పిల్లల్ని చూసి, ఇల్లాల్ని చూడమన్న – చిల్డ్రన్ అండర్స్టాండింగ్ - అచ్చంగా తెలుగు

పిల్లల్ని చూసి, ఇల్లాల్ని చూడమన్న – చిల్డ్రన్ అండర్స్టాండింగ్

Share This

పిల్లల్ని చూసి, ఇల్లాల్ని చూడమన్న – చిల్డ్రన్ అండర్స్టాండింగ్

భావరాజు పద్మిని


ఏవిటండీ ఈ పెద్దాయన దాష్టీకం ? ముందరే బాపు గీతని, ముళ్ళపూడి రాతని హైజాక్ చేసారు. మరిప్పుడో ? మొత్తం సమాజపు పోకడలనే నాణానికి రెండు వైపులా చూసి, రాసేసి, ఎందరో తల్లుల మనసుల్ని, పిల్లల మనసుల్ని వీర హైజాక్ చేసారు.
అసలేమైందంటే...
ఆయన పిల్లల్లో పిల్లాడై, పిల్లల కళ్ళతో లోకాన్ని తల్లిదండ్రులకు చూపారు. అలాగే నేటి తల్లిదండ్రుల మనసుల్లోకి పరకాయ ప్రవేశం చేసేసి, వారు ఎలా ఆలోచిస్తున్నారో ,ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారో, చెబుతూ, సరైన దారి చూపారు. ఈ పుస్తకం చదవగానే నాకు మొదట కలిగిన అనుభూతి – అరె, ఎన్నో రోజులుగా నా మనసులో, ఎందరో తల్లుల మనసుల్లో ఉన్న మనోభావాలను యెంత చక్కగా అక్షరీకరించారు ? భళా, బ్నిం గారు... హాట్స్ ఆఫ్ అంది, అంతరంగం.
చదువులమ్మ పండుగ – కేవలం A,B,C,Dలు మాత్రమే విద్య కాదనీ, ప్రతి మనిషి, సంపూర్ణ అంకితభావంతో చేసే ప్రతీ పనినీ విద్యే అంటారని, చెప్పిన విధానం – అద్భుతః .
‘మా పిల్లలు అన్నం తినరండీ. ఆ మాటకొస్తే ఏమీ తినరండీ !’ ఇదీ ఇప్పటి తల్లుల మొదటి ఫిర్యాదు. ఎందుకు తినట్లేదు ? అమ్మ ముద్దలో ప్రేమ కరువై, కుక్కాలన్న యాంత్రికత చోటు చేసుకుందా ? ఎందరో తల్లులు ఆత్మవిమర్శ చేసుకేనేలా అందించిన రెండవ అంకం – చిలక ముద్దా, పిచుక ముద్దా... చదివి తీరాల్సిందే !
ప్రకృతితో పిల్లలు సంబంధం కోల్పోతున్న ఈ యాంత్రిక యుగంలో, ప్రతి చిన్న ప్రాణి నుంచి నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుందని తెలిపిన చక్కటి వ్యాసం – మనమూ, ప్రాణికోటి.
ఆరున్నొక్క రాగంలో పేచీ పెట్టడానికి పాట కన్నా పద్యం మిన్న అంటూ, పిల్లలకి ఇచ్చిన ఐడియా- పాట కన్నా పద్యం వీజీ. కంప్యూటర్ గేమ్స్ కంటే, పద్యాలు నేర్చుకోవడం, మెదడుకు మేత వంటిది అంటూ గొప్పగా చెప్పారు ఇందులో.
భాషను ఒక్కటీ పిల్లలకు అందిస్తే, మొత్తం సంస్కృతిని అందించినట్లే. అందుకే, ఎన్ని భాషలు నేర్చినా, మన మధురాల తెలుగు మరువద్దంటూ చెప్పిన – ‘మధురాల తెలుగు ‘ అన్న అంశం మనలో ఆలోచనలను రేకెత్తిస్తుంది.
