నీకు నేనున్నా - 5 - అచ్చంగా తెలుగు

నీకు నేనున్నా - 5

అంగులూరి అంజనీదేవి

anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com


(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు  మనోహర్. అతని అక్క  కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. మధురిమకు పెళ్ళైపోయిందని అబద్ధమాడి, అతని అక్క కూతురైన పద్మతో అతని వివాహం జరిపిస్తుంది అతని తల్లి. ఇక చదవండి.)
మనోహర్ చెప్పింది తప్ప తను కల్పించుకొని ఏది చేయదు. ఒకవేళ చొరవగా ఏదైనా చేస్తే ఇక ఆ రోజంతా ఇంట్లో విసుక్కుంటూనే వుంటాడు. ఏదో ముచ్చటపడి చేసింది కదాని సరిపెట్టుకోడు. ఇలా జరిగిన రోజులు కూడా వున్నాయి. అందుకే మనోహర్ మాటను అతిక్రమించి ఏ పనీ చేయదు పద్మ. ఒక్కమాటలో చెప్పాలంటే అతని పర్మిషన్ లేకుండా అతని పక్కన కూర్చోవాలన్నా భయపడ్తుంది.
హైస్కూల్లో చదువుకునే రోజుల్లో - ముందుగా పెళ్ళి అయ్యి అత్తగారింటికి వెళ్ళి భర్తలతో కాపురం చేస్తున్న తన స్నేహితురాండ్రు వాళ్లు తమ భర్తతో కలిసి చేసే సరదాలు, సంతోషాలు పద్మతో చెబుతుంటే పద్మకి కూడాత్వరగా పెళ్ళి చేసుకోవాలనిపించేది. పెళ్ళి అయిన తర్వాత తనుకూడా తన భర్తతో సినిమాలకి, షికార్లకి,
పిక్నిక్లకి వెళ్లాలనుకునేది. సిటీలైఫ్ గొప్పగా ఎంజాయ్ చెయ్యాలను కునేది.
కానీ ఈనాడు తనకి ఒక్కకోరిక కూడా తీరలేదు. తను ఒకప్పుడు కన్న కలలన్నీ ఊహలేనని తన మనసుకి సర్దిచెప్పకుంది. భార్తలంతా ఇలాగే ఉంటారనుకుంది. మనోహర్ ప్రవర్తనకి అలవాటుపడింది.
మనోహర్ చెప్పినట్లే కాఫీ తెచ్చి టేబుల్ పై పెట్టింది. కాఫీ త్రాగి ఆఫీసుకి వెళ్ళిపోయాడు మనోహర్.
*****
రెండుసార్లు గుండెపోటు వచ్చిన వసంతమ్మకి మూడవసారి కూడా వచ్చింది. వెంటనే వెళ్లి ఎదురింట్లో వుండే దామోదర్రెడ్డిని పిలిచింది మధురిమ.
 జాలిగుండెగల దామోదర్రెడ్డి మధురిమ కన్నీటిని చూడలేక, అంతకు ముందు రెండుసార్లు గుండెపోటు వచ్చినప్పడు కూడా వసంతమ్మను హాస్పిటల్లో చేర్పించి గట్టి ట్రీట్ మెంట్ యిప్పించారు. ఈసారి ఆయన ప్రయత్నం విఫలమైంది.
కన్నబిడ్డను ఒంటరిదాన్ని చేసి, ఆ బిడ్డ బరువు, బాధ్యతల్ని దామోదర్ రెడ్డికి అప్పగించి కన్నుమూసింది వసంతమ్మ. మధురిమను తమ సొంత బిడ్డలా స్వీకరిస్తున్నట్లు వసంతమ్మకు హామీ ఇచ్చారు దామోదర్ రెడ్డి దంపతులు.
తల్లి శవంపై పడి, చిన్నపిల్లలా ఏడుస్తున్న మధురిమను దామోదర్ రెడ్డిభార్య దగ్గరకు తీసుకొని ఓదార్చింది. ఎవరెంత ఓదార్చినా తగ్గే బాధకాదు అది. కడుపులోంచి తన్నుకొచ్చి ఎగిరెగిరిపడుతుంది మధురిమ ఆ ఏడుపుకి. ఆ ఏడుపు చూసి  చూసి అక్కడున్నవాళ్లంతా కంటతడి పెట్టుకున్నారు.
“ఇక నేను ఎవరికోసం బ్రతకాలి బాబాయ్! నాకేవరున్నారిప్పుడు. ఈ ఒంటరితనాన్ని భరించలేను బాబాయ్!” అంటున్న మధురిమను చూస్తుంటే దామోదర్ రెడ్డి గుండెనెవరో పిండినట్లు అయింది.
నువ్వు ఒంటరిదానవు కావు మధూ! నీకు నేనూ, మీ పిన్నీ వున్నాం. నువ్విలా బాధపడ్తుంటే ఏం చేయాలో మాకు తోచడం లేదు. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలను చూడాలి కదా!” అంటూ వసంతమ్మకు జరగవలసిన కార్యక్రమాలను దగ్గరుండి జరిపించారు దామోదర్ రెడ్డి దంపతులు.
దామోదర్ రెడ్డి ఆయన భార్య దయవల్ల రోజులు చాలా ప్రశాంతంగా  జరిగిపోతున్నాయి మధురిమకు.
