పేరు లేదు. అగ్నాత కవి అని ఉంది.
 ఉరే వెధవా. అగ్నాత కాదురా, అజ్ఞాత కవి అనాలి. నిజమే ఆయన పాపం ఎప్పుడూ పేరు కోసం చూడలేదు. తన పద్యాలను అచ్చు వేసుకోడం మాట అటుంచి పత్రికలకే పంపుకోలేదు.. ప్చ్.
ఆయన తనలోనే అనుకుంటున్నా బాబిగాడికి స్పష్టంగానే వినిపించింది.
ఎవరు తాతయ్యా? నీకు తెలుసా? ఎలా తెలుసూ?... ప్రశ్నల వర్షం కురిపించాడు.
మధ్యాహ్నం పూట కూడా తాతారిని ఓ గంట నిద్ర పోనీవేంట్రా. లోపల్నుంచి సుజాత ముద్దుగా కోప్పడుతూ వచ్చింది.
పోనీలేమ్మా. పోచుకోలు కాదుగా. నేను మాత్రం ఎంతసేపని పడుకోనూ....సర్ది చెప్పాడయన కోడలికి.
అవునురా. నాకు తెలీకేం. చాలా బాగా తెలుసు. మా ఫ్రెండుశంకరానికి వరసకు బాబాయి అవుతాడు. నేనూ బాబాయి బాబాయి అనేవాడిని  తప్ప పేరు గుర్తు లేదు. బహుశా గోవందం గారనుకుంటా. అయినా. మీలాగా ఆ రోజుల్లో సుందరం అంకులూ,జానకీ ఆంటీ అనేవారం కాదు మరీ. నిజానికి ఆయన వీటిని తానుగా అచ్చు వేసుకోవడం గానీ, పత్రికలకు పంపడం గానీ లేదని గుర్తు. మరివి బయటకు ఎలా వచ్చాయో. ఫేసు బుక్కు నుంచి తీసుకున్నారు కాబోలు.
అన్నట్లూ ఈ పద్యాలు రాయడం వెనక ఓ కథ ఉంది చెప్పనా. అంతలోనే మామూలైపోయిన రామయ్యగారిని చూసి మనవడు ఆశ్చర్యపోయినా ఆ వెంటనే ఉత్సాహంగా చెప్పు మరీ అంటూ తొందర పెట్టసాగాడు. అంతేగాక  బామ్మగారి దగ్గర పడుకున్న చెల్లాయి కలాక్షినీ కేకేసేడు.
 ****
నడి వేసవి.  భవన నిర్మాణాలకు అనువైన కాలమూ అదే. అందుకే పెరడంతా గట్టి పోయించే పనిలో పడ్డారు రామారావు. ఒరే ఒరే. ఏం పనిరా అదీ. నిక్షేపంలాంటి కొబ్బరి చెట్టూ, వేపా కూడా కొట్టించేస్తావూ.  కాస్తగట్టిగానే కోప్పడ్డారు కృష్ణారావుగారు.
“  మీరుండండి మామయ్యా. రోజూ ఆకులూ,రాలిపడే మట్టలూ డ్వలేనంటోంది రంగి. నేనూ తీయలేనాయె. పైగా రేపు వానలు కురిస్తే అంతా బురద బురద కాదూ...”
అలాగని నీడ నిచ్చే చెట్లను కొట్టేస్తారుటే అమ్మా. లబ లబ లాడింది ముసలి ప్రాణం.
ఏంటి నాన్నా మీరనేదీ? రిటైరైనాక మీరేనాడన్నా ఇక్కడ కూర్చున్నారా?. అసలు అమ్మ పోయింతర్వాత పెరట్లోకి వచ్చారా?. నడవలేనూ, తిరగలేనూ అంటూ అటాచ్డ్ బాత్ కోరింది మీరు కాదా? ... ఎదురు దాడి ప్రారంభించాడు కొడుకు.
