మను చరిత్రము -2 - అచ్చంగా తెలుగు

ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య ప్రణీత -మను చరిత్రము -2 (కళా ఖండానికి ఒక పామరుడి ప్రశంస)

బాలాంత్రపు వేంకట రమణ



 ప్రవరుడు వరూధినిని అలా తిరస్కరించి వెళ్ళాకా, ఆమె భరించలేని విరహవేదన పాలయింది.  ఆమె చెలికత్తెలు ఆమెకి  ఉపశమనం కలిగించడానికి శతవిధాలా ప్రయత్నించారుగానీ ఉపయోగం  లేకపోయింది.  ఆమెకి విచారం పొంగి పొంగి పొరలసాగింది.
ఇలా ఉండగా,  అంతకుపూర్వం వరూధినిని మోహించి ఆమెచే  తిరస్కృతుడైన ఒక గంధర్వుడున్నాడు.  అతడు, ప్రవరుడు-వరూధినీల మధ్య జరిగిన ప్రహసనాన్నంతా గమనించాడు.  వరూధిని విరహాన్నంతా తిలకించాడు.
అతడు కామరూపవిద్యాప్రభావంతో ప్రవరుడిరూపాన్ని ధరించి, వరూధిని కంటబడ్డాడు.  ఆమె వెంటనే మహోత్కంఠతతో ఆ మాయాప్రవరుడి వద్దకు వెళ్ళి అతిదీనంగా తన కోరికని తీర్చమని ప్రార్థించింది.
గంధర్వుడు కూడా తన చిరకాలవాంఛ నెరవేరుతున్నందుకు మదిలో పరమానందభరితుడై, పైకి మాత్రం బలవంతాన ఆమె కోరికని తీరుస్తున్నట్టు నటిస్తూ, ఆమెకి రెండు  షరతులు విధించాడు.  అవేమిటంటె: ఒకటి, సంభోగసమయంలొ నువ్వు కళ్ళుమూసుకోవాలి. (ఎందుచేతనంటే, మరణసమయంలోనూ, సంభోగసమయంలోనూ కామరూపమహిమతొలగిపోయి, నిజరూపం వచ్చేస్తుందిట - అందుకే గంధర్వుడు ఈ నియమం పెట్టాడు.  "ఇది మాదేశ ఆచారం" అన్నాడు).
ఇక రెండవ షరతు ఏమిటంటే "నేను నిన్ను సమ్మతింపచేసి వెళ్ళేదాకా నువ్వు నన్ను విడువకూడదు" అని.  అతడు తనని అనుగ్రహిస్తే చాలు అదే మహద్భాగ్యం అని భావిస్తున్న వరూధిని ఆ మాయాప్రవరుడి షరతులకి  వెంటనే అంగీకరించేసింది.  ఆ తరవాత వారిరువురూ  చాలాకాలం మన్మథ  సామ్రాజ్యంలో ఓలలాడి సుఖించారు.
కొంతకాలానికి వరూధిని గర్భవతి అయింది. నెలలు నిండాయి.  అయినా ఎంతో ప్రేమతో మాయాప్రవరుడికి సేవలు చేసింది.  మాయాప్రవరుడు ఇకపై తన ఆటలుసాగవని గ్రహించి,  వరూధినికి తన కపటనాటకం తెలిసిపోతే శపిస్తుందని  ఎలాగో ఆమెను ఒప్పించి  చల్లగా తన దారిన తాను జారుకున్నాడు.
పాపం వరూధిని తనతో ఇన్నాళ్ళూ కాపురం చేసింది ప్రవరాఖ్యుడే అన్న భ్రమలోనే ఉండిపోయింది.
***
నవమాసాలు నిండిన పిమ్మట వరూధిని ఒక శుభముహూర్తాన ఒక చక్కని కుమారుణ్ణి కన్నది.  మునులు ఆ బాలుడికి జాతక కర్మ నిర్వహించి అతడు సూర్యచంద్రులలాగా ప్రకాశిస్తూ ఉండటంచేత అతనికి "స్వరోచి" అని నామకరణం చేశారు.  యుక్తవయసులో అక్షరాభాసం చేసి సకలవిద్యలూ ఉపదేశించారు.  స్వరోచి యౌవనవంతుడై, మహావీరుడై మందరగిరిమీద విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన నగరాన్ని, ఆటవికులందరూ భయభక్తులతో కొలుస్తూ ఉండగా రాజ్యం ఏలసాగాడు.
