పుష్యమిత్ర – 12 - అచ్చంగా తెలుగు

పుష్యమిత్ర – 12

- టేకుమళ్ళ వెంకటప్పయ్య



జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ " అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు బృహద్ధ్రదుని వద్దకు సైన్యాధికారి పదవి కోసం వెళ్ళిన సమయంలో సింహకేతనునితో తలపడి అతన్ని ఓడించగా,  సింహకేతనుడు నగరం వదలివెళ్తాడు. కోటలో జరిగిన సంఘటనలు పుష్యమిత్రుని దిగ్భ్రాంతికి గురి చేస్తాయిదక్షిణ దేశ వాసులు కరువు వచ్చిందని చెప్పి శిస్తులు మాఫీ చెయ్యమని అర్ధిస్తే మహారాజు నిరాకరిస్తాడు. పుష్యమిత్రుడు మహారాజును కలిసి సైనికులకు ఇచ్చే జీతంలో ప్రతినెలా కొంత కోత  బెట్టి ధనాన్ని ప్రజలకు కరువు సహాయంగా ఇచ్చే విధంగా ఒప్పిస్తాడు.  రాజ్యం నుండి వెళ్ళిపోయిన సింహకేతనుడు జీలం నది వద్ద నివాతకవచులతో కలిసి కనిపించాడని భయపడ్డ బృహద్ధ్రధునికి తన యుద్ధ తంత్రాలు చెప్తాడు పుష్యమిత్రుడు.  ( ఇక చదవండి).
“ పుష్యమిత్రా! మీరు ఆంధ్ర దేశం వెళ్ళవలసిన సమయం ఆసన్నమయింది.   మీరు ఒక మంచి రధం తీసుకుని మీ గుర్రంతో సహా మరో మూడు ఉత్తమ జాతి యవనాశ్వాలను పూన్చి వెళ్ళవలసినదిగా మా ఆజ్ఞ.  పాతిక మంది సుశిక్షితులైన సైనికులను వెంట తీసుకు వెళ్ళండి. దక్షిణ, నైరుతి, ఆగ్నేయ ముగ్గురు సేనానులను  వెంట తీసుకువెళ్ళండి.. ఏ విధంగా నైనా సరే మీరు ఆ కన్యామణి వసంతసేనను తెచ్చి నాకు  సమర్పించాలి. మీ ధైర్య శౌర్యాలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. జయోస్తు ! నన్ను ఆహ్వానించకుండా “యోగ్యులైన యువకులను” అనే పదం ఆహ్వాన సందేశంలో  ఉపయోగించిన నరేంద్రవర్మకు తగిన గుణపాఠం చెప్పాలి.  నేను ఇక వివాహ ఏర్పాట్లలో ఉంటాను  మీరు వెళ్ళి రండి.”  అని పలికిన పలుకులకు చిరునవ్వు నవ్వి పుష్యమిత్రుడు "మహారాజా నాచేత ఈ బల్లెం ఉన్నంతవరకు నన్ను జయించగలవారు లేరనే అనుకుంటున్నాను" అని నమస్కరించి సెలవు తీసుకున్నాడు.
