'కళాసేవారత్న' పోడూరి శ్రీనివాసరావు - అచ్చంగా తెలుగు

'కళాసేవారత్న' పోడూరి శ్రీనివాసరావు

Share This

'కళాసేవారత్న' పోడూరి శ్రీనివాసరావు

భావరాజు పద్మిని 


ఆయన్ను అదే మొదటిసారి కలవటం. మా ఇంటికి వచ్చారు, ఎదురుగా కూర్చున్నారు. జేబులోంచి ఏదో కాగితం తీసి మడతలు పెట్టసాగారు. కొంతమందికి, ఎదుటివారి కళ్ళలోకి చూస్తూ మాట్లాడడం అంటే మొహమాటం, అందుకే అలా చేస్తున్నారేమో అనుకుని మాట్లాదసాగాను. కాని, 10 నిముషాల్లోనే నా అంచనాల్ని చిత్తు చేస్తూ ఆయన నా చేతిలో ఆ కాగితం పెట్టారు. అది నా బొమ్మే... నఖచిత్రం! ఆశ్చర్యం, ఆనందం. అసలు ఆయన నాకు పరిచయం అయ్యింది రచయతగా, గాయకులుగా, కానీ బొమ్మలు వేస్తారని, నాలుగు వరల్డ్ రికార్డులు నెలకొల్పిన గొప్ప కళాకారులని, తర్వాతే తెలిసింది. మరి అటువంటి గొప్ప చిత్రకారుడితో మన తెలుగుబొమ్మ లో ముఖాముఖి ఇవ్వకపోతే ఎలా చెప్పండి ? అందుకే, బహుముఖ ప్రజ్ఞాశాలి, చిత్రకారులు పోడూరి శ్రీనివాసరావు గారితో ప్రత్యేక ముఖాముఖి మీ కోసం...
ప్ర:మీ బాల్యం, కుటుంబ నేపథ్యం గురించి క్లుప్తంగా చెప్పండి?
జ: నేను 01.11.1949వ తేదీనాడు, క్ష్రీరాభ్ది ద్వాదశి (కార్తీకమాసం) పర్వదినాన కాకినాడలో శ్రీ పోడూరి వీర్రాజుగారు – సావిత్రీదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాను. నాన్నగారు ఆంధ్రాబ్యాంకు మేనేజరు అవడం వల్ల, నా విద్యాబ్యాసం వివిధ ప్రదేశాల్లో జరిగింది. ప్రాథమికవిద్య, ఫస్ట్ ఫారం – తణుకులోనూ, సెకండ్ ఫారం – పిఠాపురంలోనూ, థర్డ్ ఫారం – నిడదవోలులోనూ, ఫోర్త్ ఫారం నుంచి సిక్త్ ఫారం వరకు-రామచంద్రాపురంలోనూ, సెవెన్త్ ఫారం-కాకినాడలోనూ, కాలేజ్ చదువు-విశాఖపట్నం-మిసెస్ ఎ.వి.ఎన్.కాలేజ్ లోనూ జరిగింది. తరువాత
ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగంలో చేరడం, వివిధ హోదాల్లో, వివిధ రాష్ట్రాల్లో సుమారు 40 సంవత్సరాల పాటు సేవలందించి 2009 లో రిటైరయ్యాక, ప్రస్తుతం సిటిజన్-కో-ఆపరేటివ్ సొసైటీ, సంజీవరెడ్డినగర్ బ్రాంచ్, హైదారాబాద్ లో రిలేషన్ షిప్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు తమ్ముళ్లు. అక్కాచెల్లెళ్లు లేరు. ఇకపోతే శ్రీమతి సత్యవాణి నా ధర్మపత్ని, చి॥రాజశేఖర్ నా కుమారుడు. చి॥సౌ॥పద్మావతీదేవి నా కోడలు. శ్రీ రమాలాస్య మనస్విని మనుమరాలు-వెంకట శ్రీరామ్ మనుమడు. వీళ్లంతా కూడా హైదరాబాదులోనే ఉంటారు. అబ్బాయి TCSలో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్, చి॥సౌ॥ శ్రీ సంధ్యాకిరణ్మయి మా అమ్మాయి, అల్లుడు చి॥జగన్నాథరావు. చి॥శ్రీ సూర్యనిశాంత్ మనుమండు. అమ్మాయి-అల్లుడు ‘విప్రో’లో పనిచేస్తున్నారు. వారి కుటుంబం ‘బెంగుళూరు’లో ఉంటుంది.
