తుమరాడ సంగమేశ్వర శాస్త్రి - అచ్చంగా తెలుగు

తుమరాడ సంగమేశ్వర శాస్త్రి

Share This

తుమరాడ సంగమేశ్వర శాస్త్రి - ఓ అజ్ఞాత వైణికులు

మధురిమ 


కళ అనేది పూర్వజన్మ సుకృతం,సంపూర్ణ దైవానుగ్రహం వల్ల మాత్రమే సంప్రాప్తించేది.చతుషష్ఠి కళలకు ఆధిపతి అయిన ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎవరిపైన  నిలుస్తాయో వారు మాత్రమే కళాకారులు కాగలరు.ఇది సత్యం.
ముఖ్యంగా మన భారతదేశంలో కళలన్నీ దైవదత్తమైనవే. బాహ్యమైన ఐహిక సుఖాల కొఱకు కాక భగవంతుని చేరే సోపానాలు  ఈ కళలు.అందునా లలిత కళలైనటువంటి సంగీతం,నృత్యం,చిత్రలేఖనం వంటివి మనిషిని నైతిక విలువలతో కూడిన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి ఆ పరమాత్మునిలో మమేకమవ్వడానికి సాధనలా ఉపయోగపడతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
నాదానికి మూలం వేదమే. సంగీత బీజాలన్నీ సామవేదంలో  మనకి వినిపిస్తాయి. ఎన్నో మధురమైన,అద్భుతమైన సంగీతవాయిద్యాలు ఉన్నపట్టికీ వాటన్నిటిలోనూ వీణకి ఓ  విశిష్టమైన స్థానం ఉన్నది. వీణ అన్నమాట విన్నా,చదివినా వెంటనే కళ్లముందు కళలరాణి వాణి రూపన్ని సాక్షాత్కరింప చేసుకుంటాం. వీణా పుస్తక ధారిణి సరస్వతీ మాత చేత నిత్యం వాయించబడే ఆ వీణ అతి పవిత్రమైన,ప్రాచీనమైన వాయిద్యం కూడా.
వీణా అన్న సంస్కృతశబ్దానికి అర్థం ఈవిధం గా చెప్పవచ్చు "వన్యతే ఇతి వీణాః" అనగా నాదాన్నీ లేదా శబ్దాన్ని వ్యుత్పత్తి చేసేది వీణ.యాజ్ఞవల్క మహర్షి వీణ గొప్పదనాన్ని ఈ శ్లోకం ద్వారా తెలియచేసారు.
“వీణా వాదనా తత్వాంగనా శ్రుతి,జతి విశారతా
  తాల జ్ఞాన ప్రయాసేన మోక్షమార్గం నియచ్చతి.”
ఎవరైతే చక్కని వీణావాదనా నైపుణ్యాన్ని కలిగి ఉంటారో,శ్రుతి జ్ఞానం కలిగి చక్కటి తాళ ప్రతిభ కనబరుచుతారో అట్టి వారికి మోక్షము నిశ్చయము. వీణ యొక్క మహత్యము అంత గొప్పది.
అనాదిగా ఎంతోమంది వైణికులు తమ వీణా వాదనా ప్రతిభతో,పాండిత్యంతో శ్రోతలను భక్తి, పారవస్యాలతో తన్మయులను చేస్తూ తరింపచేస్తున్నారు.
అటువంటి వారిలో ఒక వైణిక శిఖామణి,సరస్వతీ సంపూర్ణానుగ్రహ శిరోమణి  శ్రీ తుమరాడ సంగమేశ్వర శాస్త్రిగారు.వీరు (1874-1932) కాలానికి చెందినవారు.
అప్పటి బొబ్బిలి నగరంలోని పాలకొండ తాలుకా లో సంగమవలస గ్రామంలో బిటివాడ అగ్రహారంలో  తుమరాడ సోమయాజులు, గున్నమ్మ దంపతులకు జన్మించారు.
ఎనిమిదవ ఏట తమ బావగారైన నందిగాన వెంకన్న గారి దగ్గరకు సంగీతాభ్యాసానికై బొబ్బిలి తరలి వెళ్ళారు.ఆరోజుల్లో నందిగాన వెంకన్న గారు గొప్ప వైణికులు మరియు "ఆంధ్ర భోజ రాజు"గా పేరు గాంచిన విజయనగరం రాజు శ్రీ శ్రీ ఆనందగజపతి మహారాజా వారి ఆస్థాన వైణికులు,గాయకులు కూడా.