టైపిస్ట్ ఉద్యోగాలు వున్నాయని ఎంప్లాయిమెంట్ నుండి మధురిమకు కాల్ లెటర్ వచ్చింది. అది చూడగానే దామోదర్రెడ్డి సంతోషపడ్డాడు. తనే స్వయంగా రికమెండేషన్ చేసి, కొంత డబ్బు ఖర్చుపెట్టి మధురిమకు జాబ్ వచ్చేలా చేశాడు. ఇప్పడాయన మనసు కుదుటపడింది.
ఇన్ని రోజులు తన దిగులు తీర్చి అన్నంపెట్టి ఆదరించటమే కాక కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు దామోదర్ రెడ్డి. ఆ బాకీ తీరాలంటే ప్రస్తుతం తన దగ్గర ఇల్లు తప్ప ఇంకేం లేదు. అందుకే ఆ ఇంటిని అమ్మి ఆయన ఋణం తీర్చాలనుకొంది మధురిమ.
మధురిమ ఆ ఇల్లు అమ్మటం దామోదర్రెడ్డికి ఇష్టం లేదు.
“నేను అనుభవంతో చెబుతున్నాను మధూ! నువ్వుఆ ఇల్లు అమ్మకోవద్దు. ఫ్యూచర్ లో ఎప్పటికైనా నీకు ఆ ఇల్లు అవసరమవుతుంది. కావాలంటే నా బాకీ నెమ్మదిగా నీ సంపాదనతో తీర్చుకుందువుగానీ" అంటూ ఆయనఎంతో అభిమానంతో చెప్పాడు.
”అదెప్పటికి సాధ్యం బాబాయ్! కష్టకాలంలో మీరెంతగా నన్ను ఆడుకున్నారో అంత త్వరగా మీ బాకీ తీర్చటం నా బాధ్యత. నాకు మనఃశాంతి కూడా.నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చిందికాబట్టి, ఇకముందు నన్ను ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళవలసిన దాన్ని.ఈ ఊరిలో నాకింకేం పని వుంటుంది” అని అంటున్న మధురిమకు తన తల్లి గుర్తుకొచ్చింది.
“అది కాదమ్మా!” అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు.
“ఇక మీరేమీ అడ్డు చెప్పకండి బాబాయ్!” నెమ్మదిగా అంది మధురిమ.
“సరే నీఇష్టం మధూ!” అని అనలేక పోయాడు. అనలేదు కూడా, మౌనంగా ఉండిపోయాడు.
వెంటనే ఇంటిని అమ్మివేసింది మధురిమ, ఆ టైం లో ఆ ఇల్లు హాట్ కేక్ లా అమ్ముడుపోయింది.
ఇల్లు అమ్మిన డబ్బుతో తల్లికి బాగలేనప్పుడు డాటర్లకి మందులకి ఇచ్చిన డబ్బు, తనకి ఉద్యోగం కోసం ఖర్చుపెట్టిన డబ్బు ఇంకా అప్పుడప్పుడు అప్పుగా  తీసుకొన్న డబ్బు మొత్తం కలిపిలెక్క చూసి దామోదర్రెడ్డికి ఇచ్చింది మధురిమ. మరి ఇన్నిరోజులు వాళ్లు చూపిన ఆదరణ, అభిమానం మాత్రం లెక్కకట్టలేనిది. కృతజ్ఞతలు తెలుపుకొంది.
మధూ! నీకు జాబ్ వచ్చిన ఆఫీసులోనే మా తోడల్లుడి చెల్లెలుదివ్య  పనిచేస్తోంది. ఆ అమ్మాయి ఒక్కతే ఒకరూంలో వుంటోంది. నువ్వుకూడా అదేరూంలో వుండు, నువ్వొస్తున్నట్లు దివ్యతో చెప్పాను. ఇదిగో దివ్య వుండే రూమ్ అడ్రన్ అంటూ అడ్రస్ రాసి వుండే చిన్న కాగితం ముక్క తీసి మధురిమ చేతికి యిచ్చాడు దామోదర్ రెడ్డి.
“సరే బాబాయ్!” అంటూ అడ్రసున్న కాగితం అందుకొంది.
ఈ బుక్స్ నీ బ్యాగ్లో పెట్టుకో మధూ! నీకు తోడుగా వుంటాయి.తీరిక సమయాల్లో చదువుకో” అంటూ బుక్స్ తో పాటు, కొన్ని పడ్లు, బిస్కెట్స్ ప్యాకెట్ కూసా బ్యాగ్ లో పెట్టుకోమని యిచ్చాడు.
మధురిమను బస్ ఎక్కించి తన బాధ్యత తీరిందనుకున్నాడుదామోదర్ రెడ్డి. ఆయనపట్ల కృతజ్ఞతతో మధురిమ కళ్ళు చెమర్చాయి.
*****
          రాజారాం సబ్ ఇస్పెక్టర్ గా రేడు సంవత్సరాల నుండి కర్నూల్ లో ఉంటున్నాడు.
హరి చెల్లెలు సుజాతతో రాజారాం కు పెళ్ళి జరిగింది. కట్నం తక్కువైనా తండ్రితో పోరాడి మధురిమను కాదనుకున్న కొంత కాలానికి సుహాతను పెళ్ళి చేసుకున్నాడు రాజారాం.