“నిజమే కానీ వాటిపై చేరే పక్షుల కిలకిలారావాలూ, కింద పిల్లల ఆటలూ .....”
మాట పూర్తి కాకుండానే అడ్డుకున్నారు కొడుకూ కొడళ్ళిద్దరూ...
“ఆఁ. పక్షుల రెట్టలూ ఎత్తిపోయాలి, పిల్లలు ఆ జామి చెట్లెక్కి పడితే... వద్దులెండి. హాయిగా గచ్చు పోస్తే మీరన్నట్లు బయటే పడుకోవచ్చు. కావాలంటే ఫేనూ పెట్టుకోవచ్చు..కదా”
ఇక తనకనవసరం అనుకున్నారు పెద్దాయన.
*****
ఎవరి కోసమూ ఆగని కాలం కాగితాలు చింపుకోసాగింది.  కృష్ణారావుగారు భార్యను వెదుక్కుంటూ పోయారు. రామారావు దంపతులు కూడా మనుమలూ, మనుమరాళ్ళతో ఆటలు మొదలు పెట్టారు. వేసవి వచ్చింది. చుర్రుమనే గచ్చుపై పెరట్లో ఆడటం వీలుగాక పిల్లలు లబోదిబో మనసాగారు.  దాంతో వారిని సమీపంలోని తోటలకో పార్కులకో తీసుకుపోక తప్పింది కాదు ఆయన కొడుకూ కోడళ్లైన  శంకర్, సశారదలకు. అప్పుడైన గచ్చు తీసి మొక్కలు నాటాలన్న ఆలోచన రాలేదు. వచ్చినా నిలువెత్తు కంకర చూరలో చమొక్కలు ఎదుగుతాయన్న నమ్మకమూ లేదు మరి.
భాద్రపదంలో పత్రికోసం ఊరంతా తిరిగినా గుప్పెడు ఆకులు దొరకడం లేదు. ఇక కార్తీకంలో తులసి పూజకని కుండీ అయితే తెచ్చారు గానీ అందులో మొక్కలు బతకడమే లేదు. ఎప్పటి కప్పుడు తీసేసి పిలకలు పెట్టుకోవడంతోనే సరిపోతోంది.  విషయమై తరచుగా అత్తా కోడళ్ల మద్య గొడవ జరుగుతూనే ఉంది. శంకర్ కొడుకు ప్రభు వాకిట్లో పరుగుతీస్తూ దెబ్బ తినొచ్చాడు. వెంటనే ఇంత పసుపు అద్దారు. కానీ ఆకులు లేకపోవడంతో తుసీ ఆయింటుమెంటేదిక్కయింది.
*****
ఈ నేపథ్యంలో శంకర్ స్నేహితుడి ఇంటికి వరసకు బాబాయి అయిన గోవిందం గారు చుట్టపు చూపుగా వచ్చారు. ఆయనకు సాహిత్యంపై మక్కువ. అందునా పద్య రచన అంటే ప్రాణమే. పిల్లలంతా ఆయన చుట్టూ చేరి కథలూ, పద్యాలూ చెప్పించుకునేవారు. మొదట్లో ఆయన పద్యాలలో ఎక్కువగా భక్తి రసమే తొణికిస లాడేది. అయితే ఒకో సంఘటన మనిషి ఆలోచనలను  పూర్తిగా ఎలా మార్చేస్తాయో చెప్పడానికి గోవిందం గారి జీవితమే నిదర్శనమేమో.
గోవిందం గారి మాతా మహుడికి సీరియసుగా ఉందని కబురు రావడంతో హుటా హుటిన కాకినాడ వెళ్ళిపోయారు. అక్కడా అపార్టుమెంట్లూ, గేటెడ్ కమ్యూనిటీలూ. ఎక్కడా పచ్చికనేది లేదు. ఇటు చూస్తే తాత ప్రాణం ఉండనా వెళ్ళనా అంటూ ఏదో సంకేతం లేదా హెచ్చరిక జారీ చేస్తోంది.
