పొదరిల్లు - అచ్చంగా తెలుగు

పొదరిల్లు

దొండపాటి కృష్ణ 



"ఒక అద్భుతాన్ని పోగొట్టుకుంటానని అద్భుతంగా మాట్లాడుతుంటే నేనేం అంటాను. నీకు నచ్చిందే చెయ్యి. నువ్వు ఎవ్వరి మాటను వినిపించుకోవుగా .. నీ ఇష్టం" గోపాల్ ఏమంటాడో అనినిర్లిప్తత కూడిన స్వరంతో అన్నాడు గోవర్ధన్.  
"వినని వాడినే అయితే వినిపించుకోని వాడినే అయితే నిన్నెందుకు పిలిపిస్తాను, నీ సలహా ఎందుకు అడుగుతాను?" ప్రశ్నించాడు గోపాల్. "నువ్వు పిలిస్తే రాలేదు మా చెల్లి పిలిస్తే వచ్చాను. అయినా నువ్వు నన్ను సలహా అడగలేదు. నీ నిర్ణయం చెప్పావ్. అంత ఆలోచించే వాడివైతే ఇల్లమ్మి నువ్వు ఎక్కడుంటావో ఆలొచించుకున్నావా? ఇంటి పట్టునే ఉండని సాఫ్ట్ వేర్  కొడుకు, మెడిసిన్ చదివే కూతురి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తావ్. ఏ ఇంట్లో శుభకార్యం జరిపిస్తావ్?" కడిగేసినట్లుగా అడిగేశాడు గోవర్ధన్.
"ఇద్దరికీ సంబంధాలు కుదురుతున్నాయి. ఒకే లగ్నంలో చేస్తాను. ఇవన్నీ ఆలోచించకుండా ఇల్లమ్మడం గురించి ఎలా ఆలోచిస్తాను. వారి పెళ్ళిళ్ళు అయ్యాకే అమ్ముతాను. ఇప్పట్నుంచే బేరం పెడితే అప్పటికితెగుతుందని అడుగుతున్నాను. ఏం తప్పా?" దీనంగా అన్నాడు గోపాల్.
"తప్పే..!ఇల్లమ్మి అద్దె కొంపలో ఉంటావా?" ఆవేశపడుతున్న గోవర్ధన్ ను శాంతపరిచేందుకు ప్రయత్నిస్తూ "ఆవేశపడకు, నేనేం అద్దె కొంపలో ఉండనులే. స్వగ్రామంలో 5 సెంట్ల స్థలం ఉంది. అక్కడున్న పూరిల్లు తొలగించిపెంకిటిల్లు కట్టించుకొని శేష జీవితం గడపాలన్నదే కోరిక.. అందుకే...!" నసిగాడు గోపాల్.
"ఇక్కడే ఎప్పట్నుంచో ఉంటున్నావ్. అందర్నీ వదిలేసి ఎలా వెళ్తావ్ రా? నా మాట వినరా!" నచ్చ జెప్ప ప్రయత్నించాడు గోవర్ధన్. "నువ్వెంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా ఇల్లు అమ్మడం అమ్మడమేరా! ఉండడానికి, చూడడానికి పెద్ద ఇల్లే అయినా మనశ్శాంతి కరువైందిరా! బోర్ కొడుతుంది." మనస్సులో మాట అదేనన్నట్లు బయటపెట్టాడు గోపాల్.
"నీ నిర్ణయం నాకు నచ్చలేదురా! అంత గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు నన్ను పిలిపించడం దేనికి?" మాట నెగ్గనందుకు నొచ్చుకున్నాడు గోవర్ధన్. తనకు నచ్చిందేదో మాట్లాడిన భార్య రంజితపై కోప్పడ్డాడు గోపాల్. మధ్యలో కలుగాజేసుకోవద్దని గట్టి హెచ్చరిక జారీ చేశాడు. అది చూసిన గోవర్ధన్ “ఎందుకురా అలా కోప్పడతావ్?తాళి కట్టించుకొని ఏడడుగులు వేసి, కలకాలం తోడుంటానని అగ్ని ముందు ప్రమాణం చేసిన వారిపై కోపాలెందుకు చెప్పు! అసలే కోపానికి కంగారెక్కువ. ఆ కంగారే అనేక అనర్ధాలకు దారి తీస్తుంది. వదిలేయ్. మా మాటెప్పుడు పట్టించుకున్నావులే! పిల్లలు పెళ్లీడుకోచ్చినా నీ ప్రవర్తనలో మార్పు లేదు! కాలేజీ రోజుల్లో ఎలా ఉండేవాడివో అలాగే ఉన్నావు. ఇంతకినన్నేం చేయమంటావ్?" నంటూ సముదాయించాడు.
