అ 'లవ్వా'ట్లు(అలవాట్లు) - అచ్చంగా తెలుగు

అ 'లవ్వా'ట్లు(అలవాట్లు)

Share This

(జ)వరాలి కధలు - 13

అ 'లవ్వా'ట్లు (అలవాట్లు)

గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)



మగవాడు చాలా చిత్రమైనవాడు. తన సంతానంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో కలలు కంటాడు. తన పిల్లలు పెరిగి గొప్పవాళ్ళై సంఘంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకొంటే " వాడెవరి బిడ్డోయి! ఈ పులిబిడ్డ కదుటోయి!" అని మీసాలపై చేయి వేసి ప్రగల్భాలు పలుకుతాడు. తప్పిదారి వాళ్ళే వెధవలుగాను, చవటలుగాను తయారైతే " చూశావా? మా యింటా వంటా లేని పనులు చేస్తున్నారు. ఊ! పోలికలెక్కడికి పోతాయి! కర్ర పట్టుకొని కాశీకి పోతుంటే, గడ్డం పట్టుకొని పిల్లనిస్తానని బ్రతిమాలాడే . . . నా బామ్మరిది . . .వాడి పోలికలొచ్చి చచ్చాయి " అని పెళ్ళాన్ని దెప్పిపొడుస్తూంటాడు. ఇది ప్రతి కొంపలోను ఉండేదే!
" ఏరా తమ్ముడూ! బాగున్నావా?" అక్క గొంతు వినిపించి తలెత్తి చూశాను.
దగ్గరలో సంక్రాంతి పండగొస్తోదని వరాలు యిల్లు దులుపుతుంటే యింటిగుమ్మంలో కూర్చుని యీ కాలం పిల్లల పెంపకాలపై కధను వ్రాయాలని మొదలెట్టాను. ఆదిలోనే హంసపాదు అన్నట్లు అక్కయ్య రావటంతో వ్రాస్తున్న పుస్తకాన్ని మూసేశాను.
"బావగారు ఏదో వ్రాస్తున్నారు? ఈ నెలకి తెచ్చుకోవాల్సిన సరుకుల జాబితానా?" బావ కుతూహలంగా అడిగాడు.
"నా తమ్ముడు మీలాగ యింటిపద్దులు, చాకలిపద్దులు వ్రాసేవాళ్ళా కనపడుతున్నాడా? మంచి రచయిత. డైరీల కొద్దీ కధలు, కవితలు యిలా వ్రాసి అలా పడేస్తాడు" అక్క నోటిధాటికి బావ మారు మాట్లాడలేదు.
గుమ్మంలో మాటలసందడి వినిపించి లోపల వీధిగది శుభ్రం చేస్తున్న వరాలు బయటకి వచ్చింది.
"అవున్రా తమ్ముడూ! చాలా నీరసంగా కనిపిస్తున్నావ్! మరదలు తిండి ఒంటికి పట్టం లేదా?"
అత్తలకు, ఆడపడుచులకు తమ యింటికి కోడలుగా తరలివచ్చిన ఆడపిల్లని ఏదో అని కెలకకపోతే మనసూరుకోదు. కానీ నా అదృష్టం కొద్దీ వరాలు అంత త్వరగా మాట తూలదు.
" మరే వదినా! యిన్నాళ్ళూ అక్క పెట్టిన తిండి తిని పుష్టిగా తయారయ్యారుగా! ఈ పుష్టి చాలనుకొన్నారేమో! ఈ కాలం పెళ్ళి కాని ఆడపిల్లలా నా వంటను నాజూగ్గా తింటున్నారు. నీరసం రాక ఏమవుతుంది? మీరన్నా చెప్పండి కాస్త గట్టిగా తినమని" వరాలు మాటలకు అక్క నరాలు పొంగిస్తుందేమోని భయపడ్డాను. కానీ యీలోపే బావ కలగజేసుకొన్నాడు.
" అది తిండి లేక కాదు. కొద్దిగా గడ్డం పెరిగి అలా నీరసంగా కనిపిస్తున్నాడు " అన్నాడు.
