గోదావరి నుంచి సబర్మతి వరకు - 10 - అచ్చంగా తెలుగు

గోదావరి నుంచి సబర్మతి వరకు - 10

Share This

గోదావరి నుంచి సబర్మతి వరకు - 10

 -అవని



(జరిగిన కధ : ఖమ్మం నుంచి  అహ్మదాబాద్ కు వెళ్ళే నవజీవన్ ఎక్ష్ప్రెస్ లో ప్రయాణిస్తూ గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది ప్రణవి. కాకతీయ యూనివర్సిటీ లో గణిత శాస్త్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటుంది ఆమె. ఆహ్మేదాబాద్ లో జరగనున్న జాతీయ శాస్త్ర, సాంకేతిక సదస్సులో పాల్గొనేందుకు ఆమె అక్కడకు వెళ్తూ ఉంటుంది. భారతదేశంలోని ప్రముఖ గణిత శాస్త్రవేత్తల్లో ఒకడు కృష్ణమోహన్. వాళ్ళ ఇంటికే ప్రణవి వెళ్తుంది. కృష్ణమోహన్ భార్య గాయత్రి, తల్లి వేదవతి. వేదవతి గారు అడగ్గా, తన గురించి చెప్తూ ఉంటుంది ప్రణవి. ఆమెకు పెళ్లై ఒక బాబు ఉంటాడు. కాని, భర్త మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కృష్ణ ను ఎలా కలిసానో ఆమె గుర్తుచేసుకుంటుంది. వారిద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. అనుకోకుండా వేదవతి గారు అనారోగ్యంతో చనిపోవడం, భార్య, ప్రణవి తనను ఒదిలి వెళ్లిపోవడంతో ఒంటరి వాడైపోతాడు కృష్ణ. ప్రణవి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం అతనిలో కొత్త శక్తిని నింపుతుంది. ఇక చదవండి.)
ఆశ్చర్యపోవడం తన వంతయింది కృష్ణకి..
వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టువుంది..
ఎదురుగా ప్రణవిని అలా చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు.
అదే ప్రశాంతత..అందాల గోదారిని చూసినట్టు,వేణుగానం విని మైమరచినట్టు ఏదో తెలియని ఓ అలౌకికానందం.
ఈలోగా తన దగ్గరికి వచ్చి.." ఎలా వున్నావు..కృష్ణా.." అనే పలకరింపు.
" ప్రణవి నువ్వేంటి ఇక్కడ..నేను వస్తానని నువ్వెలా వూహించావు.." ఆశ్చర్యంగా అడిగాడు.
" తెలియదు కృష్ణా..ఒక మనస్సు మరో మనస్సును కోరుకుంటున్నప్పుడు..ఆ తీరాలు ఇలాగే కలుస్తాయి.ఈ రోజు ఇక్కడ కాలేజిలో ఓ పనుంది.అందుకే ఇలా వచ్చా.బస్సు దిగుతున్న నిన్ను చూసా..అంతే ..నిన్ను చూస్తే నన్ను నేను ఎలా మర్చిపోతానో నీకు తెలుసు కదా..అదో అడ్మిరేషన్‌.."ఆతృతగా చెప్పింది ప్రణవి.
" ఇలా ఎలా మాట్లాడుతున్నావు..ప్రణవి.." కాస్త చిరుకోపంతో అడిగాడు కృష్ణ.
" పద రూంకెళ్ళి రిలాక్స్‌,అయి మాట్లాడుకుందాం." అంది అనునయంగా ప్రణవి.
రూం కెళ్ళి రిలాక్స్‌, అయి ఆ బద్రాద్రి రాముణ్ణి దర్శించుకున్నారు..అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ సుందర గోదావరీ తీరంలో ఓ పక్కగా కూర్చున్నారు.