హరి,సుజాతను చూడటానికి అప్పుడప్పుడు కర్నూల్ వస్తుంటాడు. డిగ్రీలో ఒక్క ఇంగ్లీషు తప్ప అన్ని సబ్జెక్ట్స్ ఫెయిలయ్యాడు హరి. మళ్లీ సబ్జేక్స్ కట్టి చదువుకోమని చెప్పింది సుజాత. ఒక్క చదువుకోవటం తప్ప అన్ని పనులు చేస్తుంటాడు హరి. ప్రస్తుతం ఓ ప్రెవేటు ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. హరి.
*****
ఉదయాన్నే పనంతా పూర్తిచేసుకొని రెడీ అయి,లంచ్ బాక్స్ బ్యాగుల్లో పెట్టుకున్నారు దివ్య, మధురిమ. ఆఫీసుకేల్లెందుకు వాళ్లు వుండే రూమ్ నుండి కొద్దిదూరం నడిచి బస్ కోసం వెయిట్ చేస్తూ ఓ చోట నిలబడ్డారు. అటువైపుగా వెళ్తున్న హరి మధురిమను చూశాడు.
మధురిమను చూడగానే హరి ఆశ్చర్యపోయాడు. మధురిమను చూడక చాలా కాలమైనట్లు అన్పించింది. కానీ మధురిమ చేసిన గుండె గాయం మాత్రం ఇంకా సలుపుతూనే ఉంది.
“ఇది ఆడది కాదురా బాబూ! ఆనాడు మా అందరి కళ్ళు కప్పి ఆ మనోహర్ గాడితో తిరిగింది. ఇప్పుడేమో బరితెగించి ఉద్యోగం కూడా చేస్తోంది. దేనివల్లనే ఆ మనోహర్ చేతిలో చెంప దెబ్బలు తిన్నాను. ఒకసారి నేనే కావాలని కోరితే నన్ను తిరస్కరించింది. ఎలాగైనా దీన్ని బజారుకీడ్చి, దీని కొవ్వు కరిగించాలి శంకర్!” అంటూ తన పక్కనే వున్న శంకర్ కి మధురిమను చూపించాడు హరి.
తన కళ్ళతోనే మధురిమ అందాన్ని త్రాగుతున్న హరిణి చూశాడు శంకర్. హరిలో వున్న ఈ ఒక్క అలబాటే శంకర్ కి నచ్చదు. మిగతా అన్ని విషయాల్లో హరి నచ్చుతాడు. అందుకే హరి కర్నూల్ కి ఎప్పుడు రమ్మని పిలిచినా వెళ్తాడు. సుజాత వందిపెట్టీ చికెన్ బిర్యాని అంటే శంకర్ కి చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా సుజాత వాళ్ల ఇంట్లో చికెన్ బిర్యాని వుంటుంది. సుహాట శంకర్ ని తన సొంత అన్నయ్యను చూసినట్లే చూస్తుంది.
శంకర్ మనషి చాలా బావుంటాడు.  హరి పనిశేస్తున్న ఫ్యాక్టరీ యజమాని కారుకి డ్రైవర్ గా ఉంటున్నాడు. శంకర్ హరి పనిచేసేది కర్నూల్ పక్కనే వున్న బేతంచెర్ల లో. బేతంచెర్ల నుండి హరి, శంకర్ అప్పుడప్పుడు కర్నూల్ లో ఉండే సుజాత దగ్గరకి వచ్చి వెళ్తుంటారు.
అంతలో సిటీ బస్ రాగానే మధురిమ, దివ్య ఆ బస్ ఎక్కి ఆఫీసు కెళ్ళారు. ఆఫీసు కెల్లాక వాల్లిదరు ఎవరి సీటులో వాళ్లు కూర్చున్నారు.
“ఆఫీసు ఫ్యూను పడున్న హడావుడి చూసి తనలోతనే నవ్వుకొంది దివ్య.
“ఏమిటి దివ్యా! నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?” అడిగింది మధురిమ.
“ఇవాళ మనఫ్యూను హడావుడి చూస్తుంటే నవ్వొస్తుంది మధూ! మన ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నంతసేపు వున్నంతసేపు మన ఫ్యూను యిలాగే వుంటాడు. ఆ తర్వాత రాయిలా కదలడు. ఈ రోజు మన ఫీల్దాఫీసర్ ఆఫీసుకొచ్చినట్లుంది. అందుకే ఈ హడావుడి” అంది దివ్య.
"దీన్నిబట్టి చూస్తుంటే మన ఫ్యూను బాగా పనిదొంగని తెలిసిపోతుంది అంది మధురిమ.
అన్నట్లు! నువ్వు మన ఫీల్దాఫీసర్ ని చూడలేదు కదూ! అడిగింది దివ్య.
“ఇంకా చూడడం దేనికి తల్లీ! నేనొచ్చిన ఈ రెండు రోజుల నుండి అతని గురించి చేబుతూనీ వున్నావుగా. ఆటను చాలా స్మార్ట్, షార్ప్, బ్రిలియంట్ అని. అతి తక్కువ టైం లో ఫీల్దాఫీసర్ అయ్యారని, ముఖ్యంగా నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే అలాంటి వాన్నే చేసుకోవాలని వుందని ఇంకా ఏవేవో చెప్పావుగా” అంటూ నవ్వింది మధురిమ.
