శ్రీధరమాధురి -22 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -22

Share This

శ్రీధరమాధురి -22

(సాలగ్రామాల విషయంలో తన జీవితానుభవాల గురించి పూజ్య గురుదేవుల అమృతవాక్కులు )

సాలగ్రామం గురించి మా గురువైన ఆరాముధన్ చెప్పిన కధ...
హైదరాబాద్ లో ఆరాముధన్ గురువర్యులకి హషీం ఇక్బల్ అనే ముస్లిం స్నేహితుడు ఉన్నాడు. అతన్ని తరచుగా దర్శిస్తూ ఉండేవారు. ఒకరోజు ఆరాముధన్ అతనివద్దకు వెళ్లినప్పుడు అతని నోటి నుంచి ఒక రాయిని తియ్యడం వారు చూసారు. మొదట అతను తన నోరు కడుక్కుని, తర్వాత రాయిని కడిగారు. హషీం ఇక్బల్ ఆ రాయిని తిరిగి నోట్లో పెట్టుకోబోతున్నాడు. ఆరాముధన్ ఉత్సుకతతో ఆ రాయిని చూసారు. అది లక్ష్మీనృసింహ సాలగ్రామం.
ఆరాముధన్ ఇలా అన్నారు – నీవు నోట్లో పెట్టుకోబోతున్న రాయి ఒక సాలగ్రామం.
హషీం – అంటే ఏమిటి ?నా చిన్నతనంలో ఈ రాయి ఎక్కడో దొరికితే, నా నోట్లో పెట్టుకున్నాను. తర్వాత అదే అలవాటుగా మారింది. చాలాసేపు ఈ రాయిని నా నోట్లోనే ఉంచుకుంటాను. నేను తినేటప్పుడు కూడా ఈ రాయిని నా నోట్లోనే ఉంచుకుంటాను. నేను తినేటప్పుడు కూడా ఈ రాయిని నా నోట్లోనే ఉంచుకుంటాను. నేను పాన్, పొగాకు కూడా నోట్లో ఈ రాయిని ఉంచుకునే నములుతాను. ఇది దేవుడి రాయని నాకు తెలీదు. కాని, ఇప్పుడిక ఈ రాయిని నా నోట్లో పెట్టుకోవాలని లేదు. నేను వేరే రాయిని పెట్టుకుంటాను. మీరు దయుంచి దీన్ని తీసుకోండి.
ఆరాముధన్ గురువర్యులు దాన్ని ఇంటికి తెచ్చారు. పంచగవ్యాలతో పరిశుద్ధం చేసారు. సాలగ్రామానికి పాలు, పెరుగు, నెయ్యి, పంచామృతం, రోజ్ వాటర్ తో స్నానం చేయించారు. నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చారు.
ఆ రాత్రి లక్ష్మి నృసింహస్వామి ఆయనకు కళలో కనిపించి, ‘హే ఆరాముదా, నువ్వు ఏం చేస్తున్నావు? నేను ఇక్బల్ నోట్లో చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నన్ను ఇక్కడకు తెచ్చి, ఏదేదో పోస్తున్నావు. నాకు ఇక్బల్ వద్దకు వెనక్కు వెళ్లాలని ఐ. నన్ను అక్కడికే తిరిగి పంపెయ్యి.’ అన్నారు.
ఆరాముధ గురువర్యులు హైదరాబాద్ వెనక్కు వెళ్లి, హషీం ఇక్బల్ కు క్షమాపణలు చెప్పారు. ‘మా దైవం నీ నోట్లో చాలా ఆనందంగా ఉన్నారట. ఆయన కోరిక ఏమిటో తెలుసుకోకుండా నేను పొరపాటు చేసాను. నన్ను క్షమించు.’ అన్నారు. ఇక్బల్ కు సాలగ్రామం ఇచ్చేసి, ఆయన హైదరాబాద్ నుంచి చెన్నై తిరిగి వచ్చారు.
నాతో ఆరాముధన్ ఇలా అన్నారు – ‘శ్రీధర్, ఎప్పుడూ నువ్వు, కేవలం నువ్వు పాటించే పద్ధతులే ఉన్నతమైనవని భావించకు. దైవం పేరుతో ఎవర్నీ నిందించకు. దైవానికి ఏది ఇష్టమో మనకు తెలీదు. బహుశా నేను అహంకారంతో నా మిత్రుడైన ఇక్బల్ లో లోపాలు వెతికాను. దైవం నా అహాన్ని పటాపంచలు చేసారు. దీన్ని బట్టి నేను పాటించే మతాచారాల కంటే దైవానికి, ఇక్బల్ అమాయకత్వమే బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ కధ ద్వారా నాలో వినయాన్ని, విధేయతను పెంచి, దైవం ఎంతో దయ చూపారు.” అన్నారు.
