నీడలు - అచ్చంగా తెలుగు

నీడలు

Share This

నీడలు

ఓలేటి శశికళ 


బంగాళాఖాతంలో వాయుగుండం. నిన్న రాత్రివరకు మామూలుగానే ఉన్నవాతావరణం, హెచ్చరిక విని అలర్టయినట్టు, ఒక్కసారిగా మారిపోయింది. సముద్రానికి దగ్గర ప్రదేశమేమో ఈదురుగాలులు ఊదరగొట్టేస్తున్నాయి. కుండపోత మొదలయింది. పొద్దున్నుంచి ప్రశాంత్ కు చాలా చికాగ్గా ఉంది. పార్టీకార్యాలయంలో కార్యకర్తలు వాళ్ళకు గుర్తింపు రావట్లేదని, జండాలు మోయించి , తరవాత మొహం చెల్లేస్తున్నారని వాదన. వాళ్ళ విషయం మాట్లాడదామని జిల్లాఇన్చార్జి మంత్రితో మాట్లాడదామంటే ఆయన అస్సలు సీరియస్నెస్ లేకుండా,”సూపర్స్పెషాలటీ ఆసుపత్రి సంగతేమయింది? ఆ పని చూడు. ఆల్రెడీ సి.ఎమ్ దృష్టిలో పడ్డావు. యంగ్ అండ్డైనమిక్ ఎమ్ఎల్ఏ గా. ఇది మనందరికి మంచి ప్రోజెక్టు. పైగా ఐ.టి పోర్టఫోలియో ఖాళీ. తొందరపడు. కల్పవృక్షాన్ని కాలదన్నుకోకు.”,అంటూ వారించాడు. అయిపోయినట్టే. గాభరాలేదు. ఒక వారంలో పేపర్వర్క్ అయిపోతుందని భరోసాయిచ్చి ఇదిగో ఇలా తమ కాలేజీ కొచ్చాడు. తన తాతగారి పేరున సుమారు వంద ఎకరాల సువిశాల ప్రాంగణాన, పచ్చని చెట్లమధ్య, పచ్చిక బయళ్ళతో, సుందర నందనవనాల మధ్య అత్యంత అధునాతన భవనాలు.ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్కోర్సులు, డెంటల్కాలేజీలు ,కొత్తగా మొదలుపెట్టిన మెడికల్కాలేజీ, కే.జీ నుండి పీ.జీ వరకు విద్యకు,అన్ని కాలేజీలకు అనుబంధంగా హాస్టల్సు,. మొత్తం మీద అదొక పెద్ద విద్యాలయ సముదాయం. ప్రశాంత్ తండ్రి శశిభూషణ్, తరవాతతరంలో ఆయన ఏకైక కుమారుడు ప్రశాంత్, అహర్నిశలు పదిహేనేళ్ళగా పడ్డకష్టానికి ప్రతిరూపం ఈ కాలేజి అని చెప్పచ్చు.
అనతికాలంలో తన తెలివి, స్మార్ట్ నెస్తో రాజకీయంగా సోపానాలెక్కిన ప్రశాంత్, దాన్ని అటానమస్ యూనివర్సిటీ చేసి, దేశంలో పేరెన్నిక గన్న కాలేజీగా అక్రెడిటేషన్ తెచ్చుకున్నాడు. ప్రశాంత్ మావగారి రాజకీయ ప్రాబల్యం మరింత ఉపయోగపడింది. కారు పోర్టికోలో పార్క్చేసి, పరిగెత్తుకొచ్చిన అటెండర్కి తాళాలిచ్చి తన ఆఫీస్రూంలోకి వెళ్ళాడు. అతని ఆఫీస్ అతని కళాత్మకదృష్టికి అద్దం పడుతుంది. అక్కడి ఫర్నిచర్, కార్పెట్, గోడలరంగులు, ఇంటీరియర్స్, ఖరీదయిన ఒరిజినల్ ఆయిల్పెయింట్ంగ్స్ , తాజాపూల అమరికలు, అణువణువు డబ్బును, అది తెచ్చేడాబుని, ఆ డాబులోని అందాన్ని చూపించి మైమరపిస్తాయి. ప్రశాంత్ రావడం చూసి , అతని పి.యే,.అనుమతి తీసుకుని లోపలికి ఒచ్చింది. నవ్వబోయినదల్లా, అతని మూడ్ గమనించి, అతని ఇన్స్ట్రక్షన్ కోసం ఎదురుచూస్తోంది. చాలా తెలివయిన అందగత్తె ఆమె. అతనికి ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఉపయోగపడాలో బాగా తెలుసు. అతని చేతిసైగకు మౌనంగా నిష్క్రమించింది. ప్రశాంత్ కన్ను అలవోకగా తన కుర్చీకెదురు గోడకున్న పెయింటింగ్ మీదపడింది. మానస పారిస్ ఆర్టు ఎగ్జిబిషన్లో కొని తనకు బహుమతిగా ఇచ్చింది. మానసను తలుచుకోగానే అతని పెదవులు అప్రయత్నంగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. గబగబా మెయిల్ ఓపెన్చేసి చూసాడు.ప్చ్. మానస మెయిల్లేదు.
