శ్రీ మద్భగవద్గీత -2 - అచ్చంగా తెలుగు

శ్రీ మద్భగవద్గీత -2

Share This

శ్రీ మద్భగవద్గీత -2 

రెడ్లం రాజగోపాలరావు.పలమనేరు.

Ph: 09482013801.

    
                                       
                                           వాసాంసి జీర్ణాని యధా విహాయ
                                            నవాని గృహ్ణాతి నరోపరాణి
                                            తధా శరీరాణి విహాయ జీర్ణా
                                            న్యన్యాని సంయాతి నవానిదేహీ                || 22 వ శ్లోకం ||
మనుజుడు పాతవైన చినిగిన బట్టలు విడిచి కొత్త బట్టలనెట్లా ధరిస్తున్నాడో అట్లే జీర్ణమైన శరీరాన్ని వదిలి దేహియగు ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తున్నాడు దేహి నిత్యుడు యదృశ్య తన్నస్యం దృశ్యమానమైన జగత్తు ఎప్పటికైనా నాశనం కావలసిందే అందుకు దుఃఖించుట అవివేకము. చినిగిపోయిన వస్త్రాన్ని గూర్చీ మనము దుఖించుట లేదు అటులనే శిధిలమైన దేహాన్ని గూర్చి దుఃఖించుట వలదు.
                                                నైనం చిందంతి శస్త్రాణి
                                                నైనం దహతి పావకః
                                                నచైనం క్లేదయంత్యాపో
                                                నశోషయతి మారుతః                 || 23 వ శ్లోకం ||
ఆత్మను ఆయుధములు ఛేదింపజాలవు అగ్ని ధహింపజాలదు నీరు తడుపజాలదు గాలి ఎండింపజాలదు బాహ్యమైన సుఖ దుఃఖాదులు శరీరమునకే గాని సాక్షీబూతుడైన ఆత్మను రవంతైనను బాధింపజాలవు మానవునికి శరీరముపై మమకారమే అవిద్య. నా కాలు, నా చేయి, నా కడుపు, నా తల అని చెప్పుచున్నాము  నేనే కాలు నేనే చేయి నేనే తల అని చెప్పుట లేదు  అప్పుడు నేనంటే ఎవరు సాక్షీభూతుడైన ఆత్మయే నేను.దేహమే దేవాలయము జీవుడే దేవుడు .
శ్రీ సదాశివబ్రహ్మేంద్ర స్వాములవారు అవధూతగా కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో తిరుగుతుండేవారు. మైసూరు, తమిళనాడు పడమటి ప్రాంతపుటడవులలో వారు సంచరిస్తున్నప్పుడు ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. దట్టమైన ఆ అడవిలో ఒక నవాబు గుడారాలు వేసుకుని రాణిగారితో విహరిస్తూ సేదదీరుతున్నారు. చూసేవారికి భయం కలిగేలా, దిగంబరుడై  తైల సంస్కారం లేని జుట్టు, జడలు కట్టిన సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని చూచిన రాణి, భయముతో అరచి అచేతనురాలైంది.
జరిగిన సంఘటనకు కోపోద్రిక్తుడైన నవాబు నడచిపోతున్న స్వామిని గద్దించి ఆగమన్నాడు. బ్రహ్మీ స్థితులైన స్వామి ఆ పలుకులు పట్టించుకోలేదు. ఉక్రోషం అధికమైన నవాబు కత్తి చేతబూని జోరుగా అనుసరించాడు. స్వామి వారి నడకజోరు తగ్గలేదు. చివరికి నవాబు కోపం పట్టలేక చేతనున్న కత్తిని స్వామిపైకి విసరాడు. కత్తి స్వామివారి భుజాన్ని తాకి చెయ్యి తెగి పడిపోయింది. సచ్చిదానంద స్థితిలోనున్న స్వామివారు కనీసం వెనక్కి తిరిగి చూడలేదు. ఉలిక్కిపాటుతో నవాబు తెగిపోయిన స్వామివారి చేయి పట్టుకుని అనుసరించాడు. స్వామివారు మరునాడు ఒక ప్రదేశంలో సేదదీరుతుండగా రొప్పుకుంటూ నవాబు అక్కడకు చేరాడు. స్వామివారి కాళ్ళపై పడి క్షమాబిక్ష వేడుకున్నాడు. కరుణాసముద్రులైన స్వామి తెగిన చేయిని భుజానికి అతికించి నవాబును కరుణించి ఉపదేశ భాగ్యం కలిగించారు. భవిష్యత్కాలంలో నవాబు స్వామివారికి ముఖ్య శిష్యునిగా మారి సాధనలో ఉన్నత ప్రగతి సాధించాడు.