***
అడవిలో నేను ‘ప్రేరణ’ అనే ప్రయోగం చేస్తున్నాను. 8 మంది బ్రాహ్మలు నాకు సాయం చేస్తున్నారు. శుక్లపక్ష చతుర్దాశికి మూడు రాత్రుల ముందు హోమంలో వేసే ఒక ప్రత్యేకమైన మూలికను తీసుకురావాలి. దాని అరటిఆకులో చుట్టి పెట్టాలి. హఠాత్తుగా, నేను దానికోసం అడగగానే, బ్రాహ్మలు అది కనిపించక వెతకసాగారు. నేనూ వెతికాను. కనిపించలేదు. నేను నెయ్యి, మూలికలు, సమిధలతో హోమం కొనసాగించమని వారికి చెప్పాను. నేను ప్రశ్నాభావాన్ని చూసాను. అది అడవిలో దక్షిణ దిశగా సూచించింది. నేను మరో 10 మైళ్ళు నడిచాను. అక్కడొక పెద్ద మర్రి చెట్టు ఉంది. దగ్గరలో ఉన్న చిన్న కాలువలో స్నానం చేసాను. ఆ మర్రిచెట్టు వద్దకు వెళ్లాను. దానిక్రింద ఒక అందమైన రాయి ఉంది. అది యోగనృసింహుని అందమైన విగ్రహం. ఆ సౌందర్యం చూసి నేను అవాక్కయ్యాను. నేనొక అరగంట ధ్యానం చేసి, మంత్ర రాజపద మూల మంత్రాన్ని మరొక అరగంట పాటు జపించాను. ఒక వృద్ధుడు నావద్దకు వచ్చి, ‘ఏం చేస్తున్నావు?” అని అడిగాడు.
‘ఈ విగ్రహం చాలా బాగుంది. నేను దీనిపట్ల ఆరాధనతో ప్రార్ధిస్తున్నాను.’ అన్నాను.
‘ఏ కోరికతో ప్రార్దిస్తున్నావు ?’ అని ఆయన అడిగారు. నేను ప్రార్ధనల్ని ఇష్టపడతానని, దానికి ఏ ప్రయోజనము ఆశించనని, చెప్పాను.
ఆయన నవ్వి, ‘ఆ అరటి ఆకులో ఉంచిన మూలిక కోసం వెతుకుతున్నావా?’ అని అడిగారు. నేను అప్రతిభుడనయ్యాను. ఆయన తనవద్ద ఉన్న సంచీనుంచి దాన్ని తీసి ఇచ్చారు. నేనాయనకు నమస్కరించాను.
‘నన్ను హత్తుకోవా?’ అని ఆయన అడిగారు. నేనాయన్ని హత్తుకునాను. ఆయన ‘త్వరగా వెళ్లి ప్రయోగం పూర్తి చెయ్యి,’ అన్నారు. నాకు కొంతదూరం వెళ్ళాకా,మళ్ళీ ఆయన్ను చూడాలనిపించింది. ఆయన అక్కడ లేరు. నేను దీన్ని లక్ష్మినృసింహస్వామి దీవెనలుగా భావించి, ‘ప్రేరణ’ అనే ప్రయోగం పూర్తి చేసేందుకు బయలుదేరాను. దైవం యొక్క మార్గాలు గుహ్యమైనవి. ఆయన్ను చూసి ఆశ్చర్యపోండి. దైవాన్ని కొనియాడండి.