ప్ర: మీ ఇంట్లో ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా?
జ: నాకు తెలిసినంత వరకూ మా పూర్వీకుల్లో గానీ, ప్రస్తుతంగాని ఎవరూ లేరు. కానీ ఇపుడు మాత్రం – మా మనుమరాలు చి॥మనస్విని (2వతరగతి), గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు విజేత శ్రీ రాంబాబు గారి ఆధ్వర్యంలో నడుపవడుతున్న ‘సద్గురు చిత్రకళా స్కూలు’లో గత 4 నెలలుగా చిత్రకళ నేర్చుకుంటోంది.
ప్ర: చిన్నప్పటినుంచీ బొమ్మలు వేసేవారా? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది?
జ: రామచంద్రపురం స్కూలులో ఫోర్త్ ఫారం నుంచి సిక్స్త్ ఫారం వరకూ చదివానని చెప్పానుగా, మాకు ఇంగ్లీషు సబ్జెక్ట్ శ్రీ నలమాటి సూర్యనారాయణగారని మేష్టారు చెప్పేవారు. మాకు ఫిఫ్త్ ఫార్మ్ లో విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ ఠాగోర్ వ్రాసిన ‘కాబూలీవాలా’ పాఠం ఉండేది. మా మాష్టారికి రవీంద్రనాథ్ ఠాగోర్ అంటే చాలా చాలా ఇష్టం. ‘కాబూలీవాలా’ పాఠం సుమారు
నెలరోజుల పాటు చెప్పారంటే మీరు ఊహించుకోవచ్చు. రవీంద్రనాథ్ ఠాగోర్ ను రోజుకొక్కకోణంలో స్పృజించేవారు. వారిమాటల్లో చెప్పాలంటే-“ప్రతీ మనిషిలోనూ ఏదో ఒకకళ నిక్షిప్తమై ఉంటుంది. ఆ వ్యక్తి, అంతర్లీనమైన ఆకళను గుర్తించి, ఆ దిశగా ఆ కళను అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ మీలో దాగి ఉన్న కళను వెలుపలకు తీయడానికి, దానిని అభివృద్ధి పరచడానికి ప్రయత్నిచండి” అని చెప్పారు. ఆయన మాటలు ఆదర్శంగా తీసుకున్న నాకు ‘లలితకళల’ పట్ల అభిరుచి ఏర్పడింది. చిత్రకళ, గానం అపుడే మొదలుపెట్టాను. వివిధ మ్యాగజైన్లలో, పత్రికలలో పడ్డ అందమైన బొమ్మలు చూసి, వేయడానికి ప్రయత్నించేవాడిని. అలా మొదలైంది-నా చిత్రకళారంగప్రవేశం.
ప్ర: మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు?
జ: నాకు ప్రత్యేకించి గురువులు ఎవరూ లేరు. నేను కూడా ఒక సిలబస్ ప్రకారంగానీ, ఒక శిక్షణాలయంలో గాని శిక్షణ తీసుకోలేదు. బొమ్మలు చూస్తూ, వాటిల్ని వేస్తూ, అలా అలా ప్రాక్టీసు చేయడం వల్ల ఈ మాత్రం నేర్చుకోగలిగాను. అయినా నా చిన్నతనంలో ఇన్ని అవకాశాలు, నేర్చుకోవడానికి లేవని,నా అభిప్రాయం.