"అక్కా! మీ పల్లెటూళ్ళోలా అలా గట్టిగా మాట్లాడకే! అదిగో చూడు. రోడ్డున పోయేవాళ్ళంతా మన మాటలు విని నవ్వుకొంటున్నారు. వరాలూ! వచ్చిన వాళ్ళని గుమ్మంలోనే నిలబెట్టేస్తే ఎలా? లోపలికి రానీయి" అన్నాను.
"వీధిగది శుభ్రం చేశాను. రండి" అంటూ వరాలు లోపలకి నడిచింది .
" ఏంటమ్మా? నువ్వేదో పెద్ద పనిలోనే ఉన్నట్లున్నావ్? ఏంటి సంగతి?" బావ వరాల్ని ప్రశ్నించాడు.
"సంక్రాంతి వస్తోంది కద అన్నయ్యా! అందుకే యిల్లు దులిపి శుభ్రం చేస్తున్నాను. అయిపోయింది. ఒక్క వంటిల్లే మిగిలింది. దాని సంగతి రేపు చూడొచ్చు. ఇప్పుడే వస్తాను" అంటూ వరాలు వంటింటి వైపెళ్ళింది.
" ఏంటి బావా! ఏంటి సంగతి? వచ్చేముందు ఒక్క ఫోను కొడితే బస్టాండుకొచ్చేవాణ్ణి కద!" చేతిలో పుస్తకం బల్లపై పెట్టి వస్తూ అన్నాను.
" ఈ ఊరు రావాలని ముందు అనుకోలేదు. ఎల్టీసి మీద కాశీకి వెళ్ళి ఆ చుట్టుప్రక్కల గుళ్ళూగోపురాలను చూసుకొన్నాక, మీ అక్క నిన్ను చూస్తానంటే యిలా వచ్చాం. అందుకే ముందు తెలియపరచలేదు. ఇంకా వారం రోజులు సెలవు మిగిలింది. సంక్రాంతి మీ ఊళ్ళో గడిపే యోగం ఉన్నట్లుంది. ఇలా వచ్చాం"
ఈ లోపున వరాలు పండగ కోసం ముందుగా చేసిన జంతికలు, కాఫీతో వచ్చింది.
" బాగుందమ్మా! పండగ ఏర్పాట్లు బాగానే చేశావన్నమాట" మెచ్చుకోలుగా అన్నాడు బావ.
" మొత్తం సర్టిఫికెట్టు తనకే యిచ్చేయకండి! ఆ జంతికల తయారీలో నా హస్తం కూడా ఉంది " అంటున్న నా వెనక్కొచ్చి బనీను పట్టుకు మెల్లిగా లాగింది వరాలు.
"అదేంట్రా? వంటపని ఆడాళ్ళ విషయం. నువ్వు చేయటమేమిట్రా?" అక్క అందుకొంది.
"దాందేముంది అక్కా? ఆడాళ్ళు మగాళ్ళలా ఉద్యోగం చేసి వస్తున్న యీ రోజుల్లో, మగాళ్ళు వంటపనిలో సాయం చేయటంలో తప్పులేదే!"
"చూశారా? మీరూ ఉన్నారు ఎందుకు? ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు. అన్నీ నేనే చూసుకోవాలి" అక్క బావపై వాగ్బాణాలు విసిరింది.
"అదేం లేదే! జంతికలంటే నాకు చాలా యిష్టమని నీకు తెలుసుగా! అవి తను సరిగా చేస్తుందో, లేదోనని నేను కలగజేసుకొన్నాను. అంతే! " అన్నాను.
"చెల్లెమ్మా! అక్కాతమ్ముడు ఏకమైపోయారు. ఇద్దరూ నీకు వంట సరిగా రాదని నిర్ధారించేస్తున్నారు" బావ వరాలితో అన్నాడు.
" ఏంచేస్తాం? ఈరోజు లేచి ఎవరి మొహం చూశానో! ఇలా వీళ్ళ పాలబడ్డాను " అని విచిత్రంగా వరాలు తల కొట్టుకొంటూంటే అందరూ నవ్వారు. అక్క కొడుకు క్రాంతి ఈ సంభాషణంతా వింటూ అందరి ముఖాలను పరిశీలనగా చూస్తున్నాడు.