***
నేను అడవిలో వెళ్తుండగా నా కార్ ఘాట్ లలో ఆగిపోయింది. ఎన్నిసార్లు ఇంజిన్ ను ఆన్ చెయ్యాలని చూసినా, అది స్టార్ట్ కాలేదు. రాత్రి 1.30 అవుతోంది. నేను కార్ లాక్ చేసి, నడవసాగాను. దారిలో నాకు నడకలో ఊతం కోసం ఒక కర్రను వద్ద ఉంచుకుని, రోడ్డు ప్రక్కగా కూర్చున్న వృద్ధుడు కనిపించారు. ఆయన రోడ్డు ప్రక్కన కూర్చుని, చలిమంట వేసుకుంటున్నారు. నేనాయనను దాటుకుని వెళ్తుండగా, ఆయన నన్ను పిలిచి, ‘అర్ధరాత్రి ఇక్కడ ఏం చేస్తున్నావు?’ అని అడిగారు. నేను ‘నా కార్ ఆగిపోవడంతో దగ్గరలో ఉన్న గ్రామానికి నడిచి వెళ్తున్నాను,’ అని చెప్పాను. అది చాలా దూరంలో ఉందనీ, ర్=తనతో వచ్చి, ఆ రాత్రి ఉండమని, ఆయన నన్ను కోరారు. ఉదయాన్నే నీవు వెళ్ళవచ్చు, అన్నారు. నేను ఆయనను అనుసరించాను. అడవిలోకి 2 కి.మీ లు నడిచాకా అక్కడొక చిన్న గుడిసె ఉంది. ఆయన భార్య అయిన ఒక వృద్ధురాలు మమ్మల్ని స్వాగతించింది. పచ్చి మామిడికాయ, మిరపకాయ, మజ్జిగతో కాస్త గంజి త్రాగమని ఇచ్చింది. ఆయన ‘నువ్వేం చేస్తుంటావు?’అని అడిగారు.
నేను – దైవానుగ్రహం, నేను ఆయన భద్రతలో ఉన్నాను. అందుకే దేని గురించి ఆలోచించేందుకు విచారించేందుకు ఏమీ లేదు.
ఆయన – దైవం నీ గురించి శ్రద్ధ వహిస్తుంటే, నీ కార్ ఘాట్ ల మధ్యలో, అదీ అర్ధరాత్రి ఆగిపోకూడదు కదా !
నేను – నేను మిమ్మల్ని, మీ భార్యను కలవాలని దైవం ఈ విధంగా డిజైన్ చేసారేమో. మీ భార్య చేతుల మీదుగా ఈ రుచికరమైన గంజిని త్రాగెందుకే ఇలా జరిగిందేమో.
ఆయన – అయితే దీని వెనుక దైవం యొక్క ఉద్దేశం ఏదో ఉందని నువ్వు బలంగా నమ్ముతున్నావా ?
నేను – కేవలం నమ్మకం కాదు. ఆయన దయవల్ల, నమ్మకం అనే బీజం మహావిశ్వాసం అనే పర్వతంగా ఎదిగిపోయింది.
ఆయన – నీకు సమయం ఉంటే, నేను రేపు నిన్ను అడవిలో ఒకచోటికి తీసుకు వెళ్తాను.
నేను – మీరు చాలా దయామయులు. ఇదంతా నాకు దైవం ఇచ్చిన బహుమానం.
మర్నాడు ఉదయం 5 గం. లకి ఆ వృద్ధుడు, ఆయన భార్య, నేను అడవిలోకి వెళ్ళాము. అక్కడ ఒక కొలను వెనుక చిన్న జలపాతం ఉంది. మేమంతా అందులో స్నానం చేసాము. ముందుకు సాగాము. ఆయన భార్య కొన్ని తినుబండారాలను తెచ్చింది. మేము మధ్యలో తిన్నాము. దాదాపు 10 గం. తర్వాత ,సాయంత్రం 3 గం. ప్రాంతంలో మేము ఒకచోటికి చేరుకున్నాము. ఆ ప్రాంతం చాలా అందంగా ఉంది. అక్కడ ఎన్నో అరటి చెట్లు, ఎన్నో కోతులు ఉన్నాయి. ఆ దంపతులు నన్ను ఆ తోట ఆవలకు తీసుకువెళ్ళారు.
చివరికి, మేమొక  కొండపై పెద్ద రాయి ఉన్న చోటికి చేరుకున్నాము. వారు నన్ను ఆ రాయికి మరొకవైపుకు తీసుకువెళ్ళారు. అక్కడ ఒక గుహవంటి ద్వారం ఉంది. మేము లోనికి వెళ్ళాము. లోపల కాంతి చాలా తక్కువగా ఉంది. ఆమె ఒక పెద్ద చెంచాను తీసుకుని, అందులో కొంత నూనెను వేసి, దీపం వెలిగించింది. అప్పుడు ఆ రాతి గోడపై నేను దైవం యొక్క శిల్పాలలో అత్యంత సుందరమైన ప్రతిమను నేను చూసాను. అది ‘ప్రయోగ చక్రధారి శ్రీ యోగేంద్ర లక్ష్మి నృసింహ స్వామి’ది. స్వామి పద్మాసనంలో కూర్చుని ఉండగా, భూదేవి, శ్రీదేవి ఇరుప్రక్కలా నిలబడి, స్వామికి చామరంతో సేవ చేస్తున్నారు. వృద్ధుడు నన్ను దైవం యొక్క పాదాలను తాకి చూడమన్నారు. నేను ఆ పాదాలు మెత్తగా, సజీవంగా ఉన్నట్లు ఉండడం చూసి, ఆశ్చర్యపోయాను. దైవం యొక్క కుడి పాదం నుంచి ఆయన నన్ను కాస్త చందనం తీసుకోమన్నారు. అది చాలా తాజాగా సువాసనతో కూడి ఉంది. ఆమె తనతో తెచ్చిన కొన్ని పువ్వులను ఇచ్చి, దైవానికి సమర్పించమంది. నేను వారి అనుమతిని తీసుకుని ‘ఉజ్జీవని’ అనే ప్రయోగం మొదలుపెట్టాను.  ఆ ప్రయోగం పూర్తి కావడానికి 8 గం. పట్టింది.
