హనుమ ఓ అర్ధం కాని ప్రశ్న - అచ్చంగా తెలుగు

హనుమ ఓ అర్ధం కాని ప్రశ్న

Share This

హనుమ ఓ అర్ధం కాని ప్రశ్న

రావి కిరణ్ కుమార్ 


హనుమాన్ ఓ సుందర రూపం మనసును ఇట్టే ఆకర్షించే దైవం. వయసుతో నిమిత్తం లేకుండా అందరు ఇష్ట పడే తమ వాడి గా భావించుకునే ఓ ఆత్మీయ నేస్తం.
ఆయనేమీ శ్రీరాముని వలె ఆజాను బాహుడు కాదు తామర రేకుల వంటి కనులు కల వాడు కాదు. శ్రీకృష్ణుని వలె పారిజాత సుమాలను ధరించి కస్తూరి పరిమళాలతో ఒప్పారు లలితమైన దేహ సౌందర్యం కల వాడు కాదు. ఓ వానరుడు మరి నరులనే కాదు నానా రకాల జీవాలను సైతం ఎలా తన వైపు ఆకర్షించుకోగలుగుతున్నాడు  ?
అంటే మన మనసులను ఆకర్షించేదేమిటి శారీరక సౌందర్యమా లేక వ్యక్తిత్వపు సౌందర్యమా శారీరిక సౌందర్యమైతే   హనుమ వైపు మనసు ఎందుకలా పరుగులు తీస్తుంది. ఆయనను చూడగానే మనసులో ఏదో తెలియని ఆత్మీయ భావం ఉప్పొంగుతుంది. పరిశీలిస్తే ఆయన వైభవమంతా ఆయన మాట తీరు లోను నడవడిక లోను అడుగడుగునా ప్రతిఫలిస్తుంది. మనం మాట్లాడితే మన మాటకు ముఖం లో కనిపించే భావాలకు పొంతన వుండదు. ఎదుట మనిషి ముఖం లోకి చూస్తూ ఓ నిమిషమైన మాట్లాడలేము.
కాని ఆయన మాట్లాడిన మొదటి సారే శ్రీరాముని చేత ఇంతటి వ్యాకరణ పండితుడు మరొకరు లేరని కితాబు నిప్పించుకోగాలిగారు. స్పష్టత తో కూడిన మృదువైన వాక్కు , ఎటువంటి వికారాలు పలికించని ముఖ కవళికలు ఆయన సొంతం. సమయానుకూలం గా ఎల్లపుడు హితకరమైన వచనాలు పలుకటం , మాటలో వినయాన్ని ప్రదర్శించటం , ఎంత సాధించిన అహంకారం దరి చేర నీయకుండ అణుకువతొ వ్యవహరించటం, చేపట్టిన పని మీద అమిత శ్రద్ద ఆసక్తి కలిగి వుండటం , మద్యలో ఎటువంటి ఆకర్షణలు కలిగినా లొంగక పోవటం, చక్కని విషయ పరిజ్ఞానం కలిగి వుండటం , సమయోచితమైన సలహాలు ఇవ్వగల నేర్పు ఇవన్ని ఒక్క మనిషిలో చూడాలనుకుంటే ఆ రూపమే హనుమ.
ఒకానొక వేళ ఇంద్రుడు అర్జునుడు గరుడుడు ఆదిశేషుడు  ప్రహ్లాదుడు వీరంతా అహంకరించిన వారే కాని అహంకారమన్నది దరి చేరని ఒకే ఒక్క మూర్తి హనుమ ఆయనలోని సుగుణాలన్నీ ఆయన దేహాన్ని కాంతివంతం చేసి మనలను ఆయన వైపుకు ఆకర్షించు కోగలుగుతున్నాయి. మనం కుడా ఇలాంటి సుగుణ సంపద పెంచుకుంటే మన దేహాలు కూడా కాంతి పుంజాలై  వెలుగొందుతాయి మల్లెల పరిమళాలను అక్కడ ప్రసరించే వాయువు ఆ ప్రాంతమంతా వ్యాపింప చేసినట్లు మన మనసులోని ఉదాత్త భావాల పరిమళాలను మన లో చరించే వాయువు మన దేహమంతా వ్యాపింప చేసి మన శరీరాలను ఆకర్షణీయం గా చేస్తుంది.
శారీరిక సౌందర్యపు ఆకర్షణ తాత్కాలిక ఉద్రేకం లోనుండి పుడుతుంది అది నిలిచేది అతి కొద్ది కాలం అది సంతోషాన్ని ఇవ్వలేదు
కాని వికసించిన వ్యక్తిత్వపు సౌందర్య ఆకర్షణ ఎవ్వరినైన ఇట్టే కట్టి పడేస్తుంది . కలకాలం నిలిచి వుంటుంది. ఇదే హనుమ మనకు నేర్పేది..... నా అర్ధం కాని ప్రశ్నకు హనుమ ఇచ్చిన అర్ధవంతమైన సమాధానం.
******

No comments:

Post a Comment

Pages