బుడుగు సమీకరణము - అచ్చంగా తెలుగు

బుడుగు సమీకరణము

Share This

బుడుగు సమీకరణము

- యనమండ్ర శ్రీనివాస్ 


ఈరోజు ఆదివారం. మధ్యాహ్నం. అమ్మ టి వి సీరియల్ చూస్తూ బియ్యం ఏరుతోంది. పక్కనే నేను హోంవర్కు చేసుకుంటూ కూర్చున్నాని సౌండు తగ్గించి పాటలు వింటోంది. నేనొక్కడినే సినిమాలో “ఆవు తుజే మొగ్ కోర్తా” పాట.
“ఇది తెలుగు పాటా. ఇంకేదైవా భాషా?” అమ్మ అంటోంది తనలో తాను.
“తెలీదా నీకు. ఇది గోవన్ భాష. దాని అర్ధం I Love You ట. బాబాయి ఈ మధ్య అందరి అక్కలకీ ఫోను చేసి చెప్తున్నాడుగా. వినేశా నేను” అనేశా. తర్వాత నాలుక కరుచుకున్నా. బాబాయికి తెలిస్తే నాకు ప్రైవేటు చెప్పేస్తాడు.
“ఏంటి నా గురించి చెప్పుకుంటున్నారు” అంటూ బాబాయి వచ్చాడు బయటనుండీ అప్పుడే. హమ్మొ విన్నాడేమో అని డౌటు వచ్చింది. కానీ చక్కగా నవ్వుతూ వచ్చాడు. హమ్మయ్య వినలేదులే.
“ఏంలేదు బాబూ. రా. మంచినీళ్ళు తాగు. కాఫీ ఇస్తా.” అని లేవబోయింది నన్ను రష్షించడానికి. “ఇప్పుడు వద్దులే వొదినా కూర్చో” అన్నాడు బాబాయి. అప్పుడే నేను అమ్మ జడలో చూశా. ఒక తెల్ల వెంట్రుక.
నేను “అమ్మా. అసలు తెల్ల వెంట్రుకలు ఎందుకు వస్తాయి” అని అడిగా.
బాబాయి “బుడుగూ, మరి నువ్వు అల్లరి పిల్లాడివి కదా. ఎప్పుడు నువ్వు అల్లరి చేసి అమ్మకి విసుగు తెప్పిస్తావో అప్పుడల్లా ఒకొ తెల్ల వెంట్రుక వొస్తుంది అమ్మకి” అన్నాడు నవ్వుతూ.
నాకు బోల్డు ఖోపం వచ్చింది. మరి బాబాయికి అదే విషయం ఘబఘబా ఇంకా బాగా చెప్పాలి కదా. ఎలాగ అని ఆలోచించా. పైన తాతయ్య ఫొటో కనిపించింది. దండ వేసి. నా చిన్నప్పుడే జేజే దగ్గరకి వెళ్ళిపోయారట తాతయ్య.
అందుకే ఘబుక్కున “ఓహో. అలాగా. తాతయ్య తలకాయ మొత్తం తెల్లజుట్టే. అది ఎందుకో ఇప్పుడు అర్ధమయిందిలే నాకు. బాబాయి కూడ నాలాగే తెగ అల్లరి చేసి ఏడిపించుంటారు కదమ్మా ఆయన బతికున్నంత కాలం” అనేశా.
“బుడుగూ బుడుగూ. నువ్వు వుండాల్సినవాడివిరా” అని అమ్మ నవ్వేసింది తాతయ్య ఫొటోకేసి చూస్తూ.
వెంఠనే నాకు గుర్తొచ్చింది. స్కూలులో రేపు ఫొటో సెషన్ వుంది. యూనిఫాం మంచిగా ఇస్త్రీ చేసుకుని వేస్కుని రమ్మనారు వైజాగు మాస్టారు. స్కూల్లో పిల్లలందరికీ మాస్టారితో పాటు ఫొటో తీస్తారట.
“అసలు ఈ ఫొటో సెషన్ ఎందుకమ్మా?” అని అడిగా నేను.
“ఎందుకంటే నువ్వు బాగా పెద్దయ్యాక చక్కగా మీ పిల్లలకి ఈ ఫొటొ చూపిస్తూ – ఇది, సీ గాన పెసూనాంబ – ఇప్పుడు హైదరాబాదులో ఉంది. ఎంత పెద్ద డాక్టరో. వీడు నా ఫ్రెండు సీనుగాడు – ఇప్పుడు ముంబాయిలో వున్నాడు. ఎంత పెద్ద బ్యాంకులో పనిచేస్తున్నాడో. ఆ పక్కన గోపిగాడు – అల్లరి చేసేవాడు చిన్నప్పుడు, ఇప్పుడు అమెరికాలో వుంటున్నాడు. ఇంజనీరింగు చేసి. ఇలా చెప్పుకోవచ్చు కదా. అందుకని” అంది అమ్మ.
