(అ)శేష ప్రశ్న - అచ్చంగా తెలుగు

(అ)శేష ప్రశ్న

Share This

(అ)శేష ప్రశ్న

పోడూరి శ్రీనివాసరావు 

నేనెవర్ని?

పాతికమంది పైగా అక్కచెల్లెళ్లలో ఆంధ్రలక్ష్మిగా

అల్లారుముద్దుగా, అతి గారాబంగా పెరిగిన నేను

యావద్భారతావనికి, అన్నపూర్ణగా ఖ్యాతి నొందిన నేను

ఈనాడు నా ఉనికిని నిలుపుకోవడానికి

నానాపాట్లు పడుతున్నాను

నా కుమారులే దుశ్శాసనులై ఒక్కొక్క వలువనూ విప్పతూ

నా దేహాన్ని ఖండ ఖండాలుగా చేసుకుని

విందారగిద్దామని చూస్తున్నారు

నా జీవితాన్నే రాజకీయం చేసి, ఆమరణ నిరాహార దీక్షలతో

తమ జీవితాల్నే శుష్కింపచేసుకుంటున్న

నా పిల్లల జీవితాల్ని చూసి బాధపడాలా?

అగ్నికీలలను ఆనందంగా ఆస్వాదిస్తున్న –

తల్లిదండ్రుల బంగారుకలలకు తిలోదకాలిస్తున్న –

ఆత్మార్పణలతో తమ భావి జీవితాన్ని బూడిద చేసుకుంటున్న –

యువత మూర్ఖత్వానికి జాలిపడాలా?

నేనిపుడు ఆంధ్రలక్ష్మినా! తెలంగాణా తల్లినా!

రాయలసీమ రాణినా! సమైక్యాంధ్ర సరస్వతినా!

నువెవ్వరివి? నీ ఉనికేమిటి? అని

అడుగుతున్న అశేష ప్రజానీకానికి

నే సంధిస్తున్న ప్రశ్న-

నేనెవర్ని నేనెవర్ని??

నా (అ)శేష ప్రశ్నకు జవాబివ్వండి

నేనెవరిని???

No comments:

Post a Comment

Pages