వేకువ పాట ( కధా సంకలం) - అచ్చంగా తెలుగు

వేకువ పాట ( కధా సంకలం)

Share This

వేకువ పాట  ( కధా సంకలం)

ఝాన్సీ మంతెన

       
పుత్తడికి తావి అబ్బినట్టు అనే మాట గుతొస్తుంది  వారణాసి నాగలక్ష్మి గారి “ వేకువ పాట “ పుస్తకం లోని కధలు చదువుతుంటె.   నిరవధికంగా చదివించె కధనం తో పాటుగా వైవిద్యంగా ఉండె కధా వస్తువు,  వీటికి తోడు తేనెలా జాలువారె చక్కటి భాష  మూడు కలిసి చదువరులను ఆసాంతం చదివిస్తాయి. సున్నితమైన  శైలి ఏ అర్భాటము లేకుండా విషయం సూటిగా చెప్పే తీరు పాఠకులను ఎక్కువ ఆకట్టుకుంటాయి. కొన్ని కధల్లొ కధా వస్తువు పాతదే ఐనా రచనలొ పైన చెప్పిన లక్షణాల వల్ల కొత్తగా అనిపిస్తుంది.    హడావిడిగా కాక ఎంతో ప్రశాంత చిత్తం తొ రాసినట్టనిపిస్తుంది. కధలన్ని కుటుంబ నేపద్యం లోనే ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బాంధవ్యాల విశ్లేషణ వివరణ తో సాగినవే.
       ఇంక కధల విషయానికి వస్తే,  ఈ సంపుటం లో మొత్తం పంతొమ్మది కధలున్నాయి.  వీటిలొ చాలా భాగం తల్లి దండ్రులు పిల్లల మధ్య బాంధవ్యాలను తెలిపే కధలు ఎక్కువున్నాయి.  విముక్త,  వెన్నెల కిటికీ,  పుట్టిల్లు,  నేను అమ్మనవుతా,అమ్మా నాన్నా ఒ కలేజీ అబ్బాయి,అమ్మ ఒక రూపం కాదు,చూస్తూనే ఉండాలా,  వారధి.  ఈ  కధల  ఇతివ్రుత్తం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య భాందవ్యాన్ని తెలిపేవే అయినా  వైవిధ్యం ఉన్న కధలే.
        విముక్త కధ నాలుగేళ్ళ పసివాడు ఇంటినుండి తప్పిపోయిన కంగారు తో మొదలైనా అసలు భావం  మాత్రం  “ ఎప్పుడైతే తల్లి కోసం పిల్లవాడు బెంగ పడడని ఖరారుగా తెలుస్తుందో, ఆప్పుడు ఆ తల్లి తన బిడ్డని తన పాశం నుండి విముక్తుణ్ణి చేయాలి.అతణ్ణే పట్టుకుని పాకులాడుతూ వెనక్కి లాగ రాదు.   సంతానం పట్ల తల్లి అమితమైన ప్రే మ కలిగి ఉంటే ఇంక ఆ తల్లి ముక్తిని పొందేదెలా”.     బాధ్యతలు తీరిన వేళ ఎంత తొందరగా బంధాలనుండి విముక్తి పొందితె అంత ప్రశాంతంగా జీవితం నుండి విముక్తి పొంద వచ్చు అనే.
       వెన్నెల కిటికీ కధలో పిల్లలు ఎదిగి ఎవరి జీవితాల్లో వాళ్ళు స్థిరపడ్డాక వాళ్ళను చూడడానికి వెళ్ళిన తల్లిదండ్రులకు ఎదిరైన అనుభవాలను గురించిన కధ.    ఇంటికి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడే తీరిక లేదంటూ తప్పుకుని తెరిగే సంతానం కొందరిదైతే,   తల్లిదండ్రులకు దగ్గరగానె ఉన్నా వాళ్ళ బాధ్యతలను వయసు మళ్ళిన తల్లిదండ్రుల పైన పడెసే వాళ్ళు కొందరు.   విషయమ్ పాతదే ఐనా నాగలక్ష్మి గారు కధ రాసిన విధానం చాల ఆసక్తి కరంగా ఉంది.
        తల్లీ కూతుళ్ళమధ్య ఉన్న ప్రేమ,  దగ్గరితనం అత్తా కోడళ్ళ మధ్య ఉండకపోవడాన్ని ఒక కొత్త కోణంలో చూపారు నాగలక్ష్మి గారు "నేనూ అమ్మనవుతా",  "వారధి" కధల్లో.   కోడళ్ళ పట్ల అత్తలు ఉండవలసిన తీరు గురించి చక్కని సూచనలు చేసారు కధలోని భాగంగానే.