“ ఏమయ్యుంటుంది? యు.ఎస్ వెళ్ళిఅప్పుడే పదిరోజులవుతోంది. ఇంకా సెటిల్ అవ్వలేదా?.ఫోనులు చెయ్యద్దంది. తనే చేస్తానంది. మరేమయ్యుంటుంది?”, మళ్ళీ మొహంలోకి చికాకు పాకింది. ఇప్పుడు తన జీవితం, ఆశలు, ఆరోహణలు అన్నీమానసతోనే ముడిపడి ఉన్నాయి. “మానస”. పోతపోసినసౌందర్యరాశి. సుగుణాలపోగు. వీటన్నింటినీమించి, చదువుల సరస్వతి. పాటపాడిందంటే పలుకులు తేనెలో కరిగిపోతాయి. ఆమె అపురూప వ్యక్తిత్వం సరిపోల్చలేనిది. శశిభూషణ్ గారి చెల్లి శారద కూతురు మానస. ప్రశాంత్ కు మరదలు. శారద భర్త రఘరాం హైదరాబాదులో మంచిపేరున్న డాక్టరు.మానస ప్రశాంత్ కన్నా ఐదేళ్ళు చిన్న. మానస హైస్కూలు కొచ్చేటప్పటికి శారద ఆరోగ్యం దెబ్బతింది. కూతురి ఆలనా, పాలన చూడలేకపోతున్నానని బాధపడుతుంటే అన్న,ఒదిన మానసని తమ దగ్గరకు తెచ్చేసుకున్నారు. ఆడపిల్లల్లేని అన్నపూర్ణ మానసని అపురూపంగా పెంచింది. ఇంటికి ఎప్పటికయినా రావలసిన పిల్లేకదా అని భూషణ్గారు ఆడింది ఆటగా, గారంగా పెంచారు. ప్రశాంత్కిక మానసంటే ప్రాణమే. అయితే ఈ నేపధ్యాన్ని యే మాత్రం దుర్వినియోగం చెయ్యలేదు మానస.  మెరిట్ మీద కాకినాడలో మెడిసిన్లో సీటు తెచ్చుకుంది. ప్రశాంత్కి ఇష్టం లేకపోయిన తండ్రి ఆలోచనలు నచ్చి, ప్రతిఘటించ లేదు. ఇద్దరూ తమదయిన సొంత ప్రపంచాలు ఏర్పాటు చేసుకోడంలో బిజీ అయిపోయారు. మానస ఎమ్బిబిఎస్ అయ్యేసరికి శారద కేన్సర్ నాల్గవదశలో ఉంది.