మధురిమ నవ్వుతుంటే నక్షత్రాలు క్రింద రాలినట్లే వుంటుంది. మధురిమ ఎప్పడు నవ్వినా ఆ నవ్వులో ఏదో సమ్ స్పెషల్ వున్నట్లే కన్పిస్తుంది దివ్యకి.
“మధూ! నిన్నొ విషయం అడుగుతాను ఏమాత్రం దాచుకోకుండా చెబుతావా?”మధురిమ నవ్వునే చూస్తూఅడిగింది దివ్య.
ఏమిటో అడుగు దివ్యా! చెబుతాను" అంది టైప్ మిషన్లో వైట్ పేపర్ని ఇన్సర్ట్ చేస్తూ మధురిమ.
నీ కాలేజీ డేస్ లో నిన్నెవరూ ప్రేమించలేదా?" అడిగింది దివ్య. పలిక్కిపడింది మధురిమ, వెంటనే మనోహర్ గుర్తోచ్చాడు. మౌనంగా ఓసారి దివ్యవైపు చూసింది మధురిమ.
“నన్నెవరైనా ప్రేమిస్తే నాకెలా తెలుస్తుంది దివ్యా" అంది చాలా నెమ్మదిగా మధురిమ.
“అదికూడా కరెక్ట్ మధూ! నిన్నెవరైనా ప్రేమిస్తే నీకెలా తెలుస్తుంది. నీ బెంచిమేటికి తెలుస్తుంది కానిఅంది జోక్ గా దివ్య.
“జోకులాపి పనిచూడు దివ్యా!” అంది మధురిమ.
 "మరి నువ్వు ఎవర్నీ ప్రేమించలేదా?" అంది దివ్య ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి పనిలో పని అన్నట్లుగా.
"నాముఖం చూస్తుంటే అలా అన్పిస్తుందా నీకు? “
నీ ముఖం చూస్తుంటే తప్పకుండా నిన్నెవరో ఒకరు ప్రేమించి వుంటారని, అలా ఎవరైనా నిన్ను ప్రేమించి వుంటే తప్పకుండా నిన్ను మిస్ కారని, ఇంకా చెప్పాలంటే సప్తసముద్రాలు దాటైనా నీ నవ్వుకోసం వస్తారని నాకు అన్పిస్తోంది" అంది దివ్య.
 టాపిక్ ని డైవర్డ్ చెయ్యాలనివుంది మధురిమకి.
అవును దివ్యా! అంతా చెప్పావు. బావుంది. మన ఫీల్డ్ ఆఫీసర్ పేరు చెప్పలేదు నువ్వు. అంది మధురిమ ఫీల్డ్ ఆఫీసర్ని గుర్తు చేస్తే యింకెం గుర్తురాదు దివ్యకని మధురిమకు తెలుసు. అంతలో....
“సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు మేడం!” అంటూ మధురిమ దగ్గరకొచ్చి నిలబడ్డాడు ప్యూన్.
“నీ పని అయిపొయింది పొ. నువ్విప్పుడు టైపు చేసిన లెటర్స్ లో ఏవో తప్పులు కొట్టి వుంటావ్! అందుకే సార్ నిన్ను పిలుస్తున్నారు” అంది ప్యూన్ని చూడగానే దివ్య.
టైప్ చేస్తున్న సర్టిఫికేట్ ని  పూర్తిచేయకుండా అలాగే వదిలేసి ఫీల్డ్ ఆఫీసర్ రూంలోకి వెళ్లింది మధురిమ రూం లోపల చైర్లో కూర్చుని వున్న వ్యక్తిని చూడగానే షాకయింది మధురిమ. ఫీల్డ్ ఆఫీసర్ సీట్లో మనోహర్ వున్నాడు. రోజూ దివ్య చెప్తున్న ఫీల్డ్ ఆఫీసర్ తను ప్రేమించిన తన మనోహరుడా! ఆశ్చర్యపోయింది మధురిమ, ఊహించనిది ఎదురైతే ఆ అనుభవం వర్ణనాతీతం.
"రా మధూ! కూర్చో!” అంటూ కుర్చీ చూపించాడు మనోహర్. మధురిమను చూసి ఎన్నో యుగాలైనట్లుంది మనోహర్ కి.
“పిలిచారట” నిలబడే అడిగింది. మనోహరంటే కోపంగా వుందిమధురిమకి.మనోహర్ని చూసి సంవత్సరం దాటింది. ఎగ్హామ్స్ రాసి ఇంటికెళ్లాక మనోహర్ మళ్లీ తన కోసం హైదరాబాదు రాలేదు. కనీసం తల్లి పోయినప్పడైనా రాలేదు. తనను కావాలనుకున్నవాడైతే ఏదో ఒక టైంలో తనకోసం రావటానికి ప్రయత్నించడా?
"కూర్చో మధూ" మళ్లీ అన్నాడు మనోహర్. కొద్దిసేపు మధురిమ తన కెదురుగా కూర్చుంటే చూడాలని ఉంది మనోహర్ కి. మధురిమ కోపాన్ని దిగమింగింది. ఆమెకి అక్కడ కూర్చోవాలని లేదు.