"ఏం లేదురా! పేపర్ లో యాడ్ ఇవ్వాలి. వాటి గురించి నాకంతగా తెలియదని నీకు తెలుసు కదా! అందుకే నాకొక యాడ్ ను రెడీ చేస్తే రిపోర్టర్ కు ఇద్దాం. క్లాసిఫైడ్స్ లో వచ్చినట్లు మరీ అంత చిన్నగా కాకుండా ఉండేటట్లు ప్రిపేర్ చెయ్!" అభ్యర్ధించినట్లుగా ఆజ్ఞాపించాడు గోపాల్. “ఉన్నది ఉన్నట్లు రాయాలా లేక జోడించి రాయాలా?" క్లారిఫికేషన్ కోసం అడిగాడు గోవర్ధన్.
"కల్పించి రాయడమెందుకు?రాసినది చదివి ఏవేవో ఊహించుకొని వచ్చి చూశాక మళ్ళా అలా ఉండకపోతే తిట్టుకొని పోతారు. ఆనరఘోష మనకేందుకులేగానిఉన్నది ఉన్నట్లు రాస్తే చాలు. నిజం ప్రస్ఫుటంగా ఉన్నట్లు చదవగానే ఇంటి ఊహా చిత్రం వారి కళ్ళ ముందు మెదలాలి." ప్రకటన ఎలా ఉండాలో వివరించాడు గోపాల్.
* * * * * *
కవిగా తనకున్న అనుభవాన్ని మొదటిసారిగా పత్రికాముఖంగా తెలియజేసే అవకాశం రావడంతో నానా తంటాలు పడి నిద్రను చెడకొట్టుకొని, భార్య శ్రావణితో చర్చించి రెండు వెర్షన్లు రాసుకొచ్చి చూపించాడు గోవర్ధన్."ఇదిగోరా! జాగ్రతగా చదువు. ఒకటి క్లుప్తంగా వ్రాసాను. రెండోది విశదీకరించి రాసాను. మనసుపెట్టి చదివి అర్ధం చేసుకో. ఆలోచించుకో.నీకేది నచ్చుతుందో చెప్తే దానినే ప్రకటనగా ఇద్దాం" అంటూ రెండు కాగితాలను అందించాడు.
"విశాలమైన ఇల్లు గురించి వెతుకుతున్నారా? మీ కోసమే అద్భుతమైన ఇల్లు ఉంది. ఆ సువిశాల ఆవరణంలో సకల సౌకర్యాలు అందుబాటులోనే ఉన్నాయి. ఇంటిని సొంతం చేసుకోవడానికి వివరాలకై సంప్రదించండి". 
        చదివిన గోపాల్ కాస్త నిరాశపడ్డాడు. “ఏంటిరాఇది! ఇలా ఉండొద్దు అనే కదా చెప్పాను. మళ్ళీ అలాగే రాశావ్" అని అడగడంతో "అందుకే రెండోది కూడా రాశాను. అది కూడా చదువు. అప్పుడు చెప్పు నీ నిర్ణయం" అన్నాడు గోవర్ధన్. చదవడం పూర్తి చేశాడు. మొదటిది చదివినప్పుడు అతని మొహంలో నిరాశ కనిపిస్తే రెండోది చదివినప్పుడు ఏదో తెలియని వెలితి కనిపించింది. కొన్ని భావోద్వేగాలకు అక్షర రూపం ఉండదు. అవి అర్ధం చేసుకోవాల్సిందే. సన్నివేశాన్ని అర్ధం చేసుకున్న గోవర్ధన్ అక్కడ నుంచి సెలవు తీసుకున్నాడు.
* * * * * *
మౌనం ... మౌనం ... మౌనం ... అంతా మౌనం. గాలి శబ్దమే వినిపించేంత మౌనం. తుఫాన్ వచ్చేముందు సముద్రం వహించే మౌనం. ప్రళయం వచ్చేముందు ప్రకృతి వహించే మౌనం. మౌనాన్ని చేధించాలంటే శబ్ధం తాండవం చేయాల్సిందే! గోపాల్ మొహంలో సంతోషంకనిపించడం లేదు.ఏదో కోల్పోతున్నాననే భావనే అతనిని నిలువునా తొక్కేస్తుంది. ఆ భావనకు అర్దాన్నిస్తున్నట్లుగా అంతరాళం నుండి చెమ్మ కన్నీరుగా బయటకొచ్చి తన బుగ్గలపై చిందులేస్తున్న వేళ, భర్త మౌనానికి కారణం తెలీని ఆ ఇల్లాలు భర్తను పలకరించింది.
