గురుపూజ - అచ్చంగా తెలుగు

గురుపూజ

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


ఈ ఊర్లో నా స్నేహితుడు సాంబశివరావు పెళ్ళి వుండడంతో నిన్నరాత్రే వచ్చాను. నేను పుట్టింది, పెరిగిందీ, చదువుకున్నదీ ఈ ఊళ్ళోనే! ఉద్యోగార్ధం హైద్రాబాదులో చాలా కాలంనుండీ వుంటున్నాను, ఇన్నాళ్ళకి ఇలా అవకాశం కలిసొచ్చి  ఊరంతటినీ, అందర్నీ చూసినట్టు వుంటుందని ఇలా వచ్చాను. ఇవాళ రాత్రికే పెళ్ళి. పగలంతా ఏం తోచి చావదు కాబట్టి మాకు తొడపాశం, చెవి మెలేయడం, గోడకుర్చీలాంటి హింసామార్గాల ద్వారా విద్యాబుద్ధులు నేర్పి మా ఈ స్థాయికి కారణమైన మా గురువుగారు పూజ్యానందాన్ని ఒక్కసారి దర్శించుకుని ఆయన కాళ్ళకి దణ్ణం పెట్టుకుందామని వాళ్ళింటికి బయల్దేరాను.
నేను వెళ్ళేసరికి ఆయన బయట పడక్కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ముఖం చాలా జాలిగా వుంది. నేను వెళ్ళి నా పరిచయం చేసుకుని ఆయన కాళ్లకి దణ్ణం పెట్టుకుని కొద్దిదూరంలో వున్న ఎత్తైన రాయిమీద కూర్చున్నాను. ఆయన ముఖంలో ఏదో తెలియని ఆందోళన, భయం.
నేను మళ్ళీ మాట్లాడడం మొదలెట్టానో లేదో-
"ఎవరూ"అంటూ బయటకొచ్చింది గురుపత్ని.
"నేనండీ..మాస్టారుగారి దగ్గర  నాలుగక్షరమ్ముక్కలు నేర్చుకుని పైకొచ్చినవాణ్ణి..సాంబిగాడి పెళ్ళికని ఈ ఊరు వచ్చాను..ఎలాగూ వచ్చాను కదాని మాస్టారుగార్ని చూసి, ఆశీర్వచనాలు తీసుకుందామని ఇలా వచ్చాను."అన్నాను.
"ఓస్..అదా సంగతి. ఈయన్ని చూద్దామని  చేతులూపుకుంటూ వచ్చావా? ఎక్కడుంటావు నువ్వు?"
"హైద్రాబాదులో అండీ"
"ఏం చేస్తావు?"
"ఓ ప్రైవేటు కంపెనీలోనండీ"
"నా చిన్నప్పుడు ‘పరమానందయ్య శిష్యుల కధ’ అని సినిమా ఒకటి చూశానయ్యా..అందులో మీ గురువుగారి లాంటివాడే..కాదులే ఆ సినిమాలో ఆయన తెలివైనవాడు, ఒకడుంటాడు ఆయనకి మీలాంటి తొమ్మిదిమంది శిష్యులుంటారు. ఎందుకు పనికిరాని సంత"విసుక్కుంది.
"అదేంటండీ అలా అంటారు?..మనలోని చీకటిని పారద్రోలి వెలుగుదారి చూపించే వాడే గురువండీ..గురుపత్నిగా మీకు మమ్మల్ని అనే హక్కుంది కాని ఆయన్ననకూడదు" ఒకింత ఉక్రోశం, ఆక్రోశం మాటల్లో కలగలిపాను.
"అబ్బో! వెలుగుదారి చూపిస్తాడా? ఎవరికి? మీకే! ముందు ఆయన్ని ఇంటి దీపం వెలిగించుకోమను..తర్వాత మీ సంగతి..నా పెళ్ళైనప్పటినుండి చూస్తున్నాను. ఓ అచ్చటా లేదు ముచ్చటాలేదు. ఆయన జీవితం నల్లబల్లకి..సుద్దముక్కలకీ అంకితమైతే..నా జీవితం ఆయన పంచ చివర్న ముడిపడిపోయింది. రిటైరవ్వక మునుపే నయం పాఠశాలల్లోని పిల్లలు కాస్త ఆయన ముఖానింత బొట్టుపెట్టి, దక్షిణ ఇచ్చి, తమకి తోచిన చిన్న చిన్న  కానుకలు చదివించుకుని గురుపూజ చేసుకునే వాళ్ళు. ఇప్పుడేముంది? ఆయన్ని చూడడానికెవరూ రారు..వచ్చినా నీలాగా చేతులూపుకుంటూ వచ్చి నాలుగు పొగడ్తలు పొగిడి వెళ్ళిపోతారు. దానితో కడుపు నిండేనా? కాలు నిండేనా? ఈయన కూడా ఎంచక్క ఇంజనీరో, డాక్టరో అయితే నా జీవితం ఎంత బాగుండేది? చేతినిండా డబ్బుండేది. ఆయనా అంతే, మీరూ అంతే ఉత్త నాసిరకం సరుకులు."చేతులు తిప్పుతూ కోపంతో గుడ్లురిమింది.
"అదేంటండీ..అలా ముఖంమీదే అంటారు? మా ఇద్దరి మనసులూ ఎంత గాయపడతాయో ఆలోచించారా?"
"చూడూ..వాడెవడో సాంబిగాడి పెళ్ళికొచ్చానన్నావు..పెళ్ళి చూసి వెళ్ళిపో..ఇలా నీ కాలక్షేపానికి అందరిళ్ళకీ వెళ్ళకు. నీకు చేతనైతే మీ పూర్వ విద్యార్ధులందరూ కలసి డబ్బుకూడబెట్టి ఆయనకి సన్మానం చెయ్యకపోయినా ఫర్వాలేదు..ఆ డబ్బు మా చేతిలో పెడితే మిమ్మల్ని మా పిల్లలుగా భావిస్తాను, కష్టాల్లో వున్న మా బ్రతుకూ ఒకగాడిన పడుతుంది. నేను ముఖంమీదే కుండ బద్దలు కొట్టినట్టు మట్లాడతాను నువ్వేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఆఁ"అంది నిష్కర్షగా. నేను లేచి వెనక్కి మరి చూడకుండా ఒకటే పరుగుతో సాంబిగాడింటికొచ్చాను.
తర్వాత నిదానంగా ఆలోచనలో పడ్డాను ’ఆవిడన్నది నిజమే! ఉత్తుత్తి దండాలు..నాలుగు ప్రశంసాత్మక మాటలతో ఏం లాభం? ఈ కరువుకాలంలో కేవలం నాలుగు మంచిమాటలు మాట్లాడితే సరిపోతుందా? ఆయన మా జీవితాలని తీర్చిదిద్ది వెలుగిచ్చిన మాట నిజమైతే..ఆర్ధికంగా అస్తవ్యస్తమైన ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎక్కడెక్కడున్నవాళ్ళనో ‘పూర్వవిద్యార్థుల కలయిక’ అని కలుసుకోవడం గొప్పకాదు..అందరూ కలసి తమకి చదువుచెప్పిన గురువుల గురించి వాకబుచేసి వాళ్ళకి ఊతమివ్వాలి..అదీ నిజమైన గురుపూజ"అనుకున్నాక మనసు శాంతించింది. రేపు ఆర్ధిక సాయ ప్రణాళికతో వాళ్ళింటి గుమ్మం మళ్ళీ తొక్కాలి’ స్థిరంగా అనుకున్నాను.
***

No comments:

Post a Comment

Pages