సంగమేశ్వర శతకము - పరిమి వేంకటాచల కవి - అచ్చంగా తెలుగు

సంగమేశ్వర శతకము - పరిమి వేంకటాచల కవి

Share This

సంగమేశ్వర శతకము - పరిమి వేంకటాచల కవి

పరిచయం :దేవరకొండ సుబ్రహ్మణ్యం 


కవి పరిచయం:
సంగమేశ్వర శతక రచయిత పరిమి వేంకటాచలకవి ప్రథమశాఖా నియోగి బ్రాహ్మణుడు. హరితసగోత్రుడు. తండ్రి రఘునాయకుడు. తల్లి సూరమాంబ. సంస్కృతాంధ్రములందు అసమానపాండిత్యాన్ని సంపాదించిన ఈకవి, గుంటూరుమండలమున ఉన్న తెనాలితాలూకాయందలి చినపరిమి అనేగ్రామంలో జన్మించినాడు. తరువాత ఈకవి తుంగభద్ర సమీపంలోని జాగర్లమూడి అనేప్రాంతంలో తన స్థిరనివాసాన్ని ఏర్పరుచుకున్నాడు.
తనగురించి శతకాంతమున ఈ కవి ఈవిధంగా చెప్పుకొన్నాడు.
నరహరిభక్తిమించు రఘునాయకమంత్రికి సూరమాంబకున్
వరసుతుడన్ ధరన్ పరిమివంశజుడన్ భవదీయదాసుడన్
హరితసగోత్రజుండ చెలువంద జనించితి నాదిశాఖయం
దరయగ వేంకటాచల సమాఖ్యుడ కూడలి సంగమేశ్వరా
కృష్ణవేణి-తుంగభద్ర సంగమస్థానంలో ఉన్న  చామర్లపూడి (సంగమ జాగర్లమూడి) గ్రామమున వేంచేసియున్న శివమూర్తియగు శ్రీసంగమేశ్వరస్వామిపై ధ్యానపూర్వకంగా ఈ సంగమేశ్వర శతకాన్ని రచించాడు.
మేలగు తుంగభద్రకు సమీపమునం దమరావతీపురిన్
బోలిన యట్టి చామరలపూడిపురిం దగ సర్వమంగళా
లోలుడ వై వసించి సిరులు న్నిజభక్తుల కిచ్చుచున్ దయా
శీలత నొప్పుచుందువు ప్రసిద్ధిగ కూడలి సంగమేశ్వరా!
ఈకవి గురించి గాని, వారి ఇతర రచనల గురించికాని సమాచారం లభింపలేదు.
శతకపరిచయం:
"కూడలి సంగమేశ్వరా" అనే మకుటంతో చంపకోత్పలమాల వృత్తాలతో రచించిన ఈ శతకం భక్తిరసప్రాధాన్యమైనది. ప్రతిపద్యంలో భక్తిరసం ఉట్టిపడుతుంది. చక్కని ఈ క్రింది పద్యాలను చూడండి!!
నిను ధృఢభక్తి గొల్వగలనే? యిల నే గల నేర్పుతోడుతం
దనర భజింప గావ దగదా? తగదా? యటంచు నె
మ్మనమున నమ్మినాడ కనుమా! వినుమా! నినుమానసంబునం
దనిశము గొల్తునయ్య! కరుణాన్విత! కూడలి సంగమేశ్వరా!
పాములు భూషణంబులు కపాలముపళ్ళెర మద్రిగేహమున్
సామజచర్మ మంబరము సారెకుగల్గిన బిచ్చగాని నే
నే మని వెంబడింతు సిరులిమ్మని యింతియచాలు చాలునా
స్వామి త్వదీయభక్తియయొసంగవె కూడలి సంగమేశ్వరా!
కొన్ని పద్యాలలో ఆనాటిసామాజిక పరిస్తితులు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి
కాసుకుఁ గందపద్య మఱకాసుకు వృత్తము గుడ్డీగవ్వకున్
సీసముగా నిటు ల్చవుకఁ జెందెఁ గవిత్వము గావున న్మనో
ల్లాసితిలౌ ధరాధిపతుల నంది రోసి నినుస్సదా నుతుల్
చేసెద వేగ నన్ను దయసేయవె కూడలి సంగమేశ్వరా!
కంటకులౌ ధరాధిపుల గాంక్షల గొల్చుచుంతినిగాని నీ
వంటి దయాళు భక్తజను వత్సలు నామది గొల్వనైతి ని
ష్కంటకవృత్తిగా కెటులగల్గు భవచ్చరణంబుదక్క నీ
బంటుగ నెలుకోమ్మఖిలపావన కూడలి సంగమేశ్వరా!
కొన్ని పద్యాలను పరిశీలిస్తే ఈ కవికి యోగముతో పరిచయము ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ క్రిందిపద్యాలను చూడండి.
మూడిటిరెంటినిన్ గెలిచి మూటినిమూటిని రూపుమాపిము
న్మూటిని మూసి యైదిటినిపొందుగనేకముజేసి మూడిటిన్
మూడిటిదాటిరెంటినడిముంగనుచున్శివయోగిమూడిటిన్
గూడినచోటు మీఱి నినుగూడడె కూడలి సంగమేశ్వరా!
కూడలి నాదబిందువులకు కూడలి సర్వచరాచరాలికిన్
కూడలి భూతపంచకంబు కూడలి వర్ణితశక్తికోటికిన్
కూడలి నాళికాత్రయము కూడలి బంధురతత్త్వరాశికిన్
కూడలి షట్సరోజముల కూడలి కూడలి సంగమేశ్వరా!
కొన్నిపద్యములు అధిక్షేపాత్మకములై కనిపిస్తాయి!
సామజచర్మమున్విషము చంద్రుడుగంగయుకామభస్మమున్
పాములు నీ కభిష్టకరవస్తువులౌ నివి నాకు గల్గునే
సేమముతోడపూజ నిను సేయుటకింక నొకానొకప్డు నీ
నామము సంస్మరించెద మనంబున కూడలి సంగమేశ్వరా!
పూనుకలపేరు, మేన కడుబూడిద, యేనుగతోలు చిహ్నమై
తనరి యమంగళుండవగు తావకనామ మెదం దలంచువా
రనిశ మనంతమంగళములందుదు రట్టి విచిత్ర మెవ్వరుం
గనుగొననేరరయ్య త్రిజగంబుల కూడలి సంగమేశ్వరా!
చాలాపద్యాలలో మనకు ప్రాచీనకవుల పద్యాలపోలికలు కనిపిస్తాయి. ఈపద్యం చదువగానే మనకు "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలయుండు" పద్యం గుర్తుకు రాకమానదు.
ఎవ్వనిచే జగంబు జనియించు, వసించు నశించు, నవ్యయుం
డెవ్వడు కార్యకారణము లెవ్వడు భూతసమాశ్రయుండువా
డెవ్వడు చిత్కళాసహితుడెవ్వ డపారదాత డీవెకా
యివ్వసుధాస్థలిన్ వెదుకనేనిక కూడలి సంగమేశ్వరా!
కొన్ని దూర్జటికవి "శ్రీకాళహస్తీశ్వర శతకము" లోని పద్యాలను పోలి యున్నవి. మొత్తముగా ఈ శతకము భక్తిరసాన్ని ఒలికిస్తు చదువరులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతుంది.
మీరు చదవండి. ఇతరులచే చదివించండి

No comments:

Post a Comment

Pages