శ్రీధరమాధురి – 34 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి – 34

Share This

శ్రీధరమాధురి – 34

 (గురువు గొప్పతనం గురించి పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు ) 


కొన్నిసార్లు మీరు గురువు వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన మీకు అసౌకర్యంగా ఉండే ప్రశ్నలు వెయ్యవచ్చు. అవి మిమ్మల్ని బలహీనతలను ఎత్తి చూపుతాయి, దానివల్ల మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోగలుగుతారు. ఇలా చేసినందున గురువుకు మీపై బెషరతైన ప్రేమ లేదని కాదు. ఆయన మిమ్మల్ని మరింత కఠినమైన పరీక్షకు గురిచేసి, తద్వారా ఒక విషయం పట్ల మీకున్న అవగాహన, యోగ్యతను గురించి పరిశీలిస్తున్నారు. ఇదంతా ఒక గురుకులంలో గురువు శిష్యుడికి పెట్టే సాధారణ పరీక్ష వంటిదే !
***
సద్గురువుతో అనుబంధమే స్వేచ్చకు దారి చూపే ఒకేఒక్క అనుబంధం. ఎందుకంటే సద్గురువే వెలుగు, ఆయనే స్వయంగా వాస్తవికమైనవారు.
***
సైనికులు బంగారు ఆభరణాలను మోస్తూ ఉండగా ఒక అడవిని దాటుతున్న రాజు, కేవలం ఒక గోచీతో పరమానందంతో ఉన్న ముసలాయన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
ఆయన అవధూత... స్వయంగా భగవంతుడైన దత్తత్రేయుడే.
***
ఒకసారి దక్షిణామూర్తి భగవానుడు సద్గురువుగా అవతరించారు. ఆయనకు ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ఆయన ఎన్నో మార్లు తన శిష్యులను దర్శించారు. వారితో సంప్రదింపులు జరిపారు. గతంలో తనతో శిష్యులకు ఉన్న దివ్యమైన అనుబంధం గురించి ఆయన వారికి ఎన్నో కధలను చెప్పారు. శిష్యులు ఆ కధలను కేవలం కధలుగా విన్నారు తప్ప, ఆయన చెప్పిన దానిపై ధ్యాస పెట్టలేదు. శిష్యులు పూర్తిగా అహం, స్వార్ధం, డాబుతో కూడుకుని ఉండి, ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ ఉన్నారు. వారిలోని స్వార్ధం, లోభం దైవం/సద్గురువు పూర్తిగా వ్యక్తిగతంగా తమకే చెందాలని కోరుకుంది.ప్రపంచంలో శాంతి సామరస్యాలను చాటేందుకు దైవమే సద్గురువు రూపంలో వచ్చారని వారు ఎన్నడూ గుర్తించలేదు. దైవం వారిలోని ప్రతి ఒక్కరికీ మానవాళికి, ప్రపంచానికి సేవ చేసిన తృప్తిని ఇవ్వాలనుకున్నారు. దీనివల్ల వారిలో అహం చెలరేగి , వారిలోవారు కొట్లాడుకునేలా చేసింది. దైవమే తమ మధ్యన మానవ రూపంలో ఉన్నారని వారు గుర్తించేసరికి, దైవం నవ్వి, అంతర్ధానమయ్యారు.
***
గురువు నుంచి దాక్కునే వాడు, ఇతరులకు కాదు కదా, తనకు తానే నిబద్ధతతో  ఉండలేడు.
***
ఒకవేళ గురువు చెప్పేది ఏదైనా మిమ్మల్ని గాయపరిస్తే, మీ దృక్పధాన్ని మార్చుకోండి, వీలు కాకపొతే గురువునే మార్చుకోండి.  
***
పిరికివారికి నిజమైన గురువులతో జీవించడం చాలా కష్టం. కాని, నాతో ఎవరైనా జీవించవచ్చు.గురువు ఎవరికైనా ఇచ్చిన వాటికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. అది నిశ్చయంగా జీవితంలో మీ భారాన్ని లేక ప్రారబ్ధాన్ని పెంచేది కాదు. బహుశా, ఆయన ఎందుకిచ్చారో మీకు అర్ధంకాక పోవచ్చు. నిజానికి, అర్ధం చేసుకోవలసిన అవసరం కూడా లేదు.