                                                జాతస్యహిధ్రువో మృత్యుః
                                                ధ్రువం జన్మ మృతస్యచ
                                                తస్మాద పరిహార్యేర్థే
                                                నత్వం శోచి తుమర్హసి            || 27 వ శ్లోకం ||
            పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు చనిపోయిన ప్రతిజీవికి పుట్టుక తప్పదు చర్విత చర్వణమైన ఈ చక్ర భ్రమణమునకు శోకింపనేల..??
            ఆత్మ జ్ఞానమునొందనంత వరకు జనన మరణములు తప్పించనలవి కాదు. ఆత్మ జ్ఞానము కలిగిన పిమ్మట సంసార చక్ర భ్రమణమాగిపోవును. ఎట్లన ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందిన మానవుడు ఇంద్రియ నిగ్రహము కలిగి మనస్సును ప్రశాంత స్థితిలోనుంచుకుని సదా బ్రహ్మంలో రమించు చుండును. బ్రహ్మానుభూతి పొందిన మానవుడు విషయవాసనా లంపటంలో తగుల్కొనడు.
                               హతోవా ప్రాప్య సే స్వర్గం
                               జిత్వావా భోక్ష్యసే మహీమ
                               తస్మాదుత్తిష్ఠ కౌంతేయా
                               యుద్ధాయ కృతనిశ్చయః            37 వ శ్లోకం
            ఈ శ్లోకము మోక్షాభిలాషులకు చాలా ముఖ్యమైనది. అర్జున ఈ ధర్మయుద్ధమున నీవు మరణింతువేని స్వర్గమును పొందెదవు. శత్రువులను జయించినచో రాజ్యమును పొందెదవు. ఏది జరిగినా నీకు మేలే. ఇక్కడ అర్జనుని నిమిత్తమాత్రుని జేసి శ్రీకృష్ణ పరమాత్మ సాధనా పరులకు గొప్ప ఊరట నిచ్చుచున్నాడు. ఆత్మ సాధన పూర్తికాకుండా మరణము సంభవించిన ఉత్తమలోక ప్రాప్తిని పొందుచున్నాడు. "ఒక యోగి ఆత్మ కథ"లో "శ్రీ పరమహంస యోగానంద" గారు ఈ విషయాలు విపులంగా తెలియజేసారు.
            ఈ జన్మలో పుణ్యఫలములు విశేషములుగా గల ఆత్మలు ఒక విభాగంలోనూ, విశేషపుణ్యాలు చేసినా కించిత్తు పాప కర్మలొనర్చిన ఆత్మలు ఒక విభాగంగాను , పాపపుణ్యాలు సమానంగా గల ఆత్మలు ఒక విభాగంగాను కేవలం పాప కర్మలాచరించిన తమోగుణ సంపన్నులైనవారు ఒక విభాగంగాను హిరణ్యలోకాల్లో ఏర్పాట్లుంటాయి. వారి వారి కర్మ ఫలాన్నిబట్టి మరలా పునర్జన్మలుంటాయి. వారి వారి గతజన్మల కర్మ ఫలమును బట్టి సమాన యోగ్యతగల్గిన తల్లిదండ్రుల శుక్లశోణితముల కలయికతో ఏర్పడబోయే జీవిలో హిరణ్యలోకపు ఆత్మ ప్రవేశపెట్టబడుతుంది. గతజన్మ వాసనలు కూడా బిడ్డలో కనిపిస్తుంటాయి. యోగా రూఢులైన దివ్యాత్మలు మరలా జన్మనెత్తినా ధగ్ధ కర్ములుగానుంటూ, కర్మఫలములేవి అంటక, కర్మను భగవదర్పణ గావిస్తూ, మానవతా పరిమళాలు లోకంలో వెదజల్లుతూ సేవా దృక్పధంతో భగవద్భక్తితో ధన్యజీవులై ఉంటారు.
            యోగసాధన వల్లనొనగూరే ఫలము, యోగాభ్యాసము వలన కలిగే ఉచ్ఛస్థితి రాబోవు అధ్యాయములలో గీతాచార్యుడు తెలియజేస్తున్నాడు.
****

No comments:

Post a Comment

Pages