మతం అంటే? - అచ్చంగా తెలుగు

మతం అంటే?

Share This

మతం అంటే?

- అక్కిరాజు ప్రసాద్ 


మతం అనే పదం నేటి సమాజంలో ఎంతటి దుర్వినియోగం చేయబడుతోందో మనం ప్రతి రోజూ చూస్తునే ఉన్నాము. అసలు మతం అంటే ఏమిటి?
మతం అంటే భగవంతునితో కూడిన జీవితం. భగవంతుడు, ప్రపంచం, వ్యక్తి అనే మూడు సిద్ధాంతాల మధ్య గల సంబంధమే మతం. భూమి అనే తలముపైన అలసిన మానవునికి సాంత్వననిచ్చేది మతం. శాశ్వతమైన, అమరమైన స్థితికి చేర్చే సాధనం మతం.
ఇతరులకు మంచి చేయమని చెప్పేది మతం. ప్రేమ, దయ, సత్యభాషణ, పవిత్రత అనే ముఖ్యమైన లక్షణాలను జీవితంలోని అన్ని కోణాలలోనూ ఆచరించేది మతం. అన్ని విధాలా ఆచరణాత్మకమైన తత్త్వము మతం. మతమనేది భావించి అనుభూతి చెంది గ్రహించే నిత్య తత్త్వము.
మతమంటే పిడివాదం కాదు, ఒక శాఖ కాదు, ఒక విశ్వాసం కాదు, ఒక భావోద్వేగం కాదు. మతమంతే శరీరానికి బాధ కలిగినపుడు చేసే ప్రార్థన మాత్రమే కాదు. అన్నిటినీ మించి మంచితనము, సేవా భావముతో కూడిన జీవన విధానం. నిత్యమూ ధ్యానంతో కూడిన జీవితం మతం. ప్రేమ, దయ, పవిత్రత, సత్యాచరణ, భక్తి మరియు విశ్వాసాలు కలిగిన వ్యక్తే నిజంగా మతాన్ని అనుచరించినట్లు.
మతం యొక్క సారం నుదుటిపై విభూతి రేఖలు,జటాఝూటాలు, పొడవైన గడ్డము, కాషాయ వస్త్రాలు, మండుటెండలో నిలబడటం లేక చన్నీటిలో మునగటం, శిరోముండనము, గంటలు మోగించటం, శంఖము పూరించటం, డప్పులు వాయించటం మాత్రమే కాదు. మతం యొక్క సారాంశము ప్రాపంచిక ఉద్రేకాల మధ్య కూడా మంచితనము, ప్రేమ, సేవా భావాన్ని నిలుపుకొని మసలుకోవటం.
మతమంటే భగవంతునిలో రమించటం. మతమంటే పాండితీ ప్రకర్ష కాదు. మతమంటే భగవంతుని చర్చ మాత్రమే కాదు. తర్కాన్ని అధిగమించినది మతం. బాహ్యాంతరములలో జీవించబడునది మతం. గ్రహించి జీవించి ఉన్నతంగా వికసింపజేసేది మతం.
ఏ మతమైన, దాని మూలాంశం ఒక్కటే. వాటి మధ్య తేడా ఉండేది ముఖ్యం కాని విషయాలలోనే. ఒక మతాన్ని అనుసరించే జీవితం పరమాత్మ యొక్క అనుగ్రహం. కృతఘ్నత మరియు మాలిన్యములనుండి మనిషిని ఉద్ధరించేది మతం. మతము చేత ప్రకాశింపబడని వివేకము నిరుపయోగమైనది. వేదాంతము చేయలేని అద్భుతం మతం చేస్తుంది. మతం యొక్క నియమాలను పాటిస్తే మనిషికి జ్ఞానం, శాశ్వతత్వం, శాంతి, పరమానందం కలుగుతాయి. మతం అన్ని కష్టాలను, దుఃఖాలను దూరం చేస్తుంది. మతం మనిషిని స్వతంత్రుడిని, స్వశక్తుడిని చేస్తుంది. మతం జీవాత్మను పరమాత్మతో ఏకం చేస్తుంది. మతం జనన మరణాల సంకెలనుండి విముక్తులను చేస్తుంది.
మతం సమాజానికి పునాది. అన్ని శుభాలకు, ఆనందాలకు మతం మూలం. మతం వ్యక్తిగత శ్రేయస్సు కలిగించి తద్వారా సమాజము మరియు జాతి శ్రేయస్సు కలిగిస్తుంది. మనిషి అభ్యున్నతికి తోడ్పడి జాతికి శాంతిని కలిగించే నాగరికత, క్రమశిక్షణ, ఐక్యత, నైతికత మతం యొక్క ఫలాలే.
మతం లేకపోతే మానవుని జీవితానికి లక్ష్యం లేనట్లే. మతానికి దూరమైన మనిషి ఈ జన్మ యొక్క ఉద్దేశానికి అతి దూరంగా ఉన్నట్లే. అప్పుడు జీవితం వృథా అయినట్లే కదా? మతం జీవితం యొక్క ఉనికికి సార్థకత ఇచ్చి, ప్రేమ భక్తి, శాంతి మరియు సంతోషాలతో నింపుతుంది. ఎటువంటి భౌతిక శక్తి కూడా మనిషిలోని మత జిజ్ఞాసను నిర్మూలం చేయలేదు. అటువంటి శక్తుల వలన తాత్కాలికంగా కొంత అవరోధాలు కలిగినా, దీర్ఘకాల సాధనలో మతమే మనిషిని ముందుకు నడిపిస్తుంది.

No comments:

Post a Comment

Pages