"ఏరా క్రాంతీ! ఏంటలా చూస్తున్నావు?" అంటూ ఎనిమిదేళ్ళ వాణ్ణి దగ్గరకు తీసుకొంది వరాలు.
"మరో జంతిక కావాలి " సందేహిస్తూనే అడిగాడు వాడు.
" ఒక్కటేమిట్రా? నీకు కావలసినన్ని పెడతాను. రా " అంటూ వరాలు వాణ్ణి తీసుకొని వంటింట్లోకెళ్ళింది.
"నేనెప్పుడో చెప్పాను. వీడికన్నీ మేనమామ పోలికలే వచ్చాయని. బావా! కాశీకి బయల్దేరిన ఆ రోజు మీ అక్క నిస్తానంటే సరేనన్నానని, నీ అలవాట్లు ఉన్న మేనల్లుణ్ణి కూడా యివ్వాలా?" బావ మాటలకి అక్కకి కోపం వచ్చింది.
"చాల్లెండి! వాడేదైనా మంచిపని చేస్తే పులిబిడ్డ అని భుజాలెగరేస్తారా? కానిపని చేస్తే మేనమామ పోలిక అని మావాడి మీదకి తోసేస్తారా? ఆ బుద్ధులు మీ యింటా, వంటా లేనట్లు మాట్లాడతారా? పిల్లలన్నాక అల్లరి చేస్తారు, తిండికోసం ఆరాటపడతారు. మావాడిలా క్రాంతిగాడికి జంతికలు యిష్టమైనంత మాత్రాన బుద్ధులన్నీ వాడివే అన్నట్లు మాట్లాడుతారేం?" అక్క వాగ్బాణాలకు బావ నోరు పెగల్లేదు.
"బాత్రూం ఎక్కడ?" అంటూ లేచిన అతన్ని బాత్రూం వైపు తీసుకెళ్ళాను.
@ @ @
అక్క, బావ వచ్చారని రెండురోజులు ఆఫీసుకి సెలవు పెట్టి, వాళ్ళని మా ఊరికి దగ్గరలో ఉన్న నాలుగు గుళ్ళకు తీసుకెళ్ళాను. సెలవులయ్యాక నేను ఆఫీసుకెడుతూంటే యింటిదగ్గర తనకు కాలక్షేపం కాదని బావ రెండురోజులు నాతో ఆఫీసుకి వచ్చాడు. ఆ రెండురోజులూ సాయంత్రం ఆఫీసునుంచి వస్తూ బజారులో పండక్కి కావలసిన వస్తువులు కొని తెచ్చేవాళ్ళం. పనిలో పనిగా బావకి కొంత ఊరు కూడా చూపించాను. రెండోరోజు యింటికి వచ్చేసరికి పక్కింటి పార్వతమ్మతో అక్క పోట్లాడుతూ కనిపించింది. సంగతేమిటో తెలుసుకోవటానికి మేమిద్దరం కొద్ది క్షణాలు వాళ్ళు గమనించకుండా బయటనే నిలబడ్డాం.వీళ్ళిద్దరినీ సర్దటానికి వరాలు నానాయాతన పడుతోంది. కానీ ఆమె మాటల్ని వాళ్ళిద్దరూ పట్టించుకోవటం లేదు. వీళ్ళ మధ్యలో క్రాంతి బిక్క మొగం వేసుకొని చూస్తున్నాడు.
"చాల్లేవమ్మా పేద్ద చెప్పొచ్చావ్! పిల్లల్ని కనగానే సరికాదు. వాళ్ళని సవ్యంగా పెంచటం కూడా నేర్చుకోవాలి" పార్వతమ్మ మాటలకి అక్క రెచ్చిపోయింది.
" అబ్బో! నువ్వే పెంచేశావ్ పిల్లల్ని! నాకు చెప్పేముందు నీ కూతురి సంగతి చూసుకోవమ్మా! వయసొచ్చిన పిల్లకి పెళ్ళి చేయలేదని వెంపర్లాడిపోతున్నట్లుంది. తనకి తనే ఓ చీటీ రాసి, కుర్రవెధవ మీద నేరం పెట్టి తనకు వయసొచ్చిందని నీ కూతురు నీకు గుర్తు చేస్తోంది. ఆవిడగారి గోలేమిటో సరిగా కనుక్కోక, నామీదకు యుద్ధానికొస్తావా?"