“నేను టైపు చేసిన లెటర్ లో ఏమైనా తప్పులుంటే చెప్పండి! సవరించి మళ్లీ  టైపు చేస్తాను” అంది మధురిమ.
పెదవి కొరుకుతూ ఆలోచనగా ఓ క్షణం మధురిమ వైపు చూశాడు. “తర్వాత చూస్తాను. నేను ఆఫీసుకి రాక రెండు రోజులైంది. రాగానే వెనక నుండి నిన్ను చూశాను. పొడవైన నీ జడ చూడగానే నువ్వేనని డౌట్ వచ్చింది. ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయింది” అన్నాడు మనోహర్. అతని ముఖంలో మధురిమను చూశానన్న సంతోషం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది.
“ఇక నేను వెళ్ళనా?”అన్నట్లుగా అతని వైపు చూసింది.
మీవారెలా వున్నారు మధూ! ఇప్పడేం చేస్తున్నారు? నిన్ను బాగా చూసుకుంటున్నారా? నువ్విప్పదు హ్యాపీనా?” అన్నాడు నెమ్మదిగా మనోహర్.
 టక్కున కుర్చీలో కూర్చుంది మధురిమ.
“నన్ను చూస్తుంటే మీకు జోక్ గా వుందా? లేక ఆ హరి ఈ విధంగా కూడా ప్రచారం చేస్తున్నాడా?" అంది సూటిగా మనోహర్ వైపు చూస్తూ మధురిమ.
“ఇది హరి ప్రచారం కాదు మధూ! నాకు జాబ్ రాగానే నిన్ను పెళ్లిచేసుకోవాలని, మా అమ్మను మీ ఇంటికి పంపాను. మీ అమ్మగారితో మాట్లాడి రమ్మని. ఇలాంటి విషయాలు ముందుగా మన పెద్దవాళ్లు మాట్లాడుకోవటం మన సాంప్రదాయం. అందుకే మా అమ్మమీతో మాట్లాడి వచ్చారు. నీకు అప్పటికే ఓ ఇంజనీరుతో పెండ్లి అయిపోయిందట. నువ్వు మా అమ్మతో బాగా మాట్లాడావట. నన్ను అడిగినట్లు చెప్పమన్నావట. నువ్వు నన్ను అడిగినట్లు చెప్పమన్నావని తెలిసి నేనెంత సంతోషించానో తెలుసా?" అన్నాడు మనోహర్.
 మధురిమ నోట మాట రాలేదు. ఆశ్చర్యపోతూ చూసింది. మీరు మీ ఊరెళ్లిన కొద్దిరోజులకే మా అమ్మగారు పోయారు. శాశ్వతంగా తల్లిని పోగొట్టుకున్న నేను ఒంటరిగా ఎంతగా కుమిలిపోయానో బాధగా అంది మధురిమ.
మనోహర్కి ఓ క్షణం మతిపోయినటైంది.
"నువ్వంత బాధలో వున్నప్పుడు కూడా నీకు నేను గుర్తు రాలేదా మధూ!"
"ఎందుకు రాలేదు. అసలు మరచిపోయిందెప్పడు?"
"మరి నాకోసం ఎంక్వయిరీ చెయ్యాలనిపించలేదా?"
"ఎక్కడున్నారని చెయ్యాలి?మీరొక్కసారైనా నాకోసం వచ్చారా? రావాలనిపించలేదా???
"ఎందుకనిపించలేదు. నేను మా అమ్మ మాటలు నమ్మాను మధూ! నీకు పెళ్ళి అయిందనుకున్నాను. ఆశ చంపుకున్నాను".
మధురిమ మాట్లాడలేదు.
“మా అమ్మ నన్ను చీట్ చేసి, నాకు పెళ్ళి చేసింది మధు! ఈ బాధ్యత అంతా మా అమ్మ మీద పెట్టడం నాదే తప్పు” అంటున్న మనోహర్ గొంతులో ఈ విలువైన దాన్ని పోగొట్టుకున్నానన్న బాధ స్పష్టంగా వినబడుతోంది.
మనోహర్ పెళ్లి కావటం మధురిమ జీర్ణించుకోలేక పోయింది.
ఆ ఇద్దరి కళ్లు ఒకేసారి చెమర్చాయి.
కాలం తన్నే తన్నులకి బంతుల్లా ఎగిరిన జీవితాల్లో మధురిమ, మనోహర్ జీవితాలు కూడా వున్నాయి.
******
సాయంత్రం...ఆఫీసు నుండి ఇంటికెళ్ళగానే కాఫీ త్రాగి స్నానం చేసిన మధురిమ, మెరూన్ కలర్ శారీకట్టి, అదే కలర్ బ్లాజ్ తొడిగింది. జడ అల్లుకోకుండా రబ్బరు బ్యాండ్ వేసి జుట్టంతా అలాగే వదిలేసింది. ‘జీవితం ఏమింటి?’ నవల తీసుకొని, మేడమీద కెళ్లి చదువుకుంటూ కూర్చుంది మధురిమ.
కాలింగ్ బెల్ విని డోర్ తీసింది దివ్య. ఎదురుగా నిలబడి వున్న మనోహర్ ని చూడగానే ఆశ్చర్యపోయింది దివ్య.