***
కేవలం ధైర్యవంతులే, గురువు అడుగుజాడల్లో నడవగలరు.
*** 
 మీ గురువుని, మీ ఆలోచనా విధానాలను సమర్ధించేటప్పుడు, ఇతర గురుకులాలను కించపరచకుండా శ్రద్ధ వహించండి. మీ గురుకులంలోని పద్ధతులను సమర్ధించడంలో తప్పులేదు, కాని ఇతర గురుకులాలను దిగజార్చకండి. దైవం దృష్టిలో అన్ని గురుకులాలు తన నుంచే ఉద్భవించాయి, ప్రతీదీ ప్రత్యేకమైనదే. అన్ని గురుకులాలను భక్తితో గౌరవించాలి, ఎందుకంటే అన్నిటికీ దైవమే రూపకర్త, అధిపతి.
***
జీవితంలో మీ ఇబ్బందుల్లో, ఒత్తిడిలో మీతో కలిసి నడవడంలో దైవం, గురువులూ నాకు శిక్షణ ఇచ్చారు. గుర్తుంచుకోండి, మీరు సంతోషంగా ఉన్నప్పుడు, మీ సేవలు ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు ఎంతో అవసరం.
***
ఈ ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. ఎన్నో ఆలోచనల సంప్రదాయాలు ఉన్నాయి. అన్ని దారులు ‘నిర్వాణ’ వైపు, అంటే దైవం వైపే తీసుకువెళ్తాయి. ప్రతి సద్గురువుకు తన గురుకులాన్ని బలోపేతం చేసి చెప్పే స్వంత మార్గాలు ఉంటాయి. దానికి అర్ధం ఇతర గురుకులాలు తక్కువవనో, వాటిని పాటించేవారు అనాగారికులనో కాదు. ఏ నిజమైన గురువూ మానవత్వాన్ని విభజించరు, వారి విధానాలు చాలా దైవీకంగా ఉంటాయి. ఒకే గురుకులాన్ని అంటిపెట్టుకోండి. ప్రశ్నించాలేనంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండండి. గురువు అడుగుజాడల్లో నడవండి. ‘నిర్వికల్ప సమాధి’ అనే దైవంలో లీనమయ్యే దివ్యమైన స్థితికి చేరుకోండి.
***
బాధాకరంగా, ‘విశ్వాసం’ అనే పదాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటారు. ‘విశ్వాసం’తో ఉండడం అంటే, మీరు కోరినవన్నీ జరుగుతాయని అర్ధం కాదు. మీకు గురువు/దైవం పై విశ్వాసముంటే, మీకు ఏది జరిగినా, అది మీరు ఆశించినట్లుగా జరగకపోయినా,  అది మీమంచికే అన్న భావనతో దాన్ని మీరు పూర్తిగా అంగీకరిస్తారు.
***
  అతనికి మంచి ఉద్యోగం ఉంది. హఠాత్తుగా అతను పెద్ద ఆధ్యాత్మిక తత్వాల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని చుట్టూ ఉన్నవారు అతనికి సద్గురువు అనే స్థానానికి పదోన్నతిని ఇచ్చారు. ఇప్పుడతని ఉద్యోగం పోయింది. పాపం... బాధపడుతున్నాడు. అతనికి గురువనే ఉద్యోగం పోయి ఇంతకు ముందు చేసిన ఉద్యోగం రావాలని మా ప్రార్ధనలు.
***
నాతో ఎవరు ఎంత దూరం వరకు పయనించాలి అనేది ముందుగానే దైవం నిర్ణయించారు. ఒక ప్రయోగిగా, నాకు ఈ నిజం బాగా తెలుసు, సంఖ్యలను గురించి చింతించేందుకు నేను రాజకీయ నాయకుడిని కాదు. సంఖ్యల గురించి మాట్లాడే వారిని చూసి నేను నవ్వకుండా ఉండలేను. ఆ విధంగా దైవం నాకు కల్పించే వినోదానికి నేను దైవానికి కృతజ్ఞుడనై ఉంటాను.  
***
పండితులకి ఆధ్యాత్మిక గురువులకు మధ్య భూమికి, ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉంది. ఒకరినొకరనుకుని   భ్రమపడకండి. కొంతమంది పండితులు, సద్గురువులుగా నటిస్తారు, కాని మీరు అప్రమత్తంగా ఉంటే, మీరే తేడాలను గమనించగలరు.
***

No comments:

Post a Comment

Pages