శ్రీరామకర్ణామృతం -11 - అచ్చంగా తెలుగు

శ్రీరామకర్ణామృతం -11

Share This

శ్రీరామకర్ణామృతం -11

                                      డా.బల్లూరి ఉమాదేవి.                                          కామవరం


ద్వితీయాశ్వాసము.
 శ్లో:శ్రీరామం జనక క్షితీశ్వర సుతా వక్త్రాంబుజాతారుణమ్
శ్రీమద్భానుకులాబ్ధి కౌస్తుభమణిం శ్రీరత్న వక్షస్థలమ్
శ్రీకంఠాద్యమరౌఘ రత్నమకుటాలంకార పాదాంబుజమ్
శ్రీ వత్సోజ్జ్వల మింద్రనీల సదృశం శ్రీరామచంద్రం భజే.                                             ||1||
తెలుగు అనువాద పద్యము:
శా:శ్రీమద్భాను కులాబ్ధి కౌస్తుభ మణిన్ శ్రీవత్స బాహాంతరున్
సోమాది క్రతుభుఙ్మణీ మకుట సచ్ఛోభాంఘ్రి పద్మున్ ధరా
భామాజాస్య సరోజమిత్రు విలసత్సాకారి రత్నాంగు శ్రీరామున్ దారకనాము నామదిని నారాధింతు నశ్రాతమున్.
భావము:సీతా ముఖపద్మముచే మనోహరుడైనట్టి శోభగల సూర్యవంశమనెడి సముద్రమునకు కౌస్తుభమణియైనట్టి ,లక్ష్మీకరములైన రత్నహారములు వక్షఃస్థలమునందు కలిగినట్టి ఈశ్వరుడు మొదలగు దేవతాసమూహముల రత్నకిరీటములలంకారముగ కల్గిన పాదపద్మములు కల్గినట్టి శ్రీవత్సచిహ్నముచే ప్రకాశించునట్టి ఇంద్రనీలసమానకాంతి కలిగినట్టి శ్రీరామచంద్రుని సేవించుచున్నాను.
శ్లో:శ్రీరంగేశ పదాబ్జలగ్న హృదయం శ్రీశంఖ చక్రాన్వితమ్
శ్రీమన్నిర్జర పాదపస్ఫుటపదం శ్రీసింహపీఠస్థితమ్
శ్రీవైకుంఠ సహస్ర మస్తక లసద్భోగాసనే శాయినమ్
శ్రీభూమి సుతయా యుతం శ్రితనిధిం శ్రీరామమూర్తిం భజే.                       ||2||
తెలుగు అనువాద పద్యము:
శా:శ్రీరంగేశ పదాబ్జ లగ్నహృదయున్ శ్రీదేవ వృక్షస్థితున్
సారోదార సుశంఖ చక్రధరు బంచాస్యాసనాసీను శృం
గారాకారు వికుంఠధాము నహిరాట్పర్యంకశాయిన్ హరిన్
శ్రీరామున్ధరణీసుతాయుతు శ్రితార్థిఘ్నున్ భజింతున్ మదిన్.                        
భావము:శ్రీరంగనాయకుని పాదపద్మముల యందు తగిలిన మనస్సు కలిగినట్టి శంఖచక్రములతో కూడినట్టి కల్పవృక్షములవంటి
పాదములు కలిగినట్టి సింహాసనమందున్నట్టి వ వైకుంఠమందలి వేయిపడగల గల శేషుని దేహపీఠమందు శయనించునట్టి సీతతో కూడినట్టి ఆశ్రితులకు ధననిధి యైనట్టి శ్రీరామమూర్తిని సేవించుచున్నాను.
శ్లో:ఆనందకంద మరుణాధర మంబుజాక్ష
మాపీత వస్త్ర మతసీ కుసుమోజ్జ్వలాంగమ్
అక్షాంతవర్ణ మకలంక మమేయ మాద్య
మర్త్యాకృతిం రఘుపతిం శరణాగతోస్మి.     ||3||
తెలుగు అనువాద పద్యము:
మ:అకలంకాత్ము నమేయు నాద్యు హరి నిత్యానందు సర్వామరా
ధికు గంజాక్షు సువర్ణ చేలధరు నాదిక్షాంత వర్ణా  త్ము దా
రక నామున్నవపల్లవాధరు నరున్ రామున్ ఘనశ్యాము సే
వక మందారు నుదారు ధీరజనతావంద్యున్ మదిం గొల్చెదన్.
భావము:ఆనంద స్వరూపుడైనట్టి యెఱ్ఱని పెదవి కలిగినట్టి పద్మములవంటి నేత్రములు కలిగినట్టి