"ఏవమ్మోయి! మాటలు తిన్నగా రానీయి. ఎక్కువ మాట్లాడితే మర్యాద దక్కదు. మొలతాడయినా సరిగా కట్టుకోవటం రాని వెధవ నా కూతురికి పసుపుతాడు కడతానని చీటీ వ్రాస్తే ,వాడికి బుద్ధి చెప్పక నాకు నీతులు చెప్పొస్తావా?" పార్వతమ్మ అరుపులకి వరాలేం చేయలేక తల పట్టుకుంది.
" నీ కూతురు మాత్రం . . .మావాడు కుర్ర వెధవ గనుక విషయం నీతో చెప్పింది. అదే వాడు ఈడొచ్చిన వెధవైతే, లేని నయగారాలు పోయి మావాణ్ణి బుట్టలో వేసుకోవాలని చూసేది. నువ్వు కూడా నీ కూతురికి వత్తాసు పలికి, తల్లీకూతుళ్ళిద్దరూ మావాణ్ణి మాక్కాకుండా చేసేవారు"
" ఏవమ్మోయి! ఆ దరిద్రకొట్టు అలవాట్లు మా యింటా వంటా లేవు. నేలకు జానెడు లేని వెధవ ప్రేమచీటి వ్రాసి మా అమ్మాయి మీదికి విసురుతాడా? ఆ విషయం నీకు చెబితే పిల్లాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి మా అమ్మాయి నంటావా? నా కూతురు మీ వాడిలా బేవార్సు రకం కాదు. పద్ధతి ప్రకారం పెరిగింది. ఆ లవ్వుల అలవాట్లు మీ యింట్లోనే చచ్చాయి గనుక మీ కుర్ర వెధవకి ఆ పోలికలొచ్చాయి"
సందర్భం మాకు అర్ధమవటమే గాక , గొడవ యింకా పెరిగి యిద్దరూ కొట్టుకొనే దాకా వెళ్ళేలా కనిపించింది. అందుకే మా రాకను తెలిపేలా శబ్దం చేస్తూ యింట్లోకి అడుగుపెట్టాం. మా రాక గమనించిన పార్వతమ్మ వినయంగా పైట సర్దుకొని నా దగ్గరకి వచ్చింది.
" చూశారా అన్నయ్యగారూ! ఆవిడ ఎలా మాట్లాడుతోందో?"
" జరిగిందంతా విన్నాను. నా మీద గౌరవం ఉంచి మీరు వెళ్ళండమ్మా " అనగానే ఆవిడ తన యింటికి వెళ్ళిపోయింది.
పార్వతమ్మ మా యింటి ప్రక్కనే ఉంటోంది. ఆవిడకి పదహారేళ్ళ కూతురుంది. జూనియర్ కాలేజీలో యింటర్ చదువుతోంది. కాలేజీకి సంక్రాంతి సెలవులు యివ్వటంతో యిరవైనాలుగ్గంటలూ యింటిపట్టునే ఉంటోంది. వాళ్ళ యింటికీ మా యింటికీ పిట్టగోడ ఒక్కటే అడ్డు.
"అయ్యో! అయ్యో! అదేంట్రా తమ్ముడూ? అదేదో నామీద నేరం చెప్పగానే అలా వదిలేశావ్?"
" చూడు అక్కా! మీరు పండగ అయిపోగానే వెళ్ళిపోతారు. మేము యిక్కడ ఉండాల్సిన వాళ్ళం. యిరుగు పొరుగు అన్నాక ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. తెల్లారి లేస్తే మేము ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లకు వాళ్ళతో తగవు పెట్టుకొంటే ఎలాగే?" మెల్లిగా అక్కకి నచ్చచెప్పబోయాను.
"నా కొడుకుని బేవార్స్ అంటుందా? అది చిన్న పొరపాటా? నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలారా?"
