సోమిదేవమ్మ వీలునామా - అచ్చంగా తెలుగు

సోమిదేవమ్మ వీలునామా

Share This
 

సోమిదేవమ్మ వీలునామా

కంభంపాటి రవీంద్ర



ఉదయం ఎనిమిదవుతూంది, సోమిదేవమ్మ గారు పూజాదికాలు ముగించుకుని పెరటివైపున్న అరుగు మీదకొచ్చేసరికి రెండు చేతులతో తరవాణి అన్నం కలుపుకొని తినేస్తున్న కిట్టిగాడు కనిపించాడు. 'ఓరోరి ఎంత ఆకలిగా ఉంటే మటుకు రెండు చేతులతో అన్నం కలిపేసుకోవాలా? నేను కలిపి తినిపిస్తానుండు' అంటూ ఆ మడి బట్టలతోనే కిట్టిగాడు దగ్గరకెళ్ళి కూర్చున్నారు.
దూరంగా కూర్చుని తిరగలి మీద మినుములు ఆడుతున్న చిట్టితల్లి పరుగెత్తుకొచ్చి 'అయ్యో! మడిగట్టుకునున్నారు.. మీకెందుకుమ్మా' అంటూ వస్తే 'చాల్లేవే.. చంటిపిల్లాడి దగ్గర మడేమిటి.. నీ పని చూసుకో.. నేను వీడికి తినిపిస్తాను' అంటూ కిట్టిగాడిని ఒళ్ళో కూచోబెట్టుకుని ఆ తరవాణి అన్నం తినిపిస్తున్నారు సోమిదేవమ్మ గారు.
'మా ఇద్దరికీ పెసరెట్లేయవే 'అన్నారు చిట్టితల్లి తో. గబగబా కుంపటెలిగించి, పెనం పెట్టి చిట్టితల్లి పెసరెట్లేయడం మొదలెట్టింది. ఏదో బొబ్బట్లేసినట్టు తన అరచేతిలో పిండిని అటూ ఇటూ చేసి చిన్న చిన్న పెసరెట్లేసింది చిట్టితల్లి. అవి తింటూ' మీ అమ్మ ఇలా చిట్టి పెసరేట్లేస్తుందని ఊహించే తనకి చిట్టితల్లి అని పేరెట్టుంటార్రా' అని కిట్టిగాడితో అంది సోమిదేవమ్మ గారు
పెద్ద పోస్టాఫీసు పక్క వీధిలో సోమిదేవమ్మ గారిల్లు తెలీనివారుండరు. మూడు వాటాలుగా ఉన్న పెంకుటిల్లది, ఇంటికి రెండింతలుండే పెరడు, ఆ పెరట్లో లేని పాదూ, చెట్లు లేవు. అసలా ఇంట్లో అద్దెకు దిగినవారికి కూరలు కొనుక్కనే అవసరం పడేదికాదు, అన్ని రకాల కూరగాయలు ఆ ఇంట్లోనే పండేవి. ఎవరింట్లోనూ లేనన్ని కనకాంబరాల మొక్కలు ఆవిడింట్లో ఉండేవి, దాంతో ఆవిణ్ణి కనకాంబరాల మామ్మగారు అని పిలిచేవారు.
ఓ వాటాలో కాకినాడ టాగూరు కాన్వెంట్ లో టీచరుగా పనిచేస్తున్న సీతాలక్ష్మి వాళ్ళ అమ్మతో కలిసి ఉండేది, ఇంకో వాటాలో తాలుకాఫీసులో ఎల్డీసీగా పనిచేస్తున్న ప్రభాకరరావు గారు, భార్య పిల్లలు ఉంటే మధ్య వాటాలో సోమిదేవమ్మ గారొక్కరూ ఉండేవారు. ఆవిడకున్న ముగ్గురు కొడుకులూ వైజాగు , హైదరాబాద్ లలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇకపోతే ఇంటివెనకున్న పాకలో చిట్టితల్లి తన కొడుకు కిట్టిగాడితో ఉంటూంది.
సోమిదేవమ్మ గారింట్లో పని చేసే చిట్టితల్లి మొగుడు కన్నబాబు లారీ తోలేవాడు, కత్తిపూడి లో ఎవర్నో తగులుకుని పెళ్లాన్ని వదిలేసేడు. మూడేళ్ల కొడుకుతో ఒంటరిదైపోయిన చిట్టితల్లిని సోమిదేవమ్మ గారు చేరదీసి వాళ్ళ పెరట్లో ఉన్న పాకలో ఉండిపొమ్మన్నారు.