పచ్చని వస్త్రము కలిగినట్టి అగిసెపువ్వులవలె ప్రకాశించుచున్నదేహము కలిగినట్టి అకాలము మొదలు క్షకారము వరకు కల యక్షర స్వరూపుడైనట్టి యింతటివాడని ప్రమాణింప వశము గానట్టి మొదటివాడైనట్టి గొప్ప సౌందర్యము గలిగినట్టి శ్రీరాముని శరణు  బొందితిని.
శ్లో:సాకేత నవరత్న పఙ్తి ఖచితే చిత్రధ్వజాలంకృతే
వాసే స్వర్ణమయే దళాష్ట లలితే పద్మే విమానోత్తమే
ఆసీనం భరతాది సోదరజనైః శాఖామృగైః కిన్నెరైః
దిక్పాలైర్ముని పుంగవైర్నృపగణైః సంసేవ్యమానం భజే.                                             ||4||
తెలుగు అనువాద పద్యము:
మ:తన సాకేతమునన్ మణిధ్వజ లసత్సౌధంబునన్ బుష్పకం
బున హేమాష్ట దళాబ్జ మధ్యమమునన్ భూపుత్రియున్ సోదరుల్
మునులున్ దిగ్వరులున్ గపుల్ నృపులు నాప్తుల్ కిన్నరుల్ సంతసం
బున గొల్వం జెలువొందు రాము దలతున్ భూపుత్రికాధీశ్వరున్.
భావము:అయోధ్య యందు నవరత్నవులు తాపబడి చిత్రములైన ధ్వజముల చేత నలంకరింపబడిన యింటియందు స్వర్ణమయమైన యష్టదళ పద్మమందు విమానమందు గూర్చొన్నట్టి సీతతోను,భరతాదులైన తమ్ములతోను వానరులతోను కిన్నరులతోను.
దిక్పతులతోను మునిశ్రేష్టులతోను రాజసమూహములతోను సేవింప బడుచున్న రాముని సేవించు చున్నాను.
శ్లో:కందర్పాయుత కోటికోటి తులితం కాలాంబుద శ్యామలం
కంబుగ్రీవ ముదార కౌస్తుభధరం కర్ణావతంసోత్పలమ్
కస్తూరీ తిలకోజ్జ్వలం స్మితముఖం చిన్ముద్రయాలంకృతం
సీతాలక్ష్మణ వాయుపుత్ర సహితం సింహాసనస్థం భజే.                       ||5||
తెలుగు అనువాద పద్యము:
మ:సుమబాణాయుత సుందరున్ లలిత కస్తూరీ లలాటోజ్జ్వలున్
గమలాక్షున్ ధరణీసుతాయుతు జగత్కాంతున్ హరిన్ కౌస్తుభా
ఖ్య మణీయుక్తు శుభాస్యు గంబుగళునిన్ గర్ణావతంస ప్రభా
సిముకుందున్ మణిపీఠగున్ గొలిచెదన్ జిన్ముద్రికాలంకృతున్.
భావము:లక్షకోటి మన్మథులతో సమానుడైనట్టి వర్షకాల మేఘమువలె నల్లనైనట్టి శంఖము వంటి కంఠము గలిగినట్టి గొప్ప కౌస్తుభ మణిని ధరించినట్టి కుండలములైన కలువలు గలిగినట్టి కస్తూరి బొట్టు చేత ప్రకాశించుచున్నట్టి జ్ఞానముద్ర చేత నలంకరింపబడినట్టి సీతతోను లక్ష్మణునితోను ఆంజనేయునితోను గూడినట్టి సింహాసన మందున్నట్టి రాముని సేవించుచున్నాను.
శ్లో:వరాభయం దివ్యరథాంగ శంఖం సకౌస్తుభం వేష్టిత పీతవస్త్రమ్
కిరీట హారాంగద కుండలాంగం  శ్రీవత్స చిహ్నం శిరసానమామి.               ||6||
తెలుగు అనువాద పద్యము:
మ:అరిభీకృద్ధరి శంఖ నందక గదాహస్తున్ మహాకౌస్తుభా
భరణున్ రత్నకిరీటకుండల ధరున్ ప్రస్ఫీత పీతాంబరున్
వరదున్ శ్రీరఘురామ భూరమణు శ్రీవత్సాంకు  సీతా మనో
హరు గారుణ్య పయఃపయోధి మదిలో నశ్రాంతముం గొల్చెదన్.
భావము:వరములను అభయమునిచ్చునట్టి ప్రశస్తమైన శంఖము చక్రము కలిగినట్టి కౌస్తుభమణితో కూడినట్టి పచ్చని బట్ట కట్టుకొన్నట్టి కిరీటము,హారములు,భుజకీర్తులు కుండలములు శరీరమునందు కలిగినట్టి శ్రీవత్సమను మచ్చ చిహ్నము కలిగినట్టి రాముని శిరస్సుచే  నమస్కరించుచున్నాను.