అప్పుడు ... అప్పుడు అక్కడ చేరిన పెద్దల్లో ఎవరో అన్నారు. పంతులుగారి నోట్లో ఇన్ని తులసి చుక్కలు వేయండమ్మా. అందుకే ఆగినట్లున్నాడూ అని.
ఇక ఉరుకులూ పరుగులూ...చుట్టు పట్ల అన్నీ అలాంటి కాంప్లెక్సులే. చివరకు బైకు వేసుకుని ఓ పాతిక కిలోమీటర్లు పోతేగానీ తులసి చెట్లు కనిపంచలేదు. అవీ ఏదో తోట మద్యలో ఉడటంతోకాపలావారిని బతిమి వారు అడిగినంతా ఇచ్చుకుని మరీ నాలుగు కొమ్మలు తెచ్చుకోవలసింది. కానీ... ఈ లోపే విసిగిన ఆ ముసలి ప్రాణం  ఇక మీవల్ల కాదులెమ్మంటూ సెలవు తీసుకుంది.
దాంతో గోవిందంగారి మనసు మూగబోయింది. ఆలోచనలలో ఏదో విస్ఫోటం. దానికి మరింత బలమిస్తూ పక్కింటి పిల్లాడు కిందపడి దెబ్బతగిలించుకున్నాడు. రాయడానికి ఇంట్లో ఏమీ లేక ఇంత బోరిక్ పౌడరు అద్ది ఆయింటుమెంటుకోసం పరుగుతీయడం ఆయన కంట పడింది. ఇక ఆ రాత్రి నిద్ర పట్టలేదు.
****
అన్యమనస్కంగానే ఇల్లు చేరిన గోవిందంగారికి తానేమ చేయాలో తోచకపోయినా, ఏమి చేయగలడో స్ఫురించింది. అప్పటికే మొదలు పెట్టిన ఓ భక్తి రస శతకం పూర్తి కావచ్చింది. తర్వాతేమి చేయాలా అని ఆలోచనలో ఉన్న ఆయనకు ఆ దైవమే ఆలోచన చెప్పినట్లనిపించింది.
పిల్లల కోసం ఉన్న శతకాలను పరిశీలించాడు. ఏవీ తన ఆలోచనలకు తగినట్లు లేదనిపించడంతో తనే ఓ శతకం రాయాలనుకున్నాడు. వెంటనే కంప్యూటరు ముందు కూర్చున్నాడు. ఇంట్లోవారు రుకోలేదు. అస్తమానమూ అలా కంప్యూటరు ముందు కూర్చుంటే ఆరోగ్యం దెబ్బతింటుందనేవారు. తోటివారు కూడా ఆ రాసినది  ఏదైనా పత్రికకు పంపచ్చుగా అనేవారు. అందరికీ ఆయన మౌనమూ, చిరునవ్వులే సమాదానాలైనాయి. మొత్తం పాంచ భౌతికాల పరిరక్షణనూ, ఇంకా ఆ కాలానికి తగిన ఇతర అంశాలను కూడా ఆ పద్యాలలో స్పృశించాడు.
క్యాలెండర్లు మళ్లీ మారిపోయాయి. గోవిందంగారినీ కాలం  పిలవసాగింది. స్నేహితుడితో పాటు శంకర్ తదిరులు కూడా బాబాయిని చూడటానికి వచ్చేశారు. వారికాయన పుష్యమాసపు భీష్మాచార్యులుగా కనిపించాడు.
షరా మామూలుగా తులసికోసం వేట మొదలయింది. అది దొరికేలోగానే ఆయనా...
