కలకానిది విలువైనది - అచ్చంగా తెలుగు

కలకానిది విలువైనది

Share This

కలకానిది విలువైనది

బి.ఎన్.వి.పార్ధసారధి 


రమేష్ చాలా దిగులుగా వున్నాడు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకటం లేదు. దాదాపు మూడు నెలలుగా ప్రతీ నెలా మూడు వేలు పంపే పెద్ద మనిషి మరణించటంతో దినం గడవటం కష్టం గా వుంది. రూం మేట్స్ ఆదరించటంతో వుండటానికి గది, రెండు పూట్ల తినటానికి కాస్త తిండి ఏదో గడచి పోతోంది.
రమేష్ అనాధ. అతని తల్లి తండ్రులు ఎవరో అతనికే తెలియదు. బాల్యం అంతా అనాధ ఆశ్రమం లో పెరిగాడు. ఆ అనాధ ఆశ్రమం లో పదో తరగతి వరకూ ఉచితంగా చదివిస్తారు. రమేష్ చదువులో చురుకుగా వుండటంతో ఓ పెద్దమనిషి  డిగ్రీ వరకూ తాను చదివిస్తానని ఆశ్రమం వారికి మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ పెద్ద మనిషి రమేష్ ని డిగ్రీ వరకూ చదివించాడు. రమేష్ కి డిగ్రీ లో కూడా మంచి మార్కులు రావటం తో ఉద్యోగ ప్రయత్నం లో పడ్డాడు. “ నువ్వు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వుండు. నేను నీకు ఉద్యోగం వచ్చేవరకు ఒక ఏడాది పాటు నెలనెలా మూడు వేలు ఇస్తాను. అంత లోపు ఏదో ఒక ఉద్యోగం రాక పోదు.” పెద్ద మనిషి రమేష్ కి హామీ ఇచ్చాడు. పెద్దమనిషి ఇచ్చిన భరోసా తో రమేష్ ధైర్యం చేసి ఉద్యోగాల వేట కోసం పట్నం వచ్చాడు. కాలేజీ మిత్రులు కొందరు పట్నం లో వుండటంతో వాళ్ళ తోటే మకాం పెట్టాడు. నెలనెలా ఆ పుణ్యాత్ముడు పంపే మూడు వేల రూపాయలు అతి జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు రమేష్. రూం కి అద్దె మిత్రులు కట్టేవాళ్ళు. శని, ఆది వారాల్లో రాత్రి భోజనం కూడా మిత్రుల ఖాతా లోనే. ఆ పుణ్యాత్ముడు పంపే మూడు వేలలో నెలకి అయిదారు వందలు మిగిలేవి. మూడు నెలలు గడిచాయి. రమేష్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. ఇంతలో ఆ పుణ్యాత్ముడు మరణించాడన్న దుర్వార్త తెలిసి డీలా పడ్డాడు రమేష్. మిత్రులు ధైర్యం చెప్పారు. రోజూ రాత్రి పూట భోజనం మిత్రుల ఖాతాలోకి మారింది. ఉదయం కాఫీ కి స్వస్తి పలికాడు రమేష్. ఉదయం భోజనం క్రమేపీ ఇడ్లీ గా మారింది. ఉదయం ఇడ్లీకి రాత్రి భోజనం నడుమ ఆహారం కేవలం మంచినీరు! కొన్ని సార్లు రూం మేట్స్  బిస్కెట్ పాకెట్స్ కొని ఇచ్చేవారు. ఆ బిస్కెట్ పాకెట్స్ ని కూడా అతి పొదుపుగా వాడే వాడు రమేష్. నాలుగు బిస్కెట్స్ తిని మూడు గ్లాసుల నీళ్ళు తాగేవాడు. కాళ్ళు అరిగేలా తిరిగినా కేవలం డిగ్రీ చదివిన రమేష్ కి ఎక్కడా ఉద్యోగ ఆవకాశాలు  కనిపించక పోవటంతో బాగా నిరుత్సాహానికి గురయ్యాడు.