          ఇకపోతే ప్రముఖ చిత్రకారులందరిదీ ... ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క శైలి. కాని, నిర్వివాదాంశంగా ఏ చిత్రకారునికైనా ఆరాధ్యుడు శ్రీ బాపుగారే. అందాల బాపూబొమ్మ కానీండి, పురాణపురుషుల చిత్రాలు గానీండి, కార్టున్ లు కానీండి, ముఖచిత్రాలు గానీండి, కథలకు బొమ్మలు గానీండి... ఏదైనా ఆయనగీతే... ఒక బొమ్మ. ఆయన్ని అభిమానించని, ఆదర్శంగా తీసుకోని చిత్రకారుడే ఉండడు. అలాగే వడ్డాది పాపయ్య గారిదో శైలి. శ్రీ బాపుగారి బొమ్మ
–సన్నజాజైతే..శ్రీ వడ్డాది పాపయ్యగారి బొమ్మ-బొడ్డుమల్లె. శ్రీ పాపయ్యగారి శైలి కొన్ని తరహా చిత్రరాజాలకు చక్కగా నప్పుతాయి. నిర్మొహమాటంగా చెప్పాలంటే, ఎంతోమంది చిత్రకారులున్నా శ్రీ బాపుగారు, శ్రీ వడ్డాది పాపయ్యగారు నేను ఎక్కువగా అభిమానించే చిత్రకారులు.
ప్ర:మోడరన్ ఆర్ట్ అంటూ అర్థం పర్థం లేని బొమ్మలు వస్తున్న తరుణంలో, అసలు బొమ్మ అంటే ఎలా ఉండాలి – అని మీరు భావిస్తారు?
జ:బొమ్మ గీయడంలో వివిధరకాలున్నాయి. విభిన్న తరహాలున్నాయి. అనేకప్రక్రియలు,విధానాలు...ఉన్నాయి. అందులో ఒక భాగమే ఈ మోడరన్ ఆర్ట్. ఉదాహరణకు కవిత్వంలో చూడండి- ప్రాచీన కవిత, ఆధునిక కవిత, భావకవిత,పద్యకవిత,వచనకవిత,దీర్ఘకవిత,నానీలు,హైకూలు,రెక్కలు....ఇలా అనేక ప్రక్రియలున్నాయి. ఎవరికివారే, వారి తరహాలోనే...వారికి తోచిన విధంగానే సాహితీ కృషి చేస్తున్నారు. పద్ధతేదైనా ఒక్క విషయం మనం మర్చిపోకూడదు...ఏ విధంగా చేసినా అందరూ చేస్తున్నది...సాహితీ సేద్యమే.
కాని అందులో కలుపుమొక్కలు ఏర్పడకుండా జాగ్రత్తపడాలి. అటువంటివి ఏరిపారేయాలి. చిత్రకళ అయినా అంతే- ఆర్టు ఏదైనా అసభ్యకరంగా చిత్రీకరించకూడదు. బొమ్మ చూస్తుంటే మనస్సుకు ఆహ్లాదం కలిగించేటట్లుండాలి. ప్రాచీనకవితలో అర్ధంకోసం ‘నిఘంటువు’ తిరిగేసే విధంలా కాకుండా, బొమ్మ చూస్తుంటే, ఆ అందాన్ని ఆస్వాదించేస్థితిలో ప్రేక్షకుడుండాలిగాని, ఈ బొమ్మ అసలేమిటి?తిరగేసి చూడాలా?మరగేసి చూడాలా?చిత్రకారుని ఆంతర్యం ఏమై ఉంటుంది? ఆయన ,మనకేం చెప్పాలని అనుకుంటున్నాడు? అని అలోచించి బుర్రలు బద్దలు కొట్టుకునే విధంగా ఉండకూడదని నా అభిప్రాయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మోడరన్ ఆర్ట్ చిత్రకారులు దీన్ని తప్పుగా అర్ధం చేసుకోరని భావిస్తాను. అందరూ ఒప్పుకోవాల్సిన విషయమేమిటంటే భగవంతున్ని మించిన చిత్రకారుడు ఈ విశ్వంలోనే లేడు. ఆయన చిత్రించిన ప్రకృతిలో- ఏ కాలమైనా-ఏ సమయమైనా -...ఏ విషయ వస్తువు తీసుకున్నా
చాలా అందంగా చిత్రించాడా మహానుభావుడు, సృష్టికర్త.