నాలుగు సంవత్సరాలు ఒక యజ్ఞం వలె ఎంతో పట్టుదలతో,దీక్షతో వెంకన్న గారివద్ద వీణ ని అభ్యసించి అమోఘమైన ,అనితర సాధ్యమైన పాండిత్యాన్ని సంపాదించారు.విధ్యార్ధి గా ఉన్నరోజుల్లోనే ఎంతో వైవిధ్యమైన ప్రతిభని కనబరిచేవారట. గురువుకు తగ్గ శిష్యులు కాగలరని అందరూ అనేవారట. వెంకన్న గారి దగ్గర తప్ప ఇంకెప్పుడూ ఎక్కడా వీరు సంగీతం నేర్చుకోలేదు కూడా.
వెంకన్న గారి దగ్గర నేర్చుకుంటున్న రోజుల్లో పరవస్తు రంగాచార్యులు అనే పండితులు ఓసారి వీరి వీణా వాదనని విని ముగ్ధులై సంగమేశ్వర శాస్త్రి గారిని విశాఖపట్నం లోని గోనెవారి సంస్థానానికి తీసుకువెళ్ళి అక్కద కచేరీ పెట్టించారట.ఆ కచేరీ వారికి ఎంతో పేరు ప్రఖ్యాతలేకాక కసింకోట జమీందారు వారి ఆదరాభిమానాలను కూడా సంపాదించి పెట్టింది.
అప్పుడు జమిందారు గారితో కలిసి సంగమేశ్వర శాస్త్రి గారు మద్రాసు కు వస్తూ ఉండేవారు.ఓసారి సుమారు ఓ సంవత్సరం పాటు మద్రాసులో ఉండడం జరిగింది.ఆ సమయం లో మద్రాసు లో ఉండే ప్రముఖ సంగీత విద్వాంసులందరితో స్నేహ సాహచర్యాలు ఏర్పడ్డాయి.
ముఖ్యంగా మద్రాసులోని శ్రీ కృష్ణ గాన సభలో వారు వాయించినప్పుడు వారి వాదనా నైపుణ్యంతో పెద్ద పెద్ద విద్వాంసులందరినీ ఆకర్షించారు.ముఖ్యం గా ముత్తయ్య భాగవతార్ గారి వంటి వారు కూడా వీరి ప్రతిభని ఎంతో మెచ్చుకుని తమిళనాట వీరికి ఎన్నో కచేరీలు,సభలు,సన్మానాలు ఏర్పాటు చేసారట.తమిళనాడు లో కచేరీలు చేసేటప్పుడు  శ్రీ గోవిందస్వామి పిళ్ళై గారు వయొలిన్ పై, పుదుకొటై దక్షిణా మూర్తి పిళ్ళై గారు మృదంగం పై వాద్య సహకారం అందించేవారుట.వీరిద్దరు ఆరోజుల్లో చాలా పెద్ద విద్వాంసులు ముత్తయ్య భాగవతార్ వంటి పెద్దవారికి మాత్రమే పక్క వాయిద్య సహకారం అందించేవారు.అలాంటి వారు మన సంగమేశ్వర శాస్త్రి గారికి సహకార  వాయిద్యం అందించారంటే మన శాస్త్రి గారి ప్రతిభ ఎంటో అర్థం అవుతుంది.
కొన్నాళ్ళకి తిరిగి కసింకోట వెళ్ళాక పిఠాపురం మహారాజా వారి ఆహ్వానం పై అక్కడికి వెళ్ళి పిఠాపురం ఆస్థాన విద్వాంసులు గా నియమింపబడ్డారు.సంగమేశ్వర శాస్త్రి గారి జీవితం లో ఇదో గొప్ప మైలు రాయిగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఆ రోజుల్లో పిఠాపురం సంస్థానం కళాకారులని ఆదరించడానికి పెట్టింది పేరు అన్నట్టుగా ఉండేది.ఎంతో మంది కళాకారులను మహారాజా వారు స్వయంగా ఆహ్వానించి సత్కరించేవారు.
సంగమేశ్వర శాస్త్రి గారిని కూడా అదేవిధంగా ఎంతో గొప్పగా,ఆత్మీయంగా సత్కరించారు పిఠాపురం మహారాజావారు.ఒకవిధంగా చెప్పాలంటే సంగమేశ్వర శాస్త్రి గారి జీవితం అంతా పిఠాపురం మహారాజా వారి ఆదరాభిమానాలతోనే గడిచింది.