శ్లో:దిగంబరం కింకిణీ మేఖలోజ్జ్వలం లలాట పర్యంత విలంబితాంకలమ్
కలద్వచస్కం కమనీయ నూపుర ద్వయం శిశుం రామమహం నమామి.   ||7||
తెలుగు అనువాద పద్యము:
చ:ఘనమణి నూపురద్వయు దిగంబరు గింకిణీ మేఖలోజ్జ్వలున్
ఘనుని గలాభి భాషణుని  గమ్రలలాట  విలంబితాలకున్
జనులకు తల్లిదండ్రులకు సంతసమొప్ప చెలంగు బాలరా
ముని వినుతించి సంతతము మ్రొక్కుచు నుందు హృదంతరంబునన్.
భావము:దిగంబరుడు మువ్వలుగల మొలనూలు గలవాడు నుదుటియందు వ్రాలుచున్న ముంగురులు గలిగినవాడు మధుర వాక్కులు గలిగినవాడు సొగసైన యందెల జత గలిగినట్టి పిల్లవాడైన రాముని నేను నమస్కరించుచున్నాను.
శ్లో:మందారమూలే మణిపీఠ సంస్థం
సుధా ప్లుతం దివ్యవిరాట్ స్వరూపమ్
సబిందు నాదాంతకళాంత తుర్య
మూర్తిం భజేహం రఘువంశరత్నం                                       ||8||
తెలుగు అనువాద పద్యము:
మ:అకలంకామర భూజ సంస్థమణిపీఠాసీనునిన్ నాదబిం
దు కళాతీతు విరాట్స్వరూపు భగవంతున్ సర్వ లోకాధి నా
యకు సీతేశు సుధాభిషిక్తు మనువంశాంభోధి చింతామణిన్
సకలాత్మున్ రఘురామ రత్నమగు నాస్వామిన్ మదిన్ గొల్చెదన్.
భావము:మందార వృక్షముల మొదటి యందు మణిపీఠమందున్నట్టి అమృతము చేత వ్యాప్తమైనట్టి ఆది విరాట్స్వరూపుడైనట్టి బిందు నాద కళల నతిక్రమించిన నాల్గవ రూపము కలిగినట్టి రఘువంశ శ్రేష్ఠుడైనట్టి రాముని సేవించుచున్నాను.
శ్లో:అనర్ఘ్య మాణిక్య విరాజమాన శ్రీపాదుకాలంకృత శోభనాభ్యాం
అశేష బృన్దారక వన్దితాభ్యాం నమో నమో రామ పదాంబుజాభ్యామ్.
ధ్వజాంబుజచ్ఛత్ర రథాఙ్గ శంఖ దంభోళి పాశాంకుశ  మత్స్యచిహ్నమ్
బ్రహ్మేంద్ర దేవాది కిరీటి కోటి సంఘృష్ట పాదాంబుజ యుగళ మీళే.           ||9||
తెలుగు అనువాద పద్యము:
అమల్యమైన మణులచేత బ్రకాశించుచున్న శోభగల పావుకోళ్ళచేత నలంకరింపబడినట్టి శుభకరములైనట్టి సమస్త దేవతలచేత నమస్కరింప బడినట్టి రాముని పాదపద్మములకు నమస్కారము.రేఖలైన జెండాల.పద్మముల ఛత్రముల చిహ్నములు గలిగినట్టి బ్రహ్మ ఇంద్రుడు దేవతలు మొదలగు వారి కిరీటముల యంచుల చేత  నొరయు చున్నట్టి పాదపద్మ ద్వంద్వము గల రాముని స్తుతించుచున్నాను.
భావము:
శ్లో:లలాట దేశోజ్జ్వలబాలభూషణం
సతాండవం వ్యాఘ్ర నఖాంక కంధరం
దిగంబరం శోభిత బర్బరాలకం
శ్రీబాలరామం శిరసా నమామి.                                                    ||10 ||
తెలుగు అనువాద పద్యము:
ఉ:అనుపమానూత్న రత్న నిచయ ప్రచయోజ్జ్వల నవ్యపాదుకా
వనములు వారిజ ప్రభవ వాసవ చంద్ర దినేంద్రముఖ్య పా
వనజ రథధ్వజాంబు శర పాశ హలాంకుశ పుండరీక లాం
ఛనములు రామచంద్ర పదసారసముల్ మదినిల్పి కొల్చెదన్.
భావము:నుదుటి యందు ప్రకాశించుచున్న చేర్చుక్క బొట్టు కలిగినట్టియు
నాట్యముతో కూడినట్టియు పులిగోరు పతకము కంఠమందు కలిగినట్టియు
దిగంబరుడైనట్టి వంకర కురులు కలిగినట్టియు చిన్నవాడైనట్టియు రాముని శిరస్సుచే నమస్కరించుచున్నాను.
****

No comments:

Post a Comment

Pages