భూషణ్ దంపతులు పెళ్ళి ప్రసక్తి తెచ్చినపుడు ఆమె ఆనందం వర్ణనాతీతం. మానసకి ఇష్టం ఉందో లేదో కనుక్కోకుండా, అన్నగారి   కోరిక  మేర మెడికల్ కాలేజీ కట్టడానికి తండ్రి తనకి పసుపు కుంకుమల కింద యిచ్చిన ముఫ్ఫై ఎకరాల భూమి ఆనందంగా రాసిచ్చేసింది. దౌర్భాగ్యం కాటేయగా, మానస పెళ్ళిచూడకుండా కన్నుమూసింది ఆ వెర్రితల్లి. తల్లి పోయన దుఃఖంలో ఎవరూ పెళ్ళి ప్రసక్తి తేలేక పోయారు. అప్పడికి ప్రశాంత్ ఉండ బట్ట లేక అడిగాడు. “ నేను అమెరికా వెళ్ళి పై చదువులు చదువుదా మనుకుంటున్నా. నా సూపర్ స్పెషలైజేషన్ అయ్యే టప్పటికి కనీసం ఆరేళ్ళు పడుతుంది. పెళ్ళి గురించి నాకు స్పష్టత లేదు. నువ్వు వేచి ఉండగలనంటే నీ ఇష్టం బావా. నువ్వంటే అయిష్టం మాత్రం లేదు.”. అనేసింది. అయోమయంలో పడ్డాడు ప్రశాంత్. మానస అమెరికా వెళ్ళి పోయింది. కాలం అన్ని సమీకరణాలను అనతి కాలంలో మార్చేసింది. రెండేళ్ళలో ప్రశాంత్     రాజకీయ ప్రవేశం, నాలుగేళ్ళలో ప్రముఖ మంత్రి గారి కూతురు రాగిణితో పెళ్ళి అయిపోయాయి. ఎక్కడో  మనసు కలుక్కుమంది మానసకు. కాని అది సహజ పరిణామమే అని మనసు తిప్పుకుంది. ఆరేళ్ళకు అమెరికాలో స్థిర పడిన తన సీనియర్ శ్రీకాంత్ ని , తన తండ్రే అక్కడకు రాగా, పిట్స్ బర్గ్ గుడిలో వైభవంగా పెళ్ళి చేసుకుంది. తన హక్కుఎవరో లాక్కున్నట్టు బాధ పడ్డాడు ప్రశాంత్. శశి భూషణ్ మాత్రం మానసిక ఇండియా రాదని, భూమి గురించి మరిచి పోతారని సంతోషించాడు. దీవెనలు మాత్రం పంపేడు. ఇదిగో మళ్ళీ పెళ్ళయిన ఆరేళ్ళకి మానస మాతృదేశం ఒచ్చింది. ఎయిర్ పోర్టు కెళ్ళాడు రిసీవ్ చేసుకోడానికి. చెక్కు చెదరని అదే అందం, హుందాతనం, భారతీయం. విద్యతో ఒచ్చిన కాంతి. కన్ను తిప్పలేక పోయాడు. మూడేళ్ళు వేచి యుండ లేని తన అవివేకాన్ని తిట్టుకున్నాడు. ఇంటికొస్తున్న దారిలో వాళ్ళ కాలేజీలు, తల్లి పేరున్న మెడికల్ కాలేజీ బ్లాకులు చూసి ఆనందంతో మురిసి పోయింది. మేనమామ కి పదే పదే కృతజ్ఞతలు చెప్పింది. తన తల్లికి మాయామర్మం తెలీదు. సొంత కూతురొచ్చినట్టు వెర్రెత్తి పోయింది. నాజూకు తిండి తినకని రకరకాల పిండి వంటలు చేయించేసింది. తనూ, మానస బాల్యం గుర్తు చేసుకుంటూ కబుర్లు, నవ్వులు. ఈ ఆనందంలో అపశృతి రాగిణి, తన భార్య. ఎలాంటి యాంబిషన్ లేదు. తిండి, నగలు, స్నేహితులు, పుట్టిల్లు. ఇంతకు మించి ఇంకో ధ్యాస లేదామెకు. ఎటొచ్చి తనంటే హడల్. తండ్రి డాబు దన మీద ప్రదర్శించ కుండా ముందే కంట్రోలులో పెట్టాడు. విచిత్రం ఏంటంటే ఈ దిష్టి బొమ్మ మానసకు నచ్చేయడమే. వచ్చిన మూడవ రోజుకి  అసలు విషయం బయట పెట్టింది, కాదు పేల్చింది. మానస నాన్న రఘురాం ఆ ఊరి వాడే. ఆయనకి పిత్రార్జితం యాభై ఎకరాలు మంచి రోడ్డు పక్క నుంది. రియల్ ఎస్టేట్ లో అరవై, డెభై కోట్ల విలువ అదిప్పుడు. దాని మీద సి.