నిమ్మకాయ ప్రేమికుడు - అచ్చంగా తెలుగు

నిమ్మకాయ ప్రేమికుడు

మా బాపట్ల కధలు – 10

భావరాజు పద్మిని 


‘శిఖరం వారి వీధి’ అని మా వీధికి పేరు. ఒకప్పుడున్న గడియారపు స్థంభం సెంటర్ నుంచి కాస్త ముందుకు వస్తే పోస్ట్ ఆఫీస్ దాటగానే వచ్చే మొదటి సందు మాదే. బ్రిటిష్ వారు కరణీకాలు ఇచ్చే రోజుల్లో సమర్ధవంతంగా పనిచేసి, వాళ్ళ చేత వెండి తొడుగున్న చేతికర్ర అందుకున్న ఘనులు శ్రీ శిఖరం వెంకట శేషాచలపతిరావు గారు. వారి పేరు మీదనే మా వీధికి ‘శిఖరం వారి వీధి’ అన్న పేరొచ్చింది. వాళ్ళ ఇల్లు మా బామ్మా వాళ్ళ ఇంటికి ఎదురే ఉండేది. వారసత్వంగా వచ్చిన శేషాచలపతిరావు గారి ఇంటిని ఆయన మనుమలు మూడు భాగాలుగా పంచుకున్నారు.
ఇంజనీరింగ్ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ, హోం సైన్సు కాలేజీ, వ్యవసాయ కళాశాల ఇలా ఆని అన్ని రకాల ఉన్నత విద్యా అందుబాటులో ఉండడంతో మా బాపట్ల పెద్ద విద్యా కేంద్రంగా ఉండేది. చదువులకు వచ్చే పోయే వలస పక్షుల వంటి విద్యార్ధులకు అప్పట్లో సరైన హాస్టల్ కాని, వసతి సదుపాయాలు కాని ఉండేవి కాదు. అందుకని, ముగ్గురు నలుగురు విద్యార్ధులు కలిసి ఓ గదిని అద్దెకు తీసుకుని, బయట మెస్ లో తినేవారు లేక వంటమనిషిని పెట్టుకుని, వండించుకుని తినేవారు. వేన్నీళ్ళకు చన్నీళ్ళలా పెద్ద సంసారాల ఖర్చులకి కాసిన్ని డబ్బులు సమకూరుతూ ఉండడంతో, దాదాపు అందరూ ఇంట్లో ఒక్క గదినైనా కురాళ్ళకి అద్దెలకి ఇచ్చేవారు. ‘బ్రహ్మచారీ శతమర్కటః’ అన్న చందాన దిట్టంగా నూనె రాసుకుని, పక్కపాపిడి తీసుకుని, నుదుట బొట్టు పెట్టుకుని, బుద్ధిమంతుడు సినిమాలో హీరోలా వచ్చి, గది అద్దెకు అడిగే విద్యార్ధులు, దరిమిలా ఆర్నెల్లు సావాసం చేసేసారికి కొత్త సినిమాలో ‘నువ్వెంత అంటే నేనెంత?’ అని తిరగబడే జులాయి హీరోలా తయారయ్యేవారు. ఇక వచ్చే పోయే ఆడ, మగ స్నేహితులు, కంబైన్డ్ స్టడీస్ పేరుతో అర్ధరాత్రి వాళ్ళ అరుపులూ కేకలతో, ఇల్లు కిష్కిందలాగా తయారయ్యింది. కుర్రాళ్ళని నయాన్నో, భయాన్నో ఒప్పించి, రాత్రి ఇంటి గేట్లు మూసేసి, ఎన్నెన్నో సరికొత్త మిలటరీ రూల్స్ పెట్టి, ఇల్లిచ్చిన ఖర్మానికి సొంతిళ్ళ వాళ్ళు ఎన్నో పాట్లు పడాల్సి వచ్చేది. అయినా చదువుల రెక్కల ఆలంబనతో నిబ్బరంగా ఎగిరే విద్యార్ధులు, మళ్ళీ వచ్చి వాలే కొత్త విద్యార్ధులు, మళ్ళీ కొత్త నమ్మకాలు, అపనమ్మకాలు, ఇలా ప్రవాహినిలా సాగిపోయేది ఈ పరంపర.