ఒకనాడు స్వరోచి వేటకి వెళ్ళాడు. అక్కడ అతను పరిజనులతో  కలిసి, తనివి తీరా కౄరమృగాలని వేటాడి వినోదిస్తూ ఉండగా, ముందుగా కొన్ని అపశకునాలూ, తదుపరి శుభశకునాలూ కనిపించాయి.  స్వరోచి "ముందు ఏదో మహాయుద్ధం జరిగి ఆ తరవాత శుభమయ్యేలాగా ఉంది" అనుకుంటూ ఉండగా "అయ్యో, అబలని, రక్షించండి! రక్షించండి!!" అన్న ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది.
వెంటనే స్వరోచి ఆ ఆర్తనాదం వినిపించిన దిక్కుగా తన పంచకల్యాణిని ఉరికించాడు.  అటునుంచి ఒక దివ్యమైన సుందరి భయంతో కంపించిపోతూ అతనికి ఎదురై "ఓ రాజా! నన్ను రక్షించు.   నేటికి మూడుదినాలుగా ఒక రాక్షసుడు నన్ను వెంబడిస్తున్నాడు.  నేను ఇందీవరాక్షుడు అనే గంధర్వరాజు కుమార్తెను" అని ఇంకా  తన కథని ఇలా వివరించింది.
"ఓ మహావీరా! నా పేరు మనోరమ.  నాకు కళావతి, విభావసి అనే ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు.  ఒకనాడు మేము హిమాలయపర్వతంమీద పువ్వలకోసం వెళ్ళి, అక్కడ ఒక గుహలో ఒక ముసలిముని తపస్సుచేసుకుంటూ ఉండగా చూశాం.  అతడు బూచిలాగా ఉండడం చూసి, బాల్యచాపల్యంతో "ఇతని నోరేది? ఇతని కళ్ళు ఎక్కడున్నాయి? ఇతని చెవులు ఏవి?" అని అతని మొహం పట్టుకుని ఊపాను.  దానితో ఆమునికి తపోభంగమయ్యి, "వయసుమదంచేత ఒళ్ళెరక్క వృద్ధుడనైన నన్నిలా అవమానించావు కనుక నువ్వు రాక్షసుడిబారినపడి ప్రాణభయం పడుదువుగాక" అని శపించాడు.  పైగా నన్ను తన బెత్తంతో చావగొట్టాడు.  అప్పుడు నాచెలికత్తెలు తెగబడి అతనిని మందలించగా, అతను కోపించి వాళ్ళిద్దర్నీ క్షయరోగ పీడితులుకమ్మని శపించాడు.
"ఓ రాజా, ఆ శాపప్రభావంవల్ల మూన్నాళ్ళగా ఒక బ్రహ్మరాక్షసుడు నన్ను కబళిస్తానని వెంటపడుతున్నాడు.  నన్ను రక్షించు.  నేను నీకు 'అస్త్రహృదయం' అనేవిద్యని ప్రసాదిస్తాను.  ఈ విద్యని తొలుత ఈశ్వరునిచే స్వయంభువమనువు, అతనివలన వసి వసిష్ఠమహర్షి, అతనిద్వారా చిత్రాశ్వుడు అనే మా మాతామహుడు, క్రమంగా పొందారు.  ఆయన ఈ విద్యని నా తండ్రికి అరణంగా ఇచ్చాడు.  మా తండ్రి నాకు ప్రసాదించాడు.  ఈ విద్యని ఇప్పుడు నేను నీకు ఉపదేశిస్తాను.   దీని సాయంతో నువ్వు రాక్షసుణ్ణి సంహరించి నన్నుకాపాడు.ఒక స్త్రీవలన విద్యస్వీకరించడానికి సందేహించకు" అని పలికింది.
స్వరోచి సంతోషించి, శుచియై, మనోరమవద్ద అస్త్రహృదయాన్ని ఉపదేశం పొందాడు.  అటుపిమ్మట స్వరోచి బ్రహ్మరాక్షసుడితో ఘోరమైన యుద్ధం చేసి, చివరగా అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు.  ఆవేటుతో రక్కసుడు నేలకూలాడు.  ఆశ్చర్యకరంగా ఆ  ఘోరదేహంనుండి ఒక దివ్యపురుషుడు ఉధ్భవించాడు.  అతను స్వరోచిని ప్రేమతో కౌగలించుకుని ఇలా అన్నాడు.