*  *  *
పుష్యమిత్రుడు ఆంధ్ర దేశానికి వెళ్ళే దారిలో కాంభోజ, విదర్భ రాజ్యాల గుండా వెళ్తూ, ఆయా దేశ సామంత రాజులను కలిసి దక్షిణ ప్రాంత కరువు సమస్యలను విచారించి వారికి కర్షకులకు ధాన్యాన్ని వితరణ చేయమని అర్ధించగా వారు ఒప్పుకుని, బృహద్ధ్రధ చక్రవర్తి నిరంకుశత్వాన్ని దుయ్యబడతారు. పుష్యమిత్రుడు వారికి సర్ది చెప్పి పరిస్తితులు త్వరలో చక్కబడతాయని హామీ ఇస్తాడు.  పుష్యమిత్రునిరధం కళింగదేశం సరిహద్దుల్లోకి ప్రవేశించింది. అఖండ గోదావరి నదిని దాటి ఆంధ్రదేశంలోకి ప్రవేశించవలసిన సమయంలో ఆ ప్రాంతం వాసులు అక్కడి దోపిడి దొంగల గురించి చెప్పి అప్రమత్తులై వుండవల్సిందిగా సలహా ఇస్తారు. అక్కడి పడవ నడిపే వారు మొన్నటి వరకూ  నది ఎండిపోయి ఉండడమూ,  వారు జీవనోపాధిలేక అష్టకష్టాలు  పడిన విషయాలు వివరిస్తారు. ఒక పెద్ద పడవ సహాయంతో రధమూ గుర్రాలతో సహా గోదావరీ నదిని దాటి ఆంధ్ర ప్రాంతం లో అడుగు పెట్టారు. స్వయంవరానికి ఇంకా నాలుగు రోజుల వ్యవధి ఉంది.  అక్కడి స్థితి గతులను విచారించాక ఒక రోజు ముందుగా కృష్ణవేణీ నదిని దాటి ఆంధ్రుల రాజధాని అమరావతికి దాపున ఉన్న ధాన్యకటకం చేరారు. అమరావతిలోని బౌద్దగురువులను కలిసి "ప్రజలంతా సమానంగా కష్టిస్తున్నారు, పన్నులు కడుతున్నారు. ఏమతాలను ఆచరించే ప్రజలైనా ఈదేశపు పౌరులు దేశ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుంటే నాకు సమానమే.  అటువంటప్పుడు బౌద్దులకు మాత్రమే పన్నురాయితీలు, ఇతర సమస్త సౌకర్యాలు ఉండటం నాకు సమంజసంగా అనిపించటం లేదని  వారికి నచ్చ జెప్పి కొన్ని పన్ను రాయితీలను, ఉచితంగా ఇచ్చే వస్తు సంభారాలను స్వఛ్చందంగా వదులుకుంటునట్టు స్థూపాధిపతి దగ్గర ఒక లేఖ తీసుకున్నాడు.  ఆవిధంగా పుష్యమిత్రునికి బౌద్ధమతస్తుల వ్యతిరేకతా సెగ మొదటగా ఆంధ్రప్రాంతం నుండి ఆరంభమయింది.
 పుష్యమిత్రుడు హస్తినాపురం నుండి వచ్చినట్టు వేగులు మహారాజు నరేంద్రవర్మకు తెలియజేసారు. మహారాజు స్వయంగా వచ్చి వారికి కావలసిన విడిది  ఏర్పాట్లు చేసారు. స్వయంవరం ముందు రోజు పుష్యమిత్రుడు కృష్ణవేణీ నదీ తీరానికి విహారానికి వెళ్ళాడు. అక్కడికి దగ్గరలో బౌద్ధుల అమరావతీ స్థూపం నిర్మాణం జరుగుతోంది. మొదటగా దానిని అశోకుని కాలం లో ఆ ప్రాంతం లో విరివిగా దొరికే సున్నపురాయితో నిర్మాణం గావించినప్పటికీ దాని నవీనీకరణ మాత్రం సంపూర్తి అవలేదు. ఈ మహాస్థూప సమూహంలో బౌద్ధ భిక్షువులకు ఆవాసాలు, విద్యాసంబంధిత కట్టడాలు కూడా అనేకం గమనించాడు పుష్యమిత్రుడు. అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు,  జాతక కధలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. స్త్రీలు సౌందర్య, శృంగార పిపాసులే..! అమరావతీ శిల్పాలలోని స్త్రీ మూర్తులను గమనించినట్లయితే