యం నుండి ఒత్డిడి ఉంది. ప్రైవేట్ బినామీలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలని. అదే అయితే తన రాజకీయంగా ఊహించ లేని ఎత్తుకెళ్ళచ్చు. తన ఆశల మీద నీళ్ళు పోస్తూ మానస చెప్పిన విషయం తండ్రీ, కొడుకులకు మింగుడు పడలేదు. దాని సారాంశం , అమెరికా లో సత్యసాయి బాబా భక్తులయిన డాక్టర్లు కొంతమంది ఆ భూమి తక్కువకి కొని, సూపర్ స్పెషాలటీ ఆసుపత్రి,కట్టి, నిర్వహణ బాధ్యతలు బాబా ట్రస్ట్ కి అప్పచెప్పి, వారు కూడా మధ్యలో ఒచ్చి, వైద్య సాయం చేయడానికి నిర్ణయించుకున్నామని. , అందుకే ఆ భూమి వారికి అమ్ముదామని ఒచ్చానని, తండ్రి కోరికది యని చెప్పింది. ఆగ్రహోదగ్రుడయ్యాడు తండ్రి. మోస పోతున్నావు, ఆ ఆసుపత్రి మనమే కడదామని తను బ్రెయిన్ వాష్ చేసాడు. మాట్లాడడం మానేసారు. ఎందుకో చాలా తర్జన భర్జన మయ్యింది. రక్షించి అమెరికా నుండి రావలసిన వారు ఉగ్రవాద దాడుల నేపధ్యంలో ప్రయాణం వాయిదా వేసుకున్నారు. వెళ్ళే ముందు నాలుగు రోజుల్లో మానసలో ఏదో మార్పు. తను కోల్పోతున్న అదృష్టం ఆమెను సతమతం చేస్తోంది. “ బావా! నే నిక్కడే ఉండి ఈ కాలేజి, ఆసుపత్రి చూసుకోచ్చ కదా” అంది. తన గుండె లయ తప్పింది ఆనందంతో. ఆ రోజు క్వారీ దగ్గర సత్తెమ్మ గుడి కెళ్ళడం, గొప్ప మలుపు. పాపం మానస. ఎంత బాధ పడుతోందో. శ్రీకాంత్ శాడిజం గురించి, భారత దేశాన్ని ద్వేషిస్తూ తనని వే ధించే అత్త మామల గురించి, కన్న బిడ్డను తనకు దూరం చేస్తున్న వైనం ఏకరువు పెట్టింది. “దేశం ఒదిలి పెట్టి యేమి బావుకున్నాను బావా? నిన్ను నష్ట పోయాను ముఖ్యంగ”,అంటూ చెయ్యి పట్టుకుని బేలగా అంటుంటే, తనని దగ్గరకి తీసుకుని “నేనున్నా”,నని ధైర్యం చెప్పాడు. అక్కడ అన్నీ సెటిల్ చేసుకుని వచ్చేస్తానంది. నాన్నకి చూచాయ గా చెప్తే చాలా సంబర పడి పోయారు.” రాగిణంటే ఇప్పుడొచ్చింది. అది నా రక్తం” అంటూ.  తనని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దింపినపుడు, ఎత్తుకొచ్చేద్దా మనిపించింది. పది రోజు లయ్యింది. కబురు లేదు. ఫోన్ నంబర్ సంపాదించి కాల్ చెయ్యచ్చు. కాని ఆ వెధవతో ఏం గొడవ లొస్తాయో. తొందరెందుకు? రూఢీ అయపోయింది మానస తనదేనని. మళ్ళీ చిరునవ్వు అతని అందమయిన పెదాలపై, యధాలాపంగా ఇ- మెయిల్ చూసాడు. కళ్ళు మెరిసాయి. మానస నుండి మెయిల్. “ నా డార్లింగ్! “ అనుకుంటు ఓపెన్ చేసాడు. చక్కని తెలుగులో, “ ఛంపేద్దామను కున్నారు కదా బావా నన్ను!”, అదిరి పడ్డాడు. మళ్ళీ చదివాడు. “ నాకు తెలుసు బావా! నువ్వు, మామయ్య నన్ను చంపడానికి ప్లాట్ చేసారు. అందుకే అంత నటించా. నా కొలీగ్సుని కూడా రావద్దన్నా. బావా! నీకు తెలుసు కదా, నాకు నీడలన్నా, రాత్రి పూట చెట్లు విరబోసుకున్న దయ్యాల్లా కనిపించి చాలా భయం వేసేది. అత్తయ్యని గట్టిగా పట్టుకుని పడుకునే దాన్ని. ఎండలో నడిస్తే నీడలంటాయని గోడల్ని ఆనుకుని నడిచేదాన్ని. నేను భూములు మీ కివ్వనని తెలియ గానే అంతలా మారిపోయారేంటి బావా?.