"ఏంటండి ఆ కన్నీళ్లు? ఇల్లు అమ్మేస్తున్నామనేనా.?" అని అడిగింది రంజిత."ఇది కన్నీరు కాదు! పశ్చాత్తాపం పడినప్పుడు వచ్చే కన్నీరు. వెళ్లి ఆ ఫోన్ ఇలా పట్టుకురా!" భార్యకు పురమాయించాడు. "ఇదిగోండి! ఎవరికీ ఫోన్ చేస్తున్నారు" అంటూ వెంట తెచ్చిన ఫోన్ అందిస్తూ అడిగింది.
        "గోవర్ధన్ కు చేస్తున్నాను. హా .. హలో .. ఏరా బిజీగా ఉన్నావా?నాకెలా చెప్పాలో అలాగే చెప్పావ్ గా. అందుకే ఒప్పుకుంటున్నాను. ఇల్లమ్మే ఉద్దేశ్యాన్ని మానుకున్నాను. నిజమేరా.. నమ్ము!” ఆర్ద్రత నిండిన స్వరంతో చెప్పాడు గోపాల్.
         "చాలా సంతోషంరా! ఇప్పటికైనా మనస్సు మార్చుకున్నావు. నాకు తెలుసు నీ మనస్థత్వం. ఎలా చెప్తే అర్ధం చేసుకుంటావో నా కన్నా ఎవరికీ తెలుసు" సంతోషం గా చెప్పాడు గోవర్ధన్. ఇద్దరూ వారి వారి మాటలను ముగించారు. భార్యవైపు చూశాడు గోపాల్. కొత్తగా కనిపించింది తనకి. విషయమేమిటని సైగ చేశాడు.
         "అసలేం జరుగుతుందండి! ఇల్లు అమ్మడం లేదని చెప్తున్నారు. మీరేం అంటున్నారో నాకేమి అర్ధం కావడం లేదు. అంత త్వరగా నిర్ణయం ఎలా మార్చుకున్నారు.? అసలేం జరిగింది?" ఆనందం కూడిన ఆశ్చర్యంతో రంజిత అడిగింది..
"ఏం జరిగిందా? నన్ను మేల్కొనేలా చేశాడు. మరుగున పడిపోయిన గతాన్ని కళ్ళముందు నిజంలా చూపించాడు. ఇదిగో ఏం రాశాడో చదువుతాను. విను:-
“మొత్తం 10 సెంట్ల స్థలంలో 5 సెంట్లులో ఇల్లు నిర్మించబడి ఉంది. ఇంటి చుట్టూ ప్రహార ఉంది. వాస్తుకనుగుణంగా నిర్మించియుంది. తూర్పున మన సంస్కృతిని ప్రతిబింబించేలా, పూజా కార్యాల్లొకి ఉపయోగించే కొబ్బరి చెట్లు ముచ్చటగా మూడు కలవు. పడమరాన ఆరోగ్యానికి మేలుచేసే నేరేడు పళ్ళ చెట్టు, ఉత్తరాన ఇంటి ముఖద్వారం, దాని ప్రక్కనే అంటిపెట్టుకొని అలంకరించబడ్డ మొక్కలు ఇంటికి శోభానందిస్తుంటాయి. దక్షిణాన రెండు మామిడి చెట్లు, ఒక ఉసిరి చెట్టు, అరటి చెట్లు, బొప్పాయి చెట్లు, సపోటా చెట్టు, నారింజ చెట్టు, జామ చెట్టు, కరివేపాకు చెట్లు ఇంకా చాలానే ఉన్నాయి. పొరుగు రాష్ట్రం నుండి తెచ్చి నాటిన మేలైన రకం పూల మొక్కలు కుండీలలో పెరుగుతూ తళతళమంటూ మెరుస్తుంటాయి. ఇవన్నీ ఇంటిని కొన్నవారికే సొంతమవుతాయి. 
