గోదావరి నుంచి సబర్మతి వరకు - 9 - అచ్చంగా తెలుగు

గోదావరి నుంచి సబర్మతి వరకు - 9

Share This

గోదావరి నుంచి సబర్మతి వరకు - 9

 -అవని


(జరిగిన కధ : ఖమ్మం నుంచి  అహ్మదాబాద్ కు వెళ్ళే నవజీవన్ ఎక్ష్ప్రెస్ లో ప్రయాణిస్తూ గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది ప్రణవి. కాకతీయ యూనివర్సిటీ లో గణిత శాస్త్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటుంది ఆమె. ఆహ్మేదాబాద్ లో జరగనున్న జాతీయ శాస్త్ర, సాంకేతిక సదస్సులో పాల్గొనేందుకు ఆమె అక్కడకు వెళ్తూ ఉంటుంది. భారతదేశంలోని ప్రముఖ గణిత శాస్త్రవేత్తల్లో ఒకడు కృష్ణమోహన్. వాళ్ళ ఇంటికే ప్రణవి వెళ్తుంది. కృష్ణమోహన్ భార్య గాయత్రి, తల్లి వేదవతి. వేదవతి గారు అడగ్గా, తన గురించి చెప్తూ ఉంటుంది ప్రణవి. ఆమెకు పెళ్లై ఒక బాబు ఉంటాడు. కాని, భర్త మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కృష్ణ ను ఎలా కలిసానో ఆమె గుర్తుచేసుకుంటుంది. వారిద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. అనుకోకుండా వేదవతి గారు అనారోగ్యంతో చనిపోవడం, భార్య, ప్రణవి తనను ఒదిలి వెళ్లిపోవడంతో ఒంటరి వాడైపోతాడు కృష్ణ. ఇక చదవండి.)
కాలక్రమంలో రోజులు దొర్లిపోతున్నాయి..
కృష్ణ మస్తిష్కం నిండా ఆలోచనల ప్రకంపనాలతో జీవితం భారంగా గడుస్తోంది.ఎడతెగని ఆలోచనలు,అంతం లేని సమస్యలు.జీవితం ఓ చక్రబంధంలా తయారయింది.
ప్రణవి జాడ లేదు..
అలా గడుస్తుండగా ఓ రోజు ఊహించనివిదంగా ఓ ఉత్తరం వచ్చింది కృష్ణకి.
అంతే కృష్ణలో మళ్ళీ ఊపిరి చిగురించింది.
ఆ ఉత్తరం ప్రణవి దగ్గరనుంచి అని తెలిసి ఉబ్బితబ్బిబయ్యాడు.
ఎంతో ఆత్రంగా ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు..
కృష్ణా..ఇన్నాళ్ళు నీకు కనిపించలేదని,మాట్లాడలేదని చాలా కోపం వచ్చివుంటుంది.నా పరిస్తితులు అలాంటివి.నన్ను నువ్వు బాగా అర్ధంచేసుకోగలవు కాబట్టి,నీకు ఇది పెద్ద విషయం కాదు.ఎప్పుడూ చెబుతావు కదా..సమస్యల్ని బూతద్దంలో చూడొద్దని.
నీ దగ్గరనుంచి ఇక్కడకి వచ్చాక బాగా ఆలోచించాను.ఇప్పటి వరకు మన మధ్య వున్న అనుబంధాన్నంతా రాసుకొని విచారించాను.
ఒక పరిచయం ఓ కొత్త జీవితాన్ని ఇవ్వగలదు..విజయాన్ని ఇవ్వగలదు,పరాజయాన్ని చూపించగలదు.నవ్వించగలదు..ఏడిపించనూ గలదు..
ఓ స్నేహం..ఆనందపు అవతలి అంచులకు తీసుకెళ్ళగలదు..
నీ పరిచయం నా జీవితానికి ఓ నవ వసంతం లాంటిది.
ఎన్ని ఊసులు,ఎన్నెన్నో బాసలు.తలుచుకుంటేనే ఆశ్చర్యం.నిజంగా నువ్వో అద్భుతానివే.
ఆకాశంలో చందమామని చూస్తాం..ఆనందిస్తాం..పట్టుకోవాలని ఆశ పడతాం..పడాలి..అంతే కాని పట్టుకోలేం,పట్టుకోకూడదు..అని తెలిసింది.
ఆ చందమామ లాంటివాడివి నువ్వు.నీ స్పర్శలో చల్లదనం అలాంటిది.నీ సాహచర్యం పండు వెన్నెలలాంటిది.
ఆ పండు వెన్నెల చల్లదనం నాకు దొరికింది.ఈ జ న్మ కిది చాలు.ఆ వెన్నెల చల్లదనం బాగుందని ఆ నీడలో కూర్చోలేం కదా.మళ్ళీ తెల్లారాల్సిందే..సూర్యోదయం జరగాలి,నును వెచ్చని  సూర్యకాంతికి ఆ చిమ్మ చీకట్లు తొలగి,చలి పొరలు మాయం కావల్సిందే.
