ప్రేమే దైవం - అచ్చంగా తెలుగు

ప్రేమే దైవం

Share This

ప్రేమే దైవం


దైవాన్ని ప్రత్యక్షంగా మన ఇంద్రియాలకు ఉన్న పరిమితులతో చూడడం కష్టం. అందుకే విగ్రహారాధన పద్ధతిని పెద్దలు మనకు సూచించారు. ఎప్పుడూ మనవెంటే, మనలోనే అంతర్యామిగా ఉంటున్నా దైవాన్ని, ఆయన ఉనికిని మనం గుర్తించి, ప్రేమించడం ఇంకా కష్టం. కారణం మనకు దైవానికి ఉండే మాయ అనే అడ్డుతెర. మనకీ దైవానికి అడ్డుగా ఉండే దుర్గుణాలను తొలగించమంటూ 'తెర తీయగ రాదా' అన్న త్యాగరాజ గేయం ఇదే నేపధ్యంలో సాగుతుంది. ఈ తెరను తీసి, దైవాన్ని నిండు మనసుతో ప్రేమించాలంటే, జన్మ జన్మల సుకృతం ఉండాలి.
ఇది ప్రాధమిక దశలో అందరికీ సాధ్యం కాదు. ఒక్కొక్క అడుగూ మనిషి తనవైపు పయనించాలన్న అపారమైన దయతో, ఆ పరమాత్మ, పండితులైనా పామరులైనా ఆస్వాదించగలిగేలా మనకిచ్చిన అద్భుతమైన భావనే, వరమే ప్రేమ. బాల్యంలో మలమూత్రాలను తెలియక ఒంటికి పూసుకుంటున్న బిడ్డను శుభ్రం చేసి, ఆకలి, నిద్రా అవసరాలను గమనించుకుని, ప్రమాదాల నుంచి రక్షిస్తూ, తన బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్ధించే అమ్మే దైవం. అమ్మ ప్రేమే దైవం. అలాగే తన బిడ్డలోనే చిన్ని కృష్ణుడిని, బుజ్జి అమ్మవారిని చూసుకుంటూ పెంచుతుంది కనుక, అమ్మకు బిడ్డే దైవం. ఆ బిడ్డ పట్ల ఆమె కనబరిచే ప్రేమే దైవం. అలాగే సోదరసోదరీమణులు, భార్యాభర్తలు, స్నేహితులు ఇలా అన్ని మానవ సంబంధాలలోనూ, రక్త సంబంధం ఉన్నా, లేకపోయినా, ఒకరిపట్ల మరొకరు చూపే అవ్యాజమైన ప్రేమానురాగాలే దైవం.
ఈ ప్రపంచంలో కనీసం ఒక్కరిననైనా, షరతులు విధించకుండా, లోపాలు, బలహీనతలతో సహా ఇష్టపడుతూ ప్రేమించని వ్యక్తి ఒక్కరు కూడా ఉండరేమో ! అహం కంటే అనుబంధం ముఖ్యం అని భావించినప్పుడు వారు మనల్ని గాయపరచినా మర్చిపోతాం, మన తప్పు లేకున్నా మన్నించమని కోరతాము. అంటే, మీరు బేషరతుగా ప్రేమించే ఆ ఒక్క వ్యక్తి... మీకు దైవసమానులు. మీరు వారిపట్ల కనబరిచే ప్రేమ నేరుగా దైవానికే చేరుతుంది. అలా, ఆ రూపంలో మీ ప్రేమను పొందేందుకు దైవమే స్వయంగా వారిలో కొలువుంటారు, తన సృష్టిలోని ప్రతి ప్రాణి పట్ల అంతటి మమత భగవంతుడికి. ఇలా ఒక్క వ్యక్తితో మొదలైన ఈ ప్రేమ... అలా, అలా విస్తరించి, జన్మలు, పరిణితుల వారధులు దాటుకుని, చెట్టులో, పుట్టలో, చేమలో, సమస్త జగతిలో దైవాన్నే దర్శించే దివ్యస్థితికి చేరుతుంది. అన్నింటా దైవమే ఉన్నప్పుడు, అందరిలోనూ దైవాన్నే చూడగలిగినప్పుడు, ఇక రాగం- ద్వేషం , సంగం ఎక్కడ ? ఇదే ఆత్మసాక్షాత్కార స్థితి అంటే.
కాబట్టి, మనం ప్రేమించే, హాయిగా మనసు విప్పి మాట్లాడుకునే ఆ కొందరినైనా అహపు మైలురాళ్ళు దాటి, హాయిగా ప్రేమించగలిగితే, అదే భావన, దైవత్వం విస్తరించి, మనల్ని దైవానికి చేరువ చేస్తుంది. కారణాలు, గుణాలు వెతక్కుండా, ఎవరెలా ఉంటే వారిని అలాగే అంగీకరించి, ప్రేమలోని నిజమైన దైవత్వాన్ని అనుభూతి చెందుదాము. లోకాస్సమస్తా సుఖినోభవంతు !
ఈ సంచికలో ప్రముఖ సినీ గీత రచయత దారివేముల రామజోగయ్య శాస్త్రి గారితో ముఖాముఖి, బహుముఖప్రజ్ఞాశాలి, చిత్రకారులు పోడూరి శ్రీనివాసరావు గారితో ముఖాముఖి, గోమాత విశిష్టతను తెలిపే చెరుకు రామమోహనరావు గారి వ్యాసం, గాయకులు ఏసుదాస్ గారి గురించి మధురిమ గారు గారు అందించిన వ్యాసం, ఆదిశంకరాచార్యులచే రచించబడిన శ్రీరామకర్ణామృతం ఇంకా ఎన్నో ఎన్నెన్నో విశేషమైన అంశాలు ఉన్నాయి. ఇవి కాక, ఆరు ఋతువుల వంటి ఆరు కధలు, ఐదు సీరియల్స్, మరెన్నో ప్రత్యేక అంశాలు దైవానుగ్రహంతో మీకు అందించాము. శ్రీవారి పాదుకల అపారమైన దయతో, పరిపూర్ణ గురుఅనుగ్రహంతో సాగే 'అచ్చంగా తెలుగు' అంతర్జాల మాస పత్రిక 20వ సంచికను, ఎప్పటిలాగే చదివి, ఆదరించి, ఆశీర్వదించి, కామెంట్స్ రూపంలో మీ ప్రోత్సాహం అందిస్తారు కదూ !
కృతజ్ఞతాభివందనలతో
భావరాజు పద్మిని.

No comments:

Post a Comment

Pages