"చాల్లే ఊరుకో! ప్రతీదానికీ నోరేసుకు పడిపోతే ఎలా? సరే! కుర్రవెధవ. తెలియక ఏదో చేశాడు. మీవాడిలా చేశాడని ఆవిడ చెప్పటానికి వచ్చింది. సర్లెండి. మా వాణ్ణి దండిస్తానని చెప్పి పంపేయక గొడవపడతావా? నీ కూతురికి పెళ్ళి కాక అలా మాట్లాడుతోందంటే కోపం రాదా?" అక్కని బావ కేకలేస్తున్నాడు.
"మీరు కూడానా?" బావ మీద అక్క లేవబోయింది.
" అక్కా! ఊరుకో!" అని అక్కని సముదాయించి వరాల్ని విషయం అడిగాను.
"నిన్న పార్వతిగారి పెరట్లో వాళ్ళమ్మాయి బట్టలు ఉతుకుతూంటే, క్రాంతి రెండు సార్లు ఆ పిల్ల మీదకు రాళ్ళు విసిరాట్ట. తెలియక చేశాడని వాళ్ళమ్మతో చెప్పలేదు. ఈ రోజు యీ చీటి విసిరాట్ట" అని వరాలు పార్వతమ్మ యిచ్చిన చీటి చూపించింది.
"నిన్ను పెళ్ళాడుతా" అని వంకర అక్షరాలతో క్రాంతి వ్రాసిన మాటలవి.
ఆ చీటి చూడగానే బావ క్రాంతిని పట్టుకొని వీపు చిట్లగొట్టసాగాడు. నేను మధ్యలో అడ్డుకొని వాణ్ణి పక్కగదిలోకి తీసుకెళ్ళమని వరాలికి చెప్పాను. వరాలు ఏడుస్తున్న వాణ్ణి ఎత్తుకొని జంతికలు పెట్టటానికి వంటింట్లోకి తీసుకెళ్ళింది.
" బావా! ఎందుకంత ఆవేశం? " నా ప్రశ్నకు తనను తాను సంబాళించుకొన్నాడు.
"అదికాదు బావా! వెధవ నేలకు జానెడు లేడు. పార్వతమ్మ కూతురికి అలా వ్రాశాడంటే. . . " వంటింట్లో క్రాంతిని కూర్చోపెట్టి వచ్చింది వరాలు.
"ఇది క్రాంతి ఒక్కడి తప్పే కాదు అన్నయ్యా! ఈ కాలం పిల్లల్లో చాలామంది యిలాగే పాడవుతున్నారు. ఒకప్పుడు సంఘంలో ఉన్న దురాచారాల నిర్మూలనకు దోహదించిన సినిమాలు ఇప్పటి పసివాళ్ళను చెడగొడుతున్నాయి. చిన్నపిల్లల చేత 'ఆ అమ్మాయిని నువ్వు చూసుకోకపోతే నేను చూసుకొంటా' అని ఏడేళ్ళ వెధవ కధానాయకుడితో అంటూంటే, మనం దాన్ని హాస్యంగా తీసుకొని చప్పట్లు కొడుతున్నాం. అది మనకు హాస్యంగా కనిపించవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే లోకం తెలుసుకుంటున్న పిల్లలకి జీవితమంటే యిదేనేమో అనిపిస్తుంది. హాస్యం పేరుతో ఆ మాటలు రాసే రచయిత నాకెదురుపడితే నిలువుగా ఉప్పుపాతర వేసేయాలనిపిస్తోంది"
"నువ్వన్నదీ నిజమేనే అమ్మాయి! అందుకేగా యీరోజుల్లో సినిమాలే మానేశాం" అక్క మధ్యలో అందుకొంది.
వరాలు తన ధోరణిలో తాను చెప్పుకుపోతోంది.