జీవితం కూడా అంతే కృష్ణా..ఓ మాయలాంటిది.నువ్వంటే నాకు ఇష్టం కాదు..ప్రాణం.
నువ్వడిగితే ఏదీ కాదనలేనంత ఇష్టం..నీ కోసం ఏదైనా చేయాలన్న తపన..అంతే ఎందుకో తెలీదు..ఈ బంధమేంటో అంతకన్నా తెలీదు.
ఇక్కడి వరకు బాగానే వుంది..
కానీ ఈ బంధం ఎంతకాలం..ఎలా..?
నువ్వో అందమైన పొదరిల్లులో బందీవి..నేనో పదిలమైన బొమ్మరిల్లులో ఓ వస్తువుని.
రెండినిటికి పొంతన ఎలా కుదురుతుంది.
ఇది విధి ఆట..వింత ఆట..ఆ దేవుని బొమ్మలాటో తెలీదు కాని..ఆలోచిస్తే అంతరంగం బద్దలవుతోంది.
ఏం చేస్తున్నాను..ఏం చెయ్యాలి..?
నిన్ను వదులుకోలేక,నిజాన్ని బహిరంగంగా చెప్పలేక ఎంత నలిగిపోతున్నానో ఆ దేవుడికే తెలియాలి.
ఈ జ న్మకి ఇలాగే బతికేద్దాం..మళ్ళీ జ న్మంటూ వుంటే అప్పుడు నాకు అంతా నువ్వే,నీకు అంతా నేనే అని చెప్పాలని వుంది.
కాని నువ్వు తట్టుకోలేవు..
ఏం చెయ్యాలిరా దేవుడా అని ఏడుస్తున్నాను..నీకు తెలుసా..
కళ్ళవెంట అప్రయత్నయత్నంగా కారుతున్న కన్నీళ్ళు..చదువుతున్న ఉత్తరానికి ఓ విరామాన్నిచ్చాయి.
ఒక్కసారి శూ న్యంలోకి చూసి తన కంటిచెమ్మని అలా తుడుచుకొని మళ్ళీ చదవడం మొదలెట్టాడు.
నీ కళ్లలోకి చూసి సూటిగా చెప్పే దైర్యం నాకు వుందా..?తెలీదు..
ఇవన్నీ నీకు తెలియనివనికాదు..
నిన్ను చూస్తే గీతని భోదిస్తున్న ఆ పరమాత్ముడే గుర్తొస్తాడు.అలాంటి నీకు ఇన్ని మాటలు ఎలా చెప్పగలను.
నువ్వంటే నాకు ఇష్టం..కాదు ప్రాణం..కానీ నా సొంతం చేసుకోలేను కదా..
ఇది సమాజం ..దానికి కొన్ని,హద్దులు పరిమితులు వుంటాయి.దాటాలంటే దానిచుట్టూ ముళ్ళకంచెలుంటాయి.
ఇవన్నీ నీకు తెలిసినవే..
గాయత్రికి ఏం చెప్పాలి..ఎలా చెప్పాలి..
శ్రీరాం కి ఏం చెప్తాం..ఎలా చెప్తాం..
పోనీ అందరం కలిసి వుండగలమా..?
ఈ సమాజానికి సమాధానం ఎవరు చెబుతారు..ఎలా చెబుతారు..
న్యాయం,ధర్మం ఓ వైపు..ప్రేమ,అభిమానం మరోవైపు.
తరాజు ఎటు తూగుతుంది.
నా స్వాంతన కోసం నీ జీవితాన్ని బలి చేసుకోకు.
మొన్న ఒకరోజు శ్రీరాం పరిస్తితి చూస్తే భయమేసింది.ఏప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్తితి.
ఏం చెబితే ఎలా స్పందిస్తాడో..ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందో తెలియని వాతావరణం.
కష్టం వస్తే నువ్వు వస్తానంటావు..కానీ నాకు నా కష్టాన్ని చెప్పే ధైర్యం రావాలి కదా..
ఏం అర్ధం కావడం లేదు..అర్ధం చేసుకుంటావు కదూ..
నాకు తెలుసు కృష్ణా ..నువ్వు ఈ ఉత్తరం చదివిన తర్వాత  అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేనని.
కానీ..ఏం చేయను..?
అంటే ఈ ఉత్తరం ద్వారా తను ఏం చెప్పాలనుకుంటుంది..ఆలోచించాడు కృష్ణ.
నిన్ను వదులుకోలేననా..అలాగని కలిసుండలేమనా..
ఎలాంటి సంబంధం లేని ఎన్నో జంతువులు సఖ్యంగా బతుకుతున్నాయి..
మనుషులమైన మనం స్నేహంగా బతకలేమా..
ఆశ్చర్యంగా వుంది..
కాలం మారింది..సమాజం మారింది..మనిషి ఆలోచనలో మార్పు రాదా..
సమాజంలో అనుబంధాలన్నిటిని ఒకే కోణంలో చూస్తారా..
