సరదాగా జంధ్యాల స్టైల్ - అచ్చంగా తెలుగు

సరదాగా జంధ్యాల స్టైల్

Share This

సరదాగా జంధ్యాల స్టైల్  

- భావరాజు పద్మిని 


హలో, ఇవాళ నవ్వారా ? నవ్వని రోజు మన జీవితంలో వ్యర్ధమైనట్లే అని నేను నమ్ముతాను. అందుకే సరదాగా మీకోసం ఈ హాస్య గల్పికను అందిస్తున్నాను.
ఒక ప్రేమికుడు పాపం కవి కాదు. కాని, సాహసం చేసి, బుర్ర బద్దలుకొట్టుకొకుండానే  ఒక ప్రేమలేఖ రాసాడు. అది ఇలా ఉంది.
"ప్రియా... రాయిలాంటి నా మనసులో కనిపించని బావురుకప్ప లాగా దాక్కుని, నువ్వు బెకబెక మంటూ సందడి చేస్తున్నావు. నీ ప్రేమకోసం గుడ్లగూబ లాగా పగలూ రాత్రి గుడ్లు తెరుచుకుని, నిన్నే చేస్తున్నాను. నా కళ్ళలో నీకు ప్రేమ చీమల బారులు కనిపించలేదా ? ప్రేమచెట్టుకు వేళ్ళాడుతూ గబ్బిలంలా నీకోసం తపస్సు చేస్తున్నాను. లొట్టిపిట్ట లాగా నిన్ను చూసి, లొట్టలు వేస్తున్నాను. హచ్ కుక్కలా నీ వెనకాలే తిరుగుతున్నాను. నిన్ను చూసి, నా మనసు కోతిలా గెంతులు వేస్తుంది. శివంగి లాంటి నిన్ను మెప్పించలేక నేను ఆకుకింద గొంగళిపురుగు లాగా దాక్కుంటున్నాను. కాబట్టి, నువ్వు కనికరించి, నా ఒంటికి ప్రేమ వైరస్ లాగా పట్టుకో.   కాకితో కబురంపినా ఒచ్చి వాలిపోతా. సరేనా ?"
పాపం ఆ అమ్మాయి జంధ్యాల గారి వీరాభిమాని. ఆమె అలవోకగా మాట్లాడినా, ఆయన సినిమాల్లో రాసే డైలాగ్ ల లాగా ఉంటుంది. ఆ అమ్మాయి ఇలా బదులిచ్చింది...
"ఇదీ ఒక ప్రేమలేఖేనా ? తమ బొంద. జంతు ప్రదర్శనశాల లోని జంతువులన్నీ సామూహికముగా మీ లేఖలో కొలువుదీరినట్లు ఉన్నవి. ఈ లేఖను ఒక జాతీయ విపత్తుగా పరిగణించాలి. అయినా, ఇట్టి లేఖ పంపుటకు మమ్మే ఎంచుకొనుట మా దౌర్భాగ్యము. ఇంతటి మహత్తరమైన లేఖ వ్రాసిన తమకు తిట్లతో  తగురీతి సత్కరించవలెనని , మదీయ చిత్తము ఉవ్విళ్ళూరుచున్నది. అందుకోనుము మా విమర్శా పత్రము.... స్వీకరించుడు.
ఒరేయ్ అబ్బాయ్... హృదయ విదారకమైన ఈ లేఖ రాసే ఐడియా నీకు ఎలా వచ్చిందిరా ? పిజ్జా హట్ డెలివరీ బాయ్ ని లిఫ్ట్ అడిగేవాడి మొహమూ నువ్వూనూ. మరచెంబులో చెంచా వేసుకు స్నానం చేసే ఫేసూ నువ్వూనూ. రోడ్డు రోలర్ టైర్ కి గాలి కొట్టాలని చూసేవాడి తెలివీ నువ్వూనూ. ఫేస్బుక్ లో చింతపండు అరువడిగే వాడి బ్రైను నువ్వూనూ. వానకు తడిసిన ట్రాన్స్ ఫార్మర్ నుంచి నిప్పులు రాలుతుంటే, అందులో కాకరపువ్వొత్తి వెలిగించుకుందుకు పరుగెత్తే వాడి తింగరతనం నువ్వూనూ. ఇలా జంతుప్రేమ లేఖలు రాసి ఆడపిల్లల్ని బెదిరించావంటే, పోతావురోరెయ్ ... ఏ పిచ్చి కుక్క చేతో కరిపించుకుని, ఎర్రగడ్డో , వైజాగో కరెంట్ షాక్ కొట్టించుకోడానికి పోతావ్... హా.
**********

No comments:

Post a Comment

Pages