"నిజంగా యీ కాలపు పిల్లలు దురదృష్టవంతులు. ఉమ్మడి కుటుంబాలు కరువైపోయాయి. ఎవరికి వారే అన్నట్లుగా జీవిస్తున్నారు. దీనివల్ల మంచిచెడ్డలు చెప్పే అమ్మమ్మలు, తాతయ్యల ప్రేమ గానీ, ఆ ఉమ్మడికుటుంబాల్లో సరదా పంచుకొనే తమతోటి పిల్లల సాంగత్యం గానీ లేక ఎల్లవేళలా తల్లిదండ్రులను అంటిపెట్టుకొనే ఉంటున్నారు. ఒకే మంచంపై అందరూ కలిసి పడుకోవటం మంచిదే! కానీ కొన్ని సమయాల్లో వాళ్ళు నిద్రపోతున్నారనుకొంటామే గానీ, ఎప్పుడైనా మనని గమనిస్తున్నారన్న ధ్యాసలో మనం ఉండం, అలా ఉండలేము కూడా. వదిన గారు ఏమనుకోకపోతే, నిన్న మీ తమ్ముడికొక విషయం చెప్పాను. అది వారే చెబుతారు. క్రాంతి ఏం చేస్తున్నాడో చూసి వస్తాను" అంటూ వంటింట్లొకి వెళ్ళిపోయింది.
"ఏరా? తనేం చెప్పింది నీకు?" పెడసరంగా అక్క అడిగింది.
"అదిగో నువ్వలా అంటావనే నీకీ విషయం నేనే చెప్పొద్దన్నాను. కానీ సందర్భం వచ్చింది గనుక చెప్పక తప్పటం లేదు" అంటూ గొంతు సవరించుకొన్నాను.
"ఏం బావా? ఏం జరిగింది? . .సందేహించకు. వాడి విషయంలో ఏదైనా తప్పు చేస్తే సర్దుకొంటాను" బావ సౌమ్యంగా అడిగాడు.
"నిన్న మధ్యాహ్నం తను వంటింట్లో కూర్చుని పని చేసుకొంటోంది. అక్కయ్య హాల్లో నిద్రపోతోంది. క్రాంతి వెనకనుంచి వెళ్ళి వాటేసుకొన్నాట్ట. తను తప్పించుకొనేలోపే 'నీ అందం నన్ను కట్టిపడేసిందోయి 'అన్నాట్ట " నేను చెప్పేలోపే అక్కయ్య అందుకొంది.
" అయ్యో అయ్యో! కట్టుకున్నవాడు ముండా అంటే పనివాడూ అదే అన్నాట్ట. ఆ పార్వతమ్మ ఏదో అందని " అక్కయ్య గోల పెడుతూంటే బావ కేకలేశాడు.
" నువ్వూరుకో! అతన్ని చెప్పనీ. .. "
" అందుకే అక్కా నీతో చెప్పవద్దన్నాను. ఏం బావా? నువ్వెప్పుడైనా అక్కతో అలా అన్నావా?" నా ప్రశ్నకు బావ నీళ్ళు నమిలాడు. బావ యిబ్బందిని గమనించి నేనే తిరిగి మొదలెట్టాను.
"తప్పు నాన్నా! అలా మాట్లాడకూడదని వరాలంటే క్రాంతి ఏమన్నాడో తెలుసా? నాన్న అమ్మని పట్టుకొని అన్నప్పుడు అమ్మ నాన్నకి ముద్దు పెట్టిందన్నాట్ట" నా మాటలకి వాళ్ళకి ముఖాన నెత్తురు చుక్కలేదు.
"భార్యాభర్తల మధ్య సవాలక్ష ఉంటాయి. అవన్నీ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. క్రాంతి మాత్రమే కాదు. రైళ్ళల్లో, బస్సుల్లో ఎంతోమంది ఎన్నో తింగరవేషాలు వేస్తుంటారు. అవి క్రాంతిలాంటి పిల్లలెందరో చూస్తుంటారు. అవి వాళ్ళ మనసుల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో యీ తింగరోళ్ళకి అనవసరం. తమ గోల తమదే! ఇంతకాలం మీకు తెలీదు. ఇప్పుడైనా మిమ్మల్ని సరిదిద్దుకోండి. నీ కన్న వయసులో చిన్నవాణ్ణి. ఇలా అన్నందుకు ఏమీ అనుకోవద్దు"
" లేదు బావా! నా తప్పు నాకు తెలిసొచ్చింది"
"అసలు విషయానికొద్దాం. క్రాంతి అందరి పిల్లల్లాంటివాడు కాదు. వాడిలో అనుకరణ శక్తి ఉంది. ప్రతీ విషయాన్ని నిశితంగా పరిశీలించే గుణం ఉందని నాకనిపిస్తోంది. పార్వతమ్మ కూతురు మీద చీటీ విసిరాడంటే వాడెక్కడో యిలాంటి విషయం చూసుంటాడు. దాన్నే యిక్కడ అనుకరించాడని నా అనుమానం" అన్నాను.