****
డాబా మీద రాత్రి మబ్బులతో దోబూచులాడే చందమామను చూస్తూ, సప్తర్షి మండలం ఎక్కడుందో వెతుక్కుంటూ, సాయంత్రం చల్లదనం కోసం నీళ్ళుపోసి కడిగిన డాబా మీద వరుసగా పక్కలు పరచుకుని, పడుకోవడంలో ఉన్న అనుభూతి ఏ ఫైవ్ స్టార్ హోటల్ గదిలోనూ రాదు. ఏపుగా ఎదిగిన యూకలిప్టస్ చెట్టు కొమ్మల్లోంచి గాలి మోసుకువచ్చే ఔషధ భరితమైన పరిమళాన్ని, అరవిచ్చిన ముద్దగన్నేరు కొమ్మల్లోంచి వచ్చే వగరు సుగంధాన్ని ఆస్వాదిస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, నిద్రపోయేసరికి రాత్రి ఏ పన్నెండో అయ్యేది. మళ్ళీ ఉదయం ఆరుగంటల కల్లా ఒకప్రక్క మా భావన్నారాయణ స్వామి గాలిగోపురం మీద ఉన్న మైక్ ల నుంచి ఒచ్చే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారి పాటలు, మరోప్రక్క ఉదయభానుడి లేత కిరణాల స్పర్శ, ‘తెల్లారింది లెగండోయ్’ అని నిండా కప్పుకున్న ముసుగుల తెరలను చీల్చి, సుప్తావస్తలో ఉన్న జీవులను మేల్కొల్పేవి.
ల్యాండ్ లైన్లు కూడా సరిగ్గా లేక ట్రంక్ కాల్స్ నడిచే కాలం. ఉత్తరాలు, టెలిగ్రాంల కాలం. అప్పుడు నాకో 12 -14 ఏళ్ళు ఉంటాయేమో! అలా నిద్ర లేచి బద్ధకంగా దొర్లుతూ చూస్తున్నాను నేను. అరె, నా పక్క మీద ఏదో వస్తువు ఉన్నట్లు మోచేతిని చల్లగా తాకింది. లేచి చూద్దును కదా, నిమ్మకాయ... బామ్మ దేనికో తెచ్చి ఉంటుందిలే, అనుకున్నాను. పోన్లే, వాసన చుద్దామనుకుని, కాస్త నిశితంగా పరిశీలిస్తే, దానిమీద ఎర్రటి పెన్నుతో ఏదో రాసున్నట్లు కూడా ఉంది. నిద్రంతా ఎగిరిపోయి గభాలున లేచి కూర్చున్నాను. ఇంతలో ఆదరాబాదరాగా అక్కడికి పరిగెత్తుకువచ్చిన మా పనిమనిషి పోలమ్మ, “అమ్మాయిగోరూ...” అంటూ నిల్చుండిపోయింది.
“ఏమైంది పోలమ్మా, ఈ నిమ్మకాయేంటి? ఎక్కడ నుంచి వచ్చింది? నీకేమైనా తెలుసా?”
“అమ్మాయిగోరూ, అదీ... ఓ వారం రోజుల నుంచి, ఎవరో మన డాబా మీద యేడనుంచో నిమ్మకాయ పడేత్తన్నారమ్మా, దాని మీద ఐ లవ్ యు ‘ అని ఎర్రటి పెన్నుతో రాత్తన్నారంట. మనింటికి ఇప్పుడు సెలవలకు వచ్చిన త్రివేణమ్మ కోసమో, లేక పెళ్లి సంబంధాలు చూసేందుకు బామ్మ గోరు తెచ్చిన జానకమ్మ కోసమో తెలవట్లేదు. అడిగితే వోల్లకీ తెల్వదన్నారు. పెద్దోల్లకి తెలిస్తే ఊరికే అల్లరని, నన్ను బామ్మగోరికి సేప్పద్దన్నారు. మీరు లేచేలోపు నిమ్మకాయలు తీసి, పడేస్తన్నాను. ఇవోల మన కూరల మార్కెట్టు తెరిసేది ఆలీసమైందో లేక ఆ అబ్బాయిగోరెవరో లేవటం లేటయిందో గాని, నిమ్మకాయ మీకు దొరికింది, బామ్మ గోరికి సేప్పకండే. జేబులో సొత్తు కాలీ ఐతే ఆ బాబుగోరే ఊర్కుంటారు. మామంచోరు కదూ.” గడ్డం పుచ్చుకు బతిమాలసాగింది పొలమ్మ.
