మొక్కేటి గోపాంగనల మోహనాకారము - అచ్చంగా తెలుగు

మొక్కేటి గోపాంగనల మోహనాకారము

Share This

మొక్కేటి గోపాంగనల మోహనాకారము

డా. తాడేపల్లి పతంజలి
అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ తెలుగు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పటాన్ చెరు
 
        
కృష్ణ మూర్తి అనగానే  నిర్వచించటానికి వీలులేని తియ్యదనం ఆయన  పెదవుల మీద నవ్వుగా మారి మనలిని పరవశింపచేస్తుంది. ఆనవ్వుల తీపి వానలో తడిసిపోయిన అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య – ఆ నల్లనయ్యను మధురంగా ఈ కీర్తనలో పిలుచుకొంటున్నాడు
 పల్లవి:
మొక్కేటి గోపాంగనల మోహనాకారము
చిక్కని నవ్వులు నవ్వీ శ్రీవేంకటేశ్వరుఁడు
చ. 1:
సత్యభామవురముపై చల్లని కస్తూరిపూఁత
తత్తరించే రుక్మిణిచేతామరపూవు
హత్తిన భూకాంతకు యంగపు పయ్యదకొంగు
చిత్తగించరమ్మ వీఁడే శ్రీవేంకటేశుఁడు
చ. 2:
పంతపు వదారువేలబంగారువుంగరము
బంతికే కుబ్జగట్టిన పసిఁడితాళి
వింతగా రాధాదేవి వేసిన కలువదండ
చెంతలను వీఁడే యమ్మ శ్రీవేంకటేశుఁడు
చ. 3:
 ఆసల తులసీదేవియఱచేతిలో యద్దము
బాసురపు యిళాదేవి పట్టుగొమ్ము
శ్రీసతి యెక్కినయట్టి సింహాసనపు గద్దె
సేస వెట్టించుకున్నాఁడు శ్రీవేంకటేశుఁడు  (రేకు: 0038-03  సంపుటము: 15-221 )
 ****
          గోపికలు  మొక్కుతున్న  మోహనమయిన ఆకారముతో  శ్రీ వేంకటేశ్వరుడు చిక్కని నవ్వులు నవ్వుతున్నాడు.
          చిక్కని నవ్వులు అంటే...
          చిక్కనైన నవ్వులా?
          అంతు చిక్కని నవ్వులా?
          దీని భావమేమి తిరుమలేశా?
          అసలు నవ్వులలో పలుచని నవ్వులు, చిక్కని నవ్వులు ఇలా ఉంటాయా?
          కారణము లేక నవ్వును... ప్రేరణమును లేని ప్రేమ... వృధా”ట “.
          మరి ఏ కారణముతో తమరు నవ్వుచుంటిరి  వేంకటేశా?
 1. పిన్న నవ్వు,
 2. చిరు నవ్వు,
 3. అల్లన నవ్వు,
 4. అలతి నవ్వు,
 5. మందస్మితం,
 6. హర్ష మందస్మితం,
 7. ఉద్గత మందస్మితం,
 8. జనిత మందస్మితం,
 9. అనాద మందస్మితం అని చిన్న నవ్వులు తొమ్మిదట.
 10. కలకల నవ్వు,
 11. పెలుచ నవ్వు,
 12. ఉబ్బు మిగిలిన నవ్వు అని పెద్ద నవ్వులు మూడట.
 13. కన్నుల నవ్వు,
 14. కన్నుల నిప్పురాలు నవ్వు,
 15. ఎలనవ్వు
 16. , కినుక మునుంగు నవ్వు,
 17. నవ్వు గాని నవ్వు,
 18. ఎఱ నవ్వు,
 19. కటిక నవ్వు,
 20. కినుక నవ్వు ఇంకో ఎనిమిది. నవ్వులు .. ఇలా ఇరవై రకాల నవ్వులు మా తిక్కన్న, అన్నమయ్యలు  చెప్పారు .
                   వీటిలో  ఏవి చిక్కని నవ్వులు?
                   గోపికలు మీ వైపు అంత మోహంగా చూడటానికి ఏనవ్వులు నవ్వారు మహా ప్రభో! వేంకటేశా!
                   మా పెద తిరుమలయ్య చిక్కని నవ్వులతో మీరు ఉన్నారని చెప్పాడు.