ఓసారి పిఠాపురం సంస్థానానికి గీతాంజలి గేయ రచయిత,బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి గురుదేవులు రబీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చారు. అప్పుడు వారు సంగమేశ్వర శాస్త్రి గారి వీణవాదనను విని అమితానందులై సంగమేశ్వర శాస్త్రి గారిని స్వయంగా తమ "శాంతినికేతన్" కు తీసుకువెళ్ళారుట.కొన్నాళ్ళ పాటు శాంతినికేతన్లో రోజూ సంగమేశ్వర శాస్త్రి గారు వీణ వాయించడం అన్నీ అరిచిపోయి గురుదేవులు రబీంద్రనాథ్ ఠాగూర్ గారు అంతటి వారు ఆ సునాదాన్ని విని సుదీర తీరాలకు మనోవేగంతో వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది.అసలే ప్రశాంతమైన ప్రకృతికి నిలయమైన ఆ శాంతినికేతన్ లో వీణ  స్వరాలని వింటూ ఉంటే  ఓ సౌందర్య ఆరాధన చేస్తున్నట్లుగా ఓ ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పొందినట్లు గా రబీంద్రులు భావించేవారట.
కొన్ని నెలల తరువాత సంగమేశ్వరశాస్త్రి గారు తిరిగి పిఠాపురం వెళ్ళవలిసి వచ్చినప్పుడు రబీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇద్దరు విధ్యార్ధులను శాస్త్రి గారితో పాటు గా పిఠాపురం పంపి వారిని శాస్త్రిగారి వద్ద వీణ నేర్చుకుని మరీ తిరిగి రమ్మన్నారట.ఆ అవకాశం దక్కించుకున్న ఆ విధ్యార్ధులెంత ధన్యులో మరి.
ఆరోజుల్లో కొమ్మూరి సూర్యనారయణమూర్తి నాయుడు గారని కాకినాడలో ఓ గొప్ప కళాపోషకులు ఉండేవారట.వీరు సరస్వతీ గాన సభ నిర్వహించేవారు.సంగీత ప్రపంచంలో దిగ్గజాలైనటువంటి మహా వైద్యనాథ్ అయ్యర్,గోవింద స్వామి పిళ్ళై వంటి వారు మద్రాసు నుంచీ వచ్చి ఇక్కడ కచేరీలు చేసేవారు.అయితే వారితో సమానంగా పోల్చదగిన వారు ఆనాడు ఆంధ్రదేశం లో ఇద్దరే వారు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు(వయొలిన్), శ్రీ తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారు(వీణ).ఈ సభ వార్షికోత్సవాలు చాలా బాగా జరిగేవట.సంగీతాభిమానులకు అదే సంక్రాంతి అన్నమాట. మైకులు కూడా లేని ఆరోజుల్లో తండోప తండాలుగా వచ్చే శ్రోతలకి వీణ స్పష్టం గా ప్రతీ గమకం వినిపించాలంటే ఎంతో నైపుణ్యం కావాలి.
సంగమేశ్వర శాస్త్రిగారు ఇంత ప్రతిభావంతులు గా కావడానికి  గురువులు నందిగాన వెంకన్నగారు ఎంత కారణమో శాస్త్రి గారి అనితర సాధ్యమైన సాధన కూడా అంతే కారణం.మామూలు మనిషిని మహర్షి గా మలిచేది సాధన మాత్రమే.భగవంతుడు పూర్వ జన్మ సుకృతంగా ఇచ్చిన కళాజీవితాన్ని  తన సాధన ద్వార సార్ధకం చేసుకోగలిగారు శ్రీ సంగమేశ్వర శాస్త్రి గారు.
ప్రతీ రాత్రి 11గంటలకు మొదలుపెట్టి తెల్లవారుఝామున మూడు గంటలవరకూ నిర్విరామంగా సాధన చేసేవారట.రోజుకో రాగం తీసుకోవడం ఇక ఆ రాత్రంత ఆ రాగాన్నే పరి పరి విధాలుగా సాధన చేసేవారట.ముఖ్యంగా త్రిస్థాయిలలో (హెచ్చుస్థాయి,మధ్యస్థాయి,మందరస్థాయి) ల లో రోజుకు వెయ్యి సార్లు సాధన చేసేవారట. మధ్యలో ఎక్కడైనా తప్పు గనక వస్తే మళ్ళీ మొదటినుంచీ మొదలుపెట్టి వెయ్యి పూర్తి చెయ్యవలిసిందేకాని ఇంకో మార్గం లేదు.
వీణను వాయించడం లో ఒక్కొకరికి ఓ ప్రత్యేకత,పద్ధతి ఉంటుంది.దీనినే బాణి అని కూడా అంటారు.మన సంగమేశ్వర శాస్త్రి గారి బాణి ఎంత అద్భుతం అంటే ఒక్కోసారి మేఘ గర్జన వలె ఉంటే ఒక్కోసారి తీయని కోకిల స్వరం లాగా వినిపించేదట.