నాకు నవ్వాగలేదు. “సర్లే పోలమ్మా. కాని, ఏవిటిది ? నిమ్మకాయతో ప్రేమలేఖా ? ఓహో బాగుందే ! ఇది ఇంతవరకూ ఏ సినిమాలోనూ వాడలేదే ! వీడి క్రియేటివిటీ సంతకెళ్ళ ! సర్లే బామ్మకి చెప్పను కాని, శుభ్రమైన నిమ్మకాయలు పారేసుకోవడం ఎందుకే? ఈ నిమ్మకాయ డిప్పలో ఉన్న ప్రేమని పిండుకు తాగేసి, మన నరనరాల్లోనూ శక్తి నింపేసుకోవచ్చు కదా ! ‘నిమ్మకాయ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ!’ అని గట్టిగా అరవచ్చు కూడాను. నేను పళ్ళు తోముకోస్తా, నువ్వు నిమ్మకాయ రసం పట్రా !” అన్నాను.
“అట్టాగేనమ్మా...”అంటూ బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయింది సగం అర్ధమయ్యి, కానట్లున్న పొలమ్మ. ఆ తర్వాత చేప మేడ కింద దుప్పటి పరిచి ఆడే ఆటల్లో, మాటల్లో కూడా నిమ్మకాయ మీద జోకులేసుకుని ఫక్కున నవ్వుకునేవాళ్ళం. ఈ నిమ్మకాయ ఎటునుంచి పడుతోందో కనిపెట్టడానికి పొద్దుటే నిద్రపోతున్నట్టు నటిస్తూ, దుప్పటీ సందుల్లోంచి చూస్తూ, మా ‘ఆలూరి డిటెక్టివ్ ఏజెన్సీ’ చేసిన పరిశోధనలో ఆ నిమ్మకాయ ఎదురు కరణం గారి డాబా మీదనుంచే పడుతోందని కనుగొన్నాము. కాని, అది వేసేది అందులో ఉండే కుర్రాళ్ళో, వాళ్ళ స్నేహితులో తెలీలేదు. మా పరిశోధనలో మేము మునిగిఉన్నాం కాని, మా గుట్టు అంత త్వరగా బయటపడుతుందని మేము ఊహించలేదు!
ఓ శుభోదయాన, , ఆ ప్రేమికుడు ఎక్కుపెట్టి వదిలిన నిమ్మకాయ ప్రేమబాణం, నులకమంచం మీద అప్పుడే నిద్దర్లేచి ఆవులిస్తూ బద్ధకంగా కూర్చున్న మా బామ్మ వీపు మీద గురితప్పి పడనే పడింది ! తటాలున నిమ్మకాయను పరిశీలించి, వెంటనే అడిరిపడ్డ మా బామ్మ దండకం మొదలెట్టేసింది.
“హయ్యో, హయ్యో, ఓరి వీడి అఘాయిత్యం కూలా ! ఎవడో ముదనష్టపు వెధవ, మనింటిమీద చేతబడి చేస్తున్నాడే! మంత్రించిన నిమ్మకాయలు వేస్తున్నాడే ! నా కాళ్ళూ, చేతులూ ఆడట్లేదు. ఒసేయ్ నిద్రపోతు మనవరాళ్ళలారా ! లేవండే ! ఎవడో ఎర్రటి కుంకుమ పూసిన నిమ్మకాయ వేసి చచ్చాడే ! ఇల్లు శుద్ధి చెయ్యాలి, పంతులుగార్ని పిలిపించాలి. మీ అందరికీ ఆంజనేయస్వామి గుడి దగ్గరున్న మంత్రాల సుబ్బారావుతో తాయత్తులు కట్టించాలి. ఓరి దేవుడా, నా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి.”
బామ్మ పొలికేకలకు లేచి కూర్చున్న మేము ఒకరి మొహాలు ఒకరం చూసుకుని, నవ్వాపుకోలేక పగలబడి నవ్వసాగాము.
“సిగ్గుమాలిన రకాలమ్మా. ఇక్కడ నేను గుండెలదిరి చస్తుంటే, నవ్వొస్తోందే మీకు? అంట్ల పీనుగు పక్షుల్లారా ?”
కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిట్టడంలో మా బామ్మ మాణిక్యమ్మ గారు స్పెషలిస్ట్. ఆవిడ మాటలకు మేము విరగబడి నవ్వసాగాము. మమ్మల్ని చూసి, ఇంకేదో విషయం ఉందని, బామ్మకి అర్ధమైపోయింది.
“ఏవైందే? ఆ నవ్వులేంటి? చెప్తారా, పాము కర్రతో నాలుగు తగిలించమంటారా?” పాము తలకాయ ఉన్న ఆ చేతికర్ర పేరు వినగానే మాలో బెదురు పుట్టింది. నెమ్మదిగా అసలు సంగతి చెప్పసాగాము.
“బామ్మా, అదీ... చేతబడి కాదే ! నిమ్మకాయ ప్రేమలేఖ. ఇది చేతబడి కుంకుమ కాదు, ఎర్రటి ఇంకు పెన్నుతో  రాసిన అక్షరాలు. మంచుకు తడిసి, అలా అవుతోంది. మనింట్లో ఉన్న ఏ ఆడపిల్ల కోసమో ఎవరో వేస్తున్నారు. కరణం గారి డాబా మీదనుంచేనని మా అనుమానం. ఓ పది రోజులనుంచి మొదలైంది...” అన్నాము బామ్మ ఏమంటుందోనని భయంగా వణుకుతూ.
“ఏవిటేవిటీ? నిమ్మకాయ ప్రేమలేఖా ? అదీ దానిమీద ఎర్రటి పెన్నుతోనా ? ఎవడే ఆ అప్రాచ్యపు కుంక? పూర్వ జన్మలో చేతబడి ముగ్గులేసుకునుంటాడు తింగర శుంఠ ! లేకపోతే వేరే ఏ రంగు పెన్నూ దొరకనట్టు ఎరుపు రంగే దొరికిందా  ముదనష్టపు గన్నాయ్ కి? నా ఇంట్లో ఉన్న ఆడపిల్లల మీదే కన్నేస్తాడా త్రాష్టపు వెధవ? ఎవడో దొరకనీ చెప్తా, వాడి గుడ్లు పీకి, గుమ్మంలో ముగ్గేసి పెట్టిన గొబ్బెమ్మ మీద గన్నేరు పువ్వుల్లా పెడతాను. ఎంత ధైర్యం వాడికి?”
బామ్మ తిట్లకి పడీపడీ నవ్వసాగాము. మమ్మల్ని చూసి, ఆవిడా నవ్వేస్తూ, “సర్లే... కూరల రేట్లు మండిపోతున్నాయి. ఆ నెలతక్కువ సోంబేరి గాడెవడో తెలిస్తే, నిమ్మకాయతో పాటు కాసిన్ని బాపట్ల వంకాయలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు... అన్నీ విసరమనండి. అట్టే మొహమాట పడకుండా, ఓ రెండు కిలోలు విసరమనండి. కాస్త ఖర్చు తప్పుతుంది...” అంటున్న బామ్మ మాటలకు అడ్డమొస్తూ... “బామ్మా... బూడిద గుమ్మడికాయ కూడా విసరమంటావా? కాని, అది నీకు తగిల్తే నొప్పెడుతుంది కదా !” అడిగింది మా పెద్దకోతి. అందరం పగలబడి నవ్వసాగాము.
“ఛస్... అల్లరి కోతి పిల్ల రాకాసుల్లారా. పొండి, పోయి మొహాలు కడుక్కోండి,” మందలిస్తూ, నవ్వాపుకుంటూ ఆవిడా మేడ దిగింది.
*****
డాబా మీదకి పాకిన పెద్ద మల్లె తీగ నుంచి మల్లెపూలు కోసుకురమ్మని ఆ రోజున బామ్మ పంపడంతో వెళ్లాను.