ఎన్ని ప్రశ్నలు..
ఎడ తెగని ఆలోచనలు.
జీవితంలో జరిగే అనేక సంఘటనలకి మన ప్రమేయం వుండదు.ఏవి ఎందుకు జరుగుతాయో మనకి తెలియదు.మనం నిమిత్తమాత్రుల్లా చూస్తూ వుండడమే.
ఉత్తరాలకి,మౌనానికి,పరోక్షానికి దొరకని సమాధానాలు ప్రత్యక్షానికి దొరకొచ్చు అనిపించింది.ప్రతీ సమస్యకి రెండు కోణాలు వుంటాయి.ప్రతి మనిషిలోను రెండు పార్శ్వాలుంటాయి.ఒక నాణానికి వుండే బొమ్మ,బొరుసు లాగ.
ఒక సారి సబర్మతీ తీరం నుంచి గోదావరి తీరానికి వెళ్ళి అక్కడి పరిస్తుతులు చూడాలనిపించింది.
ప్రస్తుతం తను వున్న పరిస్తితుల్లో తనకి మానసిక ప్రశాంతత చాలా అవసరం.
జీవితమే ఓ ప్రయాణంలా అనిపించింది.
ఏ బంధం ఏ తీరాలకు చేరుస్తుందో..ఎప్పుడు ఏ పరిచయం ఎలాంటి మలుపులకు దారితీస్తాయో మనం ఊహించలేం.అదే జీవితం.
జీవితమే ఓ రైలు బండిలాంటిది..మనమందరం అందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల్లాంటివాళ్ళం.ఎవరి గ మ్య స్తానం వచ్చినప్పుడు వాళ్ళు దిగుతుంటారు.ఇదీ అంతే మన ప్రయాణం ఈ లోకంలో వున్నంతవరకు మనం ప్రయాణించాల్సిందే.
ఇలాంటి ఆలోచనలన్నీ తుంపరతుంపరగా చుట్టుముడుతున్నాయి కృష్ణ మదిలో.
మర్నాడే ప్రయాణానమయ్యాడు కృష్ణ.
 నవజీవన్‌ ఎక్స్‌ ప్రెస్లో ప్రయాణం కొత్తగా అనిపించింది.
ప్రశాంతంగా గోదారి అందాలు చూసి ఎన్నాళ్లయిందో అనిపించింది.యాంత్రిక జీవితంలో పడి ఎన్నో అనుభూతుల్ని మనం కోల్పోతుంటాం.చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి కృష్ణకి.
పదవతరగతి పరీక్షలు పూర్తవడం..తర్వాత అందరూ కలిసి భద్రాచల రాముణ్ణి దర్శించుకోవడం.అక్కడే నాలుగురోజులు వుండడం.
ఆ శ్రీరామ చంద్రుని దర్శన భాగ్యం మళ్లీ ఇన్నాళ్లకు కలగుతుండడం..అదో అనిర్వచనీయమైన అనుభూతి అనిపించింది.
ఆ రోజుల్లో అమ్మ రాసిన రామకోటి అక్కడ సమర్పించడం..ఆ పర్ణశాల అందాలు చూడడం..అదో తెలిసీ తెలియని చిన్నతనం..ఆ మధుర స్మృతులు ఆ రైలుబండి ప్రయాణంలో అలా గుర్తొస్తున్నాయి కృష్ణకి.
ఆ రోజులు ఎలా వుండేవి..ఈ రోజులు ఎలా వున్నాయి.
యాంత్రికత ఎంతలా పెరిగింది..వేగం,సాంకేతికత ఎంతలా విస్తరించాయి..
ఈ ప్రవాహంలో మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయి..
ఓ రోజు ప్రయాణానికి అందుబాటులో లేని ఎన్ని మార్గాలు సృష్టించబడ్డాయి.ఒక రోజులో దేశాలు చుట్టి వచ్చేస్తున్నాం.
నిజంగానే అద్భుతాలు ఆవిష్కరించబడ్డాయి.అంతర్జాల ప్రభావం పల్లెల్లో కూడా కనిపిస్తుంది.ప్రపంచమే ఓ కుగ్రామంలా మారుతోంది.
సాంకేతికత జోరులో నాగరికతలో కూడా పెను మార్పులొచ్చాయి.అనేక పల్లెలు తమ ఉనికిని కోల్పోయాయి.వాణిజ్యమండళ్ళ ప్రభావంతో అనేక పంటపొలాలు ఆకాశహర్మ్యాలు తలపించే భవనాల ప్రాంగణాలగా మారిపోతున్నాయి.
ఎటువెళుతున్నామో తెలియడంలేదు.
ఇలా ఆలోచనల కడలిలో తేలివుండగానే తను దిగాల్సిన ఖమ్మం రైల్వేస్టేషన్‌ రానే వచ్చింది.
ఖమ్మం రైల్వేస్టేషన్‌ లో దిగి భద్రాచలం బస్సెక్కడానికి సిద్దంగా వున్నాడు కృష్ణ.
(సశేషం.)

No comments:

Post a Comment

Pages