        ‘వారధి’ కధలో రాజేశ్వరి కోడలిని ఎంచుకోవడంలో తన ప్రమేయం లేకపొవడం తో కొడలితో యెక్కువ అనుబంధాన్ని పెంచుకోలేక పొయింది.    భర్త తొడిదే లోకంగా బ్రతికింది.    తీరా భర్త చనిపోయి,  కొడుకుతో కలిసి జీవనం సాగించాల్సి రావడం తో ముడుచుకు పోతుంది.  కొడుకు, కోడలు, కొడుకు పెంచుకున్న బాబు తో కలిసి హ్రుషికేశ్ కి వెళ్ళినప్పుడు  వాళ్ళంతా పరాయివాళ్ళలా కనబడడంతో  తనకు తెలియకుండానే మానసికంగా  ఒంటరిగానే ఉంటుంది.   రుషీకేశ్ లో గంగానది లో రాఫ్టింగ్ కి మనవడి బలవంతం మీద వెళ్ళినప్పుడు  ప్రయాణంలో మొదట భయపడినా,  ప్రయాణం సాగుతున్న  క్రమంలో భయం పోవడమే కాక జీవితమంటే భయం కూడా పొతుంది.   గంగానదీ ప్రవాహం లో ప్రయాణాన్ని జీవితానికి అన్వయిస్తూ  కధను అద్భుతంగా వర్ణించారు రచయిత్రి.
ఈ ఒక్క కధలోనే కాదు ఇంకా రెండు మూడు కధల్లొ కూడా నదీ ప్రవాహాన్ని జీవితాలలో ఉండే ఒడుదొడుకులతోను,  ఆనందాలతోను   పోల్చి చాలా హృద్యంగా రాసారు.
        భర్తనుండి హింస ను ఎదుర్కొనే స్త్రీలకు  పుట్టింటి వారు అండదండలను మానసికంగా బలాన్ని ఇవ్వాలని చెప్పే  “ పుట్టిల్లు” కధ,   దేవుని రూపాలైన చిన్న పిల్లలు చూసేది అమ్మ మనసులో ప్రేమనే కాని రూపాన్ని కాదని చెప్పే “ అమ్మ ఒక రూపం కాదు” కధ,  “కాపురం పోతుందేమోననే భయం  కేవలం స్త్రీ కే ఎందుకుండాలో అర్ధం కాదు”  అని అనుమానపు భర్తను వదిలి పుట్టింటికి వచ్చిన అమ్మలు, అలా అనుమానించడం తనని అవమానించడమే నని అంటున్న మాటలు విని మనసు మార్చుకున్న  ఆటొ డ్రైవర్  కధ “ పుష్యవిలాసం”.  ఈ అన్ని కధల్లో  కధనం సున్నితంగా చాలా బాగుంది.
          “ నాన్న కో ఈ మెయిల్ “ కధలో కూతురు తన తండ్రి చూపిన ప్రేమను,  వాత్సల్యాన్ని రాస్తూనే,  అంత ప్రేమ ఉన్న తండ్రి రెండొసారి కూడా ఆడపిల్ల పుడితే ఎందుకంత ఈసడింపు కలిగిందని అడుగుతుంది.   ఆడపిల్లను కనడం భార్య నేరమైనట్టు,  ఆమెను నిర్లక్షానికి,  అవమానాలకు గురిచేసి,  పిల్లలు ఎదిగివచ్చే వేళకు  వాళ్ళే ప్రపంచంగా ఉండడం ఎంతవరకు న్యాయం అని ఆక్రోశిస్తుంది.    తన భర్త కూడా ‘ఇద్దరూ కూతుళ్ళనే కన్నదని’ తననిఅవమానకరంగా మాట్లాడుతున్నాడని, “ వెంటనే కాక పోయినా కొన్నేళ్ళ తరువాత ఐనా నీలాగా మారతాడని నాకు నమ్మకం”  అని రాసిన వాక్యం  చాల అలోచింప చేసేదిగా ఉంది.
          సంగీతం తెలిసిన నాగలక్ష్మి గారు,  జీవితాన్ని స్వరాలతో అన్వయించి చెప్పడం చాలా బాగుంది.    రోజువారి జీవనంలో జరిగే సంఘటనలనే ఉదాహరణలుగా చూపుతు,   అపస్వరాలు రాకుండా సరళీ స్వరాలను సాధన చేయాలని  చెప్పడం,    అవసరాలకు మించి సంపాదనకు వెంపర్లాడడం,   ఈ వరుసలో జీవితాలనుక్లిష్టతరం చేసుకోవడం   లాంటివి చేసే వాళ్ళకు “ సరళీ స్వరాలు “ కధ గుణపాఠం.
టెక్నాలజీ  వాడకం పెరిగి,   సెల్ఫోన్లు ఇయర్ ఫొన్ల  వాడకం   మూలంగా కలిగే నష్టాన్ని,  అవి పరిమితంగా వాడడంవలనా, చుట్టు వుండే వారితో సహజీవనం లో   ఎంత మాధుర్యం  దొరుకుతుందో సహజీవనం కధలో   హృద్యంగా చెప్పారు నాగలక్ష్మి గారు.
       “ చూస్తూనే ఉండాలా “  కధ కూడా ఇంచుమించు గా ఇలాంటి ఇతివ్రుత్తం తోనే ఉంది.  ఉపయోగానికి కాక గొప్పలు ప్రదర్శించు కోవడానికే  ఖరీదైన వస్తువుల సేకరణా,  పిజ్జా బర్గర్ ల సంస్క్రుతి లాంటి దోరణులను తనదైన  శైలి లో సున్నితంగానే ఎండగట్టారు.
