బీరకాయ పచ్చడి - అచ్చంగా తెలుగు

బీరకాయ పచ్చడి

Share This

బీరకాయ పచ్చడి

అక్కిరాజు ప్రసాద్ 


ఎప్పుడూ గోంగూర, టమాటో వంటి ఊరగాయలేనా? తాజా కూరగాయలతో కూడా పచ్చళ్లు రుచి చూశారా? నాకు కూరగాయ పచ్చళ్లు బాగా నచ్చుతాయి, ఎందుకంటే వాటిలో ఉప్పు కారం మన శరీరానికి తగినట్లు వేసుకోవచ్చు, పోషక విలువలు పూర్తిగా పోకుండా రుచిగా చేసుకోవచ్చు. అలాంటి ఒక పచ్చడే బీరకాయ పచ్చడి. మన ఊరగాయలతో సమస్య విపరీతమైన నూనె మరియు ఉప్పు. మన పచ్చళ్ల జిహ్వను చంపుకోకుండా, బీపీ-కొవ్వు సమస్యలను అధిగమించాలంటే తాజా కూరగాయాల్తో పచ్చళ్లను చేసుకోవాలి.
అబ్బా! బీరకాయ అనగానే పొట్టు తీయాలి అనుకుటున్నారా? కష్ట పడకండి. బీరకాయ పొట్టులో చాలా పీచు పదార్థం ఉంటుంది. జీర్ణవ్యవస్థకు ఆ పొట్టు ఎంతో మంచింది. బీరకాయ రక్త శుద్ధికి, కామెర్ల చికిత్సకు, చక్కెర వ్యాధి ఉన్నవారికి, బరువు తగ్గటానికి, రోగనిరోధక శక్తి పెంచటానికి, వాపులను తగ్గించటానికి, చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగకరం. కాబట్టి వారానికి ఒక్కసారైనా తింటే శరీర ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ప్రయోజనాలు కలిగే పోషకవిలువలు చాల మటుకు పొట్టులోనే ఉన్నాయి. కాబట్టి పొట్టుతోనే పచ్చడి చేసుకుందాం. మీకు పని ఎక్కువ కాకుండా తొందరగా ఈ పచ్చడి చేసేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
  • బీరకాయ పెద్దది ఒకటి
  • మూడు-నాలుగు చిన్న సైజు టమాటోలు
  • కావలసినన్ని పచ్చిమిరపకాయలు
  • తరిగిన కొత్తిమీర
  • మూడు నాలుగు రేకుల చింతపండు
  • తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా బెల్లం
  • పోపులోకి తగినంత నూనె, ఎండు మిరపకాయలు, కాసిని మెంతులు, ఆవాలు, ఇంగువ (నేను కాస్త జీలకర్ర, మినప్పప్పు కూడా వేస్తాను, మీ ఇంట్లో అభిరుచిని బట్టి ఈ మిగిలిన పోపు పదార్థాలను వేసుకోవచ్చు)
తయారు చేసుకునే పద్ధతి:
ముందుకు బీరకాయను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. పొట్టుపై చేతితో బాగా రుద్దితే శుభ్రం అవుతుంది. పొట్టుతో వండుతాం కాబట్టి బాగా శుభ్రం చేయటం ముఖ్యం. కడిగిన బీరకాయను ముక్కలు చేసుకోండి. అలాగే టమాటోలను కడిగి ముక్కలుగా కోసుకోండి. బాణలిలో కాస్త (ఒక స్పూన్ చాలు) నూనె వేసి ఈ ముక్కలను అందులో వేసి, తగినంత ఉప్పు, పసుపు వేసి ఉడికించండి. బీరకాయ మరీ మెత్త పడకూడదు. పచ్చి వాసన పోయి కాస్త రంగు మారితే చాలు. దీనిని స్టవ్ మీదినుంచి దింపి చల్లారనివ్వండి. ఈలోపు పోపు తయారు చేసుకోండి. నూనె వేసి మెంతులు వగైరా వేసి అవి వేగిన తరువాత ఎండు మిరపకాయలు, ఇంగువ వేసి దించి చల్లార్చండి.
గ్రైండర్‌లో పోపు మిశ్రమం, చింతపండు వేసి మెత్తగా రుబ్బండి. దీనిలో పచ్చిమిరపాకాయలు, కాస్త బెల్లం (తీపి రుచి నచ్చని వారు వేయనక్కరలేదు), కొద్దిగా ఉప్పు, చల్లారిన బీరకాయ-టమాటో ముక్కలను వేసి కూరగాయలు మరీ గుజ్జుకాకుండా తక్కువ స్పీడులో రుబ్బండి. పచ్చడిని గిన్నెలోకి మార్చుకుని కొత్తిమీర వేసి కలపండి. బీరకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో, దోసెలతో, చపాతీలతో కూడా బాగుంటుంది. చపాతీలతో తినాలనుకున్న వాళ్లు బీరకాయ, టమాటోలు ఎక్కువ వేసుకుని ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తక్కువ పాళ్లలో వేసుకుంటే ఎక్కువ తినగలరు.

No comments:

Post a Comment

Pages