ప్ర:నఖచిత్రాల పట్ల ఆసక్తి ఎలా కలిగింది? ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా?
జ:అంతకుముందు నఖచిత్రాలనేవి ఉంటాయని నాకు తెలియదు. కానీ నేను సెవెన్త్ ఫారం చదువుతున్నప్పుడు, 1965 లో మాకు వరుసకు మామయ్య అనే ఆయన, జగన్నాథరావుగారని కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ కాలేజ్ లో లెక్చరరుగా పనిచేసేవారు. ఆయన ఒకరోజు ఒక నఖచిత్రం గీసి చూపారు. చాలా ఆశ్చర్యపోయాను. ఏ పనిముట్టు లేకుండా, కేవలం కాగితం మీద, చేతివేళ్లగోళ్లతో చిత్రించడం ఎంతో మహాద్భుతంగా తోచింది. చిత్రకళకూ దీనికీ చాల వ్యత్యాసముంది. పెన్సిల్ తో గీసే చిత్రాలయితే- తప్పువస్తే ఎరేజర్ తో
చెరపవచ్చు. రంగులతోనైతే-వేరేరంగు మార్చడం ద్వారాగాని, లేకవేసిన రంగును షేడ్ గా ఉపయోగించిగానీ-చేసిన తప్పును సరిదిద్దుకోవచ్చు. కానీ నఖచిత్రంలో అటువంటి అవకాశం లేదు. ఒక గీత ఇంప్రెషన్ పడితే, దాన్ని మళ్ళీ మార్చడానికి లేదు. చిత్రకారునికి తను వెయ్యబోయే చిత్రంపై పూర్తి అవగాహన ఉండాలి. అపుడే నఖచిత్రం గీయగలరు. జగన్నాథం మావయ్య ఎలా వెయ్యాలి.. అన్న టెక్నిక్ తెలియజేసాడు. దాని ఆధారంగా.. సాధనచేసి ఓ స్థాయికి చేరాను.
ఇకపోతే గురువంటే- విధానం తెలిపిన జగన్నాథం మావయ్యే నా గురువు. నఖచిత్రములు మలచడంలో పేరెన్నిక గన్న శ్రీ శిష్టారామకృష్ణారావుగారి ప్రదర్శనలు చూసి ఈ చిత్రకళలో మరిన్ని మెళకువలు తెలుసుకుకున్నాను. అయినా నేను నిరంతర విద్యార్థినే.
ప్ర:గానం, చిత్రకళ, రచన, వృత్తి-ఇన్ని రంగాల్లో ఎలా రాణిస్తున్నారు?మీ
విజయ రహస్యం ఏమిటి?