                   ఆ చిక్కని నవ్వుల  ముఖ దర్శనము  అన్నమయ్య కీర్తనల ఆరాధకులమైన మాకు కూడా ప్రసాదించు  దేవా !
చ. 1:
సత్యభామవురముపై చల్లని కస్తూరిపూఁత తత్తరించే రుక్మిణిచేతామరపూవు హత్తిన భూకాంతకు యంగపు పయ్యదకొంగు చిత్తగించరమ్మ వీఁడే శ్రీవేంకటేశుఁడు
                   ఏమే విన్నావా ! ఈ  వేంకటేశుడు కృష్ణావతారములో సత్యభామ వక్షస్థలంపై కస్తూరిపూత.
                   తొందరపడే (=తత్తరించే) రుక్మిణి చేతిలోని తామరపూవు.
                   తనను కౌగలించుకొన్న భూకాంతకు అంగపు పయ్యద కొంగు.
                   మనసుపెట్టి వినండి.  దయతో వినండి. (=చిత్తగించరమ్మ) ఆ కృష్ణుడెవడో కాడు . వీడే- మనకళ్ల ఎదుట కనబడుతున్న వేంకటేశుడు.
విశేషాలు
“మృగమదంబు చూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ...! వినుర వేమ...!”
కస్తూరి చూసేందుకు నల్లగా కనిపిస్తుంది... దాని సువాసన నాలుగు దిక్కులకూ వెదజల్లుతుంది. అలాగే పెద్దలైన వారు బయటికి గొప్పగా కనిపించరు కానీ , వారు గొప్ప గుణాలను కలిగి ఉంటారని వేమన మహాకవి  పద్యం
సరే స్వామీ !
కస్తూరి నల్లన. మీరు నల్లనయ్య.
          మీరూ గొప్పగుణాలు కలిగినవారే.
అదలా ఉంచుదాం.
మగ కస్తూరి జింక – ఆడ కస్తూరి జింకను ఆకర్షించటానికి  ఈ సువాసనల కస్తూరి తయారు చేస్తుందట.
ఆ లెక్కన-
          తమరు సత్యభామ వక్షస్థలానికి  చల్లని కస్తూరి పూత అంటే ఏమి అర్థం తీసుకోవాలి స్వామీ!
ఆవిడ హృదయంలో చెలరేగే మదన తాపానికి చల్లదనం కలిగించే వారనా!?
          అవిడని ఆకర్షించే విద్యలో పండిపోయారనా?
కస్తూరి రంగరంగ.......నాకెందుకులే సామి రంగ..
ఇక రుక్మిణమ్మ విషయానికి వద్దాం
ఆవిడ చేతిలో తామరపూవట తమరు.
తామర పూవును విలాసంగా ఇదివరకటి  రోజుల్లో ఆడవాళ్లు పట్టుకొనేవారట.
రుక్మిణమ్మ కూడా అలాగే పట్టుకొని ఉండవచ్చు.
స్వామీ ఇలా చెప్పటం ద్వారా మా పెదతిరుమలయ్య ఆంతర్యం ఏమి అయిఉంటుంది.
చేతిలో  ఉసిరికాయ అంటే కరతలామలకం ఎక్కడికి పోదని ధీమా !
అలాగే చేతిలో తామర పూవుఅంటే మీరు తనపట్టులోనే ఉన్నారని లోకానికి  రుక్మిణమ్మ చెబుతోందా?
తామరపూవును పట్టుకోవటం వల్ల చేతికి అందమా?
చేతి అందం వల్ల తామరపూవుకి విలాసమా?
ఏమో బాబూ !
 మీఇద్దరిలో ఎవరి వల్ల ఎవరికి గొప్ప వస్తోందంటే చెప్పేంత శక్తి ఉందా నాకు.
తగు నీచక్రి .....
మీ  యిద్దరం దగులం గూర్చిన బ్రహ్మ  నేర్పరి కదా “ అన్నాడు కదా మా  పోతన్న
ఇక భూదేవికి  అంగపు పయ్యెద కొంగట తమరు
మా పెద తిరుమలయ్య అయ్య కంటె నాలుగాకులు ఎక్కువ చదివినట్లున్నాడు.
                   రాజనీతి అంగములు అయిదు.
                   ఉపాయము, సహాయము, దేశకాల విభజనము, ప్రతిక్రియ, కార్యసిద్ధి.
                   మా భూదేవికి భారము తగ్గటానికి ఆ పై అయిదు అవసరము.
                   అటువంటి  మిమ్మలిని ఆ అయిదు అవసరాలకోసం  పైట కొంగులా విలాసంగా భూదేవి ధరిస్తోందట.
చ. 2:
పంతపు వదారువేలబంగారువుంగరము బంతికే కుబ్జగట్టిన పసిఁడితాళి వింతగా రాధాదేవి వేసిన కలువదండ చెంతలను వీఁడే యమ్మ శ్రీవేంకటేశుఁడు
ఈ  వేంకటేశుడు  కృష్ణావతారములో  పదహారు వేలమంది గోపికలకు బంగారపు  ఉంగరము.
ఈ  వేంకటేశుడు   పాంచరాత్రాగమ ఉత్పత్తి కోసం కుబ్జ కట్టుకొన్న బంగారు తాళి వంటి వాడు.
రాధాదేవి వేసుకొన్న  కలువదండ ఈ  వేంకటేశుడు
ఓ తల్లీ ! అటువంటి మహానుభావుడు మనదగ్గరే ఉన్నాడు
విశేషాలు
          గోపికల నృత్యము రాసలీలలో గుండ్రంగా జరిగింది. అందుకే  దానిని ప్రతీక చేస్తూ గోపికలకు  బంగారు ఉంగారముగా కృష్ణుని వర్ణించాడు.
అథ విజ్ఞాయ భగవాన్సర్వాత్మా సర్వదర్శనః
సైరన్ధ్ర్యాః కామతప్తాయాః ప్రియమిచ్ఛన్గృహం యయౌ
                                                          (శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఎనిమిదవ అధ్యాయం)
తనని ఆశ్రయించిన వారి ఆర్తిని నాశనం చేసే కృష్ణుడు తాను నగరములోకి ప్రవేశించిన వెంటనే అడిగిన వెంటనే కాదనకుండా అంగరాగమును సమర్పించి తన భక్తిని చాటుకున్నది త్రివక్ర. ఆమెను అనుగ్రహించ దలచుకున్నాడు కృష్ణుడు.
          బ్రహ్మ వైవర్త పురాణములోను,  హరి వంశములోను,  పద్మ పురాణములోను  కుబ్జ, కృష్ణ సమాగమం వలన ఉపశ్లోకుడనే ఆయన పుట్టి నారద మహర్షి వలన పాంచరాత్ర ఆగమాన్ని మనకు అందిస్తాడని చెప్పారు. అందుకే  కృష్ణుడు పాంచరాత్ర ఆగమాన్ని ఉద్ధరించడానికి  కుబ్జతో (మన బాషలో చెప్పడానికి) కలిసాడు.
          పూర్వం 'తాటి ఆకు'లో చిన్న ముక్కను రిబ్బనులా చుట్టి, దానికి పసుపు కుంకుమలు పెట్టి మూడుముళ్లు వేయించే వారు.క్రమంగా  ఆ తాటిబొట్టే  'తాళిబొట్టు'అయింది.  పసుపుకొమ్మును కట్టడం తర్వాత ఆచారమయి  'పసుపుతాడు' అయింది. తాళి ఎంత పవిత్రమయిందో పీతాంబరుడయిన  కృష్ణుడు అంత  పవిత్రుడని చెప్పటానికి కవి కుబ్జకు “పసిడి తాళి” అన్నాడు.
          కలువ పువ్వులు రాత్రి వికసిస్తాయి.
          ఇది మనందరికీ తెలిసిన విషయమే.
          మరి కలువల దండ  కృష్ణయ్య  అంటున్నాడు కవి.
          అమ్దునా రాధమ్మ వింతగా వేసిన కలువల దండట.
          అరాధమ్మ కృష్ణుని విరహంలో రాత్రి కలవరిస్తుంది.  కృష్ణ సందర్శనమే రాదకు వికాసం
          1.గోలోకంలో రమణీ రూపంలో ఆవిర్భవించిన పరమేశ్వరార్ధాంగ స్వరూప శక్తి.
 1. రాసేశ్వరి.
 2. మహాలక్ష్మి.
 3. వృష భానుడి పుత్రిక. - ఇవన్నీ రాధమ్మని గురించి చెప్పుకొనేటప్పుడు గుర్తుకు రావు.