" అదేం లేదు బావా! అలాంటి పనులు చేసేవాళ్ళు మాయింట్లో లేరు " భర్త మాటలకు అక్క అందుకొంది.
" అలాంటి అలవాట్లు మాయింట్లో ఉన్నాయనా? నా తమ్ముడు బంగారం"
"అక్కా! నువ్వూరుకుంటావా? బావా! నువ్వు క్రాంతిని ఏమీ అనవద్దు" అంటూ వంటింటి వైపెళ్ళాను.
వరాలు క్రాంతిని ఎత్తుకొని నా వెనకే వచ్చింది. వాళ్ళ నాన్నని చూసి వాడు వరాలి మెడ చుట్టేశాడు. వాణ్ణి నేను అందుకొని అక్కడున్న బల్లపై కూర్చోపెట్టాను.
"క్రాంతీ! నేనడిగింది చెప్తే అత్తయ్య నీకు కావలసినన్ని జంతికలిస్తుంది. చెప్పు నాన్నా! అమ్మాయి మీదకి చీటి విసరటం ఎక్కడైనా చూశావా?" జవాబు చెప్పటానికి తటపటాయిస్తూ వాళ్ళ నాన్న కేసి చూశాడు.
" చెప్పు వెధవా! చెప్పకపోతే తాట వలుస్తాను" అంటూ బావ గుడ్లు ఉరిమాడు. వెంటనే భయంతో వాడు ఏడుపు లంకించుకున్నాడు.
"ఈరోజు లేచి ఎవరి మొహం చూశానో! ఇలా వీళ్ళ పాలబడ్డాను " అంటూ ఏడుస్తూనే విచిత్రంగా తలకొట్టుకొన్నాడు. వాళ్ళీ ఊరు వచ్చినరోజు వరాలిలాగే తల కొట్టుకొంది. ఎంత బాగా అనుకరించాడు కుర్ర వెధవ! ఆ లెక్కన యీ చీటి విషయం కూడా ఎక్కడో చూసి అనుకరించినదే! క్రాంతి గొంతు పెంచి మరీ ఏడుస్తున్నాడు. నేను బావని దూరంగా కూర్చోపెట్టి క్రాంతి దగ్గరకొచ్చాను. వరాలు వంటింట్లోంచి మరో రెండు జంతికలు తెచ్చి వాడి చేతిలో పెట్టింది. వాణ్ణి అరగంట బుజ్జగించగా అసలు విషయం బయటపెట్టాడు.
"మరేం! బాబయ్య పక్కింటి సుజాత మీద చీటి విసిరితే, దాన్ని తీసి నవ్వుకొంటూ, బాబయ్యకి తనో చీటీ యిచ్చింది"
మాయామర్మం తెలీని పసితనం వాడిది. వాణ్ణి అడ్డుపెట్టుకొని యీ ప్రేమపత్రాల జంఝాటం నడిచింది గనుక వాడికీ అలాగే చేయాలనిపించింది.
"చూశారా! వాడు చేసే ప్రతీపనికి మా తమ్ముడి అలవాట్లు వచ్చాయంటారు. ఇప్పుడు తెలిసిందా యిది మీవాడి నిర్వాకమని. వీడికన్నీ మీ కొంప బుద్ధులే వచ్చాయి" అక్క బావపై లంకించుకొంది. బావ మౌనంగా కూర్చుండిపోయాడు.
"అక్కా! వాడెదురుగా యిలా మీలో మీరు తగవు పడితేనే వాడు మొండివాడుగా మారుతున్నాడు. ఇంకెప్పుడైనా వాడెదురుగా నువ్వు మాట తూలితే మర్యాదగా ఉండదు" అక్క మీద చిరాకు పడ్డాను.