తోటి రూం మేట్స్ అందరూ తమ బట్టలని అంజి బాబు చేత ఇస్త్రీ చేయించుకునేవారు ఒక్క రమేష్ తప్ప. రమేష్ పరిస్థితి ని అర్ధం చేసుకున్న అంజిబాబు అతనిపై సానుభూతి చూపేవాడు. బలవంతంగా కొన్ని సార్లు రమేష్ దగ్గర  బట్టలు తీసుకుని ( పండుగ రోజుల్లో) ఫ్రీ గా ఇస్త్రీ చేసి ఇచ్చే వాడు. నిరుత్సాహంతో వున్న రమేష్ దాదాపు రెండు  రోజులుగా ఉదయం రూం నుంచి  బయటికి రావటం కూడా మానేసాడు. మూడో రోజు కూడా రమేష్ రూం బయటికి రాకపోవటంతో అంజిబాబు కి అనుమానం వచ్చి రూం తలుపు తట్టాడు. ఆ  సమయంలో రూం లో మూడంకె వేసి ముసుగు పెట్టి పడుకున్న రమేష్ మస్తిష్కంలో ఆలోచనలు పరిపరివిధాల పరుగెడుతున్నాయి.” నా అన్న వాళ్ళు లేక, ఉద్యోగం దొరక్క, తిండికి ఇబ్బంది పడుతూ ఇలా ఎన్నాళ్ళు జీవించాలి ? మరణమే ఈ సమస్యలకి పరిష్కారమా?” ఇలా నిరాశ నిస్పృహల తో కొట్టు మిట్టాడుతున్న రమేష్ కి తలుపు తడుతున్న శబ్దం వినిపించింది. కొంత సేపు అలా కదలకుండానే పడుకున్నాడు. కానీ తలుపు తడుతున్న శబ్దం ఆగలేదు సరికదా రాను రాను శబ్దం గట్టిగా వినిపించసాగింది. ఇంక గత్యంతరం లేక బలవంతంగా లేచి తలుపు తీసాడు రమేష్. చేతిలో టిఫిన్ పొట్లం తో ఎదురుగా అంజిబాబు.
 “ అనాధ గా పెరిగిన నువ్వు డిగ్రీ వరకూ చదువుకున్నావంటే నువ్వు ఇంకా సాధించవలసినది ఎంతో వుంది, అది నువ్వు సాధించగలవు కూడా. నీకు ఇంతవరకూ జీవితంలో అనాధ ఆశ్రమం, ఒక పెద్దాయన ఎలాగైతే సహాయపడి అదుకున్నారో, ఇక ముందు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ఆదుకుంటారు. నీకన్నా కూడా ఎంతో ఇబ్బందుల్లో వున్నవాళ్ళు చాలామందే వున్నారు. వాళ్ళంతా నీలాగ క్రుంగిపోలేదుగా. వాళ్ళు ధైర్యంగా ఆశతో బ్రతకటం లేదా ?“ ఇడ్లీలు రమేష్ కడుపు లోకి వెళ్తూంటే అంజిబాబు మాటలు రమేష్ మెదడు లోకి వెళ్లాయి. బయట ఎక్కడినుంచో సినిమా పాట చరణం వినిపిస్తోంది  “ ఏదీ తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి అది యే ధీర గుణం,”  అంజిబాబు విశ్లేషిస్తూ అన్నాడు “ ఒక విధంగా నీకు ఇంత వరకూ జీవితం వడ్డించిన విస్తరి. అనాధ వైనా నీకు ఆశ్రమం ఆసరా దొరికింది. ఆ పైన ఒక పెద్ద మనిషి నిన్ను డిగ్రీ చదివించి , మూడు నెలల క్రితం వరకూ ఆర్ధికంగా ఆదుకున్నాడు. ఆ పెద్దమనిషి మరణించాక నీకు కష్టాలు అంటే ఏమిటో తెలిసి వచ్చాయి. కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఎవరో సానుభూతితో ఆదుకుంటారని అనుకోవడం ఒక పద్ధతి. కష్టాలు గట్టెక్కే మార్గం ఏమిటా అని ఆలోచించి ఆ మార్గం లో ప్రయత్నం చేయటం రెండో పద్దతి. “ అంజిబాబు మాటలు తూటాలుగా తగలాల్సిన చోట తగిలాయి రమేష్ కి. క్షణం ఆగి రమేష్ ముఖ కవళికలను గమనించి మళ్ళీ అందుకున్నాడు అంజిబాబు “ నువ్వు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే వున్నావు. కాదనటం లేదు. కానీ నీ ప్రయత్న విధానం లో మార్పు అవసరం. ఇంత  వరకూ నువ్వు కేవలం ఉద్యోగ ప్రకటనలు చూసి వాటికి దరఖాస్తులు పెడుతూ వచ్చావు. నీ అంతట నువ్వు నోరు తెరిచి ఏనాడు  నీకు తెలిసిన పది మందిని  ఎక్కడైనా తగిన ఉద్యోగం వుంటే చెప్పమని అడగలేదు. ఒకవైపు ఉద్యోగ ప్రకటనలు చూసి దరఖాస్తులు పెడుతూనే నీకు తెలిసిన పదిమందిని వారికి తెలిసిన చోట ఎక్కడైనా ఉద్యోగం వుంటే చెప్పమని అడుగు. ఈ విధంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా కొద్ది రోజులలో నీకు ఉద్యోగం లభిస్తుంది.” రమేష్ కి ఆత్మ విశ్వాసాన్ని నూరి పోసాడు అంజిబాబు.
అంజిబాబు గీతోపదేశం చేసి వెళ్ళిన కాస్సేపటికి రమేష్  తాను ఇడ్లీ తిన్న పొట్లం కాగితం పారవేయ బోతూ అనుకోకుండా అందులో ఈ వాక్యాలు చదివాడు “ అమెరికాలోని ఒక తండ్రికి నిరుద్యోగుడైన కొడుకు వుంటాడు. ప్రపంచ బాంక్ లో అధ్యక్షుడి పదవికి తగిన వ్యక్తిని వెతుకుతున్నారని తండ్రికి తెలుస్తుంది. ఆ తండ్రి తిన్నగా ప్రపంచ బాంక్ కి వెళ్లి “ నా కొడుకు బిల్ గేట్స్ కి కాబోయే అల్లుడు. మీ సంస్ధ లో అధ్యక్ష పదవికి దరఖాస్తు పెడుతున్నాడు “ అనగానే వాళ్ళు “ మీ కొడుకుని  అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తాం “ అంటారు. ఆ తండ్రి బిల్ గేట్స్ దగ్గరికి వెళ్లి “ నా కొడుకు ప్రపంచ బాంక్ కి కాబోయే అధ్యక్షుడు. మీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తారా?” అని అడుగుతాడు. బిల్ గేట్స్ సరే అంటాడు ! . అంజిబాబు గీతోపదేశం తర్వాత విశ్వరూప దర్శనం అయినట్టు అనిపించింది రమేష్ కి పారేయబోతున్న కాగితం లోని పై వాక్యాలు చదవగానే.
మరో నెల గడిచేసరికి రమేష్ కి పరిచయస్థుల ద్వారా ఒక సంస్థ లో చిరుద్యోగం లభించింది. “ నీ ఉద్యోగ పర్వంలో ఇది నిచ్చెన లో తొలి మెట్టు. ఇంకా నువ్వు ఎక్కాల్సిన నిచ్చన మెట్లు ఎన్నో వున్నాయి. “ అన్నాడు నవ్వుతూ అంజిబాబు. తనకి చిరుద్యోగం వచ్చిన శుభ సందర్భంగా అంజిబాబుకి రెండు స్వీట్స్ ఇచ్చి రూం కి వెడుతూండగా ఎక్కడినుంచో సినిమా పాట పల్లవి “ కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు.” వినిపించింది రమేష్ కి. పూర్తిగా గాలి కొట్టిన బెలూన్ లాగా తన మనస్సు తనకే తేలిక గా అనిపించింది రమేష్ కి.  కానీ రమేష్ కి తెలియని విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి – తాను ఆ రోజు తిన్న ఇడ్లీ పొట్లం కాగితం ప్రత్యేకించి అంజి బాబు పెట్టాడని. రెండు- అంజిబాబు పదో క్లాసు స్కూల్ ఫస్ట్ కానీ కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మానేశాడని.
****

No comments:

Post a Comment

Pages