అసలే శరదృతువు కావడంతో వాతావరణం ఆహ్లాదంగా వుంది.
ప్రణవే చొరవ తీసుకొని మాట్లాడ్డం మొదలెట్టింది.
" నా మీద చాలా కోపంగా వుంది కదూ కృష్ణా నీకు..నా మీద అసహ్యం వేస్తుంది కదూ..ఎన్ని మాటలు,ఎన్ని ఊసులు,ఎంత నమ్మకాన్ని ఇచ్చాను.కానీ ఈ రోజు నేను ఏమాటనీ నిలబెట్టుకోలేకుండా వున్నాను.." అంటూ బావురుమంటూ వస్తున్న దుఖాన్ని ఆపుకోలేక కృష్ణ వళ్ళో వాలిపోయింది.
" ఏంటిది..చిన్నపిల్లలాగ..లే,ప్రణవి ,నేను అంతా అర్ధం చేసుకోగలను..కానీ నేను కూడా ఓ మామూలు మనిషినే కదా.సహజసిద్దమైన బావోద్వేగాలు అంతే.." అన్నాడు.
ప్రణవి కృష్ణని పట్టుకొని ఏడుస్తూనే వుంది.
" బంగారం..ఇది జీవితం..జీవితమనే ఓ చిన్న ప్రయాణంలో కొన్ని అనుభూతులు,మరికొన్ని అనుభవాలు.జననం నుంచి మరణం వరకు జరిగే ప్రయాణంలో పరిచయాలు,అనుబంధాలు,బంధాలు..ఇలా పెనవేసుకుంటాయి..తర్వాత కాలం మారుతుంది.మరో తరం వస్తుంది.మనకి ఇవి జ్నాపకాలుగా వుంటాయి.మనం వున్నంతకాలం మనల్ని జీవితాంతం వెంటాడుతూనే వుంటాయి.
ఏదైనా బంధం దగ్గరయినప్పుడు ఆనందంగా వుంటుంది.కొత్త పరిచయం ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.ఇంకా చెప్పలంటే గడుస్తున్నకొద్దీ తియ్యగా వుంటుంది.అలా బంధం బలపడాలి.తీరం చేరే వరకు కలిసి ప్రయాణం చెయ్యాలి.
అంతే..అంతకన్నా ఇందులో ఏముంది చెప్పు."
ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు కృష్ణ.
ప్రణవి కలగచేసుకుంటూ.." ఎన్నయినా చెప్పు కృష్ణా..నేను నిన్ను వదులుకోలేను.." అంది సన్ననిగొంతుతో.
" నేను వదులుకోమన్నానా..బంగారం..మన బంధాన్ని ఆ భగవంతుడు ఎంతకాలం రాస్తాడో అంతకాలం వుంటుంది.అందులో ఎలాంటి సందేహం లేదు.నువ్వే కదా మాట్లాడ్డం మానేసి వుత్తరం రాసింది..నీ పరిస్తితి నేను అర్ధం చేసుకోగలను.
ఇక నాగురించి అంటావా..రెక్కలు తెగిన విహంగంలా,ఎగిరే పతంగంలా..గ మ్యం తెలియని బాటసారిలా వున్నాను.వర్తమానమే నాది కాదు.ఇక భవిష్యత్‌ గురించి ఏం చెప్పగలను.
నీ గురించి నీకు తెలియని కొన్ని నిజాలు చెబుతాను విను..
నిజంగా నువ్వో అద్భుతానివి..మనుషుల్లో మాణిక్యానివి.
నీ మనసు చాలా మంచిది.ఎదుటివాడి తప్పును కూడా నీ మీద వేసుకొని నిన్ను నువ్వు శిక్షించుకొనే అంత గొప్పది.
అమృతాన్ని అందించే దైవత్వంలో అసలైన మానవత్వం వుంటుంది.
అది ఈ లోకంలో నీలోనే చూసాను నేను.
అందుకే నువ్వు నిజంగా ప్రత్యేకం.
ఏం చేయగలను నేను నీకోసం..ఏమీ లేదు.
నా న్యూ మేధమేటికల్‌ థియరీని నీకు డెడికేట్‌ చేసి నిన్ను చిరంజీవిని చెయ్యాలి అంతే.
గ్రాహంబెల్‌ తన ప్రేయసిని ఈ ప్రపంచంలోనే చిరంజీవిని చేసాడు.అంత అదృష్టం నాకు తెలిసి ప్రపంచంలో మరే ప్రియురాలికి దక్కలేదని నా వుద్దేశ్యం.