నేను మధురిమ కోసం వచ్చాను దివ్యా! పర్మిషన్ యిస్తే లోపల కొస్తాను అంటూ అతను అడిగిన తీరు హుందాగా వుంది. నిలబడిన తీరు స్థిరంగా వుంది. దివ్యకి అతన్ని అలా చూడగానే కంగారెక్కువై కనురెప్పలు టపటప కొట్టుకున్నాయి.
"రండి సార్ లోపలకి మధు మేడ మీదకెళ్లి ఏదో నవల చదువుకుంటోంది" అంటూ పైకి వెళ్లమన్నట్లుగా దారి చూపింది దివ్య.
దివ్యకి ధ్యాంక్స్ చెప్పి చకచక మెట్లెక్కి మేడమీద కెళ్ళాడు మనోహర్.
ఈ మధ్యన రోజూ కల్లోకి వస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ ఏకంగా తన ఇంటికే  రావటం గమ్మత్తుగా వుంది దివ్యకి. వచ్చింది తనకోసమై తే ఇంకా బాగుండేది. మధురిమ కోసం ఎందుకొచ్చాడో అర్థం కాలేదు. ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళాక మధురిమని అడిగి తెలుసుకోవాలనుకొంది దివ్య. దివ్యకి, మనోహర్ ఆఫీసర్ గానే తెలుసు.
మధురిమకి ఎదురుగా కూర్చున్నాడు మనోహర్. చదువుతున్న నవలను పక్కనపెట్టి ‘ఇలా వచ్చారేమిటి?’అన్నట్లుగా చూసింది మధురిమ.
“ఏం రాకూడదా?” అన్నట్లుగా చూశాడు మనోహర్.
“దివ్య ఏమైనా అనుకుంటుంది” అంది మధురిమ.
“ఆ...ఎవరో ఏదో అనుకుంటారని, నిన్నుఊహించుకుంటూ ఇంట్లో ముడుకోమంటావా?  ఊహించుకుంటూ  బ్రతకటం ఇంక నా వల్ల కాదు. ఆ అవసరం నాకు లేదిప్పుడు. రోజూ ఇదే టైంకు ఇలాగే వస్తాను. నువ్వు కూడా ఇలాగే రెడీ  అయ్యి ఇక్కడే కూర్చో" అన్నాడు మనోహర్.
మీరిలాగే నాకోసం వస్తుంటే దివ్య నిజంగానే నన్ను బయటకు పంపేస్తుంది" అంటూ నవ్వింది మధురిమ.
"ఎంత త్వరగా పంపితే అంత మంచిది. నేను రెడీగా వున్నా నిన్ను తీసికెళ్లటానికి" అంటూ మనోహర్ కూడా నవ్వాడు.
మీరు సాధ్యంకాని వాటి సంగతి ఆలోచిస్తున్నారు".
"నాకు సాధ్యం కాకపోవటానికి నేను ఒకప్పడు మీ ఇంట్లో అద్దెకున్న సూడెంట్ నుకాను. నాకిప్పుడు ఇండివిడ్యువాలిటి వుంది. నిన్ను మెయిన్ టెయిన్ చెయ్యగలిగే కెపాసిటీ వుంది. అందుకు తగినంత మెచ్యూరిటీ వుంది"
అయినా ఒకసారి పెళ్ళి అయిన మీతో నాకు మళ్లీ పెళ్లా!"
"నాకు పెళ్ళి అయ్యి ఒక్క సంవత్సరమే అయింది. అంతలోపలే నేను పనికి రాకుండా పోలేదు?”
నా ఉద్దేశం అదికాదు. మీ ఆవిడ సంతోషాన్ని నేను లాక్కోవటం."
“ఆ...అక్కడ సంతోషం ఎక్కువై దోసిళ్లతో జుర్రుకుంటోంది. మిగిలింది కారిపోతుంది.
మరెందుకు పెళ్లి చేసుకున్నారు? బాధపెట్టటానికా?
బాధ పెట్టమని పెళ్లిచెయ్యలేదు మా
పెద్దవాళ్లు నా ఇంట్లో ఉంటుందని చేశారు. అలాగే వుంది. ఇక ముందు కూడా వుంటుంది. ఎక్కడికీ పోదు”
“మీ అమ్మగారు మిమ్మల్ని నమ్మి తన మనవరాలిని మీ చేతుల్లో పెడితే మీరు చేస్తున్న పని అదా?”
“నేను కూడా మా అమ్మగారిని నమ్మి నిన్ను ఆవిడగారి చేతిలో పెట్టాను. పోగొట్టుకున్నాను. ఏదో నా టైం బాగుంది తిరిగి దొరికావ్!”
“తొందర పడుతున్నారేమో నని పిస్తోంది”
“ఏ విషయంలో...”
“మన పెళ్ళి విషయంలో...”
“పెళ్ళి వద్దు. నువ్విలాగే ఇక్కడే కూర్చో తల్లీ! రోజూ నేనిలాగే వచ్చి వెళతాను అన్నాడు మనోహర్.”
నవ్వింది మధురిమ. అతను మాట్లాడిన తీరు చూసి.
“ఆ నవ్వేదో నాడు దగ్గరగా వచ్చి నవ్వితే ఆ రేలిపడే రాత్నాలన్నీ నా ఒళ్లోనే పడతాయి. కష్టపడి ఏరుకునే బాధ తప్పుతుంది.