"అదికాదురా! . . " అని ఏదో చెప్పబోయి నా ముఖకవళికలు చూసి ఆగిపోయింది.
మరునాడు ఉదయమే బావ వాళ్ళ ఊరికి బయల్దేరాడు.
"అదేంటి బావా! రెండ్రోజుల్లో సంక్రాంతి వస్తోంది. ఉంటావనుకొంటే వెళ్ళిపోతున్నావ్!" అన్నాను.
"బావా! ఇక్కడ నేను పండగని కూర్చుంటే, అక్కడ నా తమ్ముడు కొంప ముంచేలాగున్నాడు. మేము ఊరెడతామంటే, వాడెందుకు అంత హుషారుగా మమ్మల్ని స్టేషనుకొచ్చి రైలెక్కించాడో క్రాంతిగాడి వల్ల తెలిసొచ్చింది. చదువుకొనే రోజుల్లో ప్రేమేమిటి? చదువు పూర్తిచేసి, ఉద్యోగం చూసుకొంటే ప్రేమనమను, గాడిదగుడ్డు అనమను, వాడి యిష్టానికి వదిలేస్తాను. కానీ యిప్పుడు, వాడే బరువనుకొంటే వాడికో డోలా? వీణ్ణి పోషించలేకే తలకిందులైపోతున్నాను. వీడికైతే ఉత్తి భోజనం తోటే సరిపోతుంది. ఆ అమ్మాయి వస్తే, వాళ్ళ సరదాల ఖర్చు, పూల ఖర్చు, చీరలఖర్చు యింకా అలాంటివెన్నో భరించాలి . . .నేను అప్పులపాలవటం తధ్యం. ఇప్పుడింట్లో లేమని వాడేదైనా అఘాయిత్యం చేస్తే. . .వచ్చే తరానిక్కూడా ఖర్చు చేయాలంటే. . .అమ్మో నా వల్ల కాదు. పండగ ముందు వెళ్ళిపోతున్నానని ఏమీ అనుకోవద్దు. వెళ్ళకపోతే వాడు నా చెయ్యి దాటిపోతాడు" అంటూ అక్కని కూడా తొందరచేశాడు. మేమిద్దరం స్టేషనుకెళ్ళి వాళ్ళని రైలెక్కించి వచ్చాం.
" మీ మేనల్లుడు ఘటికుడే! చిన్నతనంలోనే యింత చిన్న కధ నడిపాడంటే, పెద్దయితే పెద్ద గ్రంధమే నడిపేలా ఉన్నాడు. అయినా పోలికలెక్కడికి పోతాయి? మీ అక్కయ్య ఒప్పుకోకపోయినా వాడికన్నీ మేనమామ పోలికలే వచ్చాయి. ఆ పరిశీలనా. . .ఆ పిచ్చి చేష్టలూ. . .అయినా అక్క కొడుకైతేనేంటి? మేనమామ అలవాట్లు, పోలికలు రాకుండా ఉంటాయా?" వరాలు అంది.
"ఏంటోయి? నా శీలాన్నే శంకిస్తున్నావ్? నేనెవరికీ ప్రేమలేఖలివ్వలేదే?" అన్నాను.
" ప్రేమలేఖలు కాదు. . నేను ఊళ్ళో లేనప్పుడు ప్రక్కింటి అమ్మాయికి కధల డైరీలివ్వలేదూ! అప్పుడే మర్చిపోయారా?" వరాలి మాటలకి నా నోరు మూతబడింది.
నిజంగా వరాలో ఎన్సైక్లోపీడియా! విషయాలన్నీ రికార్డు చేసి పెట్టి సందర్భానుసారంగా ఆయా సంగతులను బయటకు లాగి నా నోరు మూయిస్తుంది. వరాలు మేనత్తా యిలాగే తన భర్త నోరు మూయించేదట! ఆ అలవాట్లే వరాలికీ వచ్చుంటాయి. మీరేమంటారు?
***

No comments:

Post a Comment

Pages