కినుక తల్పం - అచ్చంగా తెలుగు

కినుక తల్పం 

ఆచంట హైమవతి

కాలం  మారుతున్నదట -

కలికి సబల  అయ్యెనట!

అత్తవారింటికి  అరుదెంచిన -

నవ వధువు బహు గడుసుదట!

పేరు "రత్నమాల" యట -

పేరుకి తగిన అందగత్తెయట!

ఆనాటి భోజన సమయాన...

అలిగినది పెళ్లికూతురట...?!

బతిమలాడువారత్తవారట!

కినుకతీర్చి,కోరినవిచ్చి, బుజ్జగించి -

బువ్వపుబంతికి తోడితేవలెనట!

పాతను పక్కకునెట్టే - కొత్తొకవింతకదా?!

ఈనాటి  పెళ్లిసంబరాలలో....

ఇది నూత్న సంప్రదాయమట!

వివరాల 'వలయంలో' తొంగిచుస్తే -

"మరకత పతకపు కెంపుల అడ్డిగ ,

ముత్తెపు ముక్కెర, వజ్రంపు అడ్డబాస -

వైడూర్యపు కమ్మలు, పగడపు లోలకులు -

పుష్యరాగ నాగరము, గోమేధిక జడబిళ్ళ -

నీలాల గాజులు నాలుగే  చాలు" నట!

మోమాటములేక  చెప్పమనగ...

సిగ్గులోలకబోసి  చిరునవ్విన -

కోడలి కోరికల  తుంపరలివి.

ఇంచుకే  కోరుకుంటి -బిడియమెక్కువనాకు!

ఈవిగల అత్తవారనుకుంటి -

వారికివి చాల సామాన్యమనుకొంటి!

విషయాలు విన్న వియ్యాలవారు -

తల్లడిల్లిరి - తల్లకిందులైరి!

ఎన్నెన్నో చర్చలైన పిదప, కోమలి కోడలు -

వాక్రుచ్చె మెల్లగ 'సంధి' వాక్యములు!

"అల్లుని అలుకపాన్పు' న విదేశవిద్యనడుగ -

కోడలి"కినుకతల్పమున"-నవరత్నపు నగలడిగితి!

భేదము మాని పెద్దలు...తర్కించిచూడ -

'అలుక- కినుక' లు రెండూ అనవసరమని నుడివె!

వధువు ధైర్యము చూచి - రిచ్చబోయిరి పెద్దలు !

వినయమున తలవంచి ,విభునివంకకు చూచి -

మధుర మందహాసము విసరె....

ఆ  పై  ఆమె  స్వాధీనపతిక!

మాతృదేశపు  మమతను - నే మరువలేననెను!

విదేశయానము - పర్యటన మాత్రమునకేననెను!

స్వచ్ఛమానసం - స్వదేశ  కాపురం

అతులిత సమ్మతము  నాకని...

తృప్తితో  తెలిపె తెలివైన తరుణి!

భరతభువి భాగ్యదాయిని 'ఈమె' యని -

అత్తమామలు తలలూచిరి అతి సంతసాన!!

 ***

No comments:

Post a Comment

Pages