చిట్టితల్లి ఉదయం ఐదుకల్లా లేచి ఇల్లూ, పెరడూ శుభ్రం చేసి, సోమిదేవమ్మ గారి ఇంటి పనులు చూసుకుని, కొడుకు కిట్టిగాడిని స్కూలుకంపి మళ్లీ ఏదో పనిలో పడిపోయేది. మధ్యాహ్నం పెరటరుగుమీద కూర్చుని పెరట్లో రాలిపోయిన కొబ్బరి మట్టల్లోంచి ఈనెలు తీసి, చీపుళ్ళు కట్టేది, పెరట్లో పూసిన కనకాంబరాలు కోసి వంద చొప్పున లెక్కగట్టి బజార్లో ఉన్న పూలకొట్లకు అమ్మేది. కొడుకులు ఆవిడకి ఏ డబ్బూ పంపకపోయినా ఇంటద్దెలతోనూ, పువ్వులు, చీపుళ్ళు, కొబ్బరికాయలూ అమ్మగా వచ్చిన డబ్బులతో గడిచిపోయేది. కొడుకులు ఏడాదికోసారొచ్చి పొలంలో పంట తాలూకు డబ్బులు తీసుకునెళ్ళిపోయేవారు. తక్కువ కులానిది, ఆ చిట్టితల్లిని ఇంట్లో పెట్టుకోవడమేగాక వంటింటిదాకా రానిస్తున్నావేమిటని తల్లి మీద అంతెత్తున లేచారు.. 'ఒరే.. పెద్దైన తర్వాత మా ఆశలకనుగుణంగా మీకు గుణకర్, కరుణాకర్, దయాకర్ అనే పేర్లెట్టాము. ఆ పేర్లకు మీకు ఎక్కడా పొంతన లేదు.. నా దృష్టిలో కులం కన్నా గుణం గొప్పదని' బదులిచ్చిందా సోమిదేవమ్మ గారు.
ఆ ఏడాది జూన్ నెలలో ఎప్పుడూ పడనంత వర్షాలొచ్చాయి, చూరు కారుతూండడంతో చిట్టితల్లిని కొడుకుతో సహా వచ్చి తనింట్లో ఉండమని చెప్పారు సోమిదేవమ్మ గారు. ఆ వర్షాల ప్రభావమో ఏమోగానీ ఆవిడకి న్యూమోనియా వచ్చేసింది. కొడుకు కిట్టిగాడిని ఆవిడకి సాయంగా ఉంచి, ఆ వర్షంలో తడుచుకుంటా చర్చి దగ్గరుండే డాక్టరు వీర్రాజు గారింటికెళ్ళి మందులట్టుకొచ్చింది చిట్టితల్లి.
రాత్రంతా ఆవిడ మూలుగుతూంటే చిట్టితల్లి, కిట్టిగాడు ఆవిడకి సపర్యలు చేస్తూ తెలివేసున్నారు. తెచ్చిన మందులు పనిచేయక ఆవిడ ఒళ్లు కాలిపోతూంటే భయమేసిన చిట్టితల్లి పక్కవాటాలోని సీతాలక్ష్మిని తోడు తీసుకుని తాలుకాఫీసు ఎదురుగానున్న ఎస్టీడీ బూతుకెళ్ళి కొడుకులకి ఫోన్ చేయించింది. వాళ్ళు రాకముందే చిట్టితల్లి కొడుకుతో సహా మళ్లీ పాకలోకెళ్ళిపోయింది.
ముగ్గురు కొడుకులూ, కోడళ్ళూ, మనవలూ తర్వాత రోజుకి దిగిపోయారు. వాళ్ళొచ్చేపాటికి సోమిదేవమ్మ గారు స్పృహ లో లేరు. 'మా అమ్మని నీ చేతుల్లో పెడితే నువ్వు చేసిన నిర్వాకం' అంటూ పెద్దాడు గుణకర్ చిట్టితల్లిని కొట్టినంత పనిచేసాడు. మధ్యాహ్నం పూట కొడుకు కిట్టిగాడిని పడుక్కోబెడుతూంటే కరుణాకరూ, అతని భార్య మంజుల ఆ పాకలోకొచ్చేసి మా అమ్మ స్పృహలో లేనప్పుడు తన వస్తువులు కొట్టుకొచ్చేసుంటావంటూ సామానంతా వెదికేసేరు, కిట్టిగాడి బొమ్మల పుస్తకాలతో సహా. మంజుల అంది 'నేను ముందే చెప్పాను కదండీ.. ఇది పేద్ద దొంగముండని.. కొట్టుకొచ్చినవి ఎవరింట్లోనో దాచేసుకునో అమ్మేసుకునో ఉంటుంది'. అక్కడేమీ దొరక్కపోయేసరికి చిట్టితల్లిని తిట్టుకుంటా ఇద్దరూ వట్టి చేతులతో తిరిగెళ్ళిపోయారు.