"వత్సా, నేను ఇందీవరాక్షుడు అనే గంధర్వరాజుని.  ఈ మనోరమ నా ముద్దుల కుమార్తెయే.  అంతేకాదు, నేను నీ తల్లి వరూధిని కి తమ్ముణ్ణి.  శాపవశాత్తూ నేను బ్రహ్మరాక్షసుడినై చివరికి నా కుమార్తెనే భక్షించడానికి సిద్ధం అయ్యాను.   ఇంతకీ నాకు ఈ శాపం ఎలా వచ్చిందంటే , ఒక మునీశ్వరుడు తన శిష్యులకి ఆయుర్వేదవిద్యని ఉపదేశమిస్తూ ఉండడం చూసి, నేను ఆ మునిని నాకు  కూడా ఆయుర్వేదాన్ని నేర్పమని అడిగాను. అతను అందుకు నిరాకరించాడు.  అప్పుడు నేను అదృశ్యకరణి అనే విద్యాప్రభావంతో, ఎవరికీ కనబడకుండా ఆముని తన శిష్యులకి వైద్యవిద్య    నేర్పుతుండగా ఆ శాస్త్రాన్నంతానేర్చుకున్నాను.  అంతటితో ఆగకుండా,  నిజరూపంతో ఆ మునీశ్వరుడివద్దకి వెళ్ళి "ఓయీ, నాకు విద్యనేర్పమంటే గొణుక్కున్నావు.  ఆసక్తి ఉన్నవారికి విద్య ఎలాగైనా రాకపోతుందా?  సన్నికల్లు దాచేస్తే పెళ్ళి ఆగిపోతుందా?  చూడు, నీకు తెలియకుండానే నీ విద్యనంతా నేర్చేసుకున్నాను" అని అపహాస్యంచేశాను.  దానితో ఆముని మహోగ్రదగ్రుడై నన్ను బ్రహ్మరాక్షసుడవైపోమని శపించాడు.  నేను పశ్చాత్తాపంతో అతని కాళ్ళమీదపడి క్షమాపణకోఱగా ఆయన కనికరించి "కొన్ని దినాలకి నీ కుమార్తెనే మ్రింగబోయి ఒక ధన్యునిశరముల వాత బడి శాపవిముక్తుడ వౌదువుగాని" అని దయ చూపించాడు.
"ఆ ముని శాపం వలన నాకు క్రమక్రమంగా రాక్షసత్వం ప్రాప్తించింది.  నా పౌరలందరినీ మ్రింగేశాను.  ఇరుగుపొరుగు పట్టణాలని కూడ నాశనం చేయడం మొదలుపెట్టాను.  నా మంత్రులు, నా భార్యాపిల్లల్ని నా నుండి దాచేసి నాకు మహోపకారం చేశారు.  చివరికి ఇలా నా ముద్దులకుమార్తెనే కబళింపబోయాను.  నేటికి నీ దయవలన శాపవిముక్తి కలిగింది.  నా కుమార్తెనీ, నేను నేర్చుకున్న ఆయుర్వేదవిద్యనీ గ్రహించి నన్ను ధన్న్యుణ్ణి చెయ్యి" అని వేడుకున్నాడు.  అందుకు స్వరోచి సంతొషంతో అంగీకరించాడు.
ఇంతలో ఇందీవరాక్షుని మంత్రి సామంతాదులందరూ వచ్చి, తమ ప్రభువుని స్వాగతించారు.  ఇందీవరాక్షుడు, స్వరోచి-మనోరమలతో కలిసి తన రాజ్యానికి వెళ్ళి, ఒక శుభముహూర్తంలో మనోరమని స్వరోచికిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు.
శోభనంనాటిరాత్రి మనోరమ అన్యమనస్కంగా ఉండడం చూసి, స్వరోచి కారణం అడిగాడు.  అందుకు ఆమె "ప్రాణనాథా, అక్కడ అడవిలో నా ప్రియతమ చెలికత్తెలిద్దరూ దుర్భరమైన  క్షయరోగంతో బాధ పడుతూంటే, ఇక్కడ నేను నీతో సుఖాలెలా  అనుభవించగలను?" అని దుఃఖంతో పలికింది.  వెంటనే స్వరోచి మనోరమతో కలిసి, అరణానికి వెళ్ళి, ఇందీవరాక్షుడివద్ద నేర్చుకున్న ఆయుర్వేదవిద్యా ప్రభావంతో, కళావతి, విభావసి అనే వారిరువురికీ  చికిత్సచేసి, వాళ్ళని సంపూర్ణ అరోగ్యవంతురాళ్ళగా చేశాడు.  దానితో ఆ ఇరువురు కన్యలూ తమ పూర్వపు సౌందర్యాన్ని తిరిగి పొంది, తమ దగ్గఱ వున్న దివ్య గంధర్వ విద్యల్ని అతనికి ఇచ్చి, తమని కూడా పరిణయమాడమని కోరారు.  స్వరోచి మనోరమ సమ్మతితో  వాళ్ళిద్దరినీ పెళ్ళిచేసుకున్నాడు.