        అటాచ్డ్ బాత్ రూమ్ లతోపాటు అదనంగా ఒక బాత్రూం కలదు. వాయువ్యం దిక్కున బావి, మోటారుతో పాటుగా  ఆగ్నేయం దిక్కున పూజ, వంట గది కలవు. వేటికి ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తదు. పూజలు చేసుకోవాలి అనుకునేవారికి తులసికోట కలదు. క్లుప్తంగా ఇంటిలో రెండు బెడ్ రూమ్ లు, ఒక గ్రిల్ రూమ్, బంధువులు ఎవరైనా అకస్మాత్తుగా వచ్చిన ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒక ఆతిధ్య గది, పెద్ద వరండా, డాబాపైన సంరక్షించబడ్డ రేకులు ఉన్నాయి. గ్రిల్ కు ఎదురుగానున్న వరండాలో కుర్చీలో కూచొని ప్రకృతిని ఆస్వాదిస్తుంటే - గతం కనుమరుగై వర్తమానంలోనే భవిష్యత్ ఇంకెంత బాగుంటుందో అనిపించేలా తలపిస్తూ పిల్లగాలులు ఊహాలోకంలో విహరింపజేస్తాయి. 
        ఇంటికి కుడివైపున కిరాణా షాపులు, ఎడమ వైపున మెడికల్ షాపులు ఉన్నాయి. ఎంత అత్యవసరమైనా ఇబ్బందులు తలెత్తవ్. అదే పల్లెల్లో అయితే ఈ ఇబ్బందులను ఎదుర్కోవడం కష్టమే. మొత్తంగా ఇదో వేదభూమి అని గట్టిగా చెప్పగలం. మంచి తరుణం మించినా దొరకదంటారు. అది ఇదే! మనిషనే వాడికి ఆలోచనా బుద్ధి ఏదో మూల ఉంటుంది. దానికి ఒకసారి పనిచెప్పి స్వర్గాన్ని స్వంతం చేసుకోండి. ఇవి ఇంటి గురించి కొన్ని సంగతులే. ప్రత్యక్షంగా చూస్తే మరిన్ని ప్రత్యేకతలు తెలుస్తాయి. వివరాలకు సంప్రదించండి ...”
          ఇదీ వాడు రాసింది. చూశావా! మనింటికి ఇన్ని సంగతులున్న విషయంమనం కూడా గ్రహించలేదు. వాడు మనసుపెట్టి ఒకటికి రెండుసార్లు చదివి అర్ధం చేసుకోమని ఎందుకు చెప్పాడో అర్ధమైంది.ఈ స్వర్గాన్ని వదిలేళ్లి ఇంకో స్వర్గం నిర్మిద్దామనుకుంటే అది మన అవివేకమే అవుతుంది. ఒకటికి రెండుసార్లు చదివాక ఆ సంగతి అర్ధమై కనువిప్పు కలిగింది. నా స్వర్గాన్ని వదులుకోదలచుకోలేదు. స్వర్గమంటే అదెక్కడో ఉండదు రంజిత. నిర్మలమైన మనస్సుతో మనకున్న సౌకర్యాలలో సంతృప్తిగా బతికే జీవితమే స్వర్గమని తెలుసుకున్నాను.
         ప్రాధమిక హక్కులు ఆరు. సొంతింటి నిర్మాణం ప్రాధమిక హక్కు కాకపోయినా సుప్రీం కోర్టు దాని పరిధిలోకి తీసుకొచ్చి చట్టబద్ధత ఎందుకు చేసిందో ఇప్పుడే అర్ధమవుతుంది. కానీ మనమే, అవసరాల కోసమని మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ స్వర్గం లాంటి ఇంటిని వదులుకోవడానికి సిద్ధ పడుతున్నాం. ఆలోచిస్తే వేరే మార్గం దొరక్కపోదు. అలా చెయ్యకే ఇబ్బందులు పడుతున్నాం. నా లాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు. ఒకసారి భూదేవి దూరమైతే, ఈ రోజుల్లో మళ్ళీ మనకు అది దరిచేరదని గోవర్ధన్ సౌమ్యంగా వివరించాడు.
        అందుకే దీనిని నేను వదులుకోను. నా స్వర్గాన్ని వేరే వాళ్ళ సొంతం కాకుండా ఇంకా తీర్చుదిద్దుకుంటాను. ఇంత ప్రకృతి తోడంటే, సంతోష పెడుతుంటే శేష జీవితలో బోర్ ఫీలయ్యే పరిస్థితి దూరమవుతుందిలే.." అంటూ నయనానందం జడిలో పొంగిపోతున్నాడు. స్నేహితుడు గోవర్ధన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. గార్డెన్ లోనున్న మొక్కలకు నీళ్ళు పెట్టడానికి వెళ్తున్న భర్తను చూసి భార్య సంతోష పడింది – తన కోరిక గెలిచినందుకు...!!!
......:- సమాప్తం-:......

No comments:

Post a Comment

Pages