ఉగాది - అచ్చంగా తెలుగు

ఉగాది

Share This

ఉగాది

చెరుకు రామమోహనరావు 


ద్విజ కలరవము వాదిత్రధ్వానముగాగ

                                నికర పికరవాల నెలవుగాగ

ఘన పుష్ప రజమేమొ గంధంపుపొడిగాగ

                              విరివి సత్ఫలశ్రేణి విందు గాగ

తుమ్మెద బారులు ధూమ మేఘము గాగ  

                               అరుణ పుష్పోత్కరమగ్ని గాగ

చూత శాఖములేమొ సూపార్థములు గాగ

స్రవ పుష్పరసమేమొ సర్పి గాగ 

సద్వన   వధూమణికిని   వసంతునకును

పాణి గ్రహణము జేయింప బయలుదేరె

చిలుకతత్తడి రౌతు   రాచిలుక  పైన

కదిలె వనమంత కళ్యాణ ఘడియ జూడ

ద్విజ= పక్షులు(రెండు మార్లు జన్మనెత్తునవి)

వాదిత్రములు= వాద్యములు

నికరము = శ్రేష్ఠము

ఘన పుష్పరజము = గొప్పదియైన పుప్పొడి 

విరవి = మిక్కుటమైన, అతిశయించిన

ధూమ మేఘము = దట్టమైన పొగ

అరుణపుష్పోత్కరము = ఎర్రనగు పూవుల రాశి

చూతశాఖములు = మామిడికాయలు ఆకు కూరలు  (ద్వంద్వ సమాసము)

సూపార్థము= పప్పునకు వలసినవి

స్రవ పుష్ప రసము = పూవులనుండి స్రవించు మధువు

సర్పి= నేయి

చిలుక తత్తడి రౌతు = చిలుక వాహనము పై స్వారి చేయు వాడు

పూదేనెన్ దనివార గ్రోలి  విలసామోదమ్ములై తుమ్మెదల్

మాధుర్యంబుగ ఝుంకృతుల్ సల్పుచున్ మత్తెక్కి నర్తించెడిన్

రోధస్యంతము పిక్కటిల్ల వనినారొహించి క్రొమ్మావులన్

తాదాత్మ్యమ్మున శారికల్ మధుర గీతాలాపముల్ చేసెడిన్

 

దుర్ముఖి యన్న పేరు విని దూషణ చేయగబోను నీవు నా

కర్మలపై నియంతవయి కానివి జేయగనీక తోడుగా 

యూర్ముల జేరనీక దరి, యోరిమి తోడుత నన్ను గాచి,నీ

కూర్మిని గూర్చి నాకు నాగు కోర్కులు దీర్చుము రమ్య మానసీ !

షడూర్ములు=క్షుత్, తృష్ణా. శోక, మోహ, జరా, మరణములు

 

ఎల్లలు లేని నా, నుడినిఏర్పడ వాడుక భాష పేరుతో

వెల్లువయైజెలంగుటకు వీలును గల్గగనీక హద్దులన్

కొల్లలు గాగ నేర్పరచి కోరిన రీతిని కావ్యసంపదల్

చల్లగ కుళ్ళ జేసియును చక్కగా గాంచిరి పేరు దుర్ముఖీ   

 

భారతమాయె భారముగ భాషను వాడుక భాష జేయగా 

దారము లేని మాలగ విదారకమయ్యెను కావ్య పుష్పముల్

సార సమస్త సంగ్రహము సాంతము గల్గినయట్టి పొత్తముల్

చేరువయయ్యెలే చెదకు చేవను గూర్చగ నేడు దుర్ముఖీ

ఓంనమః శివయనిఓనమాలతొ విద్య

                            మొదలిడుప్రథ నేడు మూల బడియె

పరిపక్వతకుపెద్ద బాలశిక్షకు సాటి

                             మరి లేదు యను మాట మాసి పోయె

అయ్యవారికి చాలు ఐదు వరహాలను

                              దసరాల   సరదాలు దిశలు మారె

భాషకుపరిపుష్ఠి పద్యకావ్యములన్న

                               యాలోచనలుజూడ నంతరించె

 

సుమతి వేమన శతకాలు చూరుజేరె

ఒత్తుపొల్లులు   పల్కుట     నుత్తదాయె

ౘ ౙ ళలనుపల్కుటదియేమొ సన్నగిల్లె

తెలుగు భాషకు దిక్కేరి తెలియబరుప  

 

చేసినారా మీల్సు?జెస్టు నౌ అనుటలో

                               తెలుగెంత యున్నదో తెలియగలరె

సమ్మర్న స్వెట్టింగు చాల టూమచ్చన్న

తెలుగెంత యున్నదో తెలియగలరె

ప్లీసు వెల్కమ్మన్న ప్రియభాషణమ్మున

తెలుగెంత యున్నదో తెలియగలరె

మమ్మి డాడే యాంటి మరి యంగు లనుటలో

తెలుగెంత యున్నదో తెలియగలరె

 

హాలు బాత్రూము బెడ్రూము యనుట యందు

మిల్కు బట్టరు ఘీ కర్డు మీల్సునందు

నైటు డే లైటు హైటును డేటు గేటు 

తెలుగు యేమున్నదో కాస్త తెలుప గలరె 

 

 

 

 

 

 

 

 

 

చెరుకురామ మోహన్ రావు

 

 

No comments:

Post a Comment

Pages