ప్రేమతో నీ ఋషి – 23 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 23

యనమండ్ర శ్రీనివాస్



( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ కంపెనీ వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్ వేలానికి వారిద్దరూ వెళ్తుండగా,  దారిలో స్నిగ్ధకు ఆర్ట్ మ్యూజియం కోసం వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో మాట్లాడాలని  వెళ్తుంది. ఇక చదవండి...)
"మీరిది ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?" స్నిగ్ధ చెప్పింది విన్న మహేంద్ర గర్జిస్తూ అన్నాడు.
ఈ వార్త ఆయన్ను పూర్తిగా కలవరపరచినా, అసలు విశ్వామిత్ర పెయింటింగ్ ను సంపాదించేందుకు ఏం చెయ్యాలా అని ఆయన ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ  విషయం బయటకు పొక్కితే రాబోయే చెడు ప్రచారం గురించి అతనికి దిగులుగా ఉంది. అసలే చట్టసంబంధమైన అభియోగాలతో ఆయన ఎన్నో సవాళ్ళను ఎదురుకుంటూ ఉండగా ఈ సమయంలో ఇలా జరగింది.
గార్డెన్ హోటల్ కన్సల్టెంట్ లు ఆ చిత్రంపై జరిపిన పరీక్షలన్నింటి గురించి ఋషి మహేంద్రకు వివరించాడు. కాని, మాంచెస్టర్ లో ఉన్న పెయింటింగ్ పై ఇంకా పరీక్షలు జరపలేదని కూడా అతను చెప్పాడు.
ఈ విషయాన్ని ఇక సాగదియ్యడం మహేంద్రకు ఇష్టంలేదు. ఆయన ఒక్క క్షణం ఆలోచించి, మళ్ళీ ఉత్సాహం నింపుకుని,”స్నిగ్ధ, మీరు మాంచెస్టర్ లో ఉన్న పెయింటింగ్ ను కూడా ఒక్కసారి అధికారికంగా పరిశీలించాలని నేను సూచిస్తున్నాను. ఇంతవరకు ఆ పెయింటింగ్ ఎక్కడ ఉందో కూడా వివరాలు కనుక్కోండి. ఈ ప్రాజెక్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి, నాకొక 3-4 రోజుల్లో దీని గురించి సమాచారం ఇస్తావా?” అతని ముఖం గంభీరంగా ఉంది, నిజమేమరి, ఇది ఆయన పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కదా!
ముందే స్నిగ్ధ దిగులుగా ఉంది, ఆయనకు క్షమాపణ చెప్పాలని అనుకుంది. కాని, మహేంద్ర చొరవ తీసుకుని, “స్నిగ్ధా, ఇందులో నీ తప్పేమీ లేదని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇందులో వేరెవరో ఉన్నారు, వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదు. దిగులుపడకు.” అంటూ ఆమెను అనునయించాడు.
మహేంద్ర లేచి, బయల్దేరేందుకు తలుపు వద్దకు వెళ్తూ, అది తెరవబోయే ముందు, వెనక్కు తిరిగి, ఇలా అన్నారు,” ఖరీదు ఎంతైనా అసలు పెయింటింగ్ ను గార్డెన్ హోటల్ నుంచి కొనుగోలు చెయ్యండి. కాని, ఆ నకిలీ పెయింటింగ్ మన వద్దకు ఎలా వచ్చిందో కనుగొనే ప్రయత్నం మాత్రం మానకండి. మరికొన్ని రోజులపాటు, మీరు ఈ అంశం మీద పనిచేస్తున్నట్లు ఎవరికీ తెలియనివ్వకండి, అంటూ ఒక్క క్షణం ఆగి, గట్టిగా నిట్టూర్చి, ‘మృణాల్, అప్సర లతో సహా !’ అని వెళ్ళిపోయారు.
స్నిగ్ధ, ఋషి ఆపరేషన్స్ మేనేజర్ వద్దకు వెళ్లి, ప్రద్యుమ్న మ్యుజియం కోసం విశ్వామిత్ర పెయింటింగ్ తో సహా చిత్రాలను కొనుగోలు చేసే విధివిధానాలను పూర్తిచేసారు. తర్వాత, వెంటనే వారిద్దరూ తమ గదులకు తిరిగి వెళ్ళిపోయారు. మాంచెస్టర్ తిరుగు ప్రయాణం కోసం ఋషి వెంటనే ఫ్లైట్ బుక్ చేసాడు. ఆ సంగతి స్నిగ్ధకు చెప్పి, వెంటనే బయలుదేరేందుకు ఆమెను సిద్ధంగా ఉండమని చెప్పాడు. మరికొద్ది గంటల్లో, వారు హోటల్ వారికి చెందిన ఒక టాక్సీ లో ఎక్కి, ఎయిర్పోర్ట్ కు బయల్దేరారు. ఫ్లైట్ సమయానికే ఉంది. ఎక్కగానే వారు ఆ రోజున జరిగిన కార్యక్రమాల తాలూకు అలసటతో, వెంటనే నిద్రలోకి జారుకున్నారు.