పెంచిన మమకారం, నీతో తిరిగిన నేస్తం, తోడ బుట్టిన మా అమ్మ, కూతురిలా మీ ఇంట్లో పెరిగిన అనుబంధం అన్నీ డబ్బు ముందు అంత అల్పమా?. ఆస్థులు, పదవుల ముందు అయిన వాళ్ళ ప్రాణం అంత లోకువా మీకు. నీ భార్య, దేవత లాంటి అత్తయ్యను కూడా కఠినంగా మార్చేసారా?  కొండ మీద కోతి తెచ్చిచ్చి, నా ఆనందం తనదనుకునే మామయ్య, నన్నే పెళ్ళాడతానని పంతం పట్టిన నువ్వు తుఛ్ఛమైన ఆస్ధికోసం ఎంతకయినా తెగిస్తారా?.” “నీడలు బావా! నీడలు. ఎక్కడి కెళ్ళినా నా వెనకాలే సాగుతున్న నీడలు. , పొలంలో, తోటలో, కొండ మీద సత్తెమ్మ గుడి పక్క, క్వారీలో నల్ల చెరువులో, వెనకనే పై నుండి పడుతున్న ప్రతిబింబాల నీడలు, మామయ్యతో తాతగారి సమాధి కెళ్ళినపుడు, ఎవరో విసిరినట్టు పెద్ద పాము, సమాధుల పక్కసాగుతున్న నీడ. ఎవరు, ఎలా రక్షించారో తెలీదు. బయట పడ్డ. “ “ నా ప్రాణానికి ప్రాణమయిన శ్రీకాంతుని, నన్ను అపరూపంగా చూసుకునే అత్తమామల్ని విలన్లు చేసి, నేను నీ దానినని నమ్మించి , శరణాగతి అయ్యేక మీరంతా నన్ను ఒదిలారు. నాకు నీడై కావ వలసిన  కుటుంబం పామై కాటేయ బోయింది. నా మనసెంత విరిగి పోయిందో. పెంచిన విశ్వాసంతో ముఫ్ఫై ఎకరాలు ఉత్తినే కట్టబెట్టాం కదా. ఆరడుగులు కూడా ఎక్కువే చచ్చాక. ఏం చేసుకుంటారు? “ “మరో మాట బావా! రాగిణి చాలా మంచి అమ్మాయి. సంపద నుండి ఒచ్చిన అణుకువ, ఆప్యాయతలున్నది. వాళ్ళ నాన్నగారికి పదవి లేదని, నవ్వు, మామయ్య  తనని పదే పదే కించపరచడం తప్పు. నిన్నూ, నీ అహంకారాన్ని, అలవాట్లను భరిస్తున్నందుకు, ఆ అమ్మాయికి పాద పూజ చెయ్యాలి. అత్తయ్య నాకు ఎప్పుడూ అమ్మే. మీ రిద్దరు నాకు నా పుట్టింటి వికృత నీడలు. ఆ భూమి మీద ఆశ ఒదలండి. ఆరు నెలల్లోపోయే నీ ప్రభుత్వం నన్నేదో పీకుతుందని భయం లేదు. మా నాన్న నాతోనే ఉన్నారు. నీ లాంటి వాళ్ళు ఉన్నన్నాళ్ళు మాతృ దేశానికి రావాలంటే భయమే బావా. సోరీ.! రెండో సారి చెయ్యిచ్చినందుకు. నీ ఆతిధ్యం మర్చిపోలేను.”
--------- ఉత్తి “మానస”.
డల్లాస్ నగరంలో అర్ధ రాత్రి. పేషియోలో నిలబడి , వీధి దీపాల వెలుగులో , సాగుతున్న చెట్ల నీడల్ని చూసి” ఇంక నాకు యే నీడల భయం లేదు. థేంక్స్ రాగిణి! నన్ను కాపాడి నందుకు. రహస్యంగా నా ఉతికిన బట్టలో “ వీళ్ళు నన్ను చంప డానికి ప్లాన్ చేసారని వెళ్ళి పొమ్మని అత్తయ్య చెప్పమందని చెప్పి, నన్ను అనుక్షణం కాపాడ డానికి మీ నాన్న గారి గన్ మేన్ ను రహస్యంగా ఉంచావ్. చెల్లీ! ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోను. ఉమ్మత్త వనంలో తులసి నీడవి నువ్వు””. మనసంతా చేదుకాగ, లోపలికి నడిచింది మానస.

No comments:

Post a Comment

Pages