“మాటలు బాగా ఎక్కువయ్యాయి”
“భయం లేదు మరి. ఏం చేస్తాం. అందుకే పెళ్ళిచేసుకో. నీ కంట్రోల్ లో వుంది నువ్వెలా మాట్లాడమంటే అలా మాట్లాడతాను బుద్ధిగా”
ప్రాబ్లమ్స్ వస్తాయి మనోహర్! మనం పెళ్ళి చేసుకుంటే” అంది.
“రాకుండా నేను చూసుకుంటాను మధూ! వచ్చినా డోంట్ కేర్”
మధురిమ ఇంకేం మాట్లాడలేదు.
“రేపు వెళ్ళి రిజిష్టర్ మ్యారేజ్ కోసం అఫ్లికేషన్ పెట్టుకుందాం” అన్నాడు మనోహర్.
సరే అన్నట్లు తలవూపింది మధురిమ. ఉత్సాహంతో ఎగిరి గంతేసిందిమనోహర్ మనసు.
"వెరీగుడ్! మధురిమా మేడమ్ అంటే అలా వుండాలి " అంటూ అక్కడ ఇంకోక్షణం కూడా ఉండకుండా చకచక మెట్లు దిగి వెళ్ళిపోయాడు మనోహర్.
*****
మధురిమను రిజిష్టర్ మ్యారేజీ చేసుకోలేదు మనోహర్.
“కలసి బ్రతకటానికి పెళ్లి అవసరం లేదు. మనసుంటే చాలు. ఆ మనసే లేనపుడు ఎంత ఘనంగా పెళ్ళి జరిగినా ప్రయోజనం వుండదు. కాకపోతే సమాజంకి పెళ్ళి అవసరం" అని మనోహర్ నమ్మకం. నమ్మకమే కాదు. అనుభవపూర్వకంగా అతను తెలుసుకున్న జీవితసత్యం.
మధురిమా, మనోహర్ యాదగిరిగుట్ట కెళ్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పూలదండలు మార్చుకొని పెళ్లిచేసుకున్నారు. వాళ్లతోపాటు యాదగిరిగుట్టకి దివ్య దామోదర్ రెడ్డి వెళ్లారు. మధురిమను మనోహర్ పెళ్లి చేసుకోవడం దామోదర్ రెడ్డికి ఎంతగానో నచ్చింది. అందుకే దగ్గరుండి మరీ జరిపించాడు.
మనోహర్ ఆఫీసుకి కాస్త దూరంగా మధురిమ కోసం ఓ ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఆమెకి అవసరమైనవన్నీ క్షణాల్లో కొన్నాడు. మధురిమ తన జీవితంలోకి రావటంతో నూతన మనుగడలోకి అడుగుపెట్టినటైంది మనోహర్కి. ఇన్నిరోజులు పద్మకి భర్తగా రక్షణ కల్పించాడే కాని మనిషిగా మనసు పంచలేదు. జీవితపరమైన వాంఛల్ని పద్మకు తీర్చాడే కాని పద్మనుండి తను అందుకోలేదు.
రోజూ ఆఫీసు నుండి ముందుగా మధురిమ దగ్గరకెళ్లి, తర్వాత పద్మ దగ్గరకెళ్తున్నాడు మనోహర్ ఆఫీసులో వర్క్లోడు ఎక్కువై, ఇంటికి రావటంలేటవుతుందని పద్మతో చెబుతున్నాడు. భర్త టైమింగ్స్ కి అలవాటు పడిన పద్మ యిప్పడు చాలా ప్రశాంతంగా వుంది.
తన జీవితంలోకి మధురిమ వచ్చిన విషయం పద్మతో చెప్పాలని చాలా సార్లు ప్రయత్నించాడు మనోహర్ తను చెప్పగానే విని సంబరపడటానికి పద్మ అలాంటి, ఇలాంటి మనిషికాదు. చీమ చిటుక్కుమన్నా అమ్మకీ, అమ్మమ్మకీ చెప్పి ఆగడం చేసి హర్డ్ అవుతుంది. అదీకాక ఇప్పడిప్పడే ప్రశాంతంగా వున్న పద్మను "అనవసరంగా  అశాంతిపాలు చెయ్యకూడదనుకున్నాడు. ఈమధ్యన పద్మను కూడా సంతోషంగా వుంచటానికి ప్రయత్నిస్తున్నాడు మనోహర్.
 మధురిమ నెల తప్పింది. మనోహర్ ఆనందానికి అవధుల్లేవు.
మధురిమకి నవమాసాలు నిండాక పురుడు పొయ్యటానికి పెద్దవాళ్లు లేరు. డెలివరీ టైంకు తన తల్లి తులశమ్మతో చెప్పాలనుకున్నాడు మనోహర్. చెప్పగానే దీవించడానికి తన తల్లి మల్లాది సుబమ్మ కాదు. ఎప్పుడో వదిలిపోయిందనుకున్న దాన్ని మళ్లీ తగిలించుకొని ఎవర్ని ఉద్ధరిస్తావురా! నా మనవరాలి బ్రతుకులో నిప్పలు పోసినదానికి, ఏ ముఖం పెట్టుకొని పురుడు పొయ్యమంటావు? అని నాలుగు దులుపుతుంది. తన తల్లి పైకి ఎంత సాత్వికంగా కన్పిస్తుందో లోపలంత రాక్షసంగా వుంటుంది. అందుకే ఆ ఆలోచనకి కూడా స్వస్తిచెప్పి రాజీ అనే అమ్మాయిని భేతంచర్ల నుండి రప్పించి మధురిమకి తోడుగా ఇంట్లోనే వుంచాడు.
