శ్రీ రామకర్ణామృతం - 12 - అచ్చంగా తెలుగు

శ్రీ రామకర్ణామృతం - 12

Share This

శ్రీ రామకర్ణామృతం - 12

డా.బల్లూరి ఉమాదేవి కామవరం

11.శ్లో:శతాష్ట దివ్య స్థల మూర్తి వందితం శ్రతక్రతు బ్రహ్మ మరుద్గణార్పితం శశాంక వైశ్వానర భానుమండల స్థితం భజేహం రఘువంశ వర్ధనం.
తెలుగు అనువాద పద్యము : చ:అమలశతాష్ట దివ్య నిలయ స్థితు వారిజ సంభవాంబు భృ ద్గమనముఖామరార్చితు సుధాకర వహ్ని పతైగ మండల స్తిమితు రఘూద్వహున్ కనక చేలు గృపాలుని నీలు దైత్యసం తమస దినేశు రామజననాథు భజించెద నిష్టసిద్ధికిన్.
భావము:
అనేక దివ్యస్థలములందు విగ్రహరూపములుగా నమస్కరింపబడుచున్నట్టి..ఇంద్రుడు బ్రహ్మ మొదలైన దేవతలచే నమస్కరింపబడునట్టి సూర్యచంద్రాగ్నుల యందున్నట్టి,రఘువంశమును వృద్ధి చేయునట్టి రాముని సేవించుచున్నాను.
12.శ్లో:కర్ణాంత విశ్రాంత ధనుర్గుణాంక కలంబలక్షీ కృత రాక్షసేశ్వరమ్ వృద్ధశ్రవ స్యందన మధ్య సంస్థం రూక్షేక్షణం రామ మహం నమామి.
తెలుగు అనువాద పద్యము : శా:పాకారాతి శతాంగ మెక్కి రణభూభాగంబు గంపింపగా నాకర్ణాంత ధనుర్విముక్త ధృఢబ్రహ్మాస్త్రంబునన్ రావణున్ లోకంబులు వినుతింప ద్రుంచిన బుధ శ్లోకున్ సరోషాంబకున్ గాకుత్ స్థాన్వయ దుగ్ధవారినిధి రాకాచంద్రు కీర్తించెదన్. భావము : కర్ణసమీపమునందు వ్యాపించిన ధనుస్సు యొక్క నారికి నలంకారంబగు బాణమునకు గురిచేయబడిన రావణుడు కలిగినట్టి ఇంద్రుని రథమధ్యమందున్నట్టి తీక్షణమైన చూపులు గలట్టి రాముని నమస్కరించుచున్నాను. 13.శ్లో:సుత్రామ నీలోత్పల నీలమేఘ శ్రీజిత్వరాంగం సుతయా ధరణ్యా యుక్తం సురేంద్రావన మానసం తం రామం భజే రాక్షస వంశ నాశనమ్. తెలుగు అనువాద పద్యము : మ:హరినీలోత్పల మేఘసంపద పహారాంగున్ ధరాభామినీ వరపుత్రీసహితున్ సమస్తమఖభుగ్వర్యా వనాంతర్యునిన్ ధరణీనాథు సురారి వంశ నిమిర్దగ్ధాగ్నిహోత్రున్ బరా త్పరు దీనార్తిహరున్ రఘూద్వహు మదిన్ భావించి సేవించెదన్. భావము : ఇంద్రనీలముల యొక్కయు,నల్లకలువల యొక్కయు,నీలమేఘము యొక్కయు శోభను జయించిన శరీరము కలిగినట్టి సీతతో కూడినట్టి ఇంద్రుని రక్షించుట యందు మనస్సు కలిగినట్టి రాక్షసకులమును నశింప చేయునట్టి రాముని సేవించుచున్నాను. 14.శ్లో:రాకాచంద్ర నిభాననం రతిపతి ద్వేషి ప్రియం రాక్షసా ధీశ గ్రీవ విభేదన స్ఫుట పటు ప్రఖ్యాత బాణోజ్జ్వలమ్ రత్నాలంకృత పాదుకాంచిత పదాంభోజం రమావల్లభం రాగద్వేష విహీన చిత్త సులభం రామం భజే తారకం. తెలుగు అనువాద పద్యము : శా:రాగద్వేష విహీన చిత్త సులభున్ రాకేందు బింబాననున్ భోగీంద్రాభరణ ప్రియున్ దనుజరాణ్మూర్ధచ్ఛిద  స్త్రోజ్జ్వలున్ వాగీంద్రార్చిత పాదుకాంచిత లసత్పాదాంబుజ ద్వయున్ శ్రీ గోవిందు రమాధినాథు వరదున్ శ్రీరాము సేవించెదన్. భావము : పూర్ణచంద్రుని వంటిమోము కలిగినట్టియీశ్వరునికిష్టుడైనట్టి రావణు కంఠములను బ్రద్దలు చేయుట యందు స్పష్టములై సమర్థములై ప్రసిద్ధములైన బాణములచే ప్రకాశించుచున్నట్టి రత్నములచే నలంకరింపబడున పాదుకలచే నొప్పుచున్న పాదపద్మములు గలిగినట్టి లక్ష్మికి ప్రియుడైనట్టి రాగద్వేషములు లేని మనస్సు గలవారికి లభ్యుడైనట్టి సంసారమునుండి తరింప చేయునట్టి రాముని సేవించుచున్నాను. 15.శ్లో:ఆలోల స్ఫుట రత్నకుండల ధరం చారు స్మితాలంకృతం ఆధారాదిక చక్రమండల గతం చానందకందాకురం ఆవిర్భూత కృపాంతరంగ జలధిం చాక్షాంత వర్ణాశ్రయం ఆపన్నార్తి నిదాఘ మేఘ సమయం రామం భజే తారకమ్. తెలుగు అనువాద పద్యము : మ:అకలంకోజ్జ్వల రత్నకుండలు సమస్తానందకందున్ మహా ధికు షట్చక్ర నివాసు రామవిభునాది క్షాత వర్ణాత్ము దా రకు సంభూత కృపాంతరంగ జలధిన్ భ్రాజత్ స్మితా స్యేందు సే వక వర్గార్త నిదాఘ మేఘు నుత గీర్వాణున్ భజింతున్ మదిన్. భావము : కదులుచున్న మంచి రత్నకుండలములను ధరించినట్టి చిరునవ్వుచే నలంకరింపబడినట్టి ఆధారాది చక్రమధ్యమును పొందినట్టి ఆనందమను దుంపకు మొలక యైనట్టి పుట్టిన దయగల అంతఃకరణసముద్రము గలిగినట్టి అకారము మొదలు క్షకారము వరకు అక్షరములాశ్రయముగా గలిగినట్టి ఆపదను పొందిన వారి బాధ యను గ్రీష్మమునకు వర్షాకాలమైనట్టియు తరింప చేయునట్టి రాముని సేవించుచున్నాను. 16.శ్లో:సాకేంతాంతర తారమంటప మహామాణిక్య సింహాసనే తన్మధ్యేష్టదళాంబుజే స్ఫుటతరే చిత్కర్ణికే సంస్థితం సౌమిత్రాంబుజ మిత్రసూను భరతశ్రీ వాయుపుత్రైర్వృతం ముద్రాలంకృత పాణిసారసమజం రామం భజే తారకమ్. తెలుగు అనువాద పద్యము : శా:సాకేంతాంతర రత్న మంటప విరాజిత్సింహపీఠంబునం దేకాష్టచ్ఛద పద్మ కర్ణికను దానింపొంది శాఖామృగా నీకంబుల్ నిజసోదరుల్ గొలువ బాణిన్ బోధ ముద్రాంకుడౌ కాకుత్ స్థున్ రఘురాము దారకు మదిన్ కాంక్షించి సేవించెదన్. భావము :అయోధ్యా పట్టణము యొక్క మధ్యమందలి పొడుగైన మంటపమందలి చొప్ప మణిపీఠమందుదానిమధ్యమందు మిక్కిలి స్ఫుటమైన జ్ఞానమే కర్ణికగా గల అష్టదళపద్మమందున్నట్టి లక్ష్మణుని చేత సుగ్రీవునిచేత నాంజనేయునిచేత చుట్టుకోబడినట్టి  జ్ఞానముద్రచే నలంకరింపబడిన పాణిపద్మము గలిగినట్టి పుట్టువు లేనట్టి  తరింప చేయునట్టి రాముని సేవించుచున్నాను. 17.