అమ్మ కంటే, టీవీ తోనే పిల్లలు ఎక్కువ సేపు గడుపుతూ, రాను రానూ పెంకిగా తయారవుతున్న ఈ రోజుల్లో, బాల టీవీ హక్కులపై ప్రేమగానే ఎలా నియంత్రణ విధించాలో చెబుతోంది – బాలల టీవీ హక్కులు అన్న వ్యాసం. చదివి, ప్రతి ఇంటా ఆచరించాల్సిన అంశం.
మంచి అలవాట్లు అనేవి తల్లి నుంచి, తండ్రి నుంచి పిల్లలకు సంక్రమిస్తాయి. ఎందుకంటే, పిల్లలు పసిమొగ్గల లాంటి వారు, వారు తల్లిదండ్రుల్నే చూసి వికసిస్తారు. అందుకే, ‘పిల్లల్ని చూసి, ఇల్లాల్ని చూడు...’ అంటూ, ఒక్క మాటలో గొప్ప సత్యాన్ని ఇమిడ్చి చూపారు, మన బ్నిం గారు.
‘మా పిల్లలు మాట వినరండీ !’ మరో ఫిర్యాదు. అనగా, అనగా, వింటారేమో... అలా వాళ్లకు ఓపిగ్గా వినే అలవాటు కూడా అవుతుందేమో... ప్రయత్నించమంటున్నారు, మన శ్రేయోభిలాషి.
పిల్లలు కూడా మనుషులే – నేటి బాలలే రేపటి పౌరులు. ఏది మంచో, ఏది చెడో పిల్లలకు తెలియదు కనుక, నెమ్మదిగా బుజ్జగించి, ఈ పిల్లబుద్ధిని మన దారిలోకి తెచ్చుకోవాలని చెప్పిన అంశం ఇది, మన కళ్ళు తెరిపిస్తుంది.
పిల్లల సెలవుల్ని సద్వినియోగం చేసుకునేలా మనమే చూడాలంటూ, ఇచ్చిన సూచనలు ‘సెలవలొచ్చేసాయ్...’ లో అందించారు.
ఇలా రాస్తూ పొతే ఒకటా, రెండా ? మాట, ఆట, పాట నేర్పడంలో, మంచి బాట చూపడంలో, మనం పాటించాల్సిన మెళకువలను అతి లాఘవంగా తన భాషా చాతుర్యంతో మనకు అందించారు, మన బ్నిం గారు.
ఆత్మీయులంటే ఎవరు ? మన మంచిని, క్షేమాన్ని కోరి, హిత వచనాలతో మనం చేసే పొరపాట్లను చెబుతూ, సరిదిద్దేవారే కదూ ! మరి మన తెలుగింటి ఆత్మీయులు బ్నిం గారు మనపట్ల ఉన్న ప్రేమతో అందించిన ఈ అద్భుతమైన నేటి జ్ఞానగీత – ‘చిల్డ్రన్ అండర్స్టాండింగ్ ‘ తప్పక కొని చదివి, ఆత్మవిమర్శ చేసుకుందామా ?
తప్పక చదవాల్సిన ఈ పుస్తకం మీరూ కొనండి, మీ బంధుమిత్రులకు బహుమతిగా ఇవ్వండి. మరి ఇంత మంచి పుస్తకం మీకూ తెప్పించుకోవాలని ఉందా ?
క్రింది చిరునామాలో నేరుగా ఆయన వద్దే పుస్తకాలను పొందవచ్చు.
వెల : 65 రూ. (పోస్ట్ ద్వారా ) బ్నిం గారి ఇంటికి వెళ్లి తీసుకుంటే (50 రూ.)
ప్రతులకు సంప్రదించాల్సిన చిరునామా : బ్నిం, నెం. 12-11-448, వారాసిగూడ, సికింద్రాబాద్ – 61.
ఈమెయిలు, ఫేస్ బుక్ ద్వారా కూడా బ్నిం గారిని క్రింది ఐ.డి. లో సంప్రదించండి.
bnim4u@gmail.com

No comments:

Post a Comment

Pages