ఒక్కోసారి అసలు కుడి చేతిని వాడకుండా కేవలం ఒక్క ఎడమ చేతితోనే తీగని లాగి,మీటడం ద్వారా అద్భుతమైన ధ్వనిని ఉత్పత్తి చేసేవారట.ఒక్కోసారి అన్ని తీగలని ఒక్కేసారి మీటి ఓ విచిత్రమైన ధ్వని ని వినిపింప చేసేవారట."నాగ బంధ స్వర సాంప్రదాయం" అనే విశేషమైన పద్ధతిలో వీణ ను వాయించేవారట.ఇంకో విశిష్టత  ఏంటంటే వీణని ఊర్ధ్వ ముఖంగా నిలబెట్టి వాయించే అంత ఘనులు.ఈ విధంగా వాయించగలిగిన మరో ఇద్దరు విద్వాంసులు శ్రీ కరైకుడి సుబ్బరామ అయ్యర్,విజయనగరం వెంకటరామదాసు గార్లు.
వీరు గొప్ప వాగ్గేయకారులు కూడా.తన వర్ణాలు,పల్లవులు వంటివి రక్తి రాగాలలో రచించారు.దాసు శ్రీరాములు అనే మహాకవి తో కలిసి "దాసు రామ పాల సంగమేశ్వరం" అన్న ఉభయ ముద్రతో గాన నాయకం అనే కృతిని రచించారు.
సంగమేశ్వరశాస్త్రి గారు ఎంత పెద్ద విద్వాంసులో అంత గొప్ప గురువు కూడా..ఎంతో మంది ఆయన దగ్గర శిష్యులు గా చేరి సంగీతం అభ్యసించేవారట...
వీణే కాక వయొలిన్,నాదస్వరం,కూడా వాయించేవారట.ఏ వాయిద్యంలోనైనా ఓ విద్వాంసుని దగ్గర ఓ కొత్త విషయం గమనించినా లేక వినడం జరిగినా వెంటనే సాధన చేసి ఆ అంశం లో పట్టు సాధించేవరకూ శ్రమించేవారట.అంత పట్టుదల,కార్యదీక్ష వారికి అమ్మవారి అనుగ్రహం గా లభించాయి కాబట్టే, వారు సంగీత ప్రపంచంలో అంత ఎత్తు ఎదగ గలిగారు.అయితే వారి కచేరీలు కానీ,రికార్డింగ్లు కానీ మనకి ఒక్కటి కూడా  లభించకపోవడం మన దురదృష్టం.అప్పటికి ఇంకా అంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణమే.
సంగమేశ్వర శాస్త్రి గారు లలితా ఉపాశకులు.గొప్ప భగవత్ భక్తి కలిగిన మనీషి..ఆ జగన్మాత అవ్యాజ్య కరుణా కటాక్షాలను సంపూర్ణంగా పొందగలిగిన ధన్యులు.అందుకే జీవించినంత కాలం ఆ నాదోపాసన తోనే ఆ తల్లి ని సేవించుకోగలిగారు.భౌతికంగా ఆయన జీవితంలో చివరిరోజున వారికి మరణం ఆసన్నమైంది అన్న విషయం తెలియగానే ..ఇక వారి వద్ద కొన్ని గంటలు మాత్రమే సమయం ఉందని గ్రహించి  శిష్యులను పిలిచి  వీణ ను తెచ్చి ఇమ్మన్నారట. అలా వీణ వాయిస్తూ ఉండగా ఆ గమక తరంగాలతో పాటుగా ఆయన పంచ ప్రాణాలు కూడా సరస్వతీ సానిహిత్యాన్ని చేరుకున్నాయి.
ఒక విద్వాంసుని కచేరీ వినడంవలన లేదా వాళ్ళ సమకాలీనులుగా ఉన్నా వారి ప్రతిభ గురించి తెలుసుకునే మహత్ భాగ్యం మనకి కలుగుతుంది..నేటి తరానికి శ్రీ తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారు ఓ గొప్ప అజ్ఞాత  విద్వాంసులు. వారు జీవించి ఉన్న సమయంలో సాంకేతికత అంతగా అభివృద్ధి చెందకపోవడం వలన వారి వీణా నాదాన్ని వినే అదృష్టం మనకు లేకపోయినా కనీసం ఆయనలాంటి మహానుభావులు ఈ భరతభూమి పై నడిచారన్న విషయాన్నైనా విని ఆనందిద్దాము.
*****

No comments:

Post a Comment

Pages