కొన్ని సెకనుల్లో కొన్ని కోట్ల ఫో న్లు హలో,హలో మంటూ మార్మోగుతాయి.ఎంత గొప్ప విషయం కదా.
గ్రాహంబెల్‌ ఫోన్‌ కనిబెట్టినప్పుడు తన ప్రేయసి మార్గరెట్‌ హలో తో రోజూ మాట్లాడుతూ..హలో,హలో అని పిలవడం..ఈ రోజు ప్రపంచం దాన్నే ప్రామాణికంగా తీసుకోవడం..ఇది అద్భుతం కదా..
ప్రణవి అమాంతం మరింతగా కృష్ణని వాటేసుకొంది.
" అందుకే..నువ్వంటే నాకు అంత ఇష్టం..కాదు ప్రాణం.." అంది.
" అందుకే ఇంతలా బాధపెట్టగలుగుతున్నావు." అన్నాడు కొంత బాధగా.
"ఏం చెప్పమంటావు..ఎలా చెప్పమంటావు నా బాధని..'' అంది రోదిస్తూ.
" ప్రశాంతంగా చెప్పు..నిగ్రహంగా వుండు..ఇప్పుడు ఏం జరిగింది..భూకంపాలు,సునామీలే వచ్చినా చెక్కుచెదరని ఆత్మబలంతో బతకాలి.పోరాడు జీవితంతో..పోయేదేముంది.ఎంతటివాడైనా ఈ లోకాన్ని ఏదో రోజు వదిలివెళ్ళాల్సిందే కదా..సో..ఈ శరీరం మనది కాదు.అలాంటప్పుడు దేనికి భయం.ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడం,ఆనందించడం..అంతే జీవితం.ఎంతో చిన్నది జీవితం..ఎన్ని పనులు చేసినా..ఇంకా ఎన్నో మిగిలిపోతాయి..చెప్పు ..నీకు ఎం కాదు.." ధైర్యాన్నిచ్చాడు.
" ఏం..చెప్పమంటావు.నన్ను చూస్తే నీకు అర్ధం కావటంలేదా..మా అయన మానసిక స్థితి తట్టుకోలేని స్థితికి చేరుకుంది.ఎప్పుడు పరిస్తితి ఎలా వుంటుందో తెలియదు.ప్రతి క్షణం భయంకరంగా వుంటోంది.ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో అర్ధంకాని స్తితి.కొడుకు రోజు,రోజుకు ఎదుగుతున్నాడు.వాడికి ఏం సమాధానం చెప్పాలి.పట్టించుకొనేవాళ్ళు లేరు.అంతా అగ మ్య గోచరం.పిచ్చెక్కిపోతుంది.నీతో మాట్లాడాలని ఆతృత..నా ప్రపంచాన్ని వదిలేస్తున్నాననే భావన.నిన్ను బాధపెడుతున్నాననే ఆలోచన.అన్నిటి మధ్య అతలాకుతలం..నీకు అర్ధం కాదు ఎన్నిసార్లు చెప్పినా..."చెప్పుకుంటూ పోతోంది ప్రణవి.
" అదే బంగారం..చెప్పేది.మనిషి కష్టంలో వున్నప్పుడే నిబ్బరంగా వుండాల్సింది.మీ అయనకి మంచి ఆసుపత్రిలో వైద్యం చేయించు.అత్యవసరమైనప్పుడు మందు బలవంతంగానైనా వెయ్యాల్సిందే కదా.సమస్యని మనం చూసే కోణంలోనే మనకి పరిష్కారం కనబడుతుంది.ఇంకా అవసరమైతే నాకు చెప్పు.చెయ్యగలిగిన సాయం తప్పక చేస్తాను.మనసులో ఏమీ పెట్టుకోకు.సమస్యల్ని భూతద్దంలో చూడకు.అంతా భగవత్‌ చిత్తం.దేవునిరాత ఎలావుంటే అలా.." అనునయంగా ప్రణవి తలనిమురుతూ చెప్పాడు కృష్ణ.
" అందుకేరా..నువ్వు నాకు నచ్చేది.నువ్విచ్చే ధైర్యం,స్వాంతన..వెలకట్టలేనివి..నువ్వు నా ప్రాణం.." అంది మరింత గట్టిగా హత్తుకుంటూ.
"నన్ను నీతో రమ్మంటావా...?" ఆర్తిగా అడిగాడు కృష్ణ.