***
మర్నాడు మాంచెస్టర్ లో స్నిగ్ధ ఆఫీస్ కు చేరుకోగానే, మృణాల్ తనకోసం వేచి ఉండడాన్ని గమనించింది. ఆమెను చూడగానే అతను పలకరించి, “హే స్నిగ్ధా, నువ్వెలా ఉన్నావు? నీ ట్రిప్ నుంచి ఇంత త్వరగా ఎలా వెనక్కి ఒచ్చావు? నువ్వు ముంబై లో మరొక వారం రోజులపాటు ఉంటావని అనుకున్నాను. నీ విహారయాత్రను ఆపేసి వచ్చావా?” అని అడిగాడు.
ఎప్పటిలాగే, ‘ఉత్సుకత ఎక్కువ మృణాల్ కి’, అనుకుంది స్నిగ్ధ. అతనికి పొడవైన జవాబును ఆమె ఇవ్వాలని అనుకోలేదు, ఆమె క్లుప్తంగా, “మృణాల్ నా ప్రయాణం బాగా జరిగింది, కాని హడావిడిగా ముగిసింది. మేము మ్యుజియం కోసం కొన్ని పెయింటింగ్స్ కొన్నాము. కాని, దురదృష్టవశాత్తూ, నేను ట్రిప్ కు తీసుకువెళ్ళిన నేస్తానికి ఆరోగ్యం పాడైంది. అందుకే నేను ఒంటరిగా వెళ్ళలేక, ట్రిప్ కాన్సిల్ చేసుకుని, ఋషితో పాటు వచ్చేసాను.’ అని చెబుతూ ఆమె త్వరగా క్రింద ఫ్లోర్ కు దిగసాగింది. హైదరాబాద్ కు పంపాల్సిన పెయింటింగ్స్ సంగతి ఏమైందో చూద్దామని అనుకుంది. మృణాల్ ఆమె వెనుకే వెళ్ళాడు.
‘పర్వాలేదు, ఏమైనా, నీకు కంపెనీ ఇచ్చేందుకు నువ్వు నన్ను పిలిచి ఉండాల్సింది. నువ్వు పిలిస్తే నేను వెంటనే ముంబై కి రెక్కలు కట్టుకు వచ్చి, నీతో ఆనందంగా సమయం గడిపేవాడిని కదా, హ హ ‘ స్నిగ్ధకి ఎప్పటిలాగే మృణాల్ వెకిలి వాగుడుకి విసుగొచ్చింది. కాని, ఆమె ప్రస్తుతం అతని మాటలను పట్టించుకుని, ఖండించే స్థితిలో లేదు. ఇంతవరకు తమ ఆర్ట్ కలెక్షన్ లో ఇంకేవైనా నకిలీ పెయింటింగ్స్ ఉన్నాయేమో పరిశీలించడమే ఆమె తక్షణం చెయ్యవలసింది. ఆమె ఆ పెయింటింగ్స్ తాలూకు ‘ఇన్వెన్ట్రీ రికార్డ్స్ ‘ ను పరిశీలించి, అంతవరకు కొన్న పెయింటింగ్స్ తాలుకూ పత్రాలను సమీక్షించసాగింది.
“మృణాల్, కాసేపు నన్ను ఒంటరిగా వదలగలవా ? నేను మరొక్కసారి పత్రాలను పరిశీలించి, డాక్యుమెంటేషన్ పూర్తి చెయ్యాలి. నీ పని చూసుకో. నేను నిన్ను లంచ్ కు కలుస్తాను.” ఆమె గంభీరమైన స్వరం ఆమె అయిష్టాన్ని వ్యక్తం చెయ్యడంతో, మృణాల్ మారు మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
తర్వాత కొద్ది గంటలపాటు, స్నిగ్ధ ఇన్వెంటరి గదిలో తిరిగి, నకిలీవి ఉన్నాయేమో నిర్ధారించేందుకు ప్రత్యేకంగా ఒక్కొక్క పెయింటింగ్ ను, దాని తాలూకు పత్రాలను సమీక్షించింది. విశ్వామిత్ర పెయింటింగ్ ను తమకు అమ్మినవారి అడ్రస్ ను ఆమె నోట్ చేసుకుంది. అది మృణాల్ ఇటలీ లోని ‘మిలన్’ లో ఉండే ఒక వృద్ధ ఆర్ట్ కలెక్టర్ వద్ద నుంచి కొనుగోలు చేసాడు.
స్నిగ్ధకు మొదటి నుంచే మృణాల్ మీద సందేహం ఉంది. ఈ సంఘటనతో, ఇందులో అతని హస్తం ఉందన్న నమ్మకం ఆమెకు బలపడింది. అయినా, మహేంద్ర ఈ విషయాన్ని బయటకు పోక్కనివ్వద్దని చేసిన హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని, ఈ విషయాన్ని అత్యంత లాఘవంగా నిర్ధారించాలని అనుకుంది. ఆమె ఋషికి ఫోన్ చేసి, ఆ పెయింటింగ్ ను తమకు అమ్మినవారి చిరునామాను అతనికి ఇచ్చింది. ఆమె వెనక్కు తిరిగి, లంచ్ కు వెళ్ళబోతూ ఉండగా, మృణాల్ తన వెనకాలే నిలబడి ఉండడాన్ని గమనించింది. విశ్వామిత్ర పెయింటింగ్ ను అమ్మినవారి చిరునామాను స్నిగ్ధ ఫోన్ లో చెబుతూ ఉండగా ఖచ్చితంగా అతను వినే ఉండాలి.
స్నిగ్ధకు మృణాల్ ను చూసి చెమటలు పట్టసాగాయి. ఒక కపటమైన నవ్వుతో అతను ఆమెను సమీపించాడు.
(సశేషం..)

No comments:

Post a Comment

Pages