ఆ జంట కనిపించలేదు. నేను దైవాన్నే చూస్తూ గుహలోనే ఉండిపోయాను. ఉదయాన్నే బయలుదేరాను. ఆ వృద్ధులు ఉండే గుడిసె వద్దకు నడిచి వెళ్లాను. వారు అక్కడా కనిపించలేదు.కాని, ఆసక్తికరంగా, మరొక చక్కటి సన్నివేశం కనిపించింది.
ఒక పులి, శివంగి ఆడుకుంటున్నాయి. నేను కాస్త దూరంలో ఉండి చూస్తుండగా, అవి నావద్దకు వచ్చాయి. నా వంక చూసాయి. అవి నన్ను చూసి నవ్వి పరిగెత్తుకు వెళ్ళిపోయినట్లుగా నాకు అనిపించింది. వారు అనేక మారురూపాలతో అరణ్యాలలో తిరిగే ‘గంధర్వులు’ అని నేను గుర్తించాను.
నేను కార్ వద్దకు వెనక్కు వచ్చాను. ఒక్క సారి స్టార్ట్ చెయ్యగానే కార్ ఇంజిన్ ఆన్ అయ్యింది. నేను ఆ రోజు మజిలీ చేసేందుకు మదురై దిశగా సాగిపోయాను. అంతా దైవానుగ్రహం.
***
చాలా ఏళ్ళ క్రితం నేను ఖాట్మండు ను దర్శించినప్పుడు, నాకొక సాధువు కనిపించారు. ఆయన నాకొక సాలగ్రామాన్ని ఇచ్చారు.
నేను – ఓ పూజ్య గురువర్యా, నాకు ఏమైనా సూచనలు ఇస్తారా ?
సాధువు – ఇస్తాను, నువ్వొక పని చెయ్యాలి – అంటూ నా ఎడమ చేతిని తీసుకుని, నేను అర్ధం చేసుకోగలిగినట్టు ఏదో రాసారు. నేను ఆయనకు ప్రణమిల్లి, ఖాట్మండు వదిలి వెళ్లాను.
ఆరు నెలలు నేను ఆ సాలగ్రామాన్ని అర్చించాను. తర్వాత ఒక కార్తీకపౌర్ణమి రోజున నేను దాన్ని అడవికి తీసుకువెళ్లాను. సన్నగా తుంపర పడుతోంది. ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. నేనొక కొండమీద ఉన్నాను. సాలగ్రామం యొక్క ముఖం చంద్రుడి వైపు ఉండేలా పట్టుకున్నాను. ఆకాశం మేఘావృతమై ఉండడం వల్ల, చంద్రుడు మధ్య మధ్య మాత్రమే కనిపిస్తున్నాడు. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్నాయి. హఠాత్తుగా దగ్గరలో ఉన్న చెట్టుపై పిడుగు పడి, అది మంటల్లో కాలిపోసాగింది. నేను ఆ చెట్టు వద్దకు పరుగెత్తాను. ఆ మంటల్లోంచి ఒక సాధువు వెలికి వచ్చారు.
సాధువు – ఆ సాలగ్రామం ఏది ?