స్వరోచి అటుపిమ్మట తన ముగ్గురు భార్యలతో చాలా కాలం సర్వ సుఖాలనీ అనుభవించాడు.
ఒకనాడు స్వరోచి వేటకి వెళ్ళి, అక్కడ ఒక అడవి పందిని చంపబోగా, ఒక ఆడులేడి ఎదుటికివచ్చి "రాజా, దానిని చంపకు దాని వలన నీకు ప్రయోజనం లేదు. నన్ను చంపు" అని మనుష్యభాషలో పలికింది. స్వరోచి ఆశ్చర్యచకితుడై "నేను నిన్ను ఎందుకు చంపాలి?" అని అడిగాడు.  అప్పుడు ఆ లేడి "ఇతర అంగనలతో సుఖిస్తున్న వానిని కోరడం కన్నా, చావడమే మేలు కదా!" అంది.  "నువ్వు ఎవరిని మోహించావు?" అని అడిగాడు.  "నిన్నే!" అంది లేడి.
స్వరోచి విభ్రాంతుడై "నేను మానవుడిని, నువ్వు మృగానివి.  అదెలా సాద్యం?" అని అడిగాడు.  అంతట ఆ లేడి "నువ్వు నన్ను కౌగలించుకో, అదే చాలు" అంది.  స్వరోచి ఆ లేడిని కౌగిలించుకోగానే, ఆ లేడి ఒక అధ్బుతసౌందర్యవతియై అతని ఎదుట నిలిచింది.  అతనితో "ఓ రాజా! నేను ఈ వనదేవతని.  సమస్తదేవతలూ నీవలన మనువుని కనాలి అని నన్ను ప్రార్థించగా, ఇలా వచ్చాను.  నువ్వు అదృష్టవంతుడివి.  నన్ను అంగీకరించు"  అని చెప్పింది.  స్వరోచి పరమానంద భరితుడై, మిగతా ముగ్గురి భార్యల అంగీకారంతో, ఆమెని స్వీకరించాడు.
***
కొన్నిదినాలకి ఆ వనదేవత గర్భంధరించి, నవమాసాలు నిండిన పిదప ఒక చక్కని కుమారుణ్ణి కన్నది.  అతనికి "స్వారోచిషుడు" అని నామకరణంచేశారు.  అతడు సకల సద్గుణసంపన్నుడై, సమస్తవిద్యలనీ అభ్యసించి, యుక్తవయసులోనే శ్రీ మహావిష్ణువు గుఱించి ఘోర తపస్సు చేశాడు.  శ్రీ హరి ప్రసన్నుడయ్యడు.  స్వారోచిషుడు అనేక విధాల శ్రీమన్నారాయణుని స్థుతించి, మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు.  అందుకు ఆ భక్తజనావనుడు "నువ్వు కోరినట్ట్లే మోక్షం ఇస్తాను.  కానీ కొంతకాలం ద్వితీయ  మనువువై భూమిని పాలించి, నీతినీ, ధర్మాన్నీ చక్కగా ధరలో నెలకొల్పు" అని ఆనతినిచ్చాడు.
స్వారోచిషుడు దామోదరుని ఆఙ్ఞ ప్రకారం రెండవ మనువై సకల ధరామండలాన్నీ పాలించాడు. ధర్మసంస్థాపన చేశాడు. అతని పాలనలో సమయానికి వానలు కురిశాయి.  పంటలు పుష్కలంగా పండాయి.  ప్రజలు సంతానవంతులై, భోగ భాగ్య సంపదలతో సంపూర్ణాయుస్కులై జీవించారు.  అగ్నివల్లా, చోరులవల్లా భయంలేకుండెను.  వ్యాధులు లేకుండెను.  పళ్ళు, పాలు,  సుగంధద్రవ్యాలూ, పుష్పాలూ సమృద్ధిగా లభించాయి. ప్రజలు ఈతి బాధలు, అకాలమరణాలు లేకుండా తామరతంపరలుగా వృద్ధిచెందారు.
ఫలశ్రుతి.
ఈ స్వారోచిషమనుచరిత్రమును  కోరికతో విన్నా, వ్రాసినా, చదివినా, ధనధాన్య-అరోగ్యాదులు కలిగి సంతానవంతులై, పిదప నిశ్చయంగా దేవత్వాన్ని పొందుదురు.
పూర్వం మార్కండేయుడు ప్రియశిష్యుడైన క్రోష్టి అనే మునికి చెప్పిన ఈ పుణ్యచరిత్రను పక్షులు జైమినికి చెప్పాయి.
ఇదీ "స్వరోచిషమనుసంభవం" యొక్క కథాసంగ్రహము..
       ---

No comments:

Post a Comment

Pages