సీతాకోకచిలుక సందేశం - అచ్చంగా తెలుగు

సీతాకోకచిలుక సందేశం

Share This

సీతాకోకచిలుక సందేశం 

- భావరాజు పద్మిని


నేనే ! దైవ సృష్టిలో అతి చిన్న ప్రాణిని. మీ కళ్ళు నన్ను ఆరాధనగా చూస్తుంటాయి. మీ మెదడు, నా రెక్కల్లో ఉన్న రంగుల్ని లెక్కించాలని ఆరాటపడుతుంది. మీ కాళ్ళు నన్ను పట్టుకోవాలని పరుగెడతాయి. నన్ను ‘సీతాకోకచిలుక’ అంటారు. నా ఈ రంగు రంగుల జీవితం వెనుక ఓ పోరాటంతో కూడిన నిరీక్షణ వుంది...!!
చీదరింపుల పురుగు దశ నుండి మొదలైన నా జీవన ప్రయాణం గురించి ఇవాళ మీతో చెప్పాలని ఉంది...
నాకు మంచి దృష్టి లేదు. ఆరుజతల చిన్ని కళ్ళున్నా, చూపు సరిగ్గా ఆనదు. మీలా కాళ్ళు, చేతులు, ఆలోచించే మెదడు, ఏమీ లేవు. భూమ్మీద నా ఉనికికి పూర్వాపరాలేమిటీ, మూలాలేమిటీ అని నేను ఆలోచించలేను. నల్లటి, పొడవైన వెంట్రుకలతో గొంగళి కప్పుకున్నాట్టు ఉన్న నన్ను ‘గొంగళిపురుగు’ అంటారు. నాకు పాకుతూ పోవడం తప్ప ఏమీ తెలీదు. కొందరు నన్ను కాగితాలపై, ఆకులపై ఎక్కించి వెనక్కి ఎక్కడో పారేస్తారు. అయినా, ఊపిరి ఉన్నంతవరకూ పాకుతూ పోవడమే నాకు తెలుసు. నన్ను ‘ఛీ’ అంటూ విదిలించేవారే కాని, ఏ చెట్టు ఆకులో తింటుంటే, పొగబెట్టి నిలువెల్లా కాల్చేవారే కాని, ఏనాడూ పిసరంత ప్రేమ కూడా నేను ఎరుగను. అప్పుడే, అందరిలా, నాకూ కాస్త ప్రేమని పొందాలని అనిపించింది. అందుకు గట్టిగా సంకల్పించాను... ఆ సంకల్పాన్ని తపస్సులా చెయ్యాలని తపన నాలో మొదలయ్యింది.
ఒక చెట్టులోని అనువైన ఆకు కాండాన్ని ఎంచుకొని, తలను కిందికి తిప్పి, శరీరం వెనుక భాగంతో దానిని పెనవేసుకున్నాను. తల కింది భాగం నుంచి అతి సన్నని పట్టుదారాల్లాంటి పోగులను ఉత్పత్తి చేసి, వాటితో చిన్న దిండును తయారు చేసుకున్నాను.
దాని ఆధారంగా నేను కాండానికి అతుక్కుపోయాను.. ఆపై నా చుట్టూ నేను గుండ్రంగా తిరుగుతూ, తలను అటూ ఇటూ కదిలిస్తూ, ఆ దారాల్లాంటి పోగులతో నా దేహం చుట్టూ ఒక ఒడ్డాణాన్ని రూపొందించుకున్నాను. కొన్ని రోజులు పోయాక నా గొంగళిపురుగు చర్మం లోపల మరొక సున్నితమైన చర్మపు పొర ఏర్పడటం మొదలయ్యింది. అప్పుడు నేను నా  శక్తినంతా ఉపయోగించి గిజగిజలాడడంతో పై చర్మం చీలి, విడిపోయింది. దాంతో లోపల ఉన్న కొత్త చర్మం పైకి తేలి, వాతా వరణంలోని గాలి సోకడంతో గట్టి పడింది. ఈ దశనే ప్యూపా అంటారు. ఇప్పుడు నా తోక చివర ఉన్న కొక్కాలను గొంగళిపురుగుగా ఉన్నప్పుడు చేసుకున్న దిండుకు తగిలించాను. ఆ తర్వాత నేను గాలి పీలుస్తూ తల, తలపైన స్పర్శ శృంగం, తలలోని నోరు మొదలైన చిన్న భాగాలతో పురుగురూపంలో బయటకు వచ్చి, ఆకుకు అంటుకుపోయి స్వేచ్చగా వేలాడాను. నెమ్మదిగా పూర్తిగా రూపాంతరం చెంది సీతాకోకచిలుకలా మారాను.
గొంగళి పురుగుగా ఉన్నప్పుడు నేను  సీతాకోక చిలుకగా తన తన భవిష్యత్తెలా ఉండబోతోందనే దాని గురించి కలలు కనలేదు. సీతాకోక చిలుకగా కూడా నా గొంగళిపురుగు గతాన్ని తల్చుకుని బాధపడలేదు. నాకు బతకడం ఒక అలవాటంతే. ఇప్పుడు చెప్పండి, మీ కళ్ళలోని ఆరాధనను తేలిగ్గా పొందానా ?
ఆటుపోట్లకు తట్టుకుని ఆకులు,అలములు తింటు కాలంతో కలిసి ముందుకు సాగుతూ నిద్రాణ స్థితికి (నిరీక్షణకు) చేరుకున్నాను...!!
నిరీక్షణ ఫలించి రంగుల రెక్కలతో కొత్తజీవితం మొదలుపెట్టాకా, నన్ను చీదరించుకున్న మనిషే చూసి ఆనందిస్తున్నాడు నేను తాకాలి అని ఆశపడుతున్నాడు..!! పూల మకరంధమే నాకిప్పుడు ఆహారం..!!
కష్టాల తర్వాత వచ్చే సుఖం ఎప్పుడూ ఇంత తియ్యగా ఉంటుంది. అందుకే మీ చుట్టూ ఎన్ని కష్టాలు వున్నా, ఎంతమంది మిమ్మల్ని విమర్శించినా, వెనక్కు లాగినా, కాలంతో ప్రయాణం అనే జీవనపోరాటం చేస్తూ, పట్టుదలతో నిరీక్షించండి. మీకు కూడా నాలా మంచి రోజులు వస్తాయి...!! మార్పు జీవితంలో అంతర్భాగం అని గుర్తించి, దహించే తృష్ణతో అలుపెరుగకుండా శ్రమించండి. కొన్నాళ్ళకు, కొన్ని జతల కళ్ళు మిమ్మల్ని కూడా ఆరాధనాభావంతో చూసి, ఆదర్శంగా తీసుకుంటాయి. ఇదే నేనిచ్చే మౌనసందేశం.
(శ్రీ జి. నారాయణ రావు గారి పోస్ట్ లోనుంచి కొన్ని వాక్యాల్ని ఇక్కడ వాడుకోవటం జరిగింది.)

No comments:

Post a Comment

Pages