నేను – ఇదిగో గురువర్యా. ఆయన దాన్ని తీసుకున్నారు. మేమిద్దరం కొండదిగి వెళ్ళాము. అక్కడొక కాలువ ఉంది. మేమిద్దరం నీళ్ళలోకి దిగాము. నేను సాలగ్రామాన్ని నా రెండు అరచేతులపై పెట్టుకున్నాను. ఆయన కాలువ నుంచి మూడుసార్లు నీటిని తీసి, సాలగ్రామంపై పోసారు. మేమిద్దరం 10008సార్లు ‘ ఓం నమో నారాయణాయ ‘ అన్న మంత్రాన్ని జపించాము. మేమిద్దరం కాలిపోయిన చెట్టు వద్దకు వెనక్కి వెళ్ళాము. సూర్యోదయం అయ్యింది. మేము సాలగ్రామాన్ని ఆ కాలిపోయిన చెట్టు కాండంపై పెట్టాము. ఆయన కాలువ నుంచి కాస్త నీటిని తీసుకుని రమ్మన్నారు. నావద్ద నీటిని తెచ్చేందుకు ఏ పాత్రా లేదు. నేను ఆ సాధువు వంక చూసాను.
ఆయన ‘వెళ్లి చెప్పింది చెయ్యి’ అన్నారు.
నేను అక్కడినుంచి కాలువ వద్దకు దిగి వెళ్లాను. ఆశ్చర్యకరంగా అక్కడ నాకొక గిరిజన మహిళ కనిపించింది. ఆమె కాలువ నుంచి  నీటిని తీసుకువచ్చేందుకు  వచ్చింది. ఆమె నన్ను చూడగానే నవ్వింది. నన్ను ఆమె  మాట్లాడనివ్వలేదు. తన చేతిలో ఉన్న కుండను నాకిచ్చి, తన వెనుక మోసుకు రమ్మని, నా ముందు నడుస్తూ కొండను ఎక్కసాగింది. సాధువు ఆమెను చూసారు, ఇద్దరూ నవ్వారు. నేను తెచ్చిన నీటితో ముగ్గురం కలిసి, చెట్టు కాండంపై ఉన్న సాలగ్రామానికి అభిషేకం చేసాము. నేను దిగ్భ్రమ చెందాను. కాలిపోయిన చెట్టు మళ్ళీ సజీవంగా, పచ్చగా చిగురించింది. అది యెంత పచ్చగా ఉండందంటే, గతరాత్రి పిడుగు పాటుకు కాలిన ఛాయలు మచ్చుకైనా లేవు. వారు చెట్టు నుంచి సాలగ్రామాన్ని తీసి నాకిచ్చారు.
అప్పుడు సాధువు నాతో ఇలా అన్నారు – ఇది చాలా శక్తివంతమైన సాలగ్రామం. ఇది ఎన్నో యుగాల నుంచి ఉంది. దీనికి అధిదేవత ‘కమల వాసుదేవార్’ రూపంలో ఉన్న ‘శ్రీ లక్ష్మి నారాయణన్’. నీ దేవతార్చనలో ఇది ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇది మానవాళికి, ప్రకృతికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
గిరిజన స్త్రీ ఇలా అంది – దీనికి దుష్టశక్తిని కూడా మంచిగా, శ్రేయస్కరంగా మార్చగల శక్తి ఉంది. దీన్ని భక్తితో పూజించి, లోకకల్యాణం కోసం ఉపయోగించు.
ఆ తరువాత ఆమె నా కుడిఅరచేతిపై నేను అర్ధం చేసుకోగలిగినట్లుగా ఏదో రాసింది. సాధువు, గిరిజన స్త్రీ గాల్లోకి అదృశ్యం అయ్యారు. వారు ఇంతకు ముందు నిల్చున్న దిశగా నేను సాష్టాంగ నమస్కారం చేసాను.  అజరామరులైన    నా గురువులు దీదీ చాందిని, మహర్షి రాజర్ కు ప్రణామములు. నేను ఆ సాలగ్రామాన్ని తీసుకుని, ఖాట్మండు దిశగా పయనించసాగాను. ఘోరక్పూర్ వచ్చింది. అక్కడొక సాధువు నన్ను కలిసారు. నేను సాలగ్రామాన్ని వారికి ఇచ్చాను. ఆయన నన్ను దీవించి, దాన్ని వెనక్కి ఇచ్చి, ‘మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్ధిస్తూ ఉండు,’ అన్నారు.
నేను ఆయనకు ప్రణమిల్లాను, ఆయన నన్ను గట్టిగా హత్తుకున్నారు. నా పూజ్య గురువర్యులు సు యెన్. ఇప్పుడు ఆ సాలగ్రామం మా దేవతార్చనలో ఉంది. లోక కల్యాణం కోసం మేము దాన్ని ఎల్లప్పుడూ పూజిస్తూ ఉంటాము.
ఓం నమో నారాయణాయ.
ఓం నమో భగవతే కమల వాసుదేవాయ. అంతా దైవానుగ్రహం.
***

No comments:

Post a Comment

Pages