మర్నాడు ఉదయం సోమిదేవమ్మ గారు స్పృహలోకొచ్చారు, ఓసారి చిట్టితల్లినీ, కిట్టిగాడినీ పిలవమని, వాళ్ళు రాగానే చిన్నగా నవ్వి, పెద్ద కొడుకు గుణకర్ కి ఏదో చెబుతారని ప్రయత్నిస్తూ కనుమూశారు .
ఆవిడ పోయిన మూడోరోజున మూడో కోడలు కవిత మొదలెట్టింది 'పెద్దావిడ ఆస్తుల విషయం ఏమీ చెప్పకుండానే పోయారు'
పెద్ద కొడుకు గుణకర్ అన్నాడు 'మా అమ్మ ఖచ్చితంగా విల్లు రాసేవుంటుంది.. అందుకే ఈ చిట్టితల్లిని, దాని కొడుకునీ పోయేముందు పిలిచింది.. వాళ్ళని పిలిపించి అడుగుదాం'
చిట్టితల్లి ఆస్తి సంగతులు తమకేమీ చెప్పలేదంది. ఆ రోజంతా తల్లినీ కొడుకునీ అక్కడే నిలబెట్టి నానాతిట్లూ తిట్టి చివరికి పోలీసు కేసెడతామని బెదిరించినా ఇద్దరూ కూడా మాకు తెలీదన్నారు.
ఆ రాత్రి చిట్టితల్లి కొడుకుని పడుక్కోబెడుతూంటే పాకకున్న కఱ్ఱ తలుపు కిర్రున చప్పుడైంది. మూడో కొడుకు దయాకర్ పిల్లిలా నడుచుకుంటూ వచ్చాడు. 'నిన్ను చూస్తే చాలా జాలేస్తూంది.. మా అన్నయ్యలు నిన్నీ పాకలోంచి గెంటెయ్యాలని చూస్తున్నారు.. నేను చెప్పినా వినరు.. నువ్వా చిన్నదానివి.. ఎక్కడికి పోతావు? నువ్వొప్పుకుంటే నీకోసం వేరే ఇల్లు తీసుకుని అప్పుడప్పుడూ వచ్చిపోతుంటా.. ఏవంటావ' న్నాడు.
'ఆ తల్లి మీరు ముగ్గురూ నాకు తోడబుట్టినోళ్ళతో సమానమని సెప్పేది.. కానీ ఆయమ్మకి మీరు తోడేళ్ళంటోళ్ళని తెలీదు.. అందరూ దీన్ని లంకంత ఇల్లనేవోరు.. ఇప్పుడు లంకలాటి కొంప అయిపోనాది.. మీరూ మీ అన్నలూ ఆస్తి కాయితాలు దొరుకుతాయేమో ఈ పాకంతా తవ్వి వెతుక్కోండని' కొడుకుని నడిపించుకుంటా అలా చీకట్లో కలిసిపోయింది.
మర్నాడు ఉదయం సీతాలక్ష్మి కాకినాడెళ్ళే బస్సెక్కడానికి బస్టాండుకెళ్ళేసరికి అక్కడున్న కాఫీ హోటల్లో గిన్నెలు కడుగుతా చిట్టితల్లి కనిపించింది.
వాళ్ళ స్కూల్లో మాటాడి చిట్టితల్లికి ఆయా పనిప్పించి కిట్టిగాడిని కూడా అదే స్కూల్లో చేర్చింది.
దశదిన కర్మలూ కానిచ్చి ఇంట్లో సామాన్లు అన్నీ అమ్మేసుకున్నారు సోమిదేవమ్మ గారి కొడుకులు. ఇల్లంతా వెదికినా భోషాణం తాళం దొరకలేదు, చివరకి దాన్ని బద్దలుగొట్టించి చూస్తే స్టీలు సామాన్లు, ఇత్తడి డెయిసాలు కనిపించాయి తప్పితే ఆస్తి కాయితాలు మటుకు దొరకలేదు. దీంతో ఆస్తిని ఎలా విడగొట్టి స్వాధీనం చేసుకోవాలా అని చిన్నప్పటినుంచి తెలిసిన లాయరు ద్విభాష్యం లక్ష్మణరావు గారింటికెళ్తే ఆయన మూడు నెలల క్రితమే వాళ్ళబ్బాయిని చూడ్డానికి లండన్ వెళ్లారని రెండు నెలల తర్వాత వస్తారని తెలిసింది. 'సరే ఎలాగా మూడు నెలల తర్వాత దసరాలకి పంట డబ్బులు కోసం రావాలి కదా.. అప్పుడు అందరం వచ్చి లాయరు గారితో మాటాడదాం' అన్నాడు పెద్దాడు గుణకర్. తమ్ముళ్ళిద్దరూ ఒప్పుకున్నారు.
