పండుతాటికల్లు - అచ్చంగా తెలుగు

పండుతాటికల్లు

Share This

పండుతాటికల్లు

కృష్ణ మణి



గుల్ఫారం దంచి
లొట్లు నిమ్పిండు గౌండ్ల రాజన్న
అట్ల నింపిండో లేడో
గప్పుడే దిగిన్రు
ఎల్లిగాడు మల్లిగాడు
పెడ్లాం పిల్లలను
గాలిదేవునికి గిరివిబెట్టిండు ఎల్లిగాడు
పెండ్లికానక
దుకాన్లనే ముంతతోని సంసారం జేస్తుండు మల్లిగాడు
మాటలు జూస్తే
మూటలు నిండుతయి
బతికిశెడ్డ దొరలమని
గాలిల కోటలు కడ్తరు సొక్కమైనోళ్ళు
శింపిరి గడ్డం మాశిన బట్టల కశీరు దూలాలు
ఎల్లిగాని నొసలుకు
సూరెండ గుచ్చితే అర్దమయ్యింది
అద్దుమరాతిరి ఇల్లు జేరింది
బరిగడుపున తిందామంటే
పెండ్లాం సదువుడికీ ఎక్కడలేని రోషం
పిల్లలు జూస్తుండంగ
తల్లి ఈపు అట్టలు దేలినయి
ముద్దు జెద్దామంటే
గూట్లపిట్టలోలె బెదురుతరు పొరలు
ఎవడు జెప్పిన తిప్పలురా ఎల్లిగా
ఏం బతుకురా నీది
బతికినా సచ్చినా
లెక్కలకు రాని పురుగువి
అని నాయినమ్మ కలకలానవట్టే
మన్సు మర్లి
సంసారం చింత జెయ్యవట్టే బుద్ధిమంతుడు
అంతల్నే వొచ్చిండు మాయల మల్లిగాడు
ఓ ఎల్లన్నో ... ఏం సుఖమే నీదో
రాతిరి ఒదినే పండనియ్యలేదా ఏందని పరాచకం
ఎల్లిగాని పెడ్లాం పన్లు పటపటాని కొర్కవట్టింది
జెంగిలి బాడ్కావ్ అనుకుంటా
పెండ్లి జేస్కొని కాలవడరాదురా మల్లిగా
అని ముసలమ్మ సాపెన
మా అన్నని జూస్తలేమే పెద్ద నాయనమ్మ
ఏగుతుంది సాలదా
ఇంక నాకెందుకే అని
ఎల్లిగాని చెవిల జొర్రీగ గుయ్యిమనట్లు
ఓ ఎల్లన్న
ఎల్లే జల్ది
పండుతాటికల్లు తెచ్చిండు జంగన్న
అని మెల్లంగ గెల్కిండు
ఇంకేంది నాల్కె జివ్వుమని
ఇంట్ల నిలవదనియ్యద్
దీని బర్రె మొకం ముండది ఇదొకటి నా పానానికని
అంగేసుకుంటా సరసరా ఆకిలి దాటి
ఉయ్యాల ఊగినట్లు ఉర్కవట్టే
సిగ్గు శరం లేనొడు ఏంజెప్పాలె
****

No comments:

Post a Comment

Pages