జ: భగవంతుడు సృష్టించిన ఈ జగత్ లో రోజుకి ఇరవై నాలుగు గంటలు. అవి మీకైనా నాకైనా ఇరవైనాలుగు గంటలే- మన వృత్తికి, అభిరుచికి, దైనందిన కార్యక్రమాలకు విభజించుకోవాలి. నేను ఎక్కువ టి.వి చూడను. వీలయినంతవరకు ఎక్కువ పుస్తకపఠనంలోనూ, వ్రాసుకోవడంలోనూ గడుపుతాను. సాయంత్రాలు వీధిలోకి వెళ్లి స్నేహితులతో ఖాళీగా పనికి మాలిన కబుర్లు చెప్పడం నాకు నచ్చదు. కొన్నాళ్లు చిత్రకళ మీద అభిలాష పెంచుకొని, ఆ దిశలో సాధన చేసిన నేను ప్రస్తుతం రచనా వ్యాసంగానికి, పుస్తకపఠనంకు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాను. చైతన్యం అనే మాసపత్రికలో గత ౩౦ నెలలుగా ‘బాలచైతన్యం’ శీర్షికన పిల్లలకు అర్ధమయ్యే రీతిలో మహానుభావుల జీవితచరిత్రలను – ప్రతీనెలా ఒక్కొక్కరి చొప్పున తెలియబరుస్తున్నాను. ఇవి
చాలా బాగుంటున్నాయని ఎందఱో తెలియబరుచుకుంటున్నారు. మన సంస్కృతీ, మనదేశ గొప్పతనము, ఈ పవిత్ర గడ్డమీద పుట్టిన ఎందఱో మహానుభావుల గురించి మనపిల్లలు తెలుసుకోవాలి. అందుకే నా ఈ ప్రయత్నమంతా! ఇదిగాక ‘అచ్చంగా తెలుగు’లో ప్రతీనెలా ఏదో ఒకటి- నా వంతుగా రచనా సహకారం అందిస్తుంటాను. అంతేకాక ఆంద్రభూమి,రచన,నవ్య,మనజ్యోతి మొదలైన పుస్తకాల్లో నా రచనలు ప్రచురితమౌతూ ఉంటాయి. ఏదైనా, సమయాన్ని వెచ్చించడమైన,మరేదైనా...మన అభిరుచిమేరకు, మన ఇష్టాఇష్టాల బట్టే ఉంటాయి. మరొకటేమిటంటే-మీకే రంగంలో ఇష్టం ఉంటే – ఆ రంగానికి సంబంధించిన విషయాలపై, ఎక్కువ శ్రద్ధ చూపుతారు, ఆ పనిని ఎంతో జాగ్రత్తగా చేస్తారు. నేను చేసే పనులన్నీ నాకిష్టమైనవే! అందుకే వాటికన్నిటికీ, నాకు గల సమయాన్ని విభజించుకుంటాను. చేసే ప్రతీపనీ, మనసుపెట్టి చేయడంతో, ఆపనిలో పెర్ ఫెక్షన్ వస్తుంది. మనం విజయం సాధించగలుగుతాము.
ప్ర: మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి?
జ: నాకు భిన్నరంగాలలో ఉన్న ప్రవేశం ద్వారా నాకు చాలానే అవార్డులు,
రివార్డులు, ప్రశంసలు వచ్చాయి. నా అభిరుచుల విషయానికివస్తే-కవిత్వం, రచన, చిత్రలేఖనం, గానం,నఖచిత్రలేఖనం, నటన, స్టాంపుల సేకరణ, నాణేల సేకరణ, ఫస్ట్ డే కవర్ల సేకరణ లాంటి అనేక అభిరుచులున్నాయి.
ఇప్పటివరకు నాకు లభించినవి: 5 బిరుదులు, 4 వరల్డ్ రికార్డులు, 34 పురస్కారాలు, అవార్డులు అందుకున్నాను విభిన్న రంగాలలో.
మర్చిపోలేని ప్రశంసలు: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాయోగి మహారాజ్ వారిచే వారణాశిలో జరిగిన సన్మానం-మంగళా శాసనము. 2. త్రిదండి రామానుజజీయర్ స్వామి గారిచే భువనేశ్వర్ లో జరిగిన ఆశీస్సులు, మంగళాశాసనములు. 3. ఆంధ్రాబ్యాంకు చైర్మన్ సర్ రామకృష్ణన్ గారిచే హెడ్ ఆఫీసులో అభినందనపత్ర బహుకరణ- ఈ మూడు కూడా నఖచిత్రాలకి వచ్చినవే. 4. శ్రీసుమాలు- స్వీయకవితాసంకలనం విడుదల సందర్భంగా డా.సినారె, శ్రీ సుదామగార్ల ప్రశంసలు. ఆ పుస్తకానికి ముఖపత్రరచన (cover page disign)కూడా నాదే. ఎన్నో గుర్తుంచుకోదగిన సన్నివేశాలున్నా –అందులో ముఖ్యమైనవి- పైన ఉదహరించినవి.