“హమ్మయ్యో, చచ్చాన్రోయ్...” పెద్దగా తాత అరవడంతో, ఏమైందోనన్న ఆత్రంలో కిందికి పరుగెత్తాను. అప్పటికే అక్కడ మా పటాలమంతా మూగి నవ్వుతున్నారు. తాత చేతిలో ఉన్న నిమ్మకాయ, బట్టతల మీదున్న చిన్న బొప్పి  చూడగానే, అక్కడ జరిగింది ఏమిటో వెంటనే అర్ధమయ్యి, నేనూ నవ్వసాగాను. ఆ రోజు నిమ్మకాయ బాణం శక్తిహీనమై, వేగం తగ్గి, డాబా మీద పడాల్సింది పోయి, గురితప్పి, వసారాలో వట్టివేళ్ళు కట్టే పెద్ద ఊచల్లేని కిటికీల్లోంచి సూటిగా వచ్చి, అక్కడుండే ఆఫీస్ లో ఏదో క్రిమినల్ కేసు చూస్తున్న మా తాత బట్టతల మీద పడింది. బాధతో ఉన్న ఆయన ముందు అట్టే నవ్వితే బాగోదని, మేమంతా అటూ ఇటూ పరిగెత్తి నవ్వసాగాము.
“కొట్టాడూ... నా మొగుడ్నీ కొట్టాడూ... వాడి చేతులు కొండ కోతులు పీక్కెళ్ళ ! వాడిని బ్రహ్మరాక్షసుడు బానిసగా ఎత్తుకుపోనూ ! ఒరేయ్ ప్రేమ పిచ్చితో పూనకం వచ్చి గంతులేస్తున్న పోతురాజు వెధవా ? దమ్ముంటే నా ముందుకు రారా, తేల్చుకుందాం !” ఇంటి కప్పు ఎగిరిపోయేలా అరవసాగింది బామ్మ.
“ఏవిటే పోలేరమ్మ పూనినట్టు ఆ అంకమ్మ శివాలు. నిమ్మకాయేంటి, ప్రేమేంటి, ఆ అర్ధం పర్ధం లేని జీవజంతువుల శాపనార్ధాలేంటి ? అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఓ పక్క నొప్పెట్టి చస్తుంటే, ఎదురింటి వైపు చూసి, అరుస్తావేంటి ?” అయోమయంగా అడిగారు తాత.
కోపంతో బుసలు కొడుతూనే, తిట్లతో అక్షింతలేస్తూనే మధ్య మధ్య నవ్వుతూ జరిగింది చెప్పింది బామ్మ. ఇవతల   కడుపులు పట్టుకు నవ్వాపుకోలేక చస్తున్నాము మేము.
“భేష్... నిమ్మకాయ ప్రేమ. అలాగే నిమ్మకాయ పెళ్ళిళ్ళు, నిమ్మకాయ ఖూనీలు, నిమ్మకాయ విడాకులు కూడా వస్తే, ఇంకా నాకు బోల్డన్ని కేసులొస్తాయే మాణిక్యం. పోన్లే, వేస్తే వేసాడు కానీ, ఇంతమంది ఉన్న ఇంట్లో, అదీ వేసంకాలంలో ఒక్క నిమ్మకాయ పడేస్తే ఎలాగే? తల ఒక్కింటికీ ఒక్కో నిమ్మకాయ లెక్కెట్టి వెయ్యమను. హాయిగా నిమ్మకాయ చారు, ఖారం, పప్పు, రసం చేసుకు తాగుదాం. ఏవిటీ?” కోపంతో ఉన్న బామ్మని కవ్విస్తూ అన్నారు తాత.
“చాల్చాల్లెండి సంబడం. ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే ... చుట్టకి నిప్పడిగాడట ఒకడు. మీ క్రిమినల్ లాయర్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఓ పక్క ఈ తొలిపొద్దు త్రాష్టపు సన్నాసి ఎవడో తెలీక చస్తుంటే, నిమ్మకాయతో విందుభోజనం ఆరగించడానికి ఎత్తులేస్తున్నారు. ముందా కరణం గారింట్లో కుర్రాళ్ళని దీని గురించి కనుక్కోండి.” గదమాయించింది బామ్మ. తాత వాళ్ళని అడిగినా, మేమంతా ‘అన్నయ్య’ అని పిలిచే వాళ్ళ నుంచీ ఏ జవాబూ రాలేదు. వాళ్ళ మిత్రుల పనేమో, లేక తెల్లారట్ట ఎవరూ చూడకుండా బయటికున్న డాబామెట్లు ఎక్కి ఎవరైనా చాటుగా చేసే పనో, తెలీలేదు. మొత్తానికి నిమ్మకాయల ప్రేమ వర్షం అలాగే కురవసాగింది.
