నిరాశను తరిమేద్దాం...! - అచ్చంగా తెలుగు

నిరాశను తరిమేద్దాం...!

Share This

నిరాశను తరిమేద్దాం...!

- జి. నారాయణ రావు 


'జీవితం నిస్సారంగా ఉంది, నా బతుకింతే' అని నిరాశపడిపోవడం చాలామంది చేసే పనే. అలాకాకుండా జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలంటే... ఏం చేయాలంటే...
• ప్రశాంతంగా ఉండండి. మీరు పుట్టింది మీ కోసమేనన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఎదుటి వారి నుంచి ఏమైనా నేర్చుకోండి. కానీ, మీకు మీరు ప్రత్యేకంగా ఉండండి. మీకంటే ఎవరూ ఎక్కువ కాదు... ఇలా అనుకున్నప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎవరో దూరమయ్యారనీ, మనం అనుకున్నది జరగలేదనీ నిరాశపడితే ఏం లాభం... మీకు మీరు దూరం అవుతారు. సమస్యలొచ్చినప్పుడు నవ్వండి. ఓడిపోయినపుడు మరింత సృజనాత్మకంగా చేసేందుకు ప్రయత్నించండి. దీనివల్ల సానుకూల దృక్పథం సొంతమవుతుంది.
• లక్ష్యం ఏర్పరచుకోండి. లక్ష్యం లేకుండా ప్రయాణిస్తే కచ్చితంగా నిరాశకు గురవుతారు. అదే లక్ష్యం ఉంటే, దాన్నెలా సాధించాలన్న దానిపైనే మీ మనసు లగ్నమవుతుంది. చిన్న సాయమైనా సరే పొరుగు వాళ్లకు చేయాలన్న సంకల్పం పెట్టుకోండి. ఇది మీలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
• మిమ్మల్ని మీరు నమ్మండి. ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూడకండి. పరిస్థితులన్నీ గమనించుకుంటూ, స్వతంత్రంగా ఉండేలా ప్రయత్నించండి. దీనివల్ల ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అది ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మీ కలల్ని నిజం చేసుకోవాలంటే సాయపడేది ఆత్మవిశ్వాసం మాత్రమే. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఎదురయ్యే పర్యవసానాల్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి.
• జ్ఞానం సంపాదించుకోండి. ఏదైనా నేర్చుకునేందుకు ఎప్పుడూ ముందుండండి. దానికి మంచి మార్గం పుస్తకాలు. పుస్తకాలతో స్నేహం పెంచుకోండి. దీనివల్ల జ్ఞానంతో పాటూ మానసిక ప్రశాంతతా, ఆలోచించే సామర్థ్యమూ పెరుగుతుంది.
• సరైన ఆహారం ఆహారం మనిషి ఆలోచనాశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే క్రమం తప్పకుండా భోంచేయాలి. పోషకాహారం తీసుకుంటూ శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోన గలుగుతారు.
  • సరైన నిద్ర, వ్యాయామం
ఉరుకులు పరుగుల జీవితంలో నేడు మనిషికి తగినంత  నిద్ర, వ్యాయామం కొదవవుతోంది. అందుకే, మీ దినచర్యలో వీటికి తగినంత సమయం కేటాయించుకోండి.
మంచి వ్యాపకాలు, మిత్రులతో సమయం గడపడం, భావాలను పంచుకోవడం వంటివాటి ద్వారా, నిరాశను తరిమేసి, సుఖమయమైన, ఆరోగ్యకరమైన జీవనానికి ద్వారాలు తెరుద్దాం.

No comments:

Post a Comment

Pages