ఆఫీసు నుండి రాగానే మధురిమను హాస్పిటల్కి తీసికెళ్లాడు మనోహర్. అప్పుడప్పుడు హాస్పితర్ కి తీసికెళ్లి చెకప్ చేయిస్తుంటాడు మనోహర్. హాస్పిటల్ నుండి బయటికొచ్చి దారిలో పండ్లు, మందులు కొనుక్కొఇ ఇంటిముందు కారాపుకొని ల్ప్లకేల్తున్న మధురిమను మనోహర్ చోస్స్ను చూశాడు హరి.
వాళ్ళిద్దరిని అలా చూడగానే హరి అంతరంగంలో అల్లకల్లోలం మొదలైంది. పద్మను పెళ్ళిచేసుకున్న మనోహర్ కి మధురిమ మళ్ళీ ఎలా దొరికిందో అర్ధం కాలేదు హరికి. కడుపు మండిపోతోంది. తన బాధను ఎవరికీ చెప్పుకోవాలో తెలియటంలేదు.
వెంటనే ఇంటికెళ్లి సుజాతతో చెప్పాడు హరి.
సుజాత మౌనంగా విని వూరుకుంది. సుజాత అలా మౌనంగా వుండటం హరికి నచ్చలేదు.
“ఎప్పుడు చూసినా వల్ల ఊసు దేనికన్నయ్యా నీకు? బహుశ వాళ్లిద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారేమో. మధ్యలో నీకు ఎందుకు ఈ తపన?”
“పెండ్లా!పేరంటమా! వాడి అక్కయ్య కూతురు పద్మతో వాడి పెళ్ళి ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఇది వాడి కీప్. నా శపథం తీరాలంటే నాకు నీ సహాయం కావాలమ్మా!”
“నా సహాయమా! ఏమిటిది?”
“నువ్వు వెంటనే పద్మతో పరిచయం పెంచుకొని, ఈ విషయం మొత్తం ఆవిడతో చెప్పు. అప్పుడావిడ దానికి బుద్ధి చెప్పి వాతలు పెడుతుంది” అన్నాడు కసిగా హరి.
“నేను చచ్చినా ఆ పని చేయను. ఆనాడు నే చెల్లిగా నీ మాట విని మధురిమ పరువు teeshaanu. పెళ్ళికాకుండా చేశాను. ఇప్పిడి కూడా ఇలాంటి వేదవ పనులు చేశానంటే నా భర్త నా ముషం కూడా చూడడు. అంటూ ఖచ్చితంగా చెప్పి అక్కడ నిలబడకుండా వంట ఇంట్లోకివెళ్లింది సుజాత.
“అవునులే! ఎంతయినా అది నీ ఫ్రెండ్ కదూ!” అంటూ కోపంగా బయటకెల్లాడు హరి.
*****
హరి బయటకెల్లాక ... మనోహర్ ఇంట్లో లేని సమయం చూసి పద్మకి ఫోన్ చేశాడు.
ఆ వారం వచ్చిన వారపత్రికలోని సిరియల్ చదువుతూ మధ్యలో డిష్టర్స్ చేసిన ఫోన్ కాల్ని విసుక్కుంటూ, ఫోన్ దగ్గరకెళ్లి రిసీవరెత్తింది పద్మ.
 “హలో.” అంది పద్మ
మనోహర్ భార్యగారు మీరేనాండి? అంటూ ఫోన్లో అడిగాడు హరి.
“అవునండీ!" చెప్పింది పద్మ
మరి మీపేరు తెలుసుకోవచ్చా? అంటూ ఆమె మనోహర్ భార్యఅవునో కాదోనన్న డౌట్ వచ్చి అడిగాడు హరి.
“నాన్ సెన్స్ ! రాంగ్ నంబర్!” అంటూ కసిరినట్లే అని ఫోన్ పెట్టేసింది
ట్రింగ్...ట్రింగ్." అంటూ మళ్లీ వైూగింది ఫోను. అలాగే మోగుతోంది. విసుగెత్తిన పద్మ మళ్లీ ఫోన్ దగ్గరకెళ్ళి ఫోన్ ఎత్తింది.
సారీ! మీ పేరు నాకు అవసరం లేదు. మిమ్మల్ని నా చెల్లిగా భావించి మీకో విషయం చెప్పాలను కుంటున్నాను.
చెప్పటమే కాదు, సాయంత్రం ఆరుగంటలు దాటాక నెఉ చెప్పిన ఇంటిదగ్గరకు మీరోస్తే నేను చెప్పబోయేది మీ కళ్ళతోనే మీరు చూడొచ్చు” అన్నాడు త్వరత్వరగా హరి.
          ఆరు దాటాక బయటికేల్తే తనని అపహరించాలన్న ఆలోచనతో అలా అంటున్నాడనుకొంది.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages