స్వాతంత్ర్యము - అచ్చంగా తెలుగు

స్వాతంత్ర్యము

Share This

స్వాతంత్ర్యము

- అక్కిరాజు ప్రసాద్ 


తెల్లవారి నుండి మనకు స్వాతంత్ర్యము వచ్చి 68 ఏళ్లు. అంటే దాదాపు మూడు తరాలు గడిచాయి. మరి మూడు తరాల తరువాతైనా ఆ స్వాంతత్ర్య ఫలాలు మనకు దక్కాయా? ఈ విషయం గురించి అంతర్ముఖులమవుదాం.
ఘనమైన సహజ వనరులు, అపారమైన సంపదలు కలిగిన భూమి మన భరత భూమి. మహనీయులకు, త్యాగధనులకు, మానధనులకు, అమర వీరులకు జన్మ భూమి ఇది. పరమాత్మ అడుగడుగునా కనిపించే కర్మ భూమి మనది. ఇది తెలుసుకొని తెల్లవారు వ్యాపారం పేరుతో మన దేశంలో ప్రవేశించి, మన అమాయకపు రాజుల మధ్య ఐక్యతను విభజించి ఈ నేలపై పూర్తి అధికారాన్ని పొందారు. సహజంగా కష్ట పడే మనస్తత్వం కలవాడు భారతీయుడు. స్వయంశక్తుడు, స్వతంత్రుడు భారతీయుడు. అటువంటి మనలను బానిసగా మర్చి, నౌకర్లుగా ఉద్యోగాలిచ్చి మనసులలో బానిసత్వాన్ని తరతరాల పాటు మిగిలేలా చేశారు. ఫలితం?
మన అస్తిత్వం కోల్పోయి పరధర్మానికి దాసులమై స్వాతంత్ర్యంలో కూడా బానిసలలాగనే బ్రతుకుతున్నాము. వ్యవసాయం మన సామర్థ్యం. అది నేడు రైతుల ఆత్మహత్యలతో నిర్మానుష్యమవుతున్న పల్లెలతో తాండవిస్తోంది. చిన్న మధ్య తరగతి వ్యాపారాలు మన పట్టుగొమ్మలు. అవి నేడు పెద్ద వ్యాపార సంస్థల కబంధ హస్తాలలో నలిగి చితికిపోతున్నాయి. విలువలతో కూడిన విద్య మనకు సనాతనంగా గంగాప్రవాహంలా అందిన వారసత్వం. ఈ విద్యావ్యవస్థను కూకటివేళ్లతో పెకళించి పరాయి విద్యా వ్యవస్థను మనపై రుద్దారు. వీటి ఫలితం? స్వయంశక్తులమైన మనం పరాధీనులమైనాము.
స్త్రీని జగన్మాతగా కొలిచి గౌరవించిన మన సంస్కృతి స్థానంలో స్త్రీని ఒక విలాస వస్తువుగా చూపించే పాశ్చాత్య సంస్కృతి అవతరించింది. కారణం? విద్యా వ్యవస్థ, విలువలు లేని సమాజం. ఇవన్నీ మనకు తెల్లవారి పాలన వలన కలిగిన శాపాలే. ధైర్యంగా ముందుకు వెళ్లి దేశ నిర్మాణం కోసం, అభ్యున్నతి కోసం పాటు పడవలసిన యువత క్లైబ్యంతో, భయాందోళనలతో, ఒత్తిడితో విద్యను అభ్యసించి, కేవలం పొట్టకూటి కోసమే విద్య అన్న భావనను కలిగిస్తున్నారు. సృజనాత్మకత మనకు అనాదిగా ఉన్న ఆయుధం. దాని స్థానంలో యాంత్రికమైన చదువులు వచ్చాయి. కర్మ సిద్ధాంతంలో ఉన్న అద్భుతమైన రహస్యాన్ని వదలి వ్యసన వ్యామోహాలకు బానిసలై నిర్వీర్యమవుతున్నారు మన యువత. ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కోగలిగిన భారతీయ నారి నేడు పురిటి నొప్పులను తట్టుకోలేక శస్త్ర చికిత్సద్వారా పిల్లలకు జన్మనిస్తోంది.
ఉత్సాహంతో ఉరకలేస్తూ ఆడుతు పాడుతూ వీధులలో కేరింతలు కొట్టవలసిన పిల్లలు ఇళ్లకు పరిమితమై మానసిక శారీరిక బలహీనతలకు గురవుతున్నారు. ఉమ్మడి కుటుంబాలతో సుఖదుఃఖాలను పంచుకుంటూ పెరిగే వ్యవస్థ స్థానంలో మేమిద్దరం-మా ఇద్దరు అన్న కుటుంబ వ్యవస్థ వచ్చి మనుషులలో స్వార్థం పెరిగి, ఓర్పు, త్యాగం పూర్తిగా నశించాయి. మొత్తంగా దేశం నిస్సారమై, దిక్కు తోచక ఏది కనిపిస్తే దానిని పట్టుకొని అయోమయంలో అటు ఇటూ పరిగిడుతోంది.
మరి కావలసింది ఏమిటి?
మన మూలాలను తెలుసుకోవటం. వాటిలోని శక్తిని గ్రహించటం. అవి కాల గమనంలో ఎన్ని పరీక్షలను తట్టుకొని నిలబడ్డాయో అర్థం చేసుకోవటం. స్వధర్మాన్ని గౌరవించటం, మార్పు అంటే మనకు ఉన్నది వదిలి ఇంకో ధర్మాన్ని పట్టుకోవటం కాదు, మన ధర్మాన్ని కాలానుగుణంగా మార్చుకుంటూ మన పునాదులను గట్టి చేసుకోవటం. సనాతన ధర్మం మనకు అందించిన అపారమైన వాఙ్మయం ద్వారా దృఢమైన వ్యక్తిత్వాలను పెంపొందించుకొని, విశ్వజనీనమైన శక్తితో అనుసంధానం చేసుకొని మానవ జన్మను సార్థకం చేసుకోవటం. తిరిగి స్వయంశక్తులం కావాలంటే బానిస ఆలోచనలను వీడాలి. మన సామర్థ్యాలైన వ్యవసాయం, చిన్న మధ్య తరగతి వ్యాపారాలను విలువలతో శాస్త్రీయతతో అనుసంధానం చేసి మరింత ఉత్పాదన చేయాలి. మానవ వనరులు మనకు వజ్రాయుధం. ఆ మానవ వనరుల మేధో సంపత్తికి స్వధర్మం యొక్క అద్భుతమైన శక్తిని జోడించి మనలను మనం ఉత్తేజపరచుకొని దేశాన్ని అభ్యుదయం వైపు నడిపించాలి.
అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం. అప్పటివరకు మనం పరధర్మాలకు బానిసలమే. బలహీనులమే. ఏది కావాలో మనమే నిర్ణయించుకునే సమయం ఆసన్నమైంది. సంకల్పం చేసుకుందాం. నిజమైన స్వాతంత్ర్యాన్ని సాధించుకుందాం. తేలికైన మనసులతో విమాన వేగంతో మన ప్రజ్ఞ అడుగులు ముందుకు వేస్తే అఖండ భారత స్వప్నం సాకారమవుతుంది. భారతదేశపు ప్రాచీన వైభవం పునరుద్ధరించబడుతుంది.
జై హింద్!

No comments:

Post a Comment

Pages