శ్లో:విరాజమానోజ్జ్వల పీతవాసనం విశాలవక్షస్థ్సల కౌస్తుభశ్రియమ్ భజే కిరీటాంగద రత్నకుండలం నమస్తులస్యా వనమాలయాంకితమ్. తెలుగు అనువాద పద్యము : ఉ:చారు సువర్ణుచేలుని విశాల భుజాంతర కౌస్తుభోజ్జ్వలున్ శ్రీరమణీయ కుండల కిరీట శుభాంగద తారహార మం జీర విభూషణాంగు దులసీదళదాము గుణాభిరాము సీ తా రమణీ హృదుత్పల సుధాముని రాముని సన్నుతించెదన్. భావము : ప్రకాశించుచున్న ప్రజ్జ్వలించుచున్న పచ్చని బట్ట కలిగినట్టి విశాలమైన యురమున కౌసఅతుభ మణియొక్క శోభ గలిగినట్టి యంతట నిర్మలమైన తులసి యొక్క మాలిక చేత నలంకరింపబడినట్టి రాముని సేవించుచున్నాను. 18.శ్లో:మూలాది షట్సరసిజాంత సహస్ర పద్మ పత్రాంతరాళనిలయం భవబంధ నాశమ్ నాదాంత చంద్ర గళితామృత సిక్త దేహం నాదాంతనాద మహిమాస్పద రామ మీళే. తెలుగు అనువాద పద్యము : మ:అరయన్ షట్కమలోపరిస్థిత సహస్రారాంత రాళస్థితున్ వరనాదాంత శశాంక నిర్గళిత దేవాహారధారాప్రవి స్తర సంసిక్త శరీరు బాపహరు సచ్చారిత్రు నాదాంతు నా దు రమేశున్ బరమేశు రాము భజియింతున్ స్వాతమందెంతయున్. భావము :మూలాధారము మొదలైన ఆరుపద్మములపైనుండు సహస్రార పద్మము యొక్క రేకుల మధ్యమందు స్థానము కల్గినట్టి సంసార పాశమును నశింప చేయునట్టి నాప్రణవనాదమధ్యమందు చంద్రుని వలన జారుచున్న అమృతముచే తడుపబట్టినట్టి నాదనాదములోని నాదముయొక్క  మహిమకు స్థానమైనట్టి రాముని స్తోత్రము చేయుచున్నాను. 19.శ్లో:వందే పితామహ మహా వరదాన గర్వ లంకాధినాథ కులపర్వత నాశవజ్రమ్ తం రావణానుజమరుత్సుత భానుసూను దిక్పాల సోదరగణైః పరిసేవ్యమానమ్. తెలుగు అనువాద పద్యము : చ:కమలభవ ప్రదత్త వరగర్విత పూర్వసుపర్వ నాయకో త్తముని వధించి ముఖ్యులగు తార విభీషణ నీల జాంబవ త్కుముద మరుత్సుతార్కజులు గొల్వ దిగీశులు సోదరుల్ ప్రతో షమున భజింప నింపలరు సద్గుణ ధాముని రాము నెన్నెదన్. భావము :వరముల నిచ్చిన బ్రహ్మయొక్క వరములచేతనైన గర్వముగల రావణుని వంశమను పర్వతమును నశింప చేయుటకై వజ్రమైనట్టి విభీషణు ఆంజనేయుడు సుగ్రీవుడు దిక్పతులు తమ్ములు అనువారి సమూహముచే సేవింప బడుచున్నట్టి రాముని నమస్కరించుచున్నాను. 20.శ్లో:అజ్ఞానగాఢ తిమిరాపహ భానుమూర్తి మారక్తచారు నయనాంబుజ మాదిబీజమ్ అంబోధి మధ్య వటపత్రశయానమాది మధ్యాంతశూన్యమఖిలాస్పద రామచంద్రమ్. తెలుగు అనువాద పద్యము :
మ:అరుణాబ్జాక్షు సముద్రమధ్య వటపత్రాభ్యంతర స్థాయకున్ స్ఫురదజ్ఞాన తమిస్రభాస్కరు జగత్పూర్ణాత్ము నాద్యంత శూ న్యు రమాధీశ్వరు నాదిబీజు నసమానున్ మానితోదారు సుం దర మందస్మితు రామచంద్రుని మదిన్ ధ్యానింతు నశ్రాతమున్.
భావము :అజ్ఞానమను గొప్ప చీకటిని పోగొట్టు సూర్యస్వరూపుడైనట్టి అంతట నెర్రనైన నేత్రపద్మములు కల్గినట్టి ప్రపంచమునకు మొదటికారణమైనట్టి సముద్రమధ్యమున మర్రియాకు నందు పరుండినట్టి ఆదిమధ్యాంత శూన్యుడైనట్టి సమస్తమునకు స్థానమైనట్టి రామచంద్రుని సేవించుచున్నాను.

No comments:

Post a Comment

Pages