         ఈ కధా సంపుటిలో అన్ని కధలు  చాలా బాగున్నయి.     అయితే నాకు మరింతగా నచ్చిన కధలు   “ అమ్మా నాన్నా ఓ కాలేజి అబ్బాయి”  కధ.    “ ప్రపంచమంతా చిన్న పిల్లలను వృధ్ధులను  నిస్సహాయులనీ,   బలహీనులనీ;  మధ్య వయస్సు వాళ్ళంతా బలవంతులు క్రూరులూ అనుకుంటుంది” ఇది కధలోని అమ్మ ఆక్రోశం.   పిల్లలను చదువు విషయంలో తల్లిదండ్రులు చాలా కంగారు పెడుతున్నారనో పిల్లలు చాల మానసికంగా వత్తిడికి గురి చేస్తున్నారనో అనుకుంటాం.   కౌన్సిలింగ్ నిపుణులు కూడా ఇదే కొణంలో చూస్తున్నారు.    నాగలక్ష్మిగారు ఈ సమస్యను కొత్త కోణం లోచెప్పారు.   పిల్లలకు కావలసినవి అమర్చడంలో  తల్లిదండ్రులు ఎంత శ్రమపడతారో,  వారు పడుతున్న శ్రమను పిల్లలు గుర్తించకుంటే వాళ్ళ మనసులు ఎంత కష్టపడతాయో,  ఈ విషయంలో  వాళ్ళను ఏమాత్రం మందలించాలని చూసినా సెన్సిటివ్ గా ఆలోచించి ఇంట్లొనుండి పారిపోయె పిల్లలను ఏలా మేనేజ్  చేయాలో తెలియక సతమతమయ్యే తల్లిదండ్రుల కధ ఇది.   ధనవంతులైన  స్నేహితుల తల్లిదండ్రులతో మధ్యతరగతి వాళ్ళైన తమ తల్లిదండ్రును పోల్చే పిల్లలు,  చదువులో తమను తమ స్నేహితులతో పోల్చితే భరించలేరు.  ( ఈ కధను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ గారు చాల అద్భుతమైన కధ అని మెచ్చుకున్నారు).
          నాకు చాలా నచ్చిన ఇంకో కధ  “ఆనాటి వాన చినుకులు”  ఈ కధ చదువుతున్నంత సేపు ఒక మధుర కావ్యం లా అనిపించింది.  చదువు పెరిగిన కొద్ది జ్ఞానం ,  జ్ఞానం పెరిగిన కొద్దీ జీవితం పట్ల అవగాహనా పెరగాలి.  కాని దురద్రుష్ట వశాత్తు  నేటి కాలంలో ప్రతిభ అహాన్ని పెంచి, దంపతుల మధ్య దూరం పెంచుతోంది.     శిశిర,  హేమంత్ ల జీవితంలో కూడా ఇలాగే దూరం పెరిగింది.   అపార్ధాలెక్కువై ఎన్నోశిశిరాలు ఎన్నో వసంతాలు ఒంటరిగానే గడిపారు.     వాళ్ళు పెద్ద ఇంట్లోకి మారక ముందు ఉన్న ఔట్ హౌస్ లో శిశిర అక్క కూతురిని చూడడానికి వెళ్ళిన శిశిర,   తమ జీవితాల్లో మరచిన చిన్న చిన్న ఆనందాలను గుర్తు తెచ్చుకొనే వరుసలో జ్ఞానోదయం అవడం,  వసంత్ ని తిరిగి ఆహ్వానించడం.   కధా విషయం టూకీగా ఇదే అయినా ఆకట్టుకునే కధనం ఒక అందమైన కావ్యంలా సాగే వివరణలు,  ప్రకృతి వర్ణనలు వివరించడం లో   వారణాసి నాగలక్ష్మి గారి బ్రాండ్ సున్నితత్వం  చాలా అద్భుతంగా ఉన్నాయి.
        కొన్నికధల్లో  విషయమ్ పాతదే అయినా రచయిత్రి కధాశిల్పం కధనం,   తేనెలొలుకుతున్నతున్నట్లుండే చక్కని భాషా కలిసి పుస్తకాన్ని ఆసాంతం  చదివిస్తాయి.   ఇంత చక్కని కధా సంకలనాన్ని అందించిన రచయిత్రి వారణాసి నాగలక్ష్మి గారికి అభినందనలు.
పుస్తకం; వేకువ పాట
రచయిత్రి ; వారణాసి నాగలక్ష్మి
ఈ పుస్తకం  ప్రజాశక్తి బుక్ హౌస్ ( విశాలాంధ్ర) మరియు నవోదయ బుక్ హౌస్ లో లభ్యమవుతోంది.
ఇదే కాక   అన్ లైన్ లో anandbooks.com  ద్వార కూడా పోందవచ్చు.
***

No comments:

Post a Comment

Pages