ఆంధ్ర ప్రాంత స్త్రీలు సౌందర్య, శృంగార అంశాల మీద ఎంతగా శ్రద్ధ వహించేవారో ఇట్టే అర్థమవుతుంది. కొన్నిచోట్ల నగ్నంగా స్త్రీలను చెక్కినప్పటికీ, ధార్మిక భావనకు ఏ మాత్రం భంగం వాటిల్లనిరీతిలో  చెక్కడం పుష్యమిత్రునికి ఆశ్చర్యానికి గురిచేసింది. వసంతసేన ఆంధ్రదేశపు అందగత్తె, అతిలోకసుందరి కావడం వలననే  బృహద్ద్రధ చక్రవర్తి మనసు పడ్డాడనే విషయం అర్ధమైది. స్తూపానికి దగ్గరలో ఉన్న శైవ దేవాలయానికి దారి తీసాడు. దేవాలయం ముందు రధం ఆపి దేవాలయం మెట్లు ఎక్కుతూ ఉండగా ఒక తెల్లని ఛత్రం పట్టుకున్న అద్భుత సౌందర్య వతుల బృందం మెట్లు దిగి వస్తూ కనిపించింది. మధ్యలో అతిలోక సౌందర్యవతి అయిన నరేంద్ర వర్మ కుమార్తె వసంతసేన కనుపించింది. ఒక్కసారి ఇద్దరి చూపులు కలిసాయి. పద్మినీ జాతి స్త్రీని పోలిన  అందచందాలతో అలరారే వసంతసేన తళుక్కున మెరిసింది.  ఒకరినొకరు చూస్తూ అలా శిల్పాల్లా ఉండిపోయారు. వసంతసేన ధవళ వస్త్రాలతో శరీరం తామర మొగ్గలా సుతి మెత్తగా ఉంది. కళ్లు విశాలంగా వుండి తళ తళ మెరుస్తూ ఉండగా..  నాసిక సంపెంగ రేకు వలె వుంది.  చక్కటి శరీరాకృతితో మేనిచ్ఛాయ కలువను మరిపిస్తూ ఉంది. సన్నటి నడుము, దొండ పండులాంటి పండు వంటి పెదవులు, చంద్రబింబం వంటి ముఖం, ఇసుక తిన్నెల వంటి పిరుదులతో దేవతా స్త్రీ లక్షణాలతో శోభిస్తూ ఉంది. తలంటుకుని విరబోసుకున్న తుమ్మెద రెక్కల్లాంటి అరాళ కుంతలాలను, కోమలమైన చేతి వేళ్లతో సవరించుకుంటూ ఎంతో అందంగా ఉంది. ఆమె దేహ పరిమళం సుగంధభరితంగా ఆ ప్రాంతమంతా గుభాళిస్తోంది.   వసంతసేన సైతం ఆజానుబాహుడూ, అతి ధృఢకాయుడూ.. చక్కని శరీరాకృతి గల పుష్యమిత్రుడిని చూచి కళ్ళు ఆర్పకుండా చూడడం గమనించిన చెలికత్తెలు "హూ.. ఎవరివయ్యా నీవు? ఈ సమయంలో ఇక్కడికెందుకు దయచేసారు? ఇది వసంతసేన ఈశ్వర దర్శనం చేసుకునే వేళ" అని హెచ్చరించారు. "నన్ను పుష్యమిత్రుడు అంటారు. నేను హస్తినాపురం నుండి వచ్చాను. ఈ భరతఖండాన్ని ఏలే చక్రవర్తి బృహద్ధ్రధుని సర్వసేనానిని.  పుష్యమిత్రుని నోటినుండి వసంతసేన అన్న పేరు, వసంతసేన నోటినుండి పుష్యమిత్ర అనే పేరు ఒకే క్షణంలో ఉచ్చరించబడ్డాయి. ఇదంతా గమనిస్తున్న చెలికత్తెలు తేరుకుని "వసంతసేనా! పద.. పద..మహారాజుగారికి ఇవన్నీ తెలిస్తే మాకు లేనిపోని సమస్యలు అని మెట్లు దిగడం ప్రారంభించగానే..పుష్యమిత్రుడు-వసంతసేన కనుమరుగయ్యేనతవరకూ  వెనక్కు తిరిగి ఒకరినొకరు చూసుకుంటూ..ఉండిపోయారు.  ఆంధ్ర దేశపు యువతీ యువకులు బహుసుందరులని శిల్పాలలో చూడడమూ, ఆనోటా ఈనోటా వినడమే గానీ ఎప్పుడూ చూడని పుష్యమిత్రుడు వసంతసేన సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. అలాగే ఆంధ్రులు ధృఢకాయులూ.. మంచి తిండి పుష్టి కలిగి యుద్ధ తంత్రాలలోనూ కూడా నిపుణులే! అనుకున్నాడు.
