పుస్తక పరిచయం 'వసంతం' - అచ్చంగా తెలుగు

పుస్తక పరిచయం 'వసంతం'

Share This

పుస్తక పరిచయం "వసంతం" 

రచయిత్రి : పి.వసంతలక్ష్మి.

శశికళ ఓలేటి


మన పి.వసంత లక్ష్మి గారు, అదే మనకు లక్ష్మీ వసంతగా చిరపరిచితులు, వారి గతాల, స్వగతాలు, ఆమె బ్లాగ్స్ నుంచి తీసిన సంకలనం, "" వసంతం"" పేరున పుస్తక రూపంలో వెలువడి, మన పుస్తక ప్రదర్శనలో ప్రమదాక్షరి స్టాల్ లో ప్రదర్శనకు పెట్టారు. అంత మంచి పుస్తకం చదివిన తాదాత్మ్యత నుండి బయట పడలేక, దాని గురించి పంచుకుందామనే ఈ టపా. నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లల, లోటు లేని మధ్య తరగతి ఇంట్లో, బాల్య యవ్వనాలను ఏలూరు-విశాఖ పట్డణాలలో గడిపిన, మంచి, తెలివయిన, చురుకయిన, అన్నీఫస్టులే ఒచ్చే పెద్ద పిల్ల మన నాయిక. తల్లి కష్ట , సుఖాలకు నమ్ముకున్న పెద్ద పిల్ల. పచారీ సంచి, పుస్తకాల సంచి ఒడుపుగా బేలన్స్ చేసిన ఆడపిల్ల. ఆ ఆరోగ్య కరమయిన బాల్యంలో, పండుగలు, పబ్బాలు, పత్యాలు, పైత్యాలు, ఉమ్మడి కుటుంబ జీవన సౌందర్యం, యుద్ధకాలం, తుఫాన్ సరదా, రేషన్ రోజులు-----ఓహ్ ఒకటేంటి ఎన్ని స్మృతులో. మంగత్తమ్మమ్మతో దొంగ తనంగా సముద్రానికి పోయి, ఏరుకున్న గవ్వలు, విదేశీ యువకుల్లాంటి అంద మయిన నున్నటి రాళ్ళ లాంటి మరవ లేని, మనసు లోని జ్ఞాపకాలు. చెప్పులేసుకోమని స్నేహితురాలు తల్లి చెప్పినప్పటి అవమానం, ఇప్పటి వరుకు పచ్చిగా ఉంచుకున్న, స్వాభిమానపు పిచ్చి పిల్ల. బాదాం చెట్టు నుండి, ఆంధ్ర యూనివర్సిటీకి మారిన స్నేహ ప్రయాణం. సమ్మెలకు జరగని క్లాసులు, బోలెడు మంచి సినిమాల, పుస్తకాల పరిచయం ఒకెత్తయితే, వైజాగ్ సముద్రపు అలలతో , సహచరిలతో ఆడిన ఆటలు, ఆ సముద్రం, అపసవ్యపు ఎత్తు పల్లాలు, రంగులు మారే ఆకాశం, పచ్చటి కొండలు,ఆమెనా ఊరికి శాస్వతంగా కట్టి పారేశాయి. స్వేచ్ఛగా చదువు కోనిచ్చి, నచ్చిన సహచరుని కిచ్చి పెళ్ళి చేసిన వాళ్ళ నాన్నగారు----నిజమే తనన్నట్టు మన అదృష్టాలు మన పుట్టుకలోనే ఉంటాయి. చదువు తున్నంత సేపు, కికిలాడు తూనే ఉన్నాను. హాస్యం అంతర్వాహినిలా ప్రవహిస్తూనే ఉంది. దూర దేశ ప్రయాణానికి పెట్టి సర్దుడు ప్రహసనమే. విమాన ప్రయాణం చేస్తూ, దారిలో పంటి కింద కుంటాయని నాలుగు పుస్తకాలు పడేసుకున్నా నంటుంది. తల పండిన మేధావులను చూసి " To dye or not to dye",అనుకుంటూ, సప్త వర్ణ రంజిత మయిన కేశ సంపదను మొత్తానికి దారికి