తండాల గుండెసవ్వడి ‘రేల పూలు - అచ్చంగా తెలుగు

తండాల గుండెసవ్వడి ‘రేల పూలు

Share This

తండాల గుండెసవ్వడి ‘రేల పూలు

పరిచయం – భావరాజు పద్మిని


పిల్లల మనసు చదవగలిగే వారే మంచి టీచర్ అవుతారు. ఆ చిట్టి గుండెలో చిరకాలం స్థానం సంపాదించుకోగలుగుతారు.  మంచి టీచర్ లో ఒక అమ్మ కూడా దాగి ఉంటుంది. తల్లి బిడ్డ మౌనంగా ఉన్నా ఆ బిడ్డ మనోభావాల్ని అర్ధం చేసుకున్నట్లు, ఒక సహృదయం కలిగిన టీచర్... తన విద్యార్ధి నోరు విప్పకుండానే, అతని మానసిక స్థితిని అంచనా వెయ్యగలుగుతుంది. అలా మనసు కళ్ళతో పిల్లల్ని చూసిన అనుభవమే ఈ ‘రేల పూలు’ తండావాసుల కధలుగా రూపుదాల్చిందేమో !
కళ్ళతో ప్రపంచాన్ని అందరూ చూస్తారు... కాని, మనసు కళ్ళతో విద్యుత్తు, రోడ్లు, ఆరోగ్య వసతులూ లేని తండా వెతల్ని తెలంగాణా మాండలికంలో అద్భుతంగా ఈ పుస్తకంలో ఆవిష్కరించారు సమ్మెట ఉమాదేవి గారు. ప్రచురించబడ్డ కొన్నాళ్ళకే, ఈ కధలు వివిధ భాషల్లోకి అనువదించబడడం, సాహితీ దిగ్గజాల ప్రశంసలు పొందడం జరిగిందంటే, ఈ కధలు పాఠకుల మనసుకు ఎంతగా హత్తుకుపోతాయో ఆలోచించవచ్చు.
తమ తండా కు కూడా బిజిలి (విద్యుత్తు) రావాలని ఆశపడింది సాల్కి. ఏ పెద్ద దొరలకో అవసరమైతే తప్ప, ఆ చిన్న తండా దాకా, కరెంటు తీగలు ఎవరు లాగుతారు ? ఆ దొరలకు కరంటు అవసరం రానే వచ్చింది. సాల్కి తండా మీదుగా కరెంటు వైర్లు వెళ్ళాయికాని, వీరి ఇళ్ళకు బిజిలి రాలేదు. చివరికి దొంగవైర్లతో కరెంటు లాగి, ఆ వైరు లాగాబోయిన బిజిలి కధ ఏమయ్యింది... అన్నది ‘బిజిలి’ కధ నేపధ్యం. ఈ కధ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ, కళ్ళని, మనసుని కట్టి పడేస్తుంది.
ప్రకృతిని ప్రాణంగా ఆరాధిస్తూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడడం మాత్రమే కాదు, తన కళ్ళతో ఇతరులకూ ఆ సొబగులను చూపిస్తూ, వనదేవతలా ఆడుతూపాడుతూ, సందడిగా తిరుగుతూ ఉంటుంది దివిలి. అందమైన పువ్వుని కోసి, నలిపి ఆనందించే వంచకులు ఎందరో ఆమెమీద కన్నేస్తారు. చివరికి దివిలి కధ ఏమయ్యింది ? కరకు గుండెల్ని సైతం కరిగించే హృద్యమైన కధ ఇది.
ఇంట్లో ఒకపేరు, స్కూల్ లో ఒక పేరు, జనాభా లెక్కల్లో ఒకపేరు ఉండడం వల్ల తండావాసులు ఎదుర్కునే సమస్యలను చక్కగా ఆవిష్కరించింది – అస్తిత్వం కధ.
చదువునే శ్వాసగా భావించే ఒక పిల్లవాడికి, హఠాత్తుగా బాధ్యతల బరువు నెత్తిన పడితే – అటు పొలానికి, ఇటు బడికీ మధ్య ఊగిసలాడే మనసుతో పడే వేదనను తెలిపే కధ – పాల బుగ్గల చిన్ని రైతా, ఆద్యంతం చదివించి, కన్నీరు పెట్టిస్తుంది.
నోటికాడ కూడును గద్ద తన్నుకుపోయినట్టు – తన బిడ్డలకు కూడా ఒక్క మొక్కజొన్న కంకి పెట్టకుండా, కోతులనుంచి, అతికష్టపడి కాపాడుకున్న పంట, దొరలు అప్పుడూ, ఇప్పుడూ తన్నుకుపోతే – మనుషుల కంటే, కోతులే నయం, కనీసం బండ్లలో పెట్టుకు తీసుకుపొరు – అంటూ కధను ముగించిన వైనం రచయిత్రికి భాష మీద, భావపు ఆర్ద్రత మీద ఉన్న పట్టును తెలియచేస్తుంది.
‘మగాడే... కాని మనోడు కాదు...’ అంటూ భర్తను వదిలేసే దాకా వచ్చిన గిరిజన స్త్రీ - జాలా సాహసాన్ని, మనస్తత్వాన్ని అద్భుతంగా విడమరిచిన కధ ‘గిరి కాన దీపం...’ . ఎక్కడో కొండ మీదున్న దీపం వెలుగులు పంచలేనట్లు, తండాల్లో పెరిగిన భర్త కొండెక్కి కూర్చుని, ఆ తండాకు అక్కరకు రానందున, అతన్ని విడిచిపెట్టైనా సరే, తమ తండాలకు మేలు చేకూర్చాలనే జాలా జీవితం ఎందరికో ప్రేరణ కలిగిస్తుంది.
ఒకటా, రెండా... బాగా విరిసిన రేల పూల గుత్తిలో “ఏ పువ్వు బాగుంది ?” అంటే ఏమి చెప్పగలము ? అలాగే ఇందులో ఉన్న 17 కధలు, వేటికవే ప్రత్యేకం, అద్భుతం. ప్రముఖ సినీ రచయత భువనచంద్ర గారు ఈ కధలు చదివి, గొప్పగా ముందుమాట అందించారు. పుస్తకాలు ఎన్నో దొరుకుతాయి... కాని ముగ్ధమైన అడవిపూల పరిమాళాలంత స్వచ్చమైన ఇటువంటి కధల సంపుటి ఎప్పుడో కాని, అందుబాటులోకి రాదు. తప్పక కొనండి, పోస్ట్ లో తెప్పించుకుని చదవండి, మరో లోకంలోకి తరలి వెళ్ళండి...
పుస్తకాల కోసం సంప్రదించాల్సిన నెంబర్ – నివేదిత – 8106678746.

No comments:

Post a Comment

Pages