                   రాధ పేరు తలుచుకొంటే కృష్ణుడు. కృష్ణుడి పేరు తలుచుకొంటే రాధ గుర్తుకొస్తారు.
                   వనమాల (ఆకులు పువ్వులు చేర్చి కట్టిన హారము )ధరించినవాడు కృష్ణుడు
                   కాదు
                   ఆయన పేరు కలువల మాలి అంటున్నాడు పెద తిరుమలయ్య
                   అందులోను రాధమ్మ వేసిన కలువల మాలి అంటున్నాడు.
                   కాదనటానికి  మనమెవరం!?
చ. 3:
 ఆసల తులసీదేవియఱచేతిలో యద్దము బాసురపు యిళాదేవి పట్టుగొమ్ము శ్రీసతి యెక్కినయట్టి సింహాసనపు గద్దె సేస వెట్టించుకున్నాఁడు శ్రీవేంకటేశుఁడు 
తాత్పర్యము
కృష్ణావతారంలో మా వేంకటేశుడు - ఆశలు పడే తులసీదేవి చేతిలో అద్దం.
ప్రకాశించే ఇళాదేవి చేతిలో ఆధారము; ఆశ్రయము.
విష్ణుదేవుడైన మా వేంకటేశుడు శ్రీ లక్ష్మి ఎక్కిన సింహాసనము.
అక్షతలు పెట్టించుకొన్నాడు మావేంకటేశుడు.
విశేషాలు
          అద్దాన్ని అరచేతిలో పెట్టుకొని కొంతమంది తమ అంద చందాలు చూసుకొని మురిసిపోతుంటారు.
          ఆలా తులసీదేవి అరచేతిలో ఉన్న అద్దమట శ్రీ కృష్ణుడు.
          తులసితో తుల తూగేవారెవరు లేనందువలన ఆమెను తులసి అంటారు.
          బ్రహ్మ వైవర్త పురాణములో  తులసిని     ప్రేయసిగా భావించి ఆమె కోసం  విష్ణువు స్తోత్రము చేసినట్లు ఉన్నది.           (ప్రకృతి ఖండము ఇరువది రెండవ        అధ్యాయము )  ప్రేయసి ప్రియుల సరాగాలలో  ఒకరికొకరు           అద్దమవుతుంటారు కదా ! ఆ దృష్టితో పెద         తిరుమలాచార్యులు వ్రాసిన పంక్తి ఇది
.
     శ్రీకృష్ణుని ఎనమండుగురు భార్యలలో ( 1. రుక్మిణి, 2. జాంబవతి, 3. సత్యభామ, 4. కాళింది, 5. నాగ్నజితి, 6. మిత్రవింద, 7. భద్ర, 8. లక్షణ.) ఇళ లేదు కాదు కాని  ఈవిడ చరిత్ర ప్రసిద్ధం.
          ముద్దు పళని వ్రాసిన రాధికా సాంత్వనములో ఇళాదేవి ముచ్చట్లు చాలా ఉన్నాయి. తాను పెంచిన ఇళాదేవిని కృష్ణుడికి యిచ్చి పెళ్లి  చేసిన  రాధ తరువాత వాళ్లిద్దరి  సాన్నిహిత్యం చూసి అలుగుతుంది. అసలు రాధికాస్వాంతనమునకు ఇళాదేవీయమని ఇంకొక పేరు . ఆవిడకు  కృష్ణుడు ఆశ్రయమన్న కవి మాట యథార్థము.
          లక్ష్మీదేవి వక్షస్స్థలంలో ఉంటుంది. దానిని తిరుమలయ్య గద్దె అన్నాడు.
          రోజూ కల్యాణము జరిగే వేంకటేశుడు  నిత్యమూ అక్షతలు వేయించుకొంటుంటాడు. దానిని కవి “సేస వెట్టించుకున్నాడు “ అన్నాడు.
           ముగింపు
          భక్తుని మీద భగవంతునికి అధికారమా? భగవంతుని మీద భక్తునికి అధికారమా?
          మిగతావాళ్ల సంగతేమో  కాని భక్తులకు మాత్రం దేవుని మీద అధికారం
          ఆయనని అద్దమంటాడు. ఉంగరమంటాడు. దేవుడు ఏమనడు.అది భక్త కవుల స్వేచ్చ. స్వస్తి.
****

No comments:

Post a Comment

Pages