ప్ర: మీ అభిరుచులకు, మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది?
జ:పురుషుని ప్రతీ విజయం వెనుక స్త్రీ పాత్ర ఉంటుందన్నది జగద్విఖ్యాతమే. నేనందుకు ఏమాత్రం ఎక్స్ సెప్షన్ కాదు. నేనీరోజు ఇన్నిపనులు విజయవంతంగా నిర్వహిస్తున్నానంటే, ఇన్ని పురస్కారాలూ, అవార్డులూ, రివార్డులూ పొందగలిగానంటే నా శ్రీమతి సత్యవాణి, ఇతర కుటుంబసభ్యలు- పిల్లలు విజయరాజశేఖర్,శ్రీ సంధ్యాకిరణ్మయిల పాత్ర,సహకారం ఎంతగానో ఉంది- వారందరికీ ఎల్లపుడు కృతజ్ఞుడినే.
ప్ర: భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి?
జ: మీరు చేస్తున్న పనిని ఇష్టపడి, ఆస్వాదించి చేయండి. ఏపనీ మీ మీద బలవంతంగా రుద్దడంలేదు. ఒక కళను-కళగానే గౌరవించండి,దేవతగా ఆరాధించండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే-సాధన. పెర్ ఫెక్షన్ రావాలంటే సాధన ఎంతో ముఖ్యం. అంతర్జాతీయఖ్యాతిని గడించి, లక్షల చిత్రాలను గీసి, భారతదేశ, ఆంధ్రదేశ కీర్తిని, చిత్రకళలో సమున్నత శిఖరాలకు తీసికెళ్ళిన దిగ్గజం – శ్రీ బాపుగారు కూడా ఏ ఒక్కక్షణం ఖాళీ దొరికినా.. ఎదురుగా ఉన్న వస్తువునో, మనిషినో, భంగిమనో,పశుపక్ష్యాదులనో చిత్రిస్తూనే ఉండేవారట, సాధన చేస్తూనే ఉండేవారట. కాబట్టి, మీ సబ్జెక్ట్ మీద ఇంట్రస్టు పెంచుకోవడం, పరిశీలన, సాధన – ఇవి ఎంతో ముఖ్యమైనవి. పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వండి.
మీతో ఒక ముఖ్యవిషయం పంచుకుందామనుకుంటున్నాను:
ఇంతకుముందే మా మనుమరాలు చి॥లాస్యమనస్వినిగిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు విజేత శ్రీ రాంబాబు గారి ఆధ్వర్యంలో నడుపవడుతున్న ‘సద్గురు చిత్రకళా స్కూలు’లో గత 4 నెలలుగా చిత్రకళ అభ్యసిస్తుందని తెలియజేశానుగా. సెప్టెంబర్ 20వ తేదీ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, మా మనుమరాలు కూడా-లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వకర్మ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
దయజేసి మీరందరూ సహృదయంతో ఆ చిరంజీవికి ఆశీస్సులందజేయండి.
ఈ విధంగా మిమ్ములనందరికీ, నా పరిచయం కలగాజేయడానికి, కారణభూతురాలైన శ్రీమతి భావరాజు పద్మినికి, అచ్చంగా తెలుగు సంపాదకవర్గానికి సదా కృతజ్ఞుడిని.
దసరా శుభాకాంక్షలతో.....కళాసేవారత్న పోడూరి శ్రీనివాసరావు.

No comments:

Post a Comment

Pages