" నిన్ను చూసిన తర్వాత నా కొడుక్కి,మా ఆయనకి,మరీ ముఖ్యంగా ఈ సమాజానికి చెప్పగల సమాధానం నా దగ్గరలేదు." భయపడుతూ చెప్పింది ప్రణవి.
మరేం చేద్దాం..
ఇలాగే ఎక్కడున్నా,అత్మీయంగా బతుకుదాం.వీలున్నప్పుడు కలుద్దాం.అవసరమైనప్పుడు మాట్లాడుకుందాం.
ఒకరికొకరు,ఒకరికోసం ఒకరుగా మంచినేస్తాల్లా బతుకుదాం.
ఇక సమాజమంటావా..ఈ లోకంలో ఎవడిగోలవాడిది.
కళ్ళలో మన భావాల్నిబట్టే పరిస్తితులు మనకి కనబడతాయి.
నీ భావాలు పంచుకోడానికి నీకు ఓ మనిషి కావాలి,నీ సాహచర్యాన్ని పంచుకోడానికి నీకో మనసు కావాలి.
నా స్వాంతన కోసం నాకో తోడు కావాలి,అలా ఒకరికొకరం కావాలి.ఇదో జీవనసూత్రం అంతే.
ఎలాంటి బంధాలు లేని జంతువులు సఖ్యతగా బతుకుతున్నప్పుడు..నాగరికులమైనమనం స్త్రీ,పురుష బేధాన్ని సాకుగా చూపించి విద్వేషాలు,వైర మ్యాలు పెంచుకోవడం విజ్నతేనా.
స్నేహం అంటే పవిత్రం కదా..మరలాంటి స్నేహానికి మలినం అంటించడం ధర్మం కాదు కదా.
నువ్వు కూడా బాగా చదువుకున్నావు కదా..ఆలోచించు.
చదువు ఉన్నతికేకాదు..సంస్కారం నేర్పేది కావాలి.
ఆ సంస్కారం మరో నలుగురికి మంచి మార్గాన్ని చూపించాలి.
ఇద్దరూ నెమ్మదిగా లేచి,ఒకరి చేయి మరొకరు పట్టుకొని నెమ్మదిగా గోదావరితీరం వైపు అడుగులు వేస్తున్నారు..
ఒక అడుగు మరో అడుగు వేయిస్తుంది.ఆ అడుగులో నడక మొదలవుతుంది.ఆ నడక వేగం పెరిగినప్పుడు పరుగు మొదలవుతుంది.అలా జీవన ప్రయాణంలో అలుపు,సొలుపు,వేగం,నిదానం..అన్నీ పరిస్తితుల్ని బట్టి తెలుస్తూవుంటాయి.అదే జీవితం..
( ప్రతీ స్త్రీ,పురుష సంబంధం అపవిత్రం కాదు.ఈ రోజుల్లో సహజీవనం పేరుతో అనేకమంది కావలసినంతకాలం కలిసివుండి తర్వాత విడిపోయి..మిగిలిన జీవితాన్ని గందరగోళం చేసుకొని అక్కరలేని సమస్యల్లో ఇరుక్కుంటున్నారు.అది తప్పుడు మార్గమనే భావాన్ని కలిగిస్తున్నారు.వేదమంత్రాల సాక్షిగా జరిగిన పెళ్ళిలోనైనా,కలిసి బతికే సహజీవనంలోనైనా,ప్రక్రియ ఏదైనా..దాని అంతరార్ధం ఒకటే.
" ఒకరినొకరు తెలుసుకొని..ఒకరికోసం ఒకరిలా..స్నేహం అంటే ఇదేనేమో అని అనిపించేలా బతకడం.కష్ట,సుఖాలు నావి కాదు,మనవి అన్నట్టు పంచుకోడం..అదే ఏ మంత్రాల పరమార్ధమైనా..ఏ మత,జాతి సందేశమైనా ఇదే..కలకాలం హాయిగా,చిలకా,గోరింకల్లా కలిసిమెలసి జీవితాంతం తోడూ,నీడలా బతకాలనేదే. కష్ట,సుఖాలు సహజాతాల్లాంటివి..ఎదీ శాస్వతం కాదు.వస్తూ పోతూ వుంటాయి.ఓ చిన్న జీవితాన్ని హాయిగా,ఆనందంగా బతకడమే.ప్రతీ క్షణాన్ని ఆశ్వాదించడమే..”)
సెలవు..
(అయిపోయింది.)--
Thanks to the readers who are all bear with me today.. ( అవని)
Feel free to send your comments to SRINIVASVVL@GMAIL.COM.

No comments:

Post a Comment

Pages