****
భావన్నారాయణ స్వామి గుడికి బయల్దేరాము నేను, త్రివేణక్క. వెనగ్గా ఎవరో కుర్రాళ్ళు వస్తున్నట్టు అనిపించింది. మెల్లిగా వాళ్ళ మాటలు కూడా వినవస్తున్నాయి.
“ఏరా బావా ! నిమ్మకాయలు ఈ మధ్యన బాగా రేటు పెరిగిపోయాయిరా !”
“పోన్లేరా బావా, చరిత్రలో ప్రేమికులు ప్రేమకోసం గొప్ప గొప్ప త్యాగాలు చేసారు, నువ్విదీ చెయ్యలేవా ? ఓ పని చెయ్యి. నిమ్మకాయ చెట్టునే పాతేసేయ్. దండిగా దొరుకుతాయ్ కాయలు...”
“లాభం లేదురా, బావా, నిమ్మకాయతో అదృష్టం కలిసి రాలేదు. ఎన్ని నిమ్మకాయలేసినా నా ప్రేమిక కన్నైనా ఎత్తి చూడలేదు. ఇక ఏ వాక్కాయలో, దొండకాయలో వేసి చూస్తా...”
వాళ్ళ మాటలకు చప్పున తలతిప్పి చూసాము నేనూ అక్కా. నల్లగా, బక్కపల్చగా ఉన్న ఓ కుర్రాడు, త్రివేణి అక్కయ్య చూడగానే రోడ్డుమీదే సిగ్గు పడిపోతూ మెలికలు తిరిగిపోసాగాడు. అతన్ని ఎప్పుడూ చూసిన గుర్తే లేదు.
“ఒసేయ్... ఇలా రా. చూడు, ఇవాళ వీడిని తాతకి పట్టిద్దాము. నేను అటు చూసి, ఓ నవ్వు విసురుతాను. దానికి పడిపోయి, గుడి నుంచి మనల్ని ఇంటిదాకా జాగర్తగా దిగబెడతాడు. నేను ఇంటిముందు కిళ్ళీ కొట్టు దగ్గరాగుతాను. నువ్వు పైకెళ్ళి తాతకి చెప్పి తీసుకురా, సరేనా ?” అంది అక్క. పధకాన్ని ఆమోదిస్తూ తలూపాను నేను.
అలా మా వెంట ఇంటిదాకా వచ్చి మూల నిలబడ్డ అతన్ని మేడ మీదనుంచి తాతకి చూపించాను. ఇంటి ముందున్న టీ కొట్టు బాబు ద్వారా అతన్ని రప్పించి, “ఒరేయ్ గట్టిగా గాలేస్తే ఎగిరిపోతావ్... నీకు త్రివేణి కావాల్సి ఒచ్చిందా ? చింతపండు డబ్బాలా ఉన్నావ్, చీకట్లో కలసిపోయి, ఎదురింటి డాబామీంచి నిమ్మకాయేసి, నా మీద హత్యా ప్రయత్నం చేసావని పోలీసులకి ఓ మాట చెప్పానంటే, బొక్కలో తోసి మక్కెలిరగ్గొడతారు... ఇంకో సారి ఈ వీధిలో కనిపించావో, నాకు తెల్సిన సెక్షన్లు అన్నీ నీమీద పెట్టేసి, నీకు చట్టంలో ఉన్న శిక్షలన్నీ వేయించేస్తా జాగ్రత్త. ఈ సారికి ఒదిలేస్తున్నా పో...” గట్టిగా బెదిరించారు తాత.
గట్టిగా వెనక్కు లాగి వదిలిన బాణంలా, సీసాలో వెలిగించిన తారాజువ్వలా వేగంగా వెనక్కి తిరక్కుండా పారిపోయిన ఆ నిమ్మకాయ ప్రేమికుడు... మరెప్పుడూ, మా ఎవరి కంటా పడలేదు. కాని, నిమ్మకాయలు కోస్తున్నప్పుడల్లా ఈ విచిత్రమైన వాస్తవ కధనం గుర్తొచ్చి, నా పెదవులమీద చిరునవ్వు పూస్తుంది.
****

No comments:

Post a Comment

Pages