కాకినాడకి మకాం మార్చిన తర్వాత చిట్టెమ్మ ఉదయాన్నే తన పాక ముందు పెనం అవీ పెట్టుకుని రెండు బల్లలేసి తన కొడుక్కు వేసిపెట్టే చిన్న పెసరట్లేసేది. ఉదయం ఏడింటికి మొదలెట్టి ఠంచనుగా ఎనిమిదిన్నరకి ఆపేసి కిట్టిగాడిని తీసుకుని స్కూలుకెళ్ళిపోయేది. ఆ గంటన్నర లో వేసే ఆ చిట్టి పెసరట్ల కోసం జనాలెగబడిపోయి ఉదయం ఆరింటినుంచే లైను కట్టేస్తున్నారు.
దసరాలొచ్చేయి... సోమిదేవమ్మ గారి పిల్లలు కుటుంబాలతో సహా పిఠాపురం లో దిగిపోయారు. లాయరు లక్ష్మణరావు గారిని కలిస్తే ఆయన 'చాలా బాధేసిందయ్యా.. మీ అమ్మ గారు పోయారని తెలిసిన తర్వాత ఏడుపొచ్చేసిందనుకోండి.. మీకో విషయం చెప్పాలి.. మీ అమ్మ గారు మీ ముగ్గురి పేర్నా వీలునామా రాసేరు, ఆవిడ పోయే టైము కి లండన్లో ఉన్నాను కదా.. మీకేమైనా ఇబ్బంది కలిగుంటే క్షమించాలి మరి! .. పండగ తర్వాత రోజు కలవండి, చదివి వినిపిస్తాను.. ఇంట్లో పండక్కి కూతురూ అల్లుడూ వచ్చేరు.. ఆళ్ళోతో కొద్దిగా బిజీ.. ఏమనుకోకండేం' అని చెప్పి పంపేసారాయన
పండగయ్యేదాకా ఆగాలా అని ఉసూరుమనుకున్నా, అమ్మ ఆస్తులు మన పేర రాసింది అనుకుంటా సంతోషించారు.
ఏకాదశి రోజున ముగ్గురు పిల్లలు కుటుంబాలతో లక్ష్మణరావు గారింటికెల్తే ఆయన సోమిదేవమ్మ గారి వీలునామా చదివి వినిపించారు 'పొలం పన్నెండెకరాలూ ముగ్గురికీ సమానంగా పంచడమైంది, ఇల్లు మొదటి వాటా పెద్దాడి కీ, మధ్య వాటా రెండో వాడికీ, మూడో వాటా చిన్నాడికీ ఇవ్వాలి. పాక, పెరడూ నాకు తోడుగా ఉన్న చిట్టితల్లికి చెందుతాయి' అని చదివేరు
'అమ్మో అమ్మో.. అత్తయ్య గారిని మాయచేసి దొంగ ముండ పాకా, పెరడూ రెండూ నొక్కేసింది.. దానికీ ఆస్తి వస్తుందని తెలిసే ఇంట్లో పూచిక పుల్ల కూడా తీసుకోకుండా కొడుకుతో దర్జాగా వెళ్ళిపోయిందా పింజారీ ' అంటూ ఏడుపందుకుంది మూడో కోడలు కవిత.
' ఆ బూతులాపి పూర్తిగా వినవమ్మా.. ఏమిటీ.. ఇంట్లోంచెళ్ళిపోయిందా!! చాలా పెద్ద చిక్కే ఇప్పుడు.. ఈ వీలునామా చదివే రోజుకి చిట్టితల్లిని ఆ పాకలో ఉండనిస్తేనే ఇప్పటిదాకా చదివినవన్నీ వర్తిస్తాయి.. లేని పక్షంలో ఆ పాక మీ ముగ్గురూ పంచుకోవాలనీ మిగతా ఆస్తంతా చిట్టితల్లికి చెందాలనీ సోమిదేవమ్మ గారు రాశారు.. ఎంతైనా మీ తల్లి గారు దేవత' అని పైకి చూసి దణ్ణం పెట్టుకున్నారు లాయరు లక్ష్మణరావు గారు!
***

No comments:

Post a Comment

Pages