*****
ఇంటికి వస్తూనే మంచాన పడిన రామారావు గారు కొడుకును పిలిచి ఏదో చెప్పాలని చూసేరు. వీలు కాలేదు. అయితే, ఆయన పదే పదే వాకిలివైపూ, దొడ్డి వైపూ చూడటం, పైకి చూస్తూ దేవుడి పటాలకు నమస్కారాలు చేయడం లాంటవి చూస్తున్న శంకరంగారికేమీ బోధపడకపోయినా తాత మనసును పదిహేనేళ్ళ ప్రభు పసిగట్టాడు.
పలుగూ పారా తీసుకుని దొడ్లోకి పోతున్న కొడుకును చూసిన శంకరం గారు దేనికిరా అంటూ కేకేసేరు. కానీ, అతను వినిపించుకోలేదు. కానీ,
ఆశ్చర్యం. పెరట్లో పలుగు చప్పుడు వింటూనే రామారావు గారిలో అనుకోని కదలిక. ఏం జరిగిందో ఆలోచించే లోపుగానే మరునాడే పెద్దాయన గొంతులో స్పష్టత, ఆనందం. వైద్య శాస్త్రాన్నే సవాలు చేస్తున్నట్లుగా వారం రోజులకే తిరిగి కోలుకున్నాడు. పక్షం రోజులైనా గడవక ముందే లేచి తిరుగుతూ పెరట్లోనూ, వాకిట్లోనూ ఏ మొక్క ఎక్కడ ఎలా నాటాలో చెప్తున్న తండ్రిని చూసి శంకరంగారు విస్తుబోయాడు.
అంతా అయిపోయిందనుకున్న పెద్దాయన హాయిగా తిరుగుతూ పూర్తి ఆరోగ్యం పొందడమే గాక మునిమనుమలతో కూడా కులాసా కాలక్షేపం చేస్తున్నాడు. మరోవైపునిలువులోతు కంకర చూర(డస్టు)లో పాతిన మొక్కలు కూడా పెద్దయ్యగారి కోసమే అన్నట్లు ఊపిరి పోసుకుని అంతెత్తు ఎదిగాయి. పిల్లల ఆటలూ, అల్లరితో సందడే సదడి.
అలా మరో పదేళ్ళు గడిచాక అప్పుడలిసిపోయిందా శరీరం. పిలుపు కోసం ఎదురు చూస్తోంది. కానీ, అంతకు ముందు ఓడించాడనే కోపంతో కాబోలు ఓ పట్టాన కరుణించడంలేదా దైవం. లోపలకూ, బయటకూ అన్నట్లుగా ఉంది.ఇట్లా ఉన్న ఈయన పరిస్థితి చూసి తామూ దిగాలుగా ఉన్నట్లు చెట్లూ ఆకులు రాల్చడం మొదలెట్టాయి.
గడువు పూర్తయినట్లుంది. కూడదీసుకున్న పెద్దాయన నోట ఆఖరు మాట ...” తు  ల  సి  జాగ్రత్త ...”!
    తాత దేహంపై పడి రోదస్తున్న ప్రభనును శంకరంగారు లేవదీసిగాట్టిగా కౌగలించుకున్నారు.
“వద్దురా. ఏడిస్తే ఆయన ఆత్మ బాధపడుతుందీ.
ఒరే. మేము మా మూర్ఖత్వంతో సంప్రదాయాలకు తులసి నీళ్ళు వదిలేసేం. నువ్వు తిరిగి వాటికి తీర్థం పోసేవురా. నిజం తులసి మన సంప్రదాయాలకే కాదురా, మానవాళి ఆరోగ్యానికీ తగిన ఔషధమేనురా...!”
ఏడుపూ, సంతోషం కలగలసిన ఆ స్వరాన్ని ఆపలేక అలాగే చూస్తుండి పోయారు మిగిలినవారంతా...
చిత్రం. కథ ముగించిన రామయ్ గారి కనులే కాదు, వింటున్న వారందరి కనులూ...
****

No comments:

Post a Comment

Pages