తీసుకు రావడం , just rofl. అంటే తెలుసు కదండి. అటక ప్రహసనం చదువ గానే మనకు వసంత మీద కించిత్ కోపం రాక మానదు. ఎందు కంటే అది మన కధే. మరి ఎప్పుడు తొంగి చూసి, మన అనుభవాలు తొంగి చూసిందో కానీ, నవరసాలు గుప్పిం చేస్తుంది. రకరకాల రెసిపీలు రాసి, ఎప్పుడూ చెయ్యకుండా, పండగకీ , పబ్బానకి ఒక పసుపుది, ఒక తెల్లదీ అంటే పులిహార, పరవాణ్ణం చేసే వసంత మన మనసుకి మరింత దగ్గరయి పోతుంది. పది చపాతీలు తిన్నాక కూడా ఏమన్నా తింటావా అంటే "అన్నం" అని ముక్త కంఠంతో అడిగే అన్నగత ప్రాణులట అక్క చెల్లెళ్ళు నలుగురు. మరి అన్నంతో ఒచ్చే అదనాన్ని తగ్గించే నడక సీన్లు నల్లేరు మీద నడకలా నడిపేసి, మనను మహా ప్రస్థానం చేయించేస్తారు. జీవితంలో తప్పని సరిగా చూడాల్సిన, చదవాల్సిన వంద సినిమాలు, పుస్తకాలు ఆవిడని కుదురుగా కూర్చోనివ్వవు. అతడులో త్రిషను, గుండమ్మ కథలో జమున తనకెందుకు నచ్చేసారో చెప్తుంది. చివరికి మిగిలేది, ఆఖరీ ఖత్ సినిమాలు తలుచుకుని దుఃఖించు కుంటుంది. దూకుడు నచ్చదంటుంది. జీవితంలో అన్ని షేడ్స్ చూసిన మన సఖి, ప్రపంచంలో ఆనందాలకు మురియ డమే కాదు, అప సవ్యాలకు విలవిల లాడి పోతుంది. మానవి, లాస్యప్రియ ఆమె కళ్ళను తడుపుతారు. ధరలు గిట్టని టమాటా రైతులు, ప్రాణం ఖరీదు కట్టే ప్రభుత్వాలు, పిల్లల ప్రాధమిక హక్కుల కాలరాత, రియాలిటీ షోల్లో పిల్లల్నేడిపించే పెద్దల్ని చూసి మనసు కష్ట పెట్టుకుంటుంది. గల్ఫ్ దే్శాల్లో పనుల కొచ్చే ఆడవాళ్ళ వ్యధ మన మనసుల్లో గుప్పిస్తుంది. అమెరికా నుండి అర్ధ రాత్రి ఒచ్చే వలస జీవులు, మన మనసుల్లో తిష్ట వేస్తారు. పిల్లల పెంపకం, పర్యావరణం, మొక్కలు, కాలుష్యం, రోడ్లు, ప్రతి విషయంలో అవగాహన ఉన్న చైతన్య స్రవంతి యామె. ప్రకృతికి నువ్వు తిరిగి ఇవ్వ గలిగితేనే , ప్రకృతి నుండి తీసుకో, అంటూ ఎలుగెత్తి అంటుంది. వసంత లక్ష్మి పాత, కొత్త తరాల మధ్య నున్న ఆపాత మధుర మయిన తరానికి ప్రతినిధి. అంటే మనందరి. "వసంతం " అంతా మన కబుర్లే, మన సమస్యలే, మన ఆనందాలే. మనని ప్రతీ ఫ్రేం లో చూసుకోచ్చు. నేను ఆ పుస్తకం చదివేక రచయిత్రి గురించి ఏక వచనంలోకి ఒచ్చేసా. ఎందుకంటే తన వసంతం ద్వారా వసంత మన మనసుకి ఎంతో నచ్చిన నెచ్చెలి అయిపోతుంది కనుక. వెంటనే " వసంతం" బుక్ ఫేర్ లో కొనీసుకునీ, చదివీసీసి, ఆనందం సొంతం చేసుకోమని సిఫార్సు చేస్తున్నాను.

No comments:

Post a Comment

Pages