“ఆ. అర్ధమయింది. ఈయన వైజాగు మాస్టారు. చిన్నప్పుడు ఏడిపించుకు తినేవారు. ఇప్పుడేమో జేజే దగ్గరకు వెళ్ళిపోయి ఆయనకి ప్రవేటు చెప్పేస్తున్నారు - అని కూడ చెప్పచ్చు కదమ్మా మా పిల్లలకి” అన్నా. నాకన్నీ అలా తొరగా అర్ధమయిపోతాయని మీకు తెలుసుగా.
“హహహ. ఎందుకురా ఆ మస్టారు అంటే అంత కోపం నీకు” పక్కనుంచీ అడిగాడు బాబాయి.
“ఈ వైజాగు మాస్టారితో వేగడం కష్టము బాబాయి” ఇలా నాకు నేను కూడ అనుకోవడం ఈ మజ్జ ఎక్కువయిపోతోంది. నాకు ఇంతమంది మాస్టారులు ప్రైవేటులు చెప్పేశారు కానీ, ఈ మాస్టారులాగా ఎవరూ నాకు తలనొప్పి తెప్పించలేదు.
“వెధవా…మాస్టారుకి నువ్వు భయపడటమేమిటిరా” అన్నాడు బాబాయి. “బుడుగూ…నువ్వు కూడ భయపడుతున్నావా?” అంది మొన్న పెసూనాంబ కూడ ఇలానే. లాబం లేదు. ఏదో ఒకటి చెయ్యకపోతే ఇక మాస్టారు వల్ల మన పరువు బజారు పాలయ్యేలా వుంది.
“ఏంలేదు బాబాయి. ఈ మాస్టారు సమీకరణాలు చెప్తున్నారు. అవి అర్దమే కావట్లేదు. రేపు హోంవర్కు చెయ్యాలి బాబాయి” అన్నా.
“ఓస్ ఇంతేగా. Y = a+bX అనే రూపంలో ఉండేది సమీకరణం. ఇందులో రెండు రకాల విలువలు ఉంటాయి. a మరియు b. అలానే X మరియి Y. a మరియు b విలువలు స్థిరంగా ఉంటాయి. అందుకని వాటిని స్థిర రాశులు అంటారు. X మరియు Y విలువలు మారుతూ వుంటాయి. అందుకని వాటిని చర రాశులు అంటారు. అలా a b ఉపయోగించి రెండు సమీకరణాలు వాడి X Y విలువ తెలుసుకోవడమే ప్రాబ్లెమ్. ఇంతే.” అన్నాడు బాబాయి “ఆవ్ తుజే మొగ్ కోర్త” పాట హమ్ చేస్తూ.
ఆ హమ్మింగ్ వినగానే వెంఠనే నాకు అర్దమయిపోయింది. బాబాయికి చెప్పేశా. “ఇంతేనా. నాకర్దమయింది బాబాయి. నువ్వు I Love You అని చెప్తూ వుంటావుగా అందరి అక్కలకీ. ఇందులో I అనేది నువ్వు. దాని విలువ ఎప్పటికీ మారదు.కాబట్టి అది స్థిర రాశి. You అనేది చర రాశి. ఒకసారి అది రెండు జెళ్ళ సీత అవుతుంది. ఒకసారి కవితక్క అవుతుంది. ఇంకోసారి అది సునీతక్క అవుతుంది. a నేను, b సీగాన పెసూనాంబ. మేము కూడ స్థిర విలువలమే – మారము కాబట్టి. a b లని ఉపయోగించి I కి తగిన You విలువ కనుక్కోవటమే సమీకరణం. ఇంతే కదా బాబాయి” అనేశా.
బాబాయి ఘబ ఘబా వచ్చేసి నా నోరు మూసేశాడు. అమ్మ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ పక్కగదిలోకి వెళ్ళిపోయింది. నాకైతే నే చెప్పింది తప్పో రైటొ తెలీలేదు. మీకు అర్ధమయితే మీరు చెప్పరూ. ప్లీజ్.

No comments:

Post a Comment

Pages