సుబ్బుమామయ్య కబుర్లు! - అచ్చంగా తెలుగు

సుబ్బుమామయ్య కబుర్లు!

 స్నేహం


పిల్లలూ..స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం అన్న పాట మీరు విన్నారా? రక్తసంబంధం లేకుండా మన మంచిని కోరుతూ ఒక్క సుఖాల్లోనే కాదు కష్టంలోనూ మేమున్నామని తోడుండేవాళ్లే స్నేహితులంటే! పురాణకాలం నుంచీ కూడా స్నేహానికి ఎంతో విలువుందర్రా! సుదాముడు శ్రీ కృష్ణుల స్నేహం, సుగ్రీవునితో శ్రీరాముడి చెలిమి ఉదాహరణగా చెప్పుకుంటాం.
ఒక్క మనుషుల మధ్యే కాదు రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కూడా స్నేహం ఉంటుంది. పరవస్తు చిన్నయ సూరి గారు మిత్రలాభం, మిత్రబేధం అంటూ స్నేహం వల్ల కలిగే లాభాలు జరిగే నష్టాలు చక్కగా కథల రూపంలో చెప్పారర్రా. అమ్మనడిగి ఆ పుస్తకాలు చదవండి. లేదా నెట్ లో చూడండి.
మనం అందరితో సఖ్యంగా ఉంటాం..కానీ..మంచివాళ్లను, మన అభిరుచులతో కలిసే అభిరుచులు ఉన్నవాళ్లను మాత్రమే స్నేహితులుగా ఎంచుకుంటాం. ఒకసారి స్నేహితులయి కొన్నాళ్లు, కొన్నేళ్లు స్నేహం చేశాక ఏవైనా కారణాలవల్ల విడిపోతే ఎంతో బాధగా ఉంటుంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు.  ఒకే మాట, ఒకే ప్రాణం అన్నట్టుగా ఉండాలి.
స్నేహితుల ముసుగులో కొంతమంది దుష్టులు కూడా ఉంటారర్రోయ్. వాళ్ల వల్ల చెడ్డ పేరు వస్తుంది. ఇబ్బందులూ వస్తాయి. అందుచేత స్నేహానికి మంచి వాళ్లనే ఎంపిక చేసుకోవాలి. వాళ్ల ప్రవర్తన, నడవడిక మనకు వాళ్ల గురించి అంచనా వేసేందుకు సహాయం చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరినీ శ్రద్ధగా గమనించాలి.
స్నేహం నిలుపుకోవడానికి కొన్ని సూత్రాలు!

  1. స్నేహితులు ఒకరిపై మరొకరు నమ్మకం కలిగి ఉండాలి
  2. ఒకరి బలహీనతలను మరొకరు వెక్కిరించకూడదు
  3. చిన్న చిన్న విషయాలకు మాటలనుకోవడం, పోట్లాడుకోవడం చేయకూడదు
  4. ఒకరిపై మరొకరు ఇతరులకు చాడీలు చెప్పకూడదు.
  5. అబద్ధాలు చెప్పుకోకూడదు
  6. ఒకరి అవసరానికి మరొకరు ఆదుకోవాలి
  7. ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు
  8. ఇద్దరి మధ్యా ‘ఇది..నాదీ, అది..నీది’ అనే భావం కలగకూడదు
  9. ఏది తిన్నా పంచుకు తినాలి
  10. ఇచ్చిపుచ్చుకునే ధోరణి కలిగి ఉండాలి
పిల్లలూ! భగవంతుడు మనకిచ్చిన వరం స్నేహమర్రా! మీరు మంచి వాళ్లను ఎంచుకుని చక్కగా స్నేహం చేయండి. మీ స్నేహం పదిమందికి ఆదర్శంగా ఉండాలి.
వచ్చే మాసం  సినిమాల గురించి మాట్లాడుకుందాం, సరేనా? ఉంటాను మరి!
మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
****

No comments:

Post a Comment

Pages