*  *  *
"స్వయంవరానికి విచ్చేసిన రాజకుమారులారా..యువకులారా! స్వాగతం..సుస్వాగతం. ఇప్పుడు మా కుమార్తె వసంతసేన పుష్పమాల ఎవరి మెడలో హారం వేస్తుందో వారిని వరించినట్లు లెక్క.  వానికి అర్ధ రాజ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతలో పుష్యమిత్రుడు లేచి " క్షమించండి నరేంద్రవర్మా! మా చక్రవర్తికి మౌర్య వంశాధీశులు బృహద్ధ్రధ చక్రవర్తి పంపగా వచ్చాను. నా పేరు పుష్యమిత్రుడు. మా మహారాజు  వసంతసేనపై మనసుపడ్డారట. అందువలన ఇక్కడ ఎట్టి రక్తపాతమూ జరుగుకుండా నేను వసంతసేన ను తీసుకువెళ్ళి ఆయనకు అప్పజెప్ప వలసిన బాధ్యత తో వచ్చాను. అందుకు నరేంద్రవర్మ  "పుష్యమిత్రా! మేము సామంత రాజులం అనే విషయం మాకు తెలుసు. కానీ మీ చక్రవర్తి పన్నులు వసూలు చేసుకుని ఖజానా నింపుకోవడం తప్ప ప్రజల బాగోగులు ఎన్నడూ చూడలేదు. ఈ ప్రాంతపు ప్రజలు అత్యంత భయంకరమైన కరువు బాధల్లో ఉన్నప్పుడు మా గ్రామాధికారులను పంపగా శిస్తుల రద్దుకు నిరాకరించారు. ప్రజా సంక్షేమం చూడ వలసిన చక్రవర్తి చేయదగ్గ పనేనా అది?. ఇప్పుడిప్పుడే వర్షాలు పడి జనం కోలుకుంటున్నారు. మీ చక్రవర్తి వయసు మళ్ళినవాడు.  ఒక ఆడపిల్ల తండ్రిగా తనకు నచ్చిన వరునితో వివాహం జరిపించే బాధ్యత  ఉంది కదా!" అనగానే  పుష్యమిత్రుడు చిరునవ్వు నవ్వి “నిజమే మహారాజా! నేను ఈ కార్యార్ధినై హస్తినాపురం నుండి వచ్చాను. దయచేసి రక్తపాతం నివారించి ఆమెను నాతో పంపండి" అనగానే అక్కడకు వచ్చిన ఇద్దరు రాజకుమారులు లేచి కత్తులు దూయగా పుష్యమిత్రుడు వారి కత్తులను  బల్లెంతో క్షణాలలో తునా తునకలు చేసాడు. పుష్యమిత్రుని బలం తెలిసిన మిగతా వారు మిన్నకుండిపోయారు. వసంత సేన ఆసనం నుండి దిగి వచ్చి పుష్పహారంతో పుష్యమిత్రుని ఎదురుగా నిలుచుంది. ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేక కళ్ళు పక్కకు తిప్పుకున్నాడు పుష్యమిత్రుడు. "పుష్యమిత్రా! మీ బలపరాక్రమాలు, సైన్యాధిపతి ఎంపిక సమయం లో మీరు చూపిన ప్రతిభ మా దేశ ప్రజలు ఇప్పటికీ కధలు కధలు గా చెప్పుకుంటున్నారు. మొన్నటికి మొన్న మీరు మహారాజుకు ఇచ్చిన సలహాల వల్ల వచ్చిన రాయితీలు శిస్తుల మాఫీలు మేము మరిచిపోలేము. నేను మిమ్ములను అమరావతి ఆలయంలో తొలిచూపులోనే వరించాను. మీరూ నన్ను ఇష్టపడ్డారన్న విషయం తెలుసుకోలేనంత అమాయకురాలను కాను. మీరు కాదని చెప్పినా అది సత్యదూరమేనని నాకు తెలుసు. నేను ఆ కారణాలవల్ల మిమ్మల్ని వరిస్తున్నాను. మీతో వివాహం జరిపించవలసినదిగా తండ్రిగారిని కోరుతున్నాను అని చటుక్కున మెడలో పుష్పహారం వేసేసింది. అందరూ కరతాళ ధ్వనులతో "పుష్యమిత్ర మహారాజుకు జై అని జయ జయ ధ్వానాలు చేసారు.
ఒక్క ఘడియలో జరిగిన ఈ వివాహానికి పుష్యమిత్రుడు ఆశ్చర్యపోయాడు. "పుష్యమిత్రా ఇప్పుడు సేనానినివి కావు. నా అర్ధరాజ్యంతో మీరు మహారాజులయ్యారు. నా అర్ధరాజ్యమే కాదు నా పూర్తి ఆంధ్ర సామ్రాజ్యాన్ని మీకే పట్టంకట్టి కట్టుబట్టలతో వానప్రస్తానికి వెళ్ళడమూ మాకు సమ్మతమే!". అనగానే పుష్యమిత్రుడు "మహారాజా! నాకు అలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి" అనగానే, స్వయంవరం ముగిసినట్టు ప్రకటించాడు నరేంద్రవర్మ. తనకు విడిదిగా ఇచ్చిన ఏకాంత మందిరం లోకి వెళ్ళి వసంతసేనను తీసుకు రమ్మని కబురు చేసాడు. “వసంతసేనా! నీవు చెప్పింది నిజం. నేనూ నిన్ను తొలిచూపులోనే వరించాను. నేను కార్యార్ధినై వచ్చాను. ఏమిటి కర్తవ్యం?”  అనగానే వసంతసేన తెలివిగా "ప్రభూ! మీరు నా భర్త! మీ కర్తవ్య పాలనకు అడ్డురాకుండా,  మన వివాహానికి భంగం కలుగకుండా ఒక ఉపాయం ఆలోచించాను" అంది. ఏమిటది అన్నట్టు చూడగానే "నన్ను మీరు మీ సామ్రాజ్యానికి తీసుకు వెళ్ళండి. నేను ఓ వ్రతం లో ఉన్నానని దానికి సంవత్సరం గడువు వుందని, ఆ తర్వాత వివాహం చేసుకోవచ్చని ఈ లోపు చేసుకుంటే భర్తకు గండం ఉందని మా జ్యోతిషపండితులు చెప్పారని నమ్మ బలకండి. ఈ లోపు జరగవలసిన కర్తవ్యం నిదానంగా ఆలోచించి సానుకూలపరుద్దాం. ఈ లోపు మీ భవనంలోనే నేను బధ్రతగా ఉండగలనని చెప్పండి. మీ వెంట వచ్చిన పాతికమంది సైనికులనూ ఇక్కడే వదలివేయండి. మనం మా సైనికులతో తరలి వెళ్దాం." అనగానే తాత్కాలికంగా ఉపశమనం లభించి సంతసించాడు పుష్యమిత్రుడు.
 *  *  *
మరుసటిరోజు జరిగిన సభలో పుష్యమిత్రుడు ఆంధ్రదేశంలోని అన్ని ప్రాంతాల అధికారులను రప్పించి, దేశంలోని అన్నివిషయాలనూ కూలంకషంగా చర్చించాడు.   వివిధ అధిపతులు ఆంధ్ర దేశానికి  30 నగర దుర్గాలు, 10 వేల పదాతి సైన్యం, రెండు వేల  గుర్రపు దళం, వేయి ఏనుగులు ఉన్నాయని తెలిపారు.  ప్రతిష్టానం, పౌదన్యపురం, కోటిలింగాల, ధూళికట్ట, సాతానికోట, భట్టిప్రోలు, తాంబ్రావ (చేబ్రోలు), నరసాల, విజయపురి ప్రాంతాల సైన్యాధికారులు అన్ని విషయాలను తెలియజేశారు. ఇనుము పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెంది మా దేశం సుభిక్షమయ్యింది. ఉత్తర దేశంనుండి సింహళానికి వెళ్లేమార్గంలో బిడారులకు మా ఆంధ్రదేశం ముఖ్యమైన మజిలీగా ఉంది. కానీ ఈ మధ్య వచ్చిన కరువు వల్ల కొన్ని ఎగుమతులు, దిగుమతులు వంటివి కుంటుపడ్డాయి. ధాన్యం నిల్వలు దేశంలో బాగా తగ్గిపోయాయి అనగానే, వరినాట్లకు కావలసిన ధాన్యాన్ని ధాన్యాగారం నుండి కొలిపించి, రైతులందరికీ సంతోషం పంచాడు. వివాహవేడుకల అనంతరం వెంట వచ్చిన పాతికమంది సైనికులనూ.. ఆంధ్ర దేశంలో కొంత కాలం ఉండ వలసిందిగా ఆదేశించి ఆంధ్రదేశపు సైనికులను పాతిక మందిని తీసుకుని రధంపై వసంతసేనను తీసుకుని ఆ దేశ పొలిమేరలు దాటి కళింగ రాజ్యంలో ప్రవేశిస్తుండగా...... (సశేషం)
*  *  *

No comments:

Post a Comment

Pages