మిమిక్రీ సామ్రాట్ – మిమిక్రీ శ్రీనివాస్ గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

మిమిక్రీ సామ్రాట్ – మిమిక్రీ శ్రీనివాస్ గారితో ముఖాముఖి

Share This

మిమిక్రీ సామ్రాట్ – మిమిక్రీ శ్రీనివాస్ గారితో ముఖాముఖి

భావరాజు పద్మిని


ధ్వని అనుకరణ ద్వారా ప్రేక్షకులను నవ్వించి, పరవశింపచేసే కళ మిమిక్రీ. ఈ కళలో ప్రపంచ స్థాయిలో గుర్తింపును పొంది, దేశవిదేశాల్లో సుమారు 6500 లకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ‘మిమిక్రీ సామ్రాట్ ‘ మిమిక్రీ శ్రీనివాస్ గారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం అందిస్తున్నాము.
నమస్కారం మిమిక్రీ శ్రీనివాస్ గారు, మీకు ఈ కళ పట్ల ఆసక్తి ఎలా కలిగింది ?
నమస్కారమండి. నాకు తొమ్మిదేళ్ళ వయసు ఉన్నప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచి, పద్మశ్రీ అవార్డును పొంది, మూడు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్ ను పొందిన కళాకారులు డా. నేరెళ్ళ వేణుమాధవ్ గారి ప్రదర్శనను చూసాను. ఆ ప్రదర్శన వరంగల్ జిల్లాలో జరిగింది. అక్కడ సుభాష్ చంద్రబోసు జయంతిని ప్రతి సంవత్సరం నిర్వహించేవారు.
అది చూసినప్పుడు, ఒక్క మనిషి ఇన్ని రకాలుగా మాట్లాడడం, ఇన్ని రకాల ధ్వనులు చెయ్యడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అదే నాకు పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన చెప్పినట్లు చెప్పడానికి ప్రయత్నిస్తే నాక్కూడా ఏదో కాస్త వచ్చినట్లే అనిపించింది.
ఆయన చెప్పిన మొట్టమొదటి జోక్ ను మీకు చెబుతాను. ఇద్దరు ముసలివాళ్ళు ట్రైన్ లో వెళ్తుంటారు. పై బెర్త్ మీద ఒక కుర్రాడు పడుకుని ఉంటాడు. వాళ్ళ మధ్య సంభాషణను ఆయన గొంతులు మార్చి చెప్పారు.
‘ఏవోయ్ నీ వయసెంత? ‘ – వేసుకోవచ్చు, 25-20 మధ్య.
‘నీ వయసెంత ?’ - వేసుకోవచ్చు, 15-20 మధ్య అనగానే, పై బెర్త్ మీద ఉన్న కుర్రాడు ఒళ్ళుమండి వీళ్ళ మీద  పడతాడు. ‘ఎవడ్రా నువ్వు?’ అంటారు ఇద్దరూ కోపంగా.
‘నేను ఇప్పుడే పుట్టానండి,’ అంటాడు అతను.
ఇక్కడ హాస్యం కంటే నాకు ఆయన గొంతు మార్చి చెప్పిన విధానం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆయన రాజకీయ నాయకులను, సినిమా వాళ్ళను అనుకరించినా, ఇది నా మనసులో బాగా ముద్రించుకుపోయింది. అసలు గొంతు మార్చే ప్రక్రియ ఒకటి ఉంటుందని నాకు మొట్టమొదటిసారిగా తెలిసింది. ఆ తరువాత ఆయన చెప్పినట్లే నేనూ చెప్పేందుకు ప్రయత్నించేవాడిని. నాకూ ఏదో వచ్చినట్లే అనిపించింది.
1975 లో మా నాన్నగారికి వరంగల్ ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను వేణుమాధవ్ గారిని కలవాలని, ప్రత్యేకంగా వెళ్లి కలిసాను. ఆయన నేను చెప్పినవి విని, ‘నీకు అద్భుతమైన టాలెంట్ ఉందయ్యా, నువ్వు నేర్చుకుంటే నీకు మంచి స్పార్క్ ఉంది. ప్రాక్టిస్ చేస్తే చాలా గొప్ప ఆర్టిస్ట్ వి అవుతావు’ అని చెప్పారు. ఆయన మాటలు నాకు ఎంతో స్పూర్తిని కలిగించాయి.
ఆయన ఇంకా ‘నాయనా, నువ్వు పృథ్వి రాజ్కపూర్ ను అనుకరించావే అనుకో, దాన్నుంచి నీకు ఎన్నో వాయిస్ లు వస్తాయి.” అని చెప్పారు. ఇలాగే ఎస్.వి.ఆర్, ఎన్.టి.ఆర్ గారిని అనుకరించమని చెప్పారు. అలాగ సాధన చెయ్యమని చెప్పారు.
ధ్వని అనుకరణ లోని మెళకువలు ఎలా సాధన చేసారు ?
మిమిక్రీ కళాకారుడికి అబ్సర్వేషన్ చాలా ముఖ్యం. ఏ ధ్వనిని అయినా నాలుక, పెదవులు, గొంతు ను ఉపయోగించి చెప్పవచ్చు. మిమిక్రీ అనేది శాస్త్రీయమైన ఒక కళ. సరైన శిక్షణ అందిస్తే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఇది కూడా విద్యను అభ్యసించడం లాంటిదే. చదువుకున్నవారికి, చదువుకోనివారికి మాటలో తేడాలు ఉన్నట్లే, సంగీతం నేర్చుకుని పాడడానికి, నేర్చుకోకుండా పాడడానికి తేడాలు ఉన్నట్లే, ఈ కళను కూడా సరైన శిక్షణ ఉంటే ఎవరైనా నేర్చుకోవచ్చు.
అయితే మిమిక్రీ అనేది సాధన చేస్తే ఎవరికైనా సాధ్యమే అంటారా మీరు ?
అవునండి, ఎవరైనా చెయ్యగలరు. ఉదాహరణకు ఒక నటుడిని అనుకరించాలని అనుకుంటే, అతని ఉచ్చారణ, మాండలికం, వాచకం మీద పూర్తి నియంత్రణ ఉండాలి , వారు ఏ శ్రుతిలో యెంత గతిలో మాట్లాడుతున్నారో గమనించాలి. ఏ ధ్వనికి ఏ ఏ అక్షరాలు అవసరం అవుతున్నాయో గమనించాలి. ఇవన్నీ తెలిస్తే, సాధన చేస్తే ఎవరైనా చెయ్యగలరు.
అయితే ఎవరైనా, ఇతరుల స్వరాల్ని అనుకరించడం అనేది, కేవలం అనుకరణలో ఒక భాగంగానే పెట్టుకోవాలి.మనం కేవలం ఒక భాషకు చెందిన వారినే అనుకరిస్తే, ఇతర భాషల వారికి అర్ధం కాదు. అలా కాకుండా మన చుట్టూ ఉండే ధ్వనుల మీద దృష్టిని కేంద్రీకరిస్తే, ఏ భాషకు చెందిన వారినైనా మనం ఎంటర్టైన్ చెయ్యగలుగుతాము. సాధారణంగా అంతా సినీ నటులను, రాజకీయ నాయకులను మాత్రమే అనుకరిస్తూ ఉంటారు. కాని, దీనివల్ల ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శనకు ఇబ్బంది అవుతుంది. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాకా, ధ్వనుల మీద సాధన చేసి, నాకంటూ ఒక ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకున్నాను.
మరి ఆడవారికి మగవారి గొంతును అనుకరించడం సాధ్యమేనా ?
కొంత మందికి సాధ్యం కాదు. పదేళ్ళ వయసు దాకా ఆడవాళ్ళ గొంతు, మగవాళ్ళ గొంతు ఒకేలా ఉంటుంది. విని అది ఎవరి గొంతో చెప్పడం కష్టంగా ఉంటుంది. నా చిన్నప్పటి సినిమాల్లో అబ్బాయిల పాత్రలకి ఎస్.జానకి గారు, సుశీల గారు వంటి వారితోనే పాటలు పాడించేవారు. ‘గున్నమామిడి కొమ్మమీద’, ‘కనులకు వెలుగువు’ వంటి పాటలు ఈ కోవకు చెందుతాయి. 12 ఏళ్ళ తర్వాత గొంతు మారుతుంది. మన కంఠంలో రెండు కండరాలు ‘U’ ఆకారంలో ఉంటాయి. ఇవి ఆడవారిలో 1:1.5 నిష్పత్తిలో పెరిగితే, మగవారిలో 1:2 నిష్పత్తిలో పెరుగుతాయి. అప్పుడు స్వరంలో వచ్చే మార్పుల వల్ల స్త్రీలలో అందరి స్వరాలు అనుకరించే వీలు ఉండదు.
ధ్వని అనుకరణలో మీరు ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా ?
వెంట్రిలాక్విజం లో ఎం.ఎన్.రాయ్ గారి వద్ద నేను శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత, మెహాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెంట్రిలాక్విజం, కొలేరాడో నుంచి గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసాను. మిమిక్రీ కళాకారుడికి సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, భాషల పట్ల, రకరకాల సంస్కృతుల పట్ల, ధ్వని ఉత్పత్తికి సంబంధించిన అనేక పద్ధతుల పట్ల, అవగాహన ఉంటే, కృషితో సాధన చేస్తే, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వచ్చు.
జేబుల నుంచి రకరకాల ధ్వనులు తీస్తూ, ప్రేక్షకులను మురిపిస్తూ ఉంటారు కదా ! అసలు జేబుల నుంచి ధ్వని ఎలా వస్తుంది ? ఆ రహస్యం చెబుతారా ?
జేబుల్లోంచి ధ్వని రాదండి. కాని, వస్తున్నట్లుగా భ్రమింపచెయ్యడమే ఈ వెంట్రిలాక్విస్ట్ లక్షణం కదా. మామూలుగా మనం స్టేజి మీద మైక్రోఫోన్ ఒకటి వాడతాము. ఆ మైక్రోఫోన్ భుజం మీద పెడితే యెంత శబ్దం వస్తుంది, జేబులో ఉంటే యెంత ధ్వని వస్తుంది, ఒక బాక్స్ లో ఉంటే ఎలా ఉంటుంది, మన గొంతుకి, మైక్రోఫోన్ కు యెంత దూరం ఉంటుంది అనేది లెక్కించుకోవాలి.
నిజానికి, ఇది భ్రమ కలిగించే విద్యే కాని, వాస్తవం కాదు కనుక, నేను దీనికి సౌండ్ ఇల్ల్యుజన్ అనే పేరు పెడతాను.
13 దేశాల్లో గత 37 ఏళ్ళ నుంచి ప్రదర్శనలు ఇచ్చారు కదా ! మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా ?
రాజస్థాన్ లో బ్రహ్మకుమారీస్ వారు ఒకసారి ‘ప్రపంచ శాంతి సమ్మేళనం’ అనే ప్రోగ్రాం పెట్టారు. దాంట్లో ప్రపంచ శాంతి సమ్మేళనం జరుగుతోంది. నాకు హిందీ అంతంత మాత్రమే వచ్చు. అది 1973 వ సంవత్సరం. కళ్యాణ్ జి, ఆనంద్ జి, అల్కా యగ్నిక్ వంటి ప్రముఖులతో పాటు, ఒక మూడువేల మంది ప్రదర్శనకు వచ్చారు. అక్కడ 5,6 గురికి తప్ప తెలుగు రాదు. అప్పుడు అక్కడ ఉన్న పోస్టర్స్ చూసి, స్లొగన్స్ చూసి, అప్పటికప్పుడు ప్రాక్టీసు చేసాను. నాకు 10 నిముషాలే సమయం ఇచ్చారు. అది అయిపోగానే అక్కడి మధుబన్ ఇంచార్జ్ అయిన దాదీమా ’40 నిముషాలు ప్రదర్శన ఇవ్వండి’ అని మెసేజ్ పంపారు. భాష రాకపోయినా, నేను చెయ్యగలిగాను, ఇదొక మర్చిపోలేని అనుభూతి.
అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ‘బిల్ క్లింటన్ ఫౌండేషన్’ వారు భూకంప బాధితుల కోసం ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అప్పుడు నేను అక్కడే ఉండడంతో, వారి కోరికపై ఇంగ్లీష్ లో ఒక గంట ప్రదర్శన ఇవ్వగలిగాను. అంటే, నా కళ ద్వారా కేవలం తెలుగువారికే కాక, ప్రపంచంలో ఎక్కడో ఉన్న వారికి కూడా సహాయపడగలిగాను అన్నది ఒక మర్చిపోలేని అనుభూతి.
ఒకసారి మలేషియన్ ప్రభుత్వం, ఇండియన్ టూరిజం డిపార్టుమెంటు కలిసి, ఇంటర్నేషనల్ స్టేజి ప్లే కోసం నన్ను మలేషియా పంపారు. నా ప్రదర్శన చూసిన తర్వాత, నాకు ఇంకో 10 రోజులు ఎక్స్టెండ్ చేసారు. అక్కడి, హోటల్స్ లో, ఎక్షిబిషన్ లో అసలు వెంట్రిలాక్విజం అంటే తెలియని అక్కడి వారంతా నా ప్రదర్శనలు చూసి, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకున్నారు. ఇదొక మర్చిపోలేని అనుభూతి.
మా గురువుగారైన వేణుమాధవ్ గారిని, 81 లో రోటరీ క్లబ్ వాళ్ళ ఫంక్షన్ లో వేణుమాధవ్ గారిని వారి కుటుంబం ఎదుటే ఇమిటేట్ చేసాను. ఇలా నా జీవితంలో నాకు తెలియకుండా, అనేకమంది అందించిన ఆశీస్సులు, ప్రోత్సాహం  వల్ల నేను ఒక కళాకారుడిగా నిలబడగలిగాను.
‘ధ్వన్యవధానం’ అనే ప్రక్రియను గురించి చెప్పండి.
నేను 1990 నవంబర్ 13,14 న 32 గంటల పాటు నిర్విరామ ప్రదర్శన చేసాను. 19 మార్చ్, 1990 న  త్యాగరాజ గానసభలో ‘ధ్వన్యవధానం’ అనే పేరుతో నేను మిమిక్రీ అవధానం చేసాను. సాహిత్యంలో అవధానాన్ని ఆధారంగా చేసుకుని, ఒక వంద అవధానాలు చూసి, అవధాన విద్యపై థీసిస్ చూసి, ఆరు నెలలు కష్టపడి, దీనికి ఒక ఆకృతి తీసుకు వచ్చాను. 8 మంది పృచ్చకులు ఉంటారు. అవధానంలోని సమస్యాపూరణం- బదులుగా సమస్యాధ్వని, దత్తపది- బదులుగా దత్తధ్వని, ఆశువు - బదులుగా ఆశుధ్వని, సద్యోవర్ణన - బదులుగా సద్యో ధ్వని, ఇలా 8 అంశాలు 4 రౌండ్ల లో పూర్తి చేసేలా ప్లాన్ చేసాను. అసంపూర్ణంగా ఉండే ఒక వాక్యాన్ని ఇచ్చి, దాన్ని పృచ్చకుడు కోరిన విధంగా పూరించాలి. వారు ‘ఆదరించు తల్లి అధమురాలు’ అన్న వాక్యం ఇచ్చి, ముందుగా ఇది సాహితీ అవధానం కాదు, మిమిక్రీ అవధానం అని ముందుగానే తెలియజేసినా కూడా, అదే శైలిలో పూరించమని అన్నారు. మరి అవధానం చెడిపోకుండా చెప్పాలి... ఆలోచించి, ఎక్కడో విన్నది గుర్తుకు తెచ్చుకుని,  ఇలా చెప్పాను.
కూతుళ్ళ నొకరీతి కోడళ్ళ నొకరీతి ఆదరించు తల్లి అధమురాలు బిడ్డలందరు నొకటే భేషైన తల్లికి’ అంటూ పూరించాను.
దత్తధ్వనిలో ట్రైన్, కార్, ఆటో, విమానం వంటి 4 ధ్వనులు ఇచ్చి, అవి రామాయణ సన్నివేశంలో చెప్పమన్నారు. మరి రామాయణ కాలంలో ఇవన్నీ లేవు కదా. అందుకే వీటిని ఒక రామాయణం షూటింగ్ కు అన్వయించి పూరించాను. ‘నిషేధ ధ్వని’ లో ఇద్దరు రైల్వే స్టేషన్ కు వెళ్ళారు, అది తెలియాలి కాని, ట్రైన్ సౌండ్ నిషేధం అన్నారు. నేను రైల్వే అనౌన్స్మెంట్ చెప్పి, వాళ్ళు హోటల్ కు వెళ్తున్నట్టు చెప్పగానే, వెంటనే వారు ‘సంభాషణ నిషేధం’ అన్నారు. వెంటనే అక్కడ ఒక చైనా వాడి హోటల్ కు వెళ్లినట్టు మార్చి, వాడికి భాష రాదు కనుక, మెనూ గురించి అడిగినట్లుగా కోడి, మేక, కుక్క శబ్దాలతో నటిస్తూ చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ వద్దకు వెళ్ళారు అనగానే, మళ్ళీ ట్రైన్ శబ్దం నిషేధం అన్నారు. నిషేధం అన్నాకా, ఇక మార్గం ఉండదు, మలుపులు తిప్పుకుంటూ వెళ్ళాల్సిందే !అప్పుడు ‘అదిగో, ట్రైన్ ఆగుందిరా, నాకు నిద్రొస్తోంది, వరంగల్ వచ్చాకా లేపు’ అంటూ ముగించాను. నిద్రపోయాకా ఏ శబ్దమూ తెలీదు కనుక అది అలా సరిపోయింది.
8 వ తరగతి పాఠ్యపుస్తకాల్లో, 2013 లో మీ గురించి పెట్టినప్పుడు మీరు ఎలా అనుభూతి చెందారు ? మాటల్లో వర్ణించలేనండి. చాలా గొప్ప అనుభూతి కలిగింది. చిన్నప్పుడు నేను స్కూల్ లో చదివినప్పుడు, ఏవేవో పాఠాలు ఉండేవి. ఇప్పుడు నన్ను నేను ఆ పుస్తకాల్లో, రెండు రాష్ట్రాల్లో చూడడం అనేది, చాలా గొప్ప అనుభూతి. పుస్తకంలో రావడం అనేది, నేను చేసిన కృషికి గుర్తింపు అని నేను భావిస్తాను. ఇంకా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ? వెంట్రిలాక్విజం లో దేశంలో ఎవరూ చెయ్యని కొత్త ప్రయోగాలు చెయ్యాలని ఉంది. నాకు కొన్ని ఐడియా లు ఉన్నాయి. అది చేసి, చూసి, చాలా బాగుంది అని నాకు నమ్మకం కలిగాకా, ప్రేక్షకులకు చేసి, చూపుతాను. మిమిక్రీ సిలబస్ తెలుగు విశ్వవిద్యాలయం వారికి నేనే ఇచ్చాను. ఇలా విభిన్నమైన అంశాలు ట్రై చేసి, ప్రేక్షకులను రంజింపచెయ్యటంలో నాకు ఆత్మతృప్తి దొరుకుతుంది. చాలా సంతోషమండి. చాలా చక్కటి విషయాలను పంచుకున్నారు. కృతజ్ఞాతభివందనాలు. నమస్కారమండి. చదువరులు అందరికీ నా శుభాకాంక్షలు